శ్రీ మహా లక్ష్మీ చరితము - అచ్చంగా తెలుగు

శ్రీ మహా లక్ష్మీ చరితము

Share This
శ్రీ మహా లక్ష్మీ చరితము  
పిన్నలి గోపీనాథ్  


" లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయామ్"...అంటూ ప్రార్థిస్తాము మనం. అలాగే  సాగర మధనం నుంచే జనించిందనీ, దేవతలెవరినీ కాదని శ్రీ మహా విష్ణువునే వరించిందనీ కూడా  చెప్పుకుంటున్నాము. అయితే....
ఆమె క్షీర సాగరము చేరడం వెనుక గాథయే మనకు తెలియాల్సి ఉన్నది కదా.  ఫాల్గుణ మాస బహుళ విదియ నాడే ఆమె జయంతి అయినందున ఆ సందర్భముగా ఈ వృత్తాంతము....
వ్యాస భగవానుని విరచితమైన శ్రీ దేవీ భాగవత పురాణము ననుసరించి ... 
నారద మహర్షి  ఒకనాతడు వైకుంఠమున శ్రీమన్నారాయణుని కలసి  శ్రీ మహా లక్ష్మి చరిత్రను వివరించాలని కోరాడు. అప్పుడాయన వివరించిన ప్రకారము...
సృష్టికి పూర్వము శ్రీకృష్ణ పరమాత్ముని వామ భాగము నుంచి లక్ష్మీదేవి అవతరించింది. ప్రకృతిలోని అందములన్నియూ రాశి పోసినట్లుగా ఉన్న ఆమెను రెండు రూపములు ధరించాలని  పరమ శివుడు ఆదేశించాడు. ఆమెరకు ద్విరూప అయినది. అయితే  మందస్మిత వదనాలతో అలరారు తున్న ఆ రెండు రూపాలూ అందచందాలలోనూ, నడవడిలోనూ... ఇలా ఏ కోణం నుంచి చూసినా సరిసమానులై భాసిల్ల సాగాయి. కాగా, వీనిలో వామ రూపము లక్ష్మీదేవియే కాగా, దక్షిణము రాధ. లక్ష్మి విష్ణువును వరించగా రాధ కృష్ణుని కోరింది.  అప్పుడు కృష్ణుడు ఆలోచించి తానే ద్విరూపుడైనాడు.  దక్షిణాన ద్వి భుజునీగాను, వామ భాగమున చతుర్భుజుడైన విష్ణువుగా దర్శనమిచ్చాడు. ఆ ప్రకారముగా కృష్ణుడు రాధా మాధవుడు కాగా, శ్రీహరి లక్ష్మీపతి అయినాడు.సహజంగానే కృష్ణ నారాయణులిరువురూ అన్నిటా సమానులే కదా.
ఇక లక్ష్మియే స్థలమును బట్టి నానా విధ రూపములలో పూజలందుకుంటూ వస్తున్నది. అనగా ... 
అమరపురిలో స్వర్గ లక్ష్మి. నాగ లోకమున నాగ లక్ష్మి, పాతాళమున సౌభాగ్య లక్ష్మి, రాజుల చెంత రాజ్య లక్ష్మి, భువిని భక్తుల నివాసాలలో గృహలక్ష్మి, గోమాతలలో సురభి, యజ్ఞ యాగములంజు యజ్ఞకామిని యైన దక్షిణ. కాగా, పద్మాలలోనూ, చంద్రుని చెంతనూ శ్రీ శోభా రూపిణి గానూ, సూర్య మండలాన ప్రభా రూపిణిగానూ పూజలందుకుంటూ వస్తున్నది.
ముందుగా ఆమెను శ్రీమన్నారాయణుడే పూజించాడు. తదుపరి  బ్రహ్మ రుద్రుల పూజలందుకున్న దేవిని తిరిగి పాలకడలిలో  శ్రీహరియే మరోసారి అర్చించాడు. ఈ విధముగా చైత్రము, భాద్రపదము, పుష్య మాసాలలో విశిష్ట పూజలందుకున్న ఆ తల్లిని మాఘ పూర్ణిమనాడు మోక్ష లక్ష్మిగా మనువు అర్చించాడు.
ఇంతకూ లక్ష్మీ దేవి సాగర తనయగా మారడము వెనుక గాథ ఏమంటే...
*** 
శంకరుని అంశతో జన్మించినప్పటికీ దూర్వాసుడు విష్ణు భక్తుడే. ఒక పర్యాయము ఆయన వైకుంఠంలో శ్రీహరిని దర్సించి ఆయన ప్రేమ ఫలముగా అందుకున్న పారిజాతముతో తిరిగి కైలామునకు పోవుచుండగా మార్గ మధ్యమున గమనించిన ఇంద్రుడు ఆయనకూ, పరివారానికీ వందనమాచరించాడు.  చేసిన ఉపచారాలకు సంతసించిన దూర్వాసుడు తన చెంత నున్న పారిజాతాన్ని ఇంద్రునికిచ్చాడు. కానీ,  శచీపతి దానిని పువ్వే కదా అనుకుని అక్కడే ఎనుగుపై ఉంచాడు. వెంటనే అది  ఎటో వెళ్ళిపోయింది. ఆగ్రహోదగ్రుడైన దూర్వాసుడు "అది శ్రీహరి ఇచ్చిన పారిజాతము. నీకింత అహంకారము తగదు. నీ యహంకారము వలలనే అదె అలా మాయమైనది. క్రమేపీ లక్ష్మి కూడా స్వర్గము వదలిపోవుగాక..." అని శపించాడు. అలాగే జరుగుతూండడంతో ఇంద్రునికి కనులు తెరుచుకుని వైరాగ్యము ఆవరించింది. వెంటనే తమ గురువైన బృహస్పతిని చేరి విషయం వివరించాడు. ఆయన జాఞానము బోధిస్తూ వేగిరం  ఆ హరినే కలసి శరణు వేడాలన్నాడు. అప్పుడు  బృహస్పతి నేతృత్వములోనే ఇంద్రాది దేవతలు  ముందుగా బ్రహ్మను కలిసారు.  ఆయన సంగతి విని ఇంద్రుని మందలించి  వారందరినీ తీసుకుని వైకుంఠం చేరాడు. అక్కడ  విష్ముమూర్తి వీరిని సాదరముగా ఆహ్వానించి,  జరిగిన దానిని తానునూ సవరించలేమనీ, తానునూ  అస్వతంత్రుడనే అనీ చెప్పాడు. లక్ష్మి ఎక్కడెక్కడ నివసిస్తుందో వివరించి తదనుగుణంగా కొలిచినప్పుడే తగిన ఫలమని చెప్పాడు. లక్ష్మిని కొద్ది కాలంపాటు క్షీర సాగరములో వసించాలని నిర్దేశించాడు.
ఆ తర్వాత...సాగర మథనం, లక్షమి ఆవిర్బావము, విష్ణువును వరించడం మనకు తెలిసినదే. దేవతలందరూ తిరిగి ఆమెను యథోచితముగా పూజించగా ఆమె కూడా వారిని మన్నించి వారి గృహాలను పావనం చేయసాగింది.
ఇంతకూ  శ్రీ మహాలక్ష్మి కొలువై ఉండే స్థలములేవనగా...
*** 
శ్రీహరి నామ సంకీర్తనము సాగుతుండాలి. దక్షిణావర్త శంఖము, శంఖ ధ్వని, తులసీ దళ సహిత హరి సేవార్చనలు నడవాలి. లింగార్చనము,  పరమ శివుని గుణ నామ సంకీర్తనము, శ్రీ దుర్గా గుణ మహిమ గానము వినిపిస్తుండాలి. అటువంటి తావులే పద్మాలయ వాస స్థానములు.
***

No comments:

Post a Comment

Pages