శ్రీమద్భగవద్గీత-17 - అచ్చంగా తెలుగు
శ్రీమద్భగవద్గీత-17
రెడ్లం రాజగోపాల రావు
పలమనేరు


విజ్ఞానయోగము

ఏడవ అధ్యాయము
దైవీ హ్యేషా  గుణమయీ 
మమ మాయా దురత్యయా

మామేవయే ప్రపద్యంతే 
మాయా మేతాం తరన్తితే

- 14 వ శ్లోకం
ఈ శ్లోకమున భగవంతుని పొందుటకు మాయను దాటుటకు ఉపాయము చెప్పబడినది ముముక్షువులకు ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది భగవంతుని దర్శించుటకు ఒక పెద్ద అడ్డంకియున్నది అందువల్ల నేరుగా దర్శింపలేకున్నాము. ఆ అడ్డంకి మాయ ఆ మాయను దాటిన వారికి పరమాత్మ దర్శనమగును ఆ మాయను దాటుటుకు ఉపాయము పరమాత్మ కరుణతో తెలియజేయుచున్నాడు మాయకు సంబందించిన 4 లక్షణములేవియనిన 
1 అలౌకికమైనది అనగా దైవ సంబంధమైనది
2 గొప్ప సామర్త్యము గలది అనగా నీటిలో మొసలివంటిది 
3 భగవంతునికి లోబడినది
4 దాటుటకు కష్టసాధ్యమైనది
ఈ మాయ మహా శక్తివంతమైయుండుట వలన అనేకులగు బలవంతులు మేధాసంపన్నులు రాజాధిరాజులు గూడా అజ్ఞానమందు జననమరణ ప్రవాహమునందు పడిపోవుచున్నారు లోకసంభందమైన తెలివితేటలేమియు దానిదగ్గర ఉపయోగపడవు గుణమయీ అని చెప్పుటచే ఈ మాయ త్రిగుణాత్మకమైనది సత్వ రజస్తమోగుణములతో కూడియున్నది దానికి వేరుగా ఆకారములేదు త్రిగుణములే దానియాకారము సాధనా సంపత్తిచే ఒక్కొక్క గుణమును తీసివేసినచో మాయమిగులదు అప్పుడు గుణరహితుడగును.మమ మాయా అని చెప్పుటవలన ఆమాయ భగవంతుని స్వాధీనము యందున్నది. పెంపుడుకుక్క యజమానికి లోబడినట్లుగా మాయ పరమాత్మకు లోబడియున్నది.
జీవుడు + మాయ = మానవుడు
జీవుడు - మాయ = మాధవుడు

ఈ మాయ (ప్రకృతి) జనులకు దాటుట కఠినము పరమాత్మకు స్వాధీనమందున్న ఉపకరణము. అందుకనే మమమాయా (నాలో బడిన మాయ) అని చెప్పుచున్నాడు దురత్యయా (దాటుటకు కష్టసాధ్యమైనది) మాయను దాటుట కష్టసాధ్యమే కానీ అసాధ్యముకాదు. మనస్సుకు వశపడువారు ఇంద్రియములకు దాసులు విషయవాంఛలకు లోబడువారు మాయనుదాటలేరు ఆత్మజ్ఞాన పరాయణులు, భక్తి వైరాగ్యాది సాధనా సంపత్తి కలిగినవారు సులభముగా దాటగలరు. మాయయొక్క స్వరూపమును తెలుసుకొంటిమి అంతమాత్రమున భీతిల్లవలసిన పనిలేదు. సముద్రము విశాలమైనదే అయిననూ భక్తి జ్ఞానమనే చిన్న ఓడ సంపాదించిన సులభముగా దాటవచ్చును.మాయను దాటుటకు సంపూర్ణ శరణాగతియే తరుణోపాయము తరంతితే అని భగవానుడు విస్పష్టముగా దెలుపుట వలన తననాశ్రయించిన వారు మాయను తప్పక జయించగలరు కాబట్టి అశాశ్వతమైన ప్రాపంచిక వస్తువుల వ్యామోహము వదలి భగవంతుని శరణాగతి పొందవలెను అట్టి జన్మమే ధన్యము.
చతుర్విధా భజంతేమాం 
జనాస్సుకృతినోర్జున

ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీ 
జ్ఞానీచ భరతర్షభ

- 16 వ శ్లోకం
భరతవంశ శ్రేష్టుడగు ఓ అర్జునా ఆపదలోనున్నవాడు తెలుసుకొనే తపనగలవాడు ధనమునఖిలషించువాడు ఆత్మజ్ఞాని అను 4 విధముల పుణ్యాత్ములు నన్ను సేవించుచున్నారు. మొదటివాడగు ఆర్థుడు ఏదైనా విపత్తు సంభవించినపుడు, కష్టము కలిగినపుడు భగవంతుని స్మరించుచున్నారు ఇట్టివారు జనులలో పెక్కురుగలరు. కరుణాసముద్రుడగు పరమాత్మ ఎట్లైననూ వారినందరినీ పుణ్యాత్ములలో జమకట్టినాడు రెండవవాడు జిజ్ఞాసువు భగవత్తత్వము ఉనికిని తెలుసుకోదలచువాడు. కోట్లకొలది జనులలో దైవజిజ్ఞాసగలవారు శాస్త్రోక్త కర్మానష్టాన ఫలమునతిక్రమించి పోవుచున్నారని చెప్పియుండెను.అటేటి జిజ్ఞాస పూర్వజన్మ సుకృతము వలననే కలుగుచుండును.
మూడవవాడు అర్థార్థి అనగా ధనముకొరకు,సంపదలకొరకు,బాహ్యమగు సుఖములకొరకు భగవంతుని ప్రార్థించువాడు అతని ఉద్దేశ్యము దేవుని అనుగ్రహముచే ప్రాపంచిక సంపద అభివృద్ధినొందవలెననియే ఏ కారణముచేతనైననేమి ఈతడును భగవంతుని స్మరించుచున్నాడు కనుక పుణ్యాత్ముడే అగుచున్నాడు.నాల్గవవాడు జ్ఞాని భగవంతుని తత్వాన్ని బాగా ఆకళింపు చేసుకొన్నవాడు అనుభవము చెసుకొన్నవాడు స్వస్వరూప అనుభవమునొందిన మహనీయుడు అతడు నిరంతరము ఆత్మయందే స్థితికలిగి ధ్యానించుచుండును.ఆర్థుని వలే అర్థార్థుని వలే ఒకానొక కోరికతో భగవంతుని స్మరించువాడు కాదు అతడు ఏవిధమైన కోర్కెయూ భగవంతుని కోరకుండును కనుక వారందికంటే ఈతడే ఉత్తముడని గీతాచార్యుడు తెలిపెను. ఆర్త భక్తులలో గజేంద్రుడు మున్నగువారు జిజ్ఞాసువుల్లో పరీక్షిత్తు అర్థార్థుల్లో సుగ్రీవ ద్రువాదులు జ్ఞానులలో శ్రీశుకుడు,భీష్ముడు,ప్రహ్లాదుడు మొదలగు వారిని పేర్కొనవచ్చును.
తెషాం జ్ఞానీ నిత్యయుక్త
ఏక భక్తి ర్విష్యతే

ప్రియో హి జ్ఞానినో త్య ర్థ 
మహం సచమమప్రియః  

17 వ శ్లోకం
ముందు(16వ శ్లోకం) శ్లోకంలో తెలిపిన నలుగురిలో నిత్యము పరమాత్మతో గూడియుండువాడును పరమాత్మయందు స్థిర భక్తి గలవాడునగు జ్ఞాని శ్రేష్టుడగుచున్నాడు అట్టి జ్ఞనికి నేను మిక్కిలి ప్రీతికలిగినవాడను,అతడున్నూ నాకు మిగుల ఇష్టుడే. సాధకులగువారు ప్రారంభమున కొంతకాలము భగవధ్యానము చేసి తదుపరి కొంతకాలము ఇతరపనులకు వినియోగించినప్పటికీ క్రమక్రమముగా సమయమును పెంచుకొనుచుపోయి తుదకు నిరంతర దైవనిష్ఠా లక్ష్యమును చేరుకొనవలెను.
జ్ఞానికి ఒక్క భగవంతుని యందు తప్ప బాహ్య విషయములందు భక్తియుండ నేరదు అతడు భక్తులలో సర్వోతృకృష్ట స్తానమునలంకరించినాడు అట్టి జ్ఞానానికి భగవంతుని యందు అమితప్రీతి యుండునని తెలియుచున్నది. జ్ఞాని దృష్టియందు దృశ్యవస్తువులన్నియు నశించిపోవునవే కావున శాశ్వత పరమాత్మయందే ప్రీతినొందును ఈ ప్రకారముగ భక్తుడెవడు భగవంతుని ప్రేమించునో భగవంతుడు ఇంకా ఎక్కువగా భక్తుని ప్రేమించుచున్నాడు.భగవంతుడు మనకు ఇచ్చువాడే కానీ ఎక్కువగా పుచ్చుకొనువాడు కాడు వాస్తవమునకు తురీయ స్థితిలో భక్తికీ జ్ఞనమునకు బేధమే లేదు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ కాదు. భక్తునకు జ్ఞానముండును జ్ఞానికి భక్తియుండును.
ఒకసారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని మీకు భక్తుడెవరు? అని ఒకరు అడిగారు. అందుకు సమాధానంగా నాకు నిజ భక్తుడైన మనుజునికై వెతుకుచునే యున్నాను. పరిపూర్ణ భక్తుడని చెప్పగలవారెవ్వరూ ఇంతవరకూ తారసపడలేదు అందుకే వెతుకుచునే యున్నాను అని అన్నారు.
(సశేషం) 

No comments:

Post a Comment

Pages