సామ్రాజ్ఞి – 15 - అచ్చంగా తెలుగు
సామ్రాజ్ఞి – 15
భావరాజు పద్మిని


(జరిగిన కధ : ప్రస్తుత కేరళ ప్రాంతంలోని సువిశాల సీమంతినీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల. ఆమె రాజ్యంలో అంతా స్త్రీలే ! అందంలో,కళల్లో, యుద్ధ విద్యల్లో ఆమె ముందు నిలువగల ధీరుడు లేడని ప్రతీతి. ఆమె ఉత్సాహభరితమైన మాటలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. తమతో అనవసరంగా వైరం పెట్టుకున్న కుంతల రాజు విజయవర్మతో మల్లయుద్దంలో గెలిచి, అతని రాజ్యం అతని రాణులకు, కుమారులకు అప్పగించి, అతడిని బందీగా తమ రాజ్యానికి తీసుకువస్తుంది ప్రమీల. రాజ నియమాల ప్రకారం అతను విలాసపురుషుడిగా మార్చబడతాడు. పరిణామ, వ్యాఘ్ర సరోవరాలలో మునిగిన యాగాశ్వం పులిగా మారిపోవడంతో, దిక్కుతోచక శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటాడు అర్జునుడు. కృష్ణుడు ప్రత్యక్షమై యాగాశ్వానికి పూర్వపు రూపును తెప్పించి, ఆర్జునుడిని దీవించి, మాయమౌతాడు. పంపా నదీ తీరాన సీమంతినీ నగరాన్ని కావలి కాస్తున్న వారికి దొరుకుతుంది ధర్మరాజు యాగాశ్వం. దాన్ని సామ్రాజ్ఞి తన అశ్వశాలలో కట్టేయించి, యాగాశ్వం కావాలంటే తనతో యుద్ధం చేసి, విడిపించుకోమని, తన దండనాయకి వీరవల్లితో అర్జునుడికి లేఖ పంపుతుంది. తమ రాజ్యంలోని వివిధ బలాబలాలను గురించి అర్జునుడి సర్వసేనానియైన ప్రతాపరుద్రుడితో చెబుతూ ఉంటుంది వీరవల్లి. ఈలోపు విదూషకుడు చతురుడు అక్కడికి వచ్చి, వారికి వినోదాన్ని కల్పిస్తాడు. సంధిచర్చలకు సీమంతిని నగరానికి రావాలన్న కోరికతో వీరవల్లి ద్వారా సామ్రాజ్ఞికి ఒక లేఖను పంపుతాడు అర్జునుడు. ఆమె ఆహ్వానంపై అర్జున సేన   స్ర్తీ సామ్రాజ్యం చేరుకొని, అక్కడి అద్భుత నిర్మాణ వైశిష్ట్యానికి, వన శోభకు ఆశ్చర్యపోతారు . అనివార్యమైన ప్రమీలార్జునుల యుద్ధానికి రంగం సిద్ధమవసాగింది. ఈలోగా శస్త్రాస్త్రాల గురించి తన పరివారానికి వివరించాడు అర్జునుడు. ఇక చదవండి...)
సామ్రాజ్ఞి ఆంతరంగిక మందిరం. చీకట్లు ముసురుకున్నా, నిద్రపోకుండా, తన గవాక్షం లోంచి పాడ్యమి నాటి చంద్రుడినే చూస్తోంది ప్రమీల. ఇంతలో అక్కడికి వచ్చింది ఆమె ఇష్టసఖి సౌగంధిక. చనువుగా దగ్గరకు వెళ్లి సామ్రాజ్ఞి భుజంపై చెయ్యి వేసింది. వెంటనే అటు తిరిగి చూసి, మళ్ళీ తలదించుకుంది ప్రమీల.
“ప్రాణ సఖీ ! మీ ప్రవర్తన నాకు అమితాశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రాణ ప్రదంగా ప్రేమించే అర్జునులవారు మీ ఎదుట పడితే, ఆయనకు మీ మనసు తెలిపి, ప్రణయ సామ్రాజ్యంలో బంధించే బదులు, ఇలా ప్రళయ కాల కాళిక లాగా మారి సమరానికి సన్నాహాలు చేయిస్తున్నారా? మాటమాత్రమైనా గుర్విణి శక్తిసేనకు మీ మనసు తెలిపి ఉండాల్సింది కదా !” అనునయంగా అడిగింది సౌగంధిక.
“చెలీ, ఏం చెప్పమంటావు? పాలకుల వైభవాన్ని చూసి, అందరూ అసూయ పడుతూ ఉంటారు కాని, నిజానికి వారి బ్రతుకులు దుర్భరమైనవి. ప్రేమ, దుఃఖం, కోపం, నవ్వు, ఏ భావాన్ని బాహాటంగా ప్రకటించే స్వేచ్చ వారికి ఉండదు. పలువురి క్షేమం కోసం తన ఇష్టాలను త్యజించాలి. ధర్మాన్ని నిష్టగా ఆచరిస్తూ తనను నమ్ముకున్న ప్రజలకు ఆదర్శంగా నిలవాలి.
చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప స్త్రీ సామ్రాజ్యానికి అధినేత్రిగా, మన సామ్రాజ్య గౌరవమా, లేక నా స్వార్ధమా అని ఆలోచిస్తే, ధర్మం మన రాజ్య ప్రతిష్ట వైపే మొగ్గు చూపింది. అందుకే నా భావాలను నాలోనే సమాధి చేసి, బరువైన గుండెతో యుద్ధానికి సన్నద్దమయ్యాను. “
ఆ సమయంలో ఒక ముఖ్యమైన విషయం చర్చించేందుకు అక్కడికి వచ్చిన శక్తిసేన, ప్రమీల మాటలని వింది. ఇక మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయింది.
***
మూడుప్రక్కల ఎత్తైన పర్వతాలు, నడుమన వ్యాపించి ఉన్న విశాలమైన మైదానం...
ప్రమీలార్జునుల సమరానికి అదే వేదికగా మారింది. అక్కడ గంభీరమైన మౌనం అలముకుంది. ఒక మహోత్పాతం జరిగేముందు ప్రకృతి వహించే మౌనంలా ఉందది. చుట్టూ కట్టిన కంచెకు ఆవల ఉన్న వీక్షకులకు తమ బరువైన శ్వాస, గుండె చప్పుడు తప్ప ఏమీ వినిపించట్లేదు.
రధ చక్రాలు ధూళి రేపుతూ ఉండగా, స్త్రీ సామ్రాజ్య కేతనం రెపరెప లాడుతున్న యుద్ధ రధంపై అక్కడికి వచ్చింది ప్రమీల. ఆంజనేయుడి విజయకేతనం ఎగురవేసిన రధంపై గాండీవ ధారియై విచ్చేసాడు అర్జునుడు. ఒక ప్రక్కగా నిలబడి చూస్తున్న తన గుర్విణి పాదాలకు వందన బాణంతో అభివాదం చేసింది ప్రమీల. తన మనసులోనే కృష్ణ పరమాత్మకు వందనాలు సమర్పించుకున్నాడు అర్జునుడు. ఒక స్త్రీతో యుద్ధం చేసేందుకు అతని మనసు ఎంతమాత్రం అంగీకరించట్లేదు. కాని, తప్పనిసరి అయ్యింది కనుక, మూడు పదునైన బాణాలను ప్రమీలపై ప్రయోగించాడు.
తృటిలో ఆ బాణాలను ఖండించి, దశ దిశలనూ కప్పేలా తీవ్రమైన బాణాలను ప్రయోగించింది ఆమె. అర్జునుడు అచ్చెరువొంది, ప్రమీలపై అగ్ని శిఖలవంటి బాణాలను వదిలాడు. ఆమె వాటిని ఆకాశంలోనే తుత్తునియలు చేసింది. ప్రమీల అర్జునుడిపై సౌరాస్త్రం సంధించింది. అనేక చక్రాయుధాలు అందులోనుంచి బయలుదేరి అర్జునుడిని చుట్టుముట్టాయి.  దానిని వజ్రాస్త్రంతో ఖండించి, ఆమెపై నాగాస్త్రం  ప్రయోగించాడు అర్జునుడు. ఆమె గరుడాస్త్రంతో దానిని ఖండించింది. ఇక  అర్జునుడు –ప్రమీల,  రుద్రుడూ-యముడూలాగా పోరాటం సాగించారు. వాళ్ళ బాణకాంతులతో ఆకాశం మెరుపులతో మెరిసినట్లు మెరిసిపోయింది. యుద్ధం మొదటి అంకం ముగిసింది.

ఇంతలో గుర్విణి శక్తిసేన వారి మధ్యకు వచ్చి, “అర్జునా ! మా సామ్రాజ్ఞి బాణాల రుచి తెలిసిందా? ఈమెను గెలవడం నీ తరం కాదు. నీకు గుఱ్ఱం కావాలంటే, ఇకనైనా పోరు మాని, నిన్ను వలచిన ఈమెను పెళ్ళాడు. ఈ సామ్రాజ్యానికి, మా సామ్రాజ్ఞికి కూడా ఏలికవుకమ్ము. ” అంది. తన గుర్విణి వంక సంభ్రమంగా చూసి, అభివాదం చేసింది ప్రమీల.

బిగ్గరగా నవ్వాడు అర్జునుడు, “భలే గుర్విణీ ! మీ దేశంలోని స్త్రీలతో కూడిన నరుడు, నెల రోజుల్లో మరణిస్తాడు. అలా ఈమెను వివాహం చేసుకున్న మాసానికే నేను పరమపదిస్తే, ఇక మీ దేశాన్ని, మీ రాణిని ఏలేది ఎవ్వరు ? ఇది తెలిసి కూడా మీ రాణిని వివాహం చేసుకోమని ఎలా అడుగుతున్నారు? ఇదే జరిగితే, యాగాశ్వాన్ని హస్తినకు తిరిగి తీసుకుని వెళ్లి అప్పగించేది ఎవరు? కురుక్షేత్ర సంగ్రామంలో శత్రు సేనను తుత్తునియలు చేసిన అర్జునుడు ఒక స్త్రీని గెలువలేక, వివాహమాడి, అక్కడే మరణించాడన్న అపకీర్తి మూటగట్టుకునే కంటే, ఇక్కడే విజయమో, వీర స్వర్గమో తేల్చుకోవడం నయం కదూ?” అన్నాడు.

“ఏది ఏమైనా మా దేశంలోకి అడుగుపెట్టావు. ఇక ఎలాగైనా నీ ప్రాణాలు పోవడం తధ్యం. ఈమెను గెలవడం సాధ్యం కాదు కనుక, నీ ప్రాణాలు మా సామ్రాజ్ఞి చేతిలో పోవాల్సిందే. వృధాగా వాడియైన బాణాలతో శరీరం తూట్లు పొడిచిన మీదట, అమిత ప్రయాసతో, వేదనతో ప్రాణాలు వదలడం ఎందుకు? అంతకంటే, ఈమెను పెళ్ళాడి, హాయిగా ఈమె కౌగిలిలో ప్రాణాలు వదలడం నయం కదా !” తన తంత్రాన్ని అర్జునుడిపై ప్రయోగించింది శక్తిసేన. ఎలాగైనా ప్రమీల కోరుకున్న అర్జునుడితో వివాహం జరిపించాలని ఆమె కోరిక.

“గుర్విణీ ! స్వయంవరంలో గెలుపొందిన ద్రౌపది, కృష్ణుడి సోదరి సుభద్ర, నాగకన్య ఉలూపి, చిత్రాంగద ఈ నలుగురూ నా భార్యలు. చిత్రాంగదకు నేనిచ్చిన మాట వలన వేరెవరినీ వివాహం చేసుకునే స్థితిలో నేను లేను. ఇక విజయం సామ్రాజ్ఞిదో, నాదో దైవమే నిర్ణయిస్తుంది.” అని చెప్పి, ఉపచారిక సేవల కోసం తన గుడారం లోనికి వెళ్ళాడు.

అర్జునుడి సమాధానం విన్న ప్రమీల అవాక్కయ్యింది. ఇంతవరకు ఆమె లోకోత్తర సౌందర్యానికి, శౌర్యానికి, ప్రతిభకు అచ్చెరువొంది ఆమెను వివాహం చేసుకోవాలని ఉవ్విళ్ళూరిన వారే కాని, ఇలా ఆమె తనంతట తాను కోరితే తిరస్కరించిన వారు లేరు. తీరని పరాభవానికి గురైనట్లు ఆమె విషణ్ణ వదనయై నిలుచుంది. ఇంతలో ఆమె చెలులు వచ్చి ఆమెను గుడారంలోనికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఉన్న సౌగంధికతో, గుర్విణితో ఇలా అంది ప్రమీల.

“గుర్విణీ ! నా జీవితంలో ఏ పురుషుడినీ కాంక్షించలేదు. నన్ను వలచి వచ్చిన వారి నందరినీ తిరస్కరించాను. ఆ పాప ఫలమేనేమో, ప్రాణప్రదంగా ప్రేమించిన వ్యక్తి  తిరస్కరిస్తే ఎలా ఉంటుందో ఆ వేదనను ఈనాడు అనుభవిస్తున్నాను. ఈ బాధ నన్ను దహించేస్తోంది. నా కోరిక న్యాయసమ్మతమైనదే అయితే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ దానిని నెరవేర్చు గాక ! కాకున్నచో, ఈ యుద్ధం లోనే నేను ప్రేమించిన అర్జునుడి చేతిలోనే ప్రాణాలు విడుస్తాను. అంతేకాని, జీవితంలో మరే పురుషుడినీ వరించను.”

“సామ్రాజ్ఞీ ! బేలగా మారకు. ఈ సమస్త సృష్టికి మూలమైన శక్తి స్వరూపిణి స్త్రీ. అటువంటి మనం కేవలం ఒక పురుషుడు తిరస్కరించాడని నిరాశ చెందకూడదు. ఎంతటి ధీశాలినైనా కృంగదీస్తుంది ప్రేమ. ఈ నిముషం స్త్రీ సామ్రాజ్య ప్రతిష్ట నీ చేతుల్లో ఉన్నది. యాగాశ్వం విడిచి, సవాలు విసిరింది వాళ్ళు. వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పి పంపు. ఇదే నీ కర్తవ్యం. “ ఆమెను మళ్ళీ కార్యోన్ముఖురాలిని చేస్తూ  చెప్పింది శక్తిసేన.

యుద్ధం రెండో అంకం మొదలైంది. తన బాణాలతో అర్జునుడి రధానికి ఉన్న గుర్రాలను గాయపరచి, వాయువేగంతో అర్జునుడిని సమీపించింది ప్రమీల. అర్జునుడు ఆమెపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆమె అస్త్రంతో పాటు అర్జునుడి గాండీవం యొక్క నారిని కూడా ఖండించింది.
ఆపై వారిరువురూ ఒకరిపై ఒకరు ఈటెలు, పట్టెసములు, శూలములు, ముద్గరములు,  ముసలములు వంటి శస్త్రాలు ప్రయోగించుకున్నారు. ఒకరిని మించి ఒకరు ఆయుధప్రయోగాలు చెయ్యడం, వాటిని ఉపసంహరించడం జరుగుతోంది. చివరికి కోపోద్రిక్తుడైన అర్జునుడు తన గాండీవానికి వేరొక నారిని అమర్చి, “ఈమెను సంహరించి తీరుతాను,” అని బిగ్గరగా ప్రమాణం చేసాడు. ఇంతలో ఆకాశవాణి ఈ విధంగా పలికింది.
“అర్జునా ! తొందరపడకు. శాంతించు. దేవతలకు సైతం ఈమెను గెలవడం సాధ్యం కాదు. ఒకప్పుడు దిలీపుడు అనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు. ఆయన కుమార్తెయే ఈ ప్రమీల. ఒకనాడు దిలీపుడు వేటకు వెళ్తూ ఉండగా, ప్రమీల కూడా ఆయనతో పాటు వేటకు వెళ్ళింది. వీరితో కొంతమంది సైన్యం కూడా వెళ్ళారు. అదే అరణ్యంలో పార్వతీ దేవి శివుడితో రమిస్తూ ఉంది. ఆమెను దిలీపుడు, అతని సైన్యం చూసారు. వెంటనే పార్వతి కోపోద్రిక్తురాలై, రాజ్యంలోని వారందరినీ స్త్రీలు కమ్మని శపించింది. అప్పటినుంచి ఇది స్త్రీ సామ్రాజ్యమయ్యింది. పశ్చాత్తాపంతో శాప పరిహారం కోరిన వీరికి, ఏ నాడైతే ఇంద్రుని కుమారుడైన అర్జునుడు ప్రమీలను వివాహం చేసుకుంటాడో, ఆరోజే వీరికి శాపవిముక్తి అని పార్వతీ దేవి సెలవిచ్చింది. కనుక, మీ ఇరువురి వివాహం దైవనిర్ణయం !”
ఆకాశవాణి మాటలను విన్న అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్ధించాడు. మౌనంగానే ప్రమీల, అర్జునుడు తమ మనసులోని కోరికలను శ్రీకృష్ణుడికి నివేదించుకున్నారు. కృష్ణుడు ఇరువురినీ తన వద్దకు రమ్మని పిలిచి, అర్జునుడి కుడి చేతిని, ప్రమీల ఎడమ చేతిలో పెట్టి, గాంధర్వ వివాహం జరిపాడు. వారి వివాహమైన తక్షణమే స్త్రీ సామ్రాజ్యంలోని వారందరికీ శాప విముక్తి కలిగింది.
“ప్రస్తుతం ధర్మరాజు యాగదీక్షలో ఉన్నాడు కనుక, అతడిని సంరక్షించే భారం అర్జునుడిదే కనుక, నీవు అర్జునుడు హస్తిన చేరేదాకా, ఇతడిని అనుసరించాలి. ఆపై అశ్వమేధ యాగం ముగిసాకా, అర్జునుడు నిన్ను చేపడతాడు. సమ్మతమేనా?” అని ప్రమీలను అడిగాడు శ్రీకృష్ణుడు.
అంగీకార సూచకంగా తలూపి, సిగ్గుతో తలదించుకుంది సామ్రాజ్ఞి. ప్రమీలార్జునుల ప్రణయ రధం హస్తినాపురం దిశగా పయనమయ్యింది.
(సమాప్తం) 

No comments:

Post a Comment

Pages