పుష్యమిత్ర - 22 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 22
- టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు అగ్నిమిత్రునికి రాజ్యం కట్టబెట్టి హిమాలయాలలో జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడు బాబాజీ ద్వారా తను కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద సంచరించాలని  ఆదేశించడంతో ఆశ్చర్యపోతాడు.   శ్రీహరికోట(షార్) పై భారత అధికారులు ధృవపరచగా పాక్ అధ్యక్షుడు దాన్ని ఖండిస్తాడు. పాక్ ప్రెసిడెంటు తగిన అమెరికా అద్యక్షునితో మాట్లాడగా..భారత్ కు తగిన సాక్ష్యాధారాలు లేకుండా తొందరపడవద్దని సలహా ఇస్తాడు. హిమాలయాలపై భయంకర మంచుతుఫాను రాబోతున్నదని జనం సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్ళే తరుణంలో పుష్యమిత్రుడు బాబాజీ ద్వారా ఉపదేశం పొంది మళ్ళీ జ్ఞాన సమాధిలోకి వెళ్తాడు.  (ఇక చదవండి)

గుహలో సమాధిస్థితిలో ఉన్న పుష్యమిత్రునికి బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. అవసరం మేరకే వీచే చల్లని గాలి అహ్లాదంగా ఉంది. గుహమొత్తం లేత ఊదారంగు వాయువుతో నిండి ఉంది. పుష్యమిత్రుని భృకుటి మధ్యలో ఒక దివ్య జ్యోతి వెలుగుతూ ఉంది. ఏమిటీ వెలుగు? అని అలోచిస్తుండగా అతని అగోచర దృష్టికి ఒక జటాఝాటధారి  దర్శనమిచ్చి "నాయనా! నీకు ఈ సమాధి స్థితి చాలా అవసరం" అంటూ చెప్ప సాగాడు.
సమాధి అంటే సమదృష్టిని కలిగించే ఒక మానసిక స్థితి. ఆ స్థితిలో బుద్ధి సహజమైన  వివేచనకు అతీతంగా పనిచేస్తుంది. ఈ స్థితి నీకు నీ శరీరానికీ మధ్య కొంత దూరాన్ని తీసుకువస్తుంది. సమాధుల్లో ఎనిమిది రకాలు ఉన్నాయని వేద వేదాంగాలు చదివిన నీకు చెప్పాల్సిన పని లేదు.  ఈ ఎనిమిదింటినీ మరలా రెండు అతిముఖ్యమైన విభాగాలుగా ఆర్యులు విడదీశారు. సవికల్ప సమాధి స్థితులు (ఈ సమాధి స్థితిలో అనుభూతులు మనోహరంగా ఉంటూ, ఆనందాన్నీ, బ్రహ్మానందాన్నీ కలుగజేసేవి) నిర్వికల్ప సమాధి స్థితులు (అవి ఆనందానికీ, దుఃఖానికీ అతీతమై ఏ వికారాలూ లేని స్థితి). నిర్వికల్ప సమాధిలో శరీరంతో సంబంధం ఒకే ఒక బిందువుతో ఉంటుంది. తక్కిన శక్తి అంతా స్వేఛ్ఛగా భౌతికతతో ప్రమేయంలేకుండ చరిస్తుంది. తమకీ తమ శరీరాలకీ మధ్య తారతమ్యం ఉందని తెలియడానికి సాధకులు ఇటువంటి సమాధి స్థితిని సాధన చేస్తుంటారు. సాధకులు జీవితంలో వివిధ స్థాయిల్లో వేరువేరు అనుభూతులకు లోనవడం వంటిదే  సమాధి స్థితి కూడా. కానీ సమాధి స్థితిని అనుభవించినంత మాత్రం చేత  నీ అస్తిత్వ పునరావృతుల నుండి నీకు విముక్తి లభించిందన్న హామీ లేదు.   నీవు బాల్యంలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఒక స్థితిలో అనుభూతి చెందావు. యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాత మరొక ప్రమాణంలో జీవితానుభూతి ఉంది. అలాగే  జీవితంలో వివిధ స్థాయిల్లో వేరువేరు అనుభూతులకు లోనయినట్లే సమాధి స్థితి కూడా ఉంటుంది. కొందరు ఒకరకమైన సమాధి స్థితి చేరుకుని కొన్ని సంవత్సరాల పాటు అది అనుభవింప యోగ్యమైనదిగా ఉండడం వలన అక్కడే ఉంటారు.  ఈ స్థితిలో వాళ్లకి కాలంతో, స్థానంతో ఏ సంబంధం ఉండదు. వాళ్ళకి ఏ శారీరకమైన  సమస్యలూ ఉత్పన్నం కావు. ఇందుకు కారణం వాళ్లకి శరీర, మానసిక వ్యవస్థలతో కొంతమేరకు సరిహద్దులు చెరిగిపోవడమే. కానీ ఇది తాత్కాలికం. వాళ్లు ఈ స్థితి నుండి ఒకసారి బయటకి వచ్చిన తర్వాత శరీరానికి కావలసిన అవసరాలూ, మనసుకి పూర్వం ఉన్న అలవాట్లు తిరిగి వెనక్కి వస్తాయి. నీకు సులభంగా చెప్పాలంటే  మాములుగా ఉన్నవాడి కంటే కొద్దిగా మత్తుపానీయాలు సేవించినవాడు వేరే స్థాయి అనుభూతిలో విజృంభిస్తూ ఉంటాడు. కానీ ఎప్పటికో ఒకప్పటికి ఆస్థాయి నుండి క్రిందకు దిగిరాక తప్పదు. ఈ సమాధి స్థితులన్ని ఏ రసాయనిక పదార్థాలూ సేవించకుండా ఆ స్థితిని చేరుకునే మార్గాలు. మీరు ఈ స్థితిలోకి వెళ్ళినపుడు, మీకొక  కొత్తప్రమాణం తెరుచుకుంటుంది. కానీ అది నిన్ను శాశ్వతంగా మార్చలేదని గుర్తుంచుకోవాలి.  మీరు మరొక కొత్త వాస్తవంలోకి ప్రవేశించలేరు. మీ అనుభూతి సాంద్రమౌతుంది కానీ స్థూల దృష్టితో చూసినపుడు మీరు స్వతంత్రులు కాలేరు. శరీరంలో జరిగే రసాయనిక చర్యల ద్వారా కల్పించుకున్న ఉన్నత మానసిక చైతన్య స్థితి. కానీ అందులో ఉన్న ప్రమాదం ఏమిటంటే, అది ప్రస్తుత వాస్తవం కంటే అందంగా ఉంటుంది కనుక మీరు అక్కడే ఉండిపోవాలని భ్రమపడవచ్చు. కానీ, ఎంత అందమైన అనుభవమైనా కాలక్రమంలో దాని అనుభూతి సాంద్రత తిరోముఖం పడుతుందనే విషయం తెలిసినదే కదా! ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా ? అన్నట్టు సంభాషణ ఆపాడు ఆ దివ్యతేజుడు. పుష్యమిత్రుడు ఏమీ మాట్లాడకపోవడంతో...  మళ్ళీ "నాయనా! పుష్యమిత్రా! భ్రూమధ్యం భగవన్మందిర ద్వారము. అది తెరుచుకుంటే తప్ప నుదుట జ్ఞాన జ్యోతి కనిపించదు. అనాహత చక్రము మహర్లోకాన్ని సూచిస్తుంది. పన్నెండు దళములతో బంగారం వర్ణంలో ఉంటుంది. నీవు యోగసాధనలో మరింత ఎత్తుకు ఎదిగావు. నీకు త్వరలో భగవత్సాక్షాత్కారం కాగలదు" అంటూ భృకుటి ముందు నుండి మాయమయ్యాడు ఆ మహాత్ముడు. మళ్ళీ ఈలోకంలోకి వచ్చిన పుష్యమిత్రుడు జరిగినదంతా నెమరువేసుకోసాగాడు.
* * *
మరో రెండు ఘడియల్లో గుహలో ఒక గోడలోనుండి బాబాజీ లోనకు ప్రవేశించాడు. "పుష్యమిత్రా! నీ భూలోక యాత్రకు రంగం సిద్ధమయింది. కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత నీవు భూమి మీదకు సజీవంగా ఈ దేహంతో వెళ్ళాలి అనేది నాకు తెలీదు. అది పరాత్పరుని నిర్ణయం మాత్రమే! ఆయన నాకు అప్పగించిన పనిని మాత్రమే నేను చేస్తున్నాను" అన్నాడు.
"మహత్మా! తమకు తెలియని విషయాలు కూడా ఉంటాయా?"
"నిజమే! ఉండవచ్చు! లేక ఉండకపోవచ్చు! కానీ దేవ రహస్యాలను చెప్పడం తగదు కదా!"
"నేను మరలా భూలోకంలో సంచరించి చేయవలసిన పనులు ఏమున్నవి? రాజ్యభారం అగ్నిమిత్రునికి అప్పజెప్పాను. తను అన్నీ చూసుకుంటాడు".
"అగ్నిమిత్రుడు నీకంటే పౌరుషవంతుడు. పరాక్రమశాలి. రాజసూయాగం కూడా కావించాడు. కానీ, దురదృష్టశావత్తూ నీవు విభేదించిన బౌద్ధమతాన్ని పునరుద్ధరణ చేస్తున్నాడు. బుద్ధుడు కూడా విష్ణుమూర్తి దశావతారాలలోని అవతారమే కదా! దిగులు చెందకు. భక్తి మార్గాలన్నీ భగవంతుడిని చేరడానికే!  నీవు కూల్చిన చైత్యాలను పునరుద్ధరిస్తున్నాడు. అమరావతి, సారనాధ్ స్తూపాలు ఆ ప్రాంతాలు మళ్ళీ బౌద్ధ సన్యాసులతో కళ కళ లాడుతున్నాయి.అతనికి నీ అవసరం లేదు. కానీ భవిష్యత్తులో నీ అవసరం భరతఖండానికి రావచ్చునని ఆ పరాత్పరుని ఆలోచన".
"అవశ్యం మీ ఆజ్ఞ నిర్వర్తించగలను".
"తధాస్తు"
"కానీ ఇది సాధ్యమేనా? అన్ని సంవత్సరాలు భౌతిక దేహం నాశనం కాకుండా ఉంటుందా?"
"మంచి ప్రశ్న పుష్యమిత్రా!" విను అంటూ చెప్పసాగాడు.
ఇది కొంచెం నిగూఢమైన విషయం. జాగ్రత్తగా విను పుష్యమిత్రా!  సమాధి అనేది ఒక స్థితికి లేదా ఒక జన్మకు మాత్రమే పరిమితమైనది కాదు. ప్రస్తుత స్థితిని దాటి ఇతర ప్రపంచాల్లోకి కూడా వెళ్లగలదు. దేహాన్ని వీడినవారు కూడా ధ్యానానికి ప్రభావితం అవుతారు. ధ్యానం చేస్తున్నప్పుడు నీవు నీతో ఐక్యం కావటమే కాదు, సృష్టిలోని అనేక స్థాయిలను, సూక్ష్మ ప్రపంచంలోని అనేక స్థాయిల్లోని ప్రాణికోటినంతటినీ ప్రభావితం చేయడం జరుగుతుంది. నీవు అన్ని లోకాలు అంటే ఏడు లోకాలు సమాధి స్థితిలో దర్శించగలవు అవే భుః, భువః, సువః, మహః, జనః, తపః సత్య లోకములు. కాబట్టి వందల సంవత్సరాల క్రితం జీవించిన వారి చైతన్యాన్ని, మనసులను కూడా ధ్యానం ప్రభావితం చేయగలదు. అంతేకాక భవిష్యత్తులో పుట్టబోయే వారి చైతన్యాన్నీ, బుద్ధిని కూడా ప్రభావితం చేయగలదు. జీవితం అనేది ప్రతీ క్షణంలోనూ ఉన్నది. అదే సమయంలో అది అనంతంగా వ్యాపించి ఉన్నది. నీ జీవితం శతాబ్దాల నుంచీ ఉన్నది, శతాబ్దాల పాటు ఉంటుంది. ఇది సత్యం. భగన్నిర్ణయం కూడా!
నీవు  వీరుడవు. నీకు అర్ధమయ్యే రీతిలో చెప్పడానికి యత్నిస్తాను. జాగ్రత్తగా విను! వీర్యత ద్వారా సమాధిని పొందటం  గురించి చెప్తాను. వీర్యత అంటే సాహసం, శౌర్యం. సైనికుడు యుద్ధానికి వెళ్లినప్పటి శౌర్యం. దేశం ప్రమాదంలో పడినప్పుడు రాజులో, ప్రజల్లో శౌర్యం పెల్లుబికుతుంది. అందులో ఏ ఆనందమూ లేకుండానే వారిలో శౌర్యం వచ్చిందని అనుకుంటున్నావా? ఆ క్షణంలో వారికి అమితమైన ఆనందం లభిస్తుంది. కాబట్టే ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రజలు కోరుకోకపోతే యుద్ధాలు వచ్చేవే కావు. యుద్ధపు ఫలితాలు బాధాకరంగా ఉన్నా, యుద్ధం చేయటం అనే పని మాత్రం ప్రజలకు ఆనందాన్ని ఇస్తుంది. శరీరంలోని కణకణమూ ఏకమై, చైతన్యం సంపూర్ణమై, శరీరంలోని ఆత్మరక్షణ విధానాలు ప్రేరేపితమై, ఈ విధంగా అందరిలో శౌర్యం విజృంభిస్తుంది. ఇది బలం. భయాన్ని ఎదుర్కొనే విధానం. ఈ బలం అత్యధిక స్థాయికి చేరినప్పుడు మీలో ఆనందం ఉంటుంది. మీలో కృతజ్ఞతాభావం, దేశభక్తి, దైవభక్తి జనిస్తాయి. ఆ విధంగా శౌర్యం మిమ్మల్నియుద్ధమనే ధ్యానస్థితిలోకి తీసుకువెళ్తుంది. అర్ధమయిందా!  ఈ రోజు సాయంసంధ్యా సమయం నీ యాత్రకు సిద్ధం చేయమని ఆ పరమేశ్వరుని ఆజ్ఞ. సిద్ధంగా ఉండు. అని మాయమైపోయాడు బాబాజీ.  (సశేషం)
-0o0-

No comments:

Post a Comment

Pages