నీకు నేనున్నా – 16 - అచ్చంగా తెలుగు
నీకు నేనున్నా – 16
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com


మధురిమ వరంగల్లో వుందని తెలిసిన వెంటనే ఇంట్లో అందరికిచెప్పాడు మనోహర్ మౌనంగా విన్నారు కాని, ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. ‘కోమా’ లోంచి బయటపడ్డప్పడు మాత్రం మధురిమ సంగతి తులశమ్మతో చెప్పాడు. తులశమ్మ ఏమీ అనలేదు. కొడుకు ఇకనైనా సంతోషంగా వుంటే చాలనుకుంది. తులశమ్మ మాధవయ్య ఒకసారి వరంగల్ వెళ్లి తన కోడలు మధురిమను చూడాలన్నారు. ముఖ్యంగా తన మనవడు హైదరాబాదులోనే జాబ్ చేస్తున్నాడని తెలిసి సంతోషించారు. రాహుల్ గురించి వినగానే తనకి పిల్లలు లేరన్న ఫీలింగ్ నుండి బయటపడింది పద్మ. వెంటనే కారులో వెళ్లి రాహుల్ని కలిసింది. హాస్టల్లో వున్న రాహుల్ లగేజీని కారులో పెట్టించి, రాహుల్ ని ఇంటికి తీసుకొచ్చింది. ఆఇంట్లో రాహుల్కి సర్వాధికారాలిచ్చింది పద్మ.
ఆత్మీయులైన తనవాళ్ల ఆప్యాయతకి కట్టుబడిపోయాడు రాహుల్
*****
"మధురిమ ఓల్టేజ్ హోంలో చాలామంది వృద్దులు వచ్చిచేరారు. 
ఇంకా పదిమంది వెయిటింగ్ లిస్ట్లో వున్నారు. 
ఆ లిస్టంతా తిరగేస్తూ ఆఫీసురూంలో కూర్చుని వుంది మధురిమ, 
"అమ్మా! మధమ్మ తల్లీ! నన్నునువ్వే కాపాడాలమ్మా!" అంటూ ఓ పెద్దావిడ మధురిమ దగ్గరకి వచ్చింది. 
ఆమెను చూస్తుంటే ఇంట్లో ఏదో గొడవ పడి తెగతెంపులు చేసుకొని,బయటపడ్డ మనిషిలా అన్పిస్తోంది.చెట్టు నుండి రాలిపడిన పండుటాకులా వణుకుతుంది. ఇంతకాలం అలుపెరుగని యంత్రంలా సేవలు చేసి చేసి బోరుకొచ్చిన బండిలా కన్పిస్తోంది.
“నా బిడ్డ అందరిలాంటివాడు కాడనుకున్నానమ్మా! నామాట జవదాటడనుకున్నాను. ఆ విశ్వాసంతోనే పెంచుకున్నాను. కన్న ప్రేగే నన్ను మోసం చేసింది. ఎన్నో రకాల ఆటుపోట్లను ఎదుర్కున్న నేను ఈ కొత్తరకం పరీక్షను తట్టుకోలేకపోతున్నాను తల్లీ!” అంటూ ఆవేశంగా తనబాధను నిలబడే చెప్పకుంది ఆ పెద్దావిడ.
"ముందు మీరు కూర్చోండమ్మా! తర్వాత మాట్లాడుదురు గాని" అంటూ అక్కడే వున్న సోఫా చూపించింది మధురిమ, కూర్చుందామె.
"ఒకప్పడు నేను బాగా బ్రతికినదాన్ని తల్లీ! ఆ తర్వాత కష్టాలొచ్చాయి. ఆ కష్టాల్లోకూడా నా కొడుకును చదివించి ప్రయోజకుడ్ని చేశాను. వాడీరోజు
వజ్రాలు, వైఢూర్యాలు పోగేసుకుంటున్నాడు. నా కోడలేమో నా ఆకలికి లెక్కలు
కట్టి నా డొక్క మాడుస్తోంది. 
ఈ వయసులో నేను కొడుకు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర వున్నా ఈలోకం నన్ను అవమానిస్తుంది. కానీ రాక్షసి లాంటి ఆకలి నన్ను దెయ్యంలా వెంటాడుతోంది. కడుపునిండా అన్నం తినకపోతే పేగులు నోరుమూసుకోవటం లేదు ఒకటే అరువులతో ఇబ్బంది పెడున్నాయి. మేల్కొని వుంటే ఆకలేస్తుందని, నిద్రపోదామనుకుంటే ఈ వయసులో నిద్రకూడా రావటం లేదు. ఈ వృద్ధాశ్రమంలో ఎంతమంది తిన్నా అన్నం పుట్టుకొస్తుందని విన్నాను. నన్ను నీ దగ్గర వుండనిస్తావా అమ్మా?" అంటూ దీనంగా అడిగిందామె. 
మధురిమ కళ్లు చెమర్చాయి.
"ఉండండమ్మా! మీలాంటి వాళ్లు వుండటానికే ఈ హోం వుండేది" అంది మధురిమ,
"ఇక్కడ వుండేవాళ్లంతా పెన్షనర్లట కదమ్మా! నేను పెన్లనర్ని కాను. నేను మీకు నెలనెలా డబ్బులు కట్టలేను. మీ హోంలో ఏదైనా పనివుంటే ఇవ్వండి! ఆ పని చేసుకుంటూ మీ దగ్గరే వుంటాను. నాకు అంత అన్నం పెట్టించండిచాలు. కాదనకందమ్మా!" అంటూ బ్రతిమాలిందా పెద్దావిడ. 
ఆమెనలా చూస్తుంటే ఎనబై సంవత్సరాలు దాటిన తన మేనమామభార్య గురొస్తుంది మధురిమకి. 
ఏ ఇంట్లో చూసినా ఏమున్నది గర్వకారణమన్నట్లు. వయసుమీద పడి వంగిపోయి నడుస్తూ కూడా ఇంటెడు చాకిరీ చేస్తున్నారు. ముసలివాళ్లు కొన్నిచోట్ల అయితే మనవళ్ల చేత దెబ్బలు కూడా తింటున్నారు. అనుబంధాల ముసుగులో బాధలు పడ్తూఆకలి క్షోభను భరిస్తున్నారు. కోడళ్ల దగ్గర స్టెఫినీలుగా మారి జీతభత్యాలు లేని సేవకురాళ్లులా అవుతున్నారు. ఇలాంటి నిస్సహాయులకి అన్నం పెడితే వాళ్లలో కన్పించే కృతజ్ఞత అంతా, ఇంతకాదు.
“ఈరోజు నుండి నిన్ను నా హోంలో వుంచుకుంటున్నానమ్మా! నువ్వు నాకు డబ్బులివ్వనవసరం లేదు. నా హోంలో నువ్వు పనికూడా చెయ్యొద్దు. నా హోంని పెన్షనర్లు ఏవిధంగా వినియోగించుకుంటున్నారో నువ్వు కూడా అదేవిధంగా వినియోగించుకో. ఏడో నెంబరు గదిలో ఓ బెడ్ ఖాళీగా వుంది. వెళ్లి అందులోవుండు” అంటూ ఆమెను ఆ గదిలోకి పంపివేసింది మధురిమ.
ఆ పెద్దావిడ అలా వెళ్లగానే - కరుణాకర్ని పార్వతమ్మని వెంట బెట్టుకొని మధురిమ రూమ్ లోకి వచ్చాడు మనోహర్.
వాళ్లను చూడగానే ఆశ్చర్యపోతూ లేచి నిలబడింది మధురిమ వాళ్లను కూర్చోమని కుర్చీలు చూపించింది. వాళ్లు కూర్చున్నారు.
"మధూ! వీళ్లు మా అక్కయ్య బావగార్లు. అంటే పద్మ అమ్మా నాన్నగారు. వీళ్లకి కొడుకు, కోడలు దగ్గర మంచి ఆదరణ లేదు. అక్కయ్యకి మోకాళ్లనొప్పలు ఎక్కువయ్యాయి. కూర్చున్నచోట నుండి అతికష్టంగా లేవగల్లుతోంది. బావ పెన్షనర్ వీల్లిద్దర్నినీ ఓల్టేజ్ హోంలో జాయిన్ చేసుకో.ఇక్కడైతే డాక్టర్ సౌకర్యం కూడా వుంటుందని ఇక్కడే వుంటామంటున్నారు. ఇప్పటి నుండి వీళ్ళిద్దరి బాధ్యత నీదే”అంటూ మధురిమకు వాళ్లను పరిచయం చేశాడు మనోహర్.
అప్లికేషన్ రాయించి వాళ్లిద్దర్ని జాయిన్ చేసుకుంది మధురిమ.
"మధూ! ఇంతక్రితం నీ రూంలో నుండి వెళ్తూమాకోపెద్దావిడ ఎదురైంది. ఆమె పేరు చెప్పిందా నీకు?" అన్నాడు మనోహర్. ఆమెను సరిగ్గా గుర్తుపట్టలేక పేరు అడిగాడు మనోహర్.
“చెప్పిందండీ! వసుంధరట" అంటూ క్యాజువల్గా అంది మధురిమ. వసుంధర పేరు వినగానే షాక్ తిన్నారు మనోహర్తో పాటు పార్వతమ్మ,కరుణాకర్.
"ఆవిడ మా అమ్మకి మంచి స్నేహితురాలు మధూ! అమ్మ దగ్గరకి వచ్చి నవలలు తీసికెళ్ళి చదువుతుండేది. చాలా మారిపోయింది. కనుక్కోలేకపోయాను. లేకుంటే పలకరించేవాడ్ని. అక్కయ్య కూడా నాలాగే ఆవిడ్ని గుర్తుపట్టలేదు" అంటూ పార్వతమ్మవైపు చూశాడు మనోహర్.
 "వృద్ధాప్యం శాపమవుతోంది తమ్ముడూ! వయసు మళ్లాక రెస్ట్ తీసుకోవచ్చని ఆశపడున్న సమయంలో మానవ సంబంధాలు ఆర్ధిక బంధాలై ముసలి వాళ్లను క్రిమినల్స్ని గెంటినట్లు బయటకి గెంటుతున్నారు. వయసులో వున్నంతవరకు ఎవరికైనా బాగానే జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడెలా జరుగుతుందో తెలియదు. అందుకే ఒంట్లో శక్తి వున్నప్పడే నాలుగురాళ్లు వెనకేసుకోవాలి. బిడ్డలు వాన మబ్బుల్లాంటి వాళ్లు. మబ్బుల్ని చూసి మురిఇపోయి వున్నా నీళ్లు ఒలకబోసుకో కూడదు” అంటూ వసున్ధరపై జాలిపడింది పార్వతమ్మ.
మధురిమ వసుంధరని మానవత్వంతో ఆదుకుందని అర్థం చేసుకుంది పార్వతమ్మ. పార్వతమ్మ మనోభావాలను ఆసక్తిగా వింటోంది మధురిమ.
కరుణాకర్, మనోహర్ మౌనమే ఆభరణంలా కూర్చున్నారు.
"నీ గురించి, నువ్వు నడుపుతున్న ఈ ఆశ్రమాన్ని గురించి బయట విన్నానమ్మా మధూ! ఈ ఆశ్రమాన్ని పెట్టాలన్న ఆలోచన నీకెలా వచ్చిందో కానీ ఇదొక మహత్తరమైన ఆలోచన. నీ ఆలోచనతో ఎందరో వృద్దుల జీవితాలను మార్చివేశావు. నీకు నేనున్నానంటూ మాలాంటి పండుటాకుల్ని నీ అక్కున చేర్చుకుంటున్నావు.
ఆకలికి ఏదైనా మందుంటే బాగుండని బాధపడే మాలాంటి ముసలి వాళ్లకి అన్నం పెడ్తున్నావు. ఆకలితో పుట్టిన నిర్లిప్త భావాలను మాలో దూరం చేస్తున్నావు. బ్రతకటానికి ఆకలి అవరోధం కాకుండా చేస్తున్నావు. ఇంతకన్నా ఎవరికైనా ఏం కావాలి చెప్పు,ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లీ!" అంటున్న పార్వతమ్మ దృష్టి ఎదురుగా గోడకి వున్న మధురిమ, మనోహర్ల ఫోటోపై పడింది. 
ఆ ఫోటో ప్రక్కనే పెద్దగా కన్పిస్తూ రాహుల్, మధురిమ వున్న డిజిటల్ ఫోటో వుంది. పార్వతమ్మ కళ్లు ఆ డిజిటల్ ఫోటోపై అతుక్కుపోయాయి. ఆ ఫోటోలో కుర్చీలో వున్న మధురిమ భుజంపై చేయివేసి నవ్వుతూ నిలబడి వున్నాడు రాహుల్.
ఆ ఫోటోలో వున్నరాహుల్ లో  మనోహర్ పోలికలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
వెంటనే మధురిమ వైపు చూసింది పార్వతమ్మ
"అమ్మా! మధూ! ఈ ఫోటోని ఒక కాపీ తీయించి నాకివ్వు తల్లీ! నువ్వు మాకిచ్చే రూమ్ లో దాన్ని పెట్టుకుంటాను. ఫోటోలో నీ కొడుకును చూస్తుంటే చిన్నప్పడు నా తమ్ముడ్ని చూసుకున్నట్టే  వుంది “ అంది పార్వతమ్మ ఎంతో మురిపెంగా రాహుల్ వైపు చూస్తూ.
రాహుల్ని ఎవరు ప్రేమగా చూసినా వాళ్లకి ఆప్తురాలై పోతుంది మధురిమ.
"అలాగేనమ్మా! ఇప్పడే సూడియోకి ఫోన్ చేసి అలాంటిదే ఇంకో కాపీ తెప్పిస్తాను మీకోసం అంటూ వాళ్లవైపు నవ్వుతూ చూసింది మధురిమ.
ఆ నవ్వు వెన్నెలలా హాయిగా అన్పించింది.
మధురిమ వాళ్లకోసం 'అలాట్ చేసిన రూంలోకి వెళ్లారు పార్వతమ్మ కరుణదాకర్.
ఆ రూమ్ లో ఒంటరిగా మధురిమ, మనోహర్ మిగిలిపోయారు.
******

కాలం మంచులా కరుగుతోంది. ఆ ఓల్డ్ ఏజ్ హోం లో వాతావరణం ప్రశాతంగా వుంది. మునులు సంచరించే స్థలంగా మౌనంగా వుంది.
ఆ హోం లో వుండే ముసలివాళ్ళకి వేళకి తిండి, నిద్రతోపాటు వైద్యసేవలు కూడా పర్ఫెక్ట్గా అందటం వల్ల,వాళ్ల హోంలో చేరినప్పటి నుండి ఆరోగ్యంగా, ఆనందంగా వున్నారు. 
ప్రక్క గదిలోంచి వసుంధర మాటలు విన్పిస్తుంటే వసుంధరను పలకరిద్దామని ప్రక్కగదిలోకి వెళ్లింది పార్వతమ్మ.
వసుంధర ముందు ఇద్దరు ముసలివాళ్లు కూర్చుని ఆమె చెప్పే మాటల్ని వింటున్నారు. వసుంధర చేతిలో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన విజయానికి అయిదుమెట్ల నవల వుంది. ఆ నవలను చూడగానే పార్వతమ్మ కళ్లు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. “
"వసుంధర పిన్నీ మీరింకా నవలలు చదువుతున్నారా?" అంటూ మోకాళ్లు నొప్పిగా అన్పించినా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి వసుంధర ప్రక్కన కూర్చుంది పార్వతమ్మ
“ఎవరూ?” అంటూ పరీక్షగా పార్వతమ్మ వైపు చూసింది వసుంధర
 “ఓ నువ్వా పార్వతీ! బాగున్నావా? మీవారెలా వున్నారు? కొడుకు, కోడలు బాగున్నారా?నిన్నూ కరుణాకర్ని బాగా చూసుకుంటున్నారా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది వసుంధర.
“మధురిమ ఓల్డ్ ఏజ్ హోం లోకి అడుగుపెట్టిన క్షణం నుండి వసుంధరకిమంచి ప్రొటక్షన్ తో కూడిన నిశ్చింత ఏర్పడి విశ్రాంతిగా వుంది. ఈ ‘హోం’కి వచ్చేముందు పాత కళ్లజోడుకి అద్దాలు మార్పించుకొని, మిగిలిన నూటయాభై
రూపాయలకి యండమూరి నవల “విజయానికి అయిదుమెట్లు" కొనుక్కొని భద్రంగా బ్యాగ్లో పెట్టుకొని వచ్చింది.
“ఏం చెప్పాలి పిన్నీ నా అవస్థ! నా కోడలు పెళ్ళికి ముందు నేను కలలు కన్న కోడల్లాగా లేదు. కోడలంటే కోడలే. కూతురు కాదుగా.... నా శరీర బాధను అర్థం చేసుకోటానికి? మనవడి కూడా నామీద లేనిపోనివి నూరిపోసి వాడ్నికూడా నా దగ్గరకి రాకుండా చేసింది. సెంటిమెంట్స్ చంపుకుంటూ ఎలా బ్రతకాలిపిన్నీ? ఎందుకో మేమిద్దరం ఆ ఇంట్లో పరాయివాళ్లలా మెలగాలంటేమెలగాలేకపోయాం, అందుకే ఇలా వచ్చాం" అంది పార్వతమ్మ
ఏం రావటమో ఏమోగాని వచ్చినప్పటినుండి ఒకటే బెంగగా వుంది నాకు. నా ధ్యాసంతా ఇంటిమీదనే వుంది. ఎప్పడు చూసినా కీచులాడుకుంటూ, గొడవలు పడే నా కొడుకు, కోడలు ఇప్పుడెలా వున్నారో? స్కూల్ నుండి రాగానే అడిగింది కొనివ్వకపోతే పుస్తకాలు చింపుతానంటూ బెదిరించే నా మనవడెలా వున్నాడో? ఈ పాటికి ఎన్ని పుస్తకాలు చింపుకున్నాడో! ప్రక్కింటి కోడలితో ముచ్చట్లు పెట్టుకుంటూ స్టవ్ మీద పెట్టిన గిన్నెలు మరచిపోయి నా కోడలు ఎన్ని గిన్నెలు మాడగొట్టిందో! అసలు నేనొక్క క్షణం లేకుంటే ఆ ఇల్లు ఇల్లులాగ వుండదు. నా కోడలిగాని, కొడుక్కిగాని, మనవడిగాని జాగ్రత్తనేది బొత్తిగా లేదు. ఒకటి రెండు రోజులు చూసి ఇంటికెళ్లాలని వుంది" అంది అక్కడ కూర్చుని వున్న ముసలివాళ్లలో ఒక ముసలావిడ. నేను తప్ప ఈ దేశాన్ని ఏలటం ఎవరికీ చేతకాదేమోనన్నట్లున్నాయి ఆమె మాటలు. అంతేకాదు ఆమె తన మాటలతో అక్కడున్న ముసలివాళ్లందరిని ఇళ్లకెళ్లిపోదామని రెచ్చగొడుతోంది. 
అది గమనించిన వసుంధర ఆమెనే చూస్తూ జ్ఞానిలా నవ్వింది.
“మనలో చాలామందికి వృద్దాప్యం వచ్చినంత వేగంగా బిహేవియర్లో మార్పు రావడం లేదు. మార్పు చాలా అవసరం. యండమూరి ఈ నవల్లో
ఓచోట ఏం రాశాడో చదువుతాను వినండి! "వయసు పైబడున్నకొద్ది మనలాంటి  వాళ్లు ఒంటరిగా గడపడం నేర్చుకోవాలి. మన చాదస్తంతో కొడుకులని,కోడళ్ళను, మనవళ్లని బాధించకూడదు. కాస్త ఏకాంతం, కాస్త ప్రార్థన, ఒక అందమైన పుస్తకం, పెంచుతున్న కుండీలో పూలమొక్క - ఇవి మన స్నేహితులవ్వాలి. అప్పడు మనకి తెలియకుండానే మన మొహంలో ఒక తేజస్సు వస్తుంది. కళ్లలో ఒక విధమైన తృప్తి నిండుతుంది. అప్పుడు ఆటోమాటిగ్గా చుట్టూ వున్నవాళ్లకి మనమంటే గౌరవం కలుగుతుంది. ఇప్పడు మనకి కావలసింది ఆ గౌరవం? ఏమంటూరు?? అంటూ వాళ్లను ప్రశ్నించింది వసుంధర.
వసుంధర మాటలు వాళ్లకి బాగా నచ్చాయి. ఇళ్లకి వెళ్లాలన్న ప్రయత్నాన్ని విరమించు కోవాలనుకున్నారు మనసులో.
“ఇన్ని రోజులు నువ్వూ మా అమ్మ కలిసి నవలలు చదువుతుంటేవీళ్లకేం దొరుకుతుంది వీటిల్లో అనుకునేదాన్ని! పిన్నీ ఈ పుస్తకాల ద్వారా ఇన్ని విషయాలు తెలుస్తాయా? అంటూ బుగ్గలు నొక్కుకుంది పార్వతి.
తెలుస్తాయి పార్వతి! పుస్తకాల్లో మనకి కన్వీనియంట్గా వున్న విషయాలను మనం స్వీకరించి మన ప్రవర్తనను మార్చుకోవచ్చు. ఏదైనా మన ఆలోచనా విధానాన్ని బట్టి వుంటుంది. "ఇలా చెయ్యి" అని శాసించకుండా ఎలా చేస్తే బావుంటుందో సలహాలిస్తాయి పుస్తకాలు. అందుకే నేను యింత వయసు వచ్చినా పుస్తకాలను బాగా ఇష్టపడ్డాను" అంది వసుంధర.
“పుస్తకాలు ఇచ్చే సలహాల గురించి నాకు తెలియదు కాని మా అమ్మ మాత్రం ఏ చిన్న విషయమైనా మీతో చెప్పకొని మీ సలహా తీసుకోవటం నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. అమ్మ మీ మాటనే వేదంగా భావించేది. మీరెలా చెబితే అలా వినేది” అంది పార్వతమ్మ గతంలో జరిగిన కొన్ని కొన్ని సంఘటనల్నిగుర్తు  చేసుకుంటూ.
నేనెప్పడూ తప్పు చెప్పను పార్వతి!" అంది ఎంతో కాన్ఫెడెన్స్గా చూస్తూ వసుంధర.
"అలా ఎందుకనుకుంటారు పిన్నీ తప్పులు చెయ్యకుండా తప్పులు చెప్పకుండా వుండటానికి మనమేమైనా కాలాతీత వ్యక్తులమా? మామూలు మనుషులం? అంది పార్వతమ్మ.
పార్వతమ్మ మాటలు వసుంధర చెవికి సోకలేదు. “విజయానికి అయిదుమెట్లు" నవల వైపే తృప్తిగా చూస్తూ మరో లోకంలో వున్నదానిలా ఆలోచిస్తోంది.
"చూడు పార్వతీ! నేనీరోజు ఈ నవల చదువుకుంటూ ఏ బాధ, ఏ ఆరాటం, ఏ ఆందోళన లేకుండా మీ అందరితోపాటు నేను కూడా టైం కు తింటూ ఈ వయసులో కూడా యింత ఆరోగ్యంగా వుండగలిగాను అంటే అమృతమూర్తి అయిన ఆ మధమ్మతల్లి చలువే పార్వతి”అంటూ తన మనసులోని మాటల్ని ఆర్ధత నిండిన స్వరంతో చెప్పింది వసుంధర, వసుంధరలోని కృతజ్ఞతను అర్థం చేసుకొంది పార్వతమ్మ.
“మధురిమ మనకి పరాయిదేం కాదు పిన్నీ మనోహర్ భార్య!” అంది పార్వతమ్మ
మనోహర్భార్యేంటి పార్వతి? మధురిమ మనోహర్ కి భార్య ఎలా అవుతుంది. మన పద్మ ఉందిగా?” అంది అర్థంకాక వసుంధర.
"పద్మ వుంది. కానీ మధురిమను మనోహర్ రెండో పెళ్లి చేసుకున్నాడు” అంది పార్వతమ్మ
“రెండో పెళ్ళా! అలా ఎందుకు చేసుకున్నాడు?” అనుమానంగా అడిగింది వసుంధర
"ఎందుకు చేసుకున్నాడంటే? మనోహర్ చదువుకుంటున్న రోజుల్లో మధురిమను ప్రేమించాడట పిన్నీ జాబ్ రాగానే మధురిమతో పెళ్లి చెయ్యమని అమ్మతో కూడా చెప్పాడట. అమ్మ తన స్వార్థంతో ఏదో అబద్ధం చెప్పి పద్మనిచ్చి పెళ్లి  చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కాని మధురిమను మాత్రం మనోహర్ పెళ్లి చేసుకున్నాడు" అంది పార్వతమ్మ
షాక్ తిన్నది వసుంధర
విధినెవ్వరూ మార్చలేరు. తులశమ్మచేత ఆరోజుల్లో తను చెప్పించిన అబద్దం ఇప్పుడు గునపమై వసుంధర గుండెల్లో దిగింది.
మాట్లాడకుండా మౌనంగా వున్నా వసుంధరను అలాగే వదిలేసిఅక్కడనుండి లేచి తన గదిలోకి వెళ్లింది పార్వతమ్మ.
అంతవరకు వసుంధర ప్రక్కన కూర్చుని వున్న ముసలివాళ్లు ఆమె
మాట్లాడకపోవడం చూసి ఎవరి బెడ్ దగ్గరకి వాళ్లు వెళ్లి పడుకున్నారు.
******

"మధురిమ ఓల్టేజి హోమ్"లో ఎదురుగా వున్న ఆఫీసురూంలో కూర్చుని ఆరోజు ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయో చూసుకుంటూ వుంది మధురిమ.
అప్పడే హైదరాబాదు నుండి వచ్చిన మనోహర్ మధురిమకి ఎదురుగా వున్న సోఫాలో కూర్చున్నాడు.
భర్తను చూడగానే......
"రాహుల్ ఎలా వున్నాడు?” అంటూ తన చైర్ లోంచి లేచి వెళ్లి మనోహర్ ప్రక్కన కూర్చుంది మధురిమ. మనోహర్ హైదరాబాదు నుండి ఎప్పడు వచ్చినా రాహుల్ గురించే ముందుగా అడుగుతుంది మధురిమ.
“రాహుల్ కేం  మధు ఫైన్. నిన్ను మరీ మరీ అడిగినట్లు చెప్పమన్నాడు. ఎక్కువగా నీ గురించే ఆలోచిస్తుంటాడు. ఒకవైపు లేడిస్ హాస్టల్ చూసుకుంటూ ఇంకోవైపు ఈ 'ಓಲ್ಡೆಜಿహోమ్ ని నడుపుకోవటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని రాహుల్ భయం. నా భయం కూడా అదే" అన్నాడు మనోహర్.
మనోహర్ గొంతులోని మాధుర్యానికి కదిలిపోయింది మధురిమ. ఇన్నిరోజులు ఆమె గురించి ఆలోచించేవాళ్లు లేరు. ఇప్పుడు నీకు నేనున్నానంటూ కొండంత అండగా ఆమె ప్రక్కన కూర్చుని వున్న మనోహర్ వైపు తృప్తిగా చూసింది మధురిమ.
మధురిమ తలపై చేయివేసి ప్రేమగా నిమిరాడు మనోహర్
ఆ స్పర్శకి పులకించిన ఆమె పెదాల కొమ్మపై చిరునవ్వు పూసింది. ఆ చిరునవ్వు ఎండి బీటలువారిన మనోహర్ గుండెపై వాన చినుకులా కురిసింది. ఆ నవ్వుకున్న మహత్తు ఎంత గొప్పదో మనోహర్కి బాగా తెలుసు. ఆ నవ్వుఆమె ముఖానికి వెలుగునిస్తూ క్రమేణ మందహాసమై మనోహర్ హృదయానికి ఉత్సాహాన్నిచ్చింది. ఎంతటి అసాధ్యమైన కార్యాన్నైనా సుసాధ్యం చెయ్యగలిగే ఆ చిరునవ్వు వైపు మక్కువగా చూస్తూ మనోహర్ కూడా ఆ నవ్వులో శృతి కలిపాడు.
నిజంగానే అలసిపోయివున్న మధురిమ, మనోహర్ భుజంపై తలపెట్టుకొంది.
ఇన్నిరోజులు ఆమె చేసిన ఒంటరి ప్రయాణంలో ఎంతగా అలసి పోయిందో అర్థం చేసుకున్నవాడిలా ఆమెను దగ్గరకి తీసుకున్నాడు మనోహర్. 
మనోహర్ గుండెలో ఒదిగిపోయింది మధురిమ.

米శుభం 米

No comments:

Post a Comment

Pages