//తెలుగమ్మాయి//
నండూరి సుందరీ నాగమణి 

ఆమె కనులు కలువలు, కాటుక రేఖల చిత్రాలు...
ఆమె మోము అరవిందము, అరవిరిసిన దరహాసము...

ఆమె నుదుట చక్కని దీపశిఖ వంటి తిలకం బొట్టు...
ఆమె ముంగురులు నుదుటను వాలే తుమ్మెదలు...పట్టు పరికిణీ, వల్లెవాటు ఆమెకు అంబరాలు...
తాచుపాము వంటి వాలుజడ సంబరాలు...
కురులలో మురిసే కుసుమాల మాలల సౌరభాలు...
చెవులకు ఊగే జూకాల సరాగాల గుసగుసలు...


చేతులకు నిండారా మెరిసే మట్టిగాజుల గలగలలు...
వేళ్ళకు అలంకరించిన గోరింట పగడాలు...
పాదాలను కౌగలించిన మంజీరాల సోయగాలు...
అల్లరల్లరిగా మ్రోగే వాటి మువ్వల సవ్వడులు...


రంగురంగుల రంగవల్లులు ఆమెకు అలవోకలు...
అల్లికలు, చేతిపనులు అందమైన అభిరుచులు...
పాకశాస్త్రంలోనూ ఆమెది అందె వేసిన చేయి...
లలిత కళలందు ఒక అడుగు ముందేనోయి...


ఆమె సౌందర్యాన్ని వర్ణించ అక్షరము అసహాయయేను,
ఆమె సౌశీల్యము ముందు ఏ వనితైనా దిగదుడుపేను...
తెలుగమ్మాయంటే మరి ఇష్టపడని వారెవ్వరు?
తెలుగమ్మాయిగా పుట్టి గర్వపడని వారెవ్వరు?

***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top