దధీచి మహర్షి - అచ్చంగా తెలుగు
దధీచి మహర్షి 
మంత్రాల పూర్ణచంద్రరావు 
  
చ్యవన మహర్షి అశ్వనీ దేవతల వలన సుందర రూపము ధరించి తన భార్య అయిన సుకన్యను పిలిచి ముసలివాడను అయిన నన్ను వివాహము చేసుకొని గొప్ప త్యాగము చేసినావు. అందులకు ప్రతిగా నీకు ఒక మహా త్యాగి, పరమ తపోధనుడు అగు ఒక పుత్రుని ప్రసాదించెదను అని చెప్పి ఆమెతో సంసారము చేయగా, సుకన్యకు ఒక కుమారుడు కలిగెను. అతడే దధీచి.
    దధీచి బాల్యము నుండియు మహా తపస్సు చేయుచుండెను.అతడు సరస్వతీ నదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని ఉండెను.ఆతని తపశ్శక్తి కి శరీరమంతయు గొప్ప కాంతి వెదజల్లు చుండెను.ఆతని శక్తి చూసి సవస్వతి ఆతని యందు సమ్మోహితమయ్యెను.ఆతని శక్తి విని ఇంద్రుడు అప్సరసను తపోభంగమునకు పంపెను. దధీచి నదిలో స్నానము చేసి అచటనే నిలబడి తపస్సు చేయుచుండగా అప్సరస తన అందచందములతో ఆతని పరవసింప చూసేను, ఆతను ఆమె అందమునకు సమ్మోహితుడు అవగా అతనికి వీర్య స్ఖలనము జరిగెను.ఇది చూసిన సరస్వతి ఆ వీర్యమును సేవింఛి, గర్భవతి అయ్యెను.
    కాలక్రమమున సరస్వతి ఒక కుమారుని కని దధీచి వద్దకు వచ్చి జరిగిన వృత్తాంతము చెప్పి నీ పుత్రుని తీసుకొమ్మనెను, అందులకు దధీచి దివ్యదృష్టితో చూసి నిజమని తెలుసుకొని  నేను ముని వర్యునను, నీవే ఈ బిడ్డను తీసుకొమ్మని చెప్పగా ఆమె ఆ బిడ్డ మీద పవిత్ర జలము చల్లగా ఆతను పెరిగి పెద్దవాడు అవగా అతనిని వదిలి ఆమె వెడలిపోయెను. అతడు తపోధనుడయి మహా క్షామ సమయమున మహర్షులు అందరినీ ఆదుకొనెను.. 
     ఒకనాడు ఇంద్రుడు దధీచి వద్దకు వచ్చి ఓయీ మునీశ్వరా నేను నీకు మహా ఉత్తమమయిన శాస్త్రములను ఉపదేసించెదను, నీవు వాటిని ఇతరులకు చెప్పిన యెడల నీ తల ఖండించెదను అని చెప్పి శాస్త్రములను ఉపదేశించెను.అశ్వనీ దేవతలు ఈ విషయము తెలిసికొని దధీచి వద్దకు వచ్చి, మేము నీ తండ్రికి యువకుని రూపము ఇచ్చిన అశ్వనీ దేవతలము. ఇంద్రుడు నీకు చెప్పిన శాస్త్రములను మాకు ఇవ్వుము, ప్రతిగా నీకు మేలు చేయుదుము అని అడిగెను.దధీచి తన శాప వృత్తాంతము చెప్పగా నీకు ఏ భయము వలదు, నిన్ను మేము కాపాడెదము అని అర్ధించగా దధీచి  అంగీకరించెను.అప్పుడు అశ్వనీ దేవతలు ఒక గుఱ్ఱము ను తెచ్చి దాని తల నరికి దధీచికి అమర్చి అతని నుండి శాస్త్రములు తెలిసికొని , దధీచి తలను భద్రపరచెను. ఇంద్రుడు ఈ విషయము  తెలిసి కోపించి దధీచి తలను నరికి వెడలిపోయెను, అంత అశ్వనీ దేవతలు భద్రపరచిన తలను దధీచికి అంటించి ఆశీర్వదించి వెడలి పోయిరి. 
     ఈ ప్రకారమున పునరుజ్జీవుడు అయిన దధీచి తన బాల్యమిత్రుడు అయిన క్షువుడు అను రాజు ఆహ్వానించగా అతని కోరిక మన్నించి అక్కడకు పోయెను. ఇరువురూ మాట్లాడుతూ ఉండగా దధీచి బ్రాహ్మణులే ఉత్తములు అని, క్షువుడు క్షత్రియులే ఉత్తములు అని వాదించుకో సాగిరి.ఆ వాదన పెరిగి దధీచి క్షువుని పొడిచెను.క్షువుడు కోపించి మహాయుధము ప్రయోగించి దధీచిని ముక్కలు ముక్కలుగా నరికెను. ఈ విషయము తెలిసికొని శుక్రాచార్యుడు అచ్చటకు వచ్చి ఆ ముక్కలను ఒకచోట చేర్చి సంజీవని మంత్రముచే దధీచిని బ్రతికించెను.అంత శుక్రాచార్యుడు నీవు సర్వ శక్తి సంపన్నుడవు శివుని గూర్చి తపము చేయుము అని చెప్పి వెడలిపోయెను.
       దధీచి అచటనుండి లేచి తన ఆశ్రమమునకు చేరి పరమ  శివుని  గూర్చి తపము చేయుట మొదలు పెట్టెను.అతని ఘోర తపస్సుకు ముల్లోకములు గగ్గోలు పెట్టుచుండగా పరమ శివుడు ప్రత్యక్షమయి దధీచికి స్వచ్చంద మరణము, వజ్ర శరీరము విజయ శక్తిని ఇచ్చి అద్రుశ్యమయ్యెను.
      అంత దధీచి  క్షుపుడు తనకు చేసిన పరాభవమునకు ప్రతి చేయవలెనని తలచి ఓయీ క్షుపా నీవు క్షత్రియాధముడవు,మేము బ్రాహ్మణ ఉత్తములము అని కోపముగా పలుకగా క్షుపుడు తన వద్దనున్న శస్త్రములు అన్నీ ప్రయోగించిననూ దధీచి వాటిని తిప్పి కొట్టెను. అంత దధీచి ఓయీ క్షత్రియాధముడా ఇప్పటికయినా తెలిసినదా బ్రాహ్మణుడు అధికుడో కాడో నీవు కాదు కదా నీవు పూజించే  విష్ణువు కూడా నాకు సరిపోలరు అని గర్వముగా పలికెను. అంత క్షుపుడు తల వంచుకుని పోయి విష్ణుమూర్తి గురించి తపము చేసెను.అంత విష్ణువు ప్రత్యక్షమయి ఇద్దరునూ కలిసి దధీచి వద్దకు పోయి ఓయీ నీవు శివభక్తుడివా, నేను, శివుడు ఒక్కటే కదా అనెను. అప్పుడు దధీచి నీకునూ శివునికీ పోలికెక్కడిది, శివ భక్తుడనగు నాకే నీవు సరిపోలవు,ఇంకా శివుడు ఎందులకు అనగా విష్ణుమూర్తి కోపించి సుదర్శన చక్రము విడువగా దధీచి తన తపశ్శక్తిచే చక్రమును వెనుకను పంపెను.అంత విష్ణుమూర్తి వత్సా దధీచి నీవు మాకు పరమభక్తుడవు. నీవంటి వాని కాలిగోటికి కూడా ఎవ్వరూ సాటిరారు, అని చెప్పి క్షుపుని ఆతనితో చెలిమి చేసుకొమ్మని చెప్పెను.అంత క్షుపుడు క్షమింపు మని అడుగగా బ్రాహ్మణుల కోపము నీటి మీద వ్రాతలవంటివి, మన ఇద్దరమూ ఎప్పటివలెనే మంచి స్నేహితులము అని పలికెను.
        ఈ రీతిగా వరసంపన్నుడయిన దధీచి గభస్తిని అను మారు పేరు కలిగిన సువర్చ అను కన్యను వివాహము చేసుకొని శిష్య ప్రసిష్యులతో కాలము గడుపుచుండెను. 
       ఇట్లుండగా ఒక సారి దక్షప్రజాపతి యజ్ఞము చేయ తలచి దధీచి మహర్షిని ఆహ్వానించెను. దధీచి తన శిష్య బృందముతో అక్కడకు వెళ్ళగా దక్షుడు మిత్రమా శివుడునూ, శివ భక్తులూ రాకుండా యజ్ఞము చేయుట నీకు అంగీకారము అయినచో ఈ యజ్ఞమును మీ ఆదిపత్యములో జరుపమని కోరెను. అది వినగానే దధీచి ఆగ్రహముతో ఓయీ నీకు ఈ దుర్బుద్ధి ఎటుల వచ్చెను,దేవాది దేవుడు పరమ శివుడు లేకుండా యజ్ఞము ఎటుల జరుగును, జరిగిననూ నీకు ఉపయోగము ఏమున్నది అని శివుని అనేక విధములుగా ప్రస్తుతించెను . అందులకు దక్షుడు ఆ శ్మశాన నివాసుడు, బిచ్చగాడు,అని శివుని దూషించి  దధీచిని అవమానించెను.దధీచి లేచి ఓయీ దక్ష మూర్ఖాగ్రేసరా శివునినే దూషింతువా నీ యజ్ఞ వాటిక, నీవునూ ఇచ్చటకు వచ్చిన నీ భజన బృందము అందరూ నాశన మయ్యెదరు అని చెప్పి  వెడలిపోయెను. అటులనే వీరభద్రునిచే దక్షునకు తగిన శాస్తి జరిగెను.
       ఒకప్పుడు రాక్షసులు దేవతల మీద పదే పదే దాడులు జరిపి వారి అస్త్రములు పట్టుకుని పారిపోవు చుండిరి. దేవతలు భయపడి అందరూ ఆలోచించి వారి అస్త్రములను దధీచి మహర్షి వద్ద ఉంచుట మంచిది అని తలచి దధీచి వద్దకు వెళ్లి తమ బాధలు చెప్పుకొని తమ అస్త్రములను దాచిపెట్టమని అడిగిరి.దధీచి అందులకు అంగీకరించి అస్త్రములను తీసుకొనెను.తదుపరి దానవుల బాధలు తప్పుటచే దేవతలు ఆనందించి సుఖ సంతోషాలతో కాలము గడుపుచుండెను. ఈ అస్త్రముల గురించి పట్టించుకొనలేదు.దధీచికి కోపము వచ్చి వాటిపై మంత్రజలము చల్లి అన్నింటినీ మ్రింగివేసి జీర్ణము చేసుకొనెను.కొంత కాలమునకు దేవతలు వచ్చి తమ అస్త్రములు తిరిగి ఇవ్వమని కోరగా వాటిని నేను మ్రింగివేసాను,అవి నా శరీరము అంతయు వ్యాపించి ఎముకలలోనికి చేరిపోయినవి.మీకు కావలసిన యెడల నన్ను చంపి తీసుకొని పొండు అని చెప్పెను. దేవతలు ఆతని చంపుటకు ధైర్యము చేయలేక దీనముగా ఉండెను. అప్పుడు దధీచి అస్త్రములతో ప్రస్తుతము మీకు పని లేదు కదా, అత్యవసరము అయినప్పుడు రండి, అప్పుడు నేను ప్రాణ త్యాగము చేసిన పిదప మీ అస్త్రములు మీరు తీసుకు పొమ్మనెను. అప్పుడు నా అస్తులే మీకు శస్త్రాస్తములు  అగును అని వారిని పంపివేసెను.
        తరువాత కొంత కాలమునకు వృత్రాసురుడు అను రాక్షసుడు దేవతల మీద దండెత్తగా దేవతలు బ్రహ్మ దేవుని ఆశ్రయించెను , అప్పుడు బ్రహ్మ మీరు వెళ్లి దధీచిని అడిగి ఆతని అస్తులే మీకు ఆయుధములు అగును వెళ్లి అడుగుమని చెప్పెను.అప్పుడు దేవతలు దధీచి వద్దకు వెళ్లి పరిస్థితి వివరించెను. అప్పుడు దధీచి మహర్షి తనకు పరమేశ్వరుడు ప్రసాదించిన స్వచ్చంద మరణము ఉండుటచే, నేను యోగాన్ని కల్పించుకొని మరణించెదను, మీ పని మీరు కానిచ్చుకోండని చెప్పెను.తరువాత దేవతలు గోగణమును ప్రార్ధించి అచ్చట పరిశుద్ధము చేయించి అస్థులను బ్రహ్మ చక్రము, వజ్రాయుధము మొదలగునవి చేసుకొని రాక్షసులను సంహరించెను.
      దధీచి మహర్షి చనిపోయినప్పుడు ఆయన భార్య సువర్చ గర్భవతిగా ఉన్నది.భర్త మరణము తెలుసుకున్న సువర్చ సహగమనము చేయుటకు సిద్ధ పడగా బ్రహ్మాదులు సాద్వీ నీ గర్భమున తేజోవంతుడగు బాలుడు ఉన్నందున నీకు సహగమనము తగదు అని చెప్పి వారింప చూసేను. ఆమె వారి మాటలు లెక్క చేయక చితి పై చేరునంతలో ఆమె నుండి ఒక బాలుడు ప్రక్కన ఉన్న పిప్పల వృక్షము కింద పడెను,ఆమె సహగమనము చేసెను. పిప్పల వృక్షము అతనిపై జాలిపడి చంద్రుని వద్దనుండి అమృతమును తెచ్చి ఆ బాలునకు పోసేను. పిప్పల వ్రుక్షముచే పెంచబడిన వాడగుటచే అతనుకి పిప్పలాదుడు అను పేరు సిద్ధించి గొప్ప తపోసంపన్నుడయ్యెను.   

No comments:

Post a Comment

Pages