Saturday, April 22, 2017

thumbnail

శ్రీ రామకర్ణామృతం - 18

శ్రీ రామకర్ణామృతం -18
                                  డా.బల్లూరి ఉమాదేవి
                                      కామవరం

71.శ్లో:విలోల మణిమండలం విమలచంద్రబింబాననం
విఖండిత దశాననం వితత చాపబాణోజ్జ్వలం
విమోహిత జగత్త్రయం వికచ పద్మపత్రేక్షణం
విభీషణ సురక్షకం విజయరామ మీళే హరిమ్.

తెలుగు అనువాద పద్యము:

చ:అనుపమ రత్నకుండలు దశానన కంఠవిలుంఠునున్ శరా
  సనశరధారణున్ వికచ సారపత్ర విశాలనేత్రు స
న్ముని మతు పూర్ణచంద్రముఖు మోహుత సద్భువన త్రయం జనా
ర్ధనుని విభీషణావనుని రాఘవు నెంతు హృదంతరంబునన్.

భావము:కదులుచున్న రత్నకుండలములు కలిగినట్టి నిర్మలమైన చంద్రబింబమువంటి ముఖము కల్గినట్టి హరించబడిన రావణుడు కల్గినట్టి గొప్ప ధనుర్బాణములచే ప్రకాశించుచున్నట్టి మోహపెట్టబడిన  మూడులోకములు కలిగినట్టి వికసించిన తామరరేకులవంటి నేత్రములు కల్గినట్టి విభీషణుని రక్షించినట్టి విజయము గల విష్ణురూపుడైనట్టి రాముని స్తుతి చేయుచున్నాను .

72.శ్లో:చలనత్కుండలోల్లసిత దివ్య గండస్థలం
  చరాచర జగన్మయం చరణపద్మ గంగాశ్రయం
    చతుర్విధ ఫలఫ్రదం చరమ పీఠ మధ్య స్థితం
 చిదంశ మఖిలాస్పదం దశరథాత్మజం చింతయే

తెలుగు అనువాద పద్యము:
చ:ఘనతర కుండలోల్లసిత గండయుగున్ నిజపాదపద్మ సం
జనిత సురాపగున్ జరమ సంఙ్ఞపీఠ నివాసితున్
బరాత్ముని సచరాచరాత్మకు జతుర్విధ సత్ఫలదున్ జిదంశు రా 
ముని నఖిలాస్పదున్ భువనమోహను దాశరథిం భజించెదన్.

భావము:కదులుచున్న బంగారు కుండలములచే ప్రకాశించుచున్న ప్రశస్తములైన చెక్కులు కలిగినట్టి స్థావర జంగమ జగద్రూపుడైనట్టి పాదపద్మములయందు గంగ యొక్క ఆశ్రయము కల్గినట్టి,ధర్మార్థకామమోక్షరూప పురుషార్థముల నిచ్చునట్టి సహస్రార మధ్యమందున్నట్టి జ్ఞానాంశ రూపుడైనట్టి సమస్తమునకు స్థానమైనట్టి దశరథపుత్రుడైనట్టి రాముని ధ్యానించుచున్నాను.

73శ్లో:సనందనమునిప్రియం సకలవర్ణ వేదాత్మకం 
సమస్తనిగమాగమ స్ఫురిత తత్త్వ సింహాసనం
సహస్రనయనాబ్జజాద్యమరబృంద సేవితం
సమష్టిపుర వల్లభం దశరథాత్మజం చింతయే.

తెలుగు అనువాద పద్యము:
చ:సనకసనందనాది మునిసత్తమ సత్ప్రియు రాఘవున్ సనా
తను నిగమాగమస్ఫురిత తత్త్వు మృగేంద్ర మహాసనస్థు స
న్ముని మఘవాది నిర్జర  సమూహ సమర్చితు
నాగమాత్ము బా
వన చరితున్ సమిష్టి పురవల్లభు దాశరథిన్ భజించెదన్.

భావము:సనందనుడను నాదమునికి నిష్టుడైనట్టి సమస్తాక్షర వేద స్వరూపుడైనట్టి ఎల్ల వేదశాస్త్రముల యందు స్ఫురించుచున్న వాస్తవార్ధమే సింహసనముగా కలిగినట్టి దేవేంద్రుడు మొదలగు దేవతా సమూహములచేత సేవింపబడుచున్నట్టి  వైకుంఠ పురమునకధిపతియైనట్టి దశరథపుత్రుడైనట్టి రాముని ధ్యానించుచున్నాను.

74.శ్లో:అనర్ఘమణి పూరకోల్లసిత దివ్యతేజః పరం
అనాహుత సరోరుహ స్ఫురిత హంస నాదాన్వితం
అనంతదళ పంకజస్ఫుట మృగాంక బింబామృత
ప్లుతాంగ మఖిలాస్పదం దశరథాత్మజం చింతయే.

తెలుగు అనువాద పద్యము:
చ:అనుపమ నూత్నరత్న లసదద్భుత తేజు ననాహతాబ్జ చంద్రబిం
బనవ సుధాప్లుతాంగు బరమంబఖిలాస్పదు నాజియగ్రనం
దను రఘురామచంద్రు నవతారక నాము మదిన్ భజించెదన్.

భావము:విలువలేని మణిపూరచక్రమునందు
ప్రకాశించుగొప్ప తేజోరూపుడైనట్టి, యుత్కృష్టుడైనట్టి అనాహత చక్రమందు ప్రకాశించుచున్న హంసమంత్ర నాదముతో కూడినట్టి సహస్రారచక్రమందు స్ఫుటమైన చంద్రబింబమందలి అమృతముచే తడపబడిన దేహము గలిగినట్టి సమస్తమునకు ఆధారమైనట్టి దశరథ పుత్రుని ధ్యానించుచున్నాను.

75.శ్లో:జాగ్రత్స్వప్న సుషుప్తి కాలవిలసత్తత్వాత్మ చిన్మాత్రకం
చైతన్యాత్మక మాధి పాప రహితం భూమ్యాది తన్మాత్రకమ్
శాంభవ్యాది సమస్త యోగ కుళకం సాంఖ్యాది తత్త్వాత్పరం
శబ్దా వాచ్య మహం నమామి సతతః వ్యుత్పత్తి నాశాత్పరమ్.

తెలుగు అనువాద పద్యము:
మ:గరిమన్ శాంభవి ముఖ్య యోగ యుతు జాగ్రత్స్వప్నసుప్తంబులనం
దురు తత్త్వాత్ము జిదాత్ము  బాపహరునాద్యున్ బంచభూతాత్మకున్
బరునుత్పత్తి వినాశవర్జితుని శబ్దవాచ్యాత్ముం  బరా
త్పరు సాంఖ్యాది సమస్తతత్త్వపరునిన్ ధ్యానింతు శ్రీరామునిన్.
.
భావము:జాగ్రదాద్యవస్థాత్రయమందు ప్రకాశించు తత్త్వమును ఙ్ఞానమాత్రమునైన రూపము కలిగినట్టి రూపము కలిగినట్టి చేతనాస్వరూపుడైనట్టి మనోవ్యథాపాపములు లేనట్టి భూమి మొదలగువాని తన్మాత్రా స్వరూపుడైనట్టి శాంభవీ విద్యమొదలగు సమస్త యోగములయొక్క సమూహము కలిగినట్టి సాంఖ్యతత్త్వములకంటె వెరైనట్టి శబ్దగోచరుడు కానట్టి జనన నాశములు లేనట్టి రామునెల్లప్పుడూ నమస్కరించుచున్నాను.

76.శ్లో:ధ్యాయే త్వాం నవవిద్రుమ స్ఫుటతనుం బర్హోల్లసన్మేచకం
నాసారంజిత మౌక్తికం పరిలసత్పీతాంబరం కౌస్తుభం
వేణూ కంబు రథాంగ పాశ పరిఘాస్రాపేక్షు చాపాశుగం
శ్రీ రామం నవమన్మథాధిక మహం షట్కోణ చక్రస్థితమ్.

తెలుగు అనువాద పద్యము:
మ:ప్రణుతింతున్నవవిద్రుమ స్ఫుటతనున్ బర్హోల్ల సన్మేచకున్
గుణపాశేక్షు ధనుర్గదాబ్జ శరవేణు ప్రాసముఖ్యాస్త్రు ని
ర్గుణు షట్కోణసరోజవాసు పరిపూర్ణున్ నాసికా మౌక్తికున్
మణిభూషున్ నవమన్మథాధికుని రామస్వామి బీతాంబరున్.
భావము:క్రొత్తపవడమువలె  శోభించుదేహము గలిగినట్టి  నెమలిపురిికన్నుకలంకారముగా కలిగినట్టి ముక్కునందు  ప్రకాశించుచున్న ముత్యము కలిగినట్టి ప్రకాశించుచున్న పచ్చని బట్టకలిగినట్టి కౌస్తుభమణికలిగినట్టి రాముని సేవించుచున్నాను.

77.శ్లో:సాకేత నగరేసమస్త మహీమాధారే జగన్మోహనే
రత్నస్తంభసహస్ర మంటప మహా సింహాసనే సాంబుజే
విశ్వామిత్ర వశిష్ఠ గౌతమ శుక వ్యాసాదిభిర్మౌనిభిః
ధ్యేయంలక్ష్మణ లోకపాల సహితం సీతా సమేతం  భజే.
తెలుగు అనువాద పద్యము:
మ:తత సాకేతపురీ వరంబునను రత్నస్తంభ సాహస్ర భా
సిత సౌధంబున భద్రపీఠమున రాజీవాసనాసీను సు
వ్రత గాధేయ వశిష్ఠ గౌతమ శుక వ్యాసాదిభావ్యున్ సతీ
యుతు దిక్పాలక లక్ష్మణాన్వితు సముద్యోగున్ జగన్మోహనున్
వితతోద్యన్మహిమున్ రఘూద్వహుని సేవింతున్ గృపా కాంక్షినై.
భావము: అయోధ్యాపురమందు ఎల్లమహిమలకు నాధారమై జగత్తులను మోహింపజేయు వేయి మణిస్తంభములుగల మంటపమందలి పద్మముతో కూడిన సింహాసనమందున్నట్టి విశ్వామిత్రుడు మొదలగు మునులచే ధ్యానింప దగినట్టి లక్ష్మణునితో లోకపాలకులతో గూడినట్టి సీతతో గూడిన రాముని సేవించుచున్నాను.

78.శ్లో:ఏకాంతే కమలే జలే వికసితే చంద్రాకృతి స్థాపితే
స్థానే తారక మంటపేతనుబిలవ్యాప్తే సుధా మండితే
అబ్జార్కానల మండలోపరి మహాశ్రీషోడశాంతే సదా నాదాంతే నాదాంతే జనకాత్మజాన్వితమహం రామం భజే తారకం.

తెలుగు అనువాద పద్యము:
ఉ:తారక మంటపంబున సుధాగృహమందు రహస్యలీల నిం
పార గృశాను భాస్కర నిశాధిప మండలిపైని సత్కళా
పూర్ణశశాంక నిర్గళిత భూరిసుధాప్లుత నాదపీఠి సీ
తారమణీ సమేతుడగు దాశరథిన్ రఘువీరు నెన్నెదన్.

భావము:
రహస్యమందు నీటియందు వికసించిన పద్మమందు చంద్రరూపమున నున్నట్టి నక్షత్రమంటపమందు సూక్ష్మరంధ్రమున వ్యాపించినట్టి సూర్యచంద్రాగ్నులపై పదియారంచులుగల మంటపమందు నాదబ్రహ్మ మధ్యమందు సీతతో కూడిన తారకరాముని సేవించుచున్నాను.

79.శ్లో:సాకేతే మణిమంటపే సురతరు ప్రాంతే ష్టవర్ణోల్లసత్
పత్రే తారక కర్ణికే ప్రవిల సత్కల్ప ప్రసూనాంచితే
పద్మే వేద చతుష్క మండలసితే నాదాంత శయ్యాతలే
తంసేవే ధ్రువ మండలేబ్జ విగళిత్పీయూషధారాప్లుతమ్.

తెలుగు అనువాద పద్యము:
మ:తన ప్రోలన్ మణికుట్టిమస్థలలసత్సంతానభూజాంతికం
బున నష్టాక్షర పత్రవేద లలితాంభోజంబునన్ దారకం
బను తత్కర్ణిక గల్ప పుష్పయుతు నాదాంతోరు పర్యంకు మే
ధను గొల్తున్ ధ్రువ మండలోద్భవ సుధాధారాప్లుతున్ దారకున్.

భావము:అయోధ్యయందు కల్పవృక్షసమీపమందు నెనిమిది అక్షరములచే ప్రకాశించుచున్నట్టి నక్షత్రకర్ణిక కల్గినట్టి శోభించుచున్న కల్పవృక్ష పుష్పములచే నొప్పుచున్న మాణిక్య మంటపమందు వేదములే నాలుగు కుండలములు కలిగి తెల్లనైన పద్మమందు నాదబ్రహమ మధ్యమందు గల శయ్యయందు ధ్రువ మండలము వలన చంద్రుని వలన జారుచున్న అమృతధారచే దడుపబడిన యారాముని సేవించుచున్నాను.

80.శ్లో:ధ్యాయే త్త్వాం రవిమండలేందు ధవళే పద్మే నిషణ్ణం హరిం
స్వర్ణాభం కరశంఖ చక్రలలితం పీతాంబరం కౌస్తుభమ్
స్వర్ణశ్మశ్రునభాలకం లలనయా యుక్తం కిరీటాంగదం
హారాలంకృతవక్షసం పదయుగ శ్రీపాదుకాలంకృతమ్.

తెలుగు అనువాద పద్యము:
మ:రవి బింబాంతర చంద్రపాండురలసద్రాజీవ సంస్థాను మా
ధవు సౌవర్ణనిభాలకాంఘ్రి నఖరున్ దాంతున్ మణీభూషణున్
గవివంద్యున్ రచక్ర కౌస్తుభధరున్ గౌశేయ వాసోజ్జ్వలున్
భవబంధాపహు రాము గొల్తు మణిశుంభత్కాలంకృతున్.

భావము:సూర్యుని బింబము కల్గినట్టియు బద్మమందు కూర్చొన్నట్టి పాపములను హరించునట్టి బంగారు శోభ కలిగినట్టి హస్తముల యందలి శంఖచక్రములచే సుందరుడైనట్టి పచ్చని వస్త్రము కల్గినట్టి కౌస్తుభ మణికల్గినట్టి బంగారుమీసములు గోళ్ళు ముంగురులు కల్గినట్టి సీతాదేవితో గూడినట్టి కిరీటము భుజకీర్తులు కల్గినట్టి హారములచో నలంకరింపబడిన  వక్షస్థలము కలిగినట్టి రెండు పాదములయందు పావుకోళ్ళచే నలంకరించబడినట్టి నిన్ను ధ్యానించుచున్నాను.
(సశేషం)

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information