(దా)ఋణమానం - అచ్చంగా తెలుగు
(జ)వరాలి కధలు - 16
(దా)ఋణమానం
రచన: గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)


"వారిజాక్షులందు, వివాహములలో, ప్రాణ, విత్త, మాన భంగాలేర్పడే సమయాలలో ఆపద్ధర్మంగా అబద్ధాలాడటంలో తప్పులేదని యీ లోకంలో అబద్ధానికి ప్రాణప్రతిష్ట చేసినవాడు దానవకుల గురువు శుక్రాచార్యుడు. పూర్వం బలిచక్రవర్తి అనే రాక్షసరాజుండేవాడు. స్వతహాగా ఆయన కర్కోటకుడే! కానీ ఒక్కటే బలహీనత. తానెవరికైనా మాట యిస్తే వెనక్కి తీసుకునే రకం కాదు. ఆ బలి ఒకరోజు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి విష్ణుమూర్తి బ్రాహ్మణ వటువుగా వచ్చాడు. యాగానికి వచ్చిన బ్రాహ్మణులకు వారడిగినది లేదనుకుండా యివ్వాలన్నది శాస్త్రం. అందువల్ల వచ్చిన వటువుకు బలి పాదప్రక్షాళన చేసి అతను వచ్చిన కారణం అడిగాడు. "నాకు పెద్దగా కోరికలు లేవు. మూడడుగుల నేల యిస్తే చాలు" అన్నాడు ఆ బాల సన్యాసి.. బాలసన్యాసి ఆశ్రమం కట్టుకొందుకు భూమిని అడుగుతున్నాడనుకొని అలాగే యిస్తానన్నాడు. అప్పుడు అతని గురువైన శుక్రాచార్యుడు బలిని ప్రక్కకు పిలిచి " వచ్చినవాడు విష్ణుమూర్తి, దేవతల పక్షపాతి. అతను కోరిన కోరికలోనే ఏదో మతలబు ఉంది. అతనికి నేల దానమివ్వను" అని చెప్పమన్నాడు. దానికి బలి " లోకాలకు వరాలిచ్చి కాపాడే హస్తం క్రింద ఉండటం, ఆ హస్తానికి తాను దానం యివ్వటం గొప్పే కదా! నేనతనికి మాట యిచ్చాను. దాన్ని తప్పటం తప్పే కదా! " అన్నాడు. 
" ఇస్తే యిచ్చావులే! నువ్విచ్చిన మాటవల్ల నీకు అపాయం కలుగుతున్నప్పుడు అబద్ధం చెప్పినా తప్పులేదు. నీకు భూమి దానం యిస్తాననలేదు. వెళ్ళిరా " అని చెప్పమన్నాడు. ఆ సందర్భంలో శుక్రాచార్యుడు ఈ నీతిసూత్రం చెప్పాడు. అంటే అతను చెప్పిన ప్రకారం " ఆడవాళ్ళ విషయంలో, పెళ్ళిళ్ళు కుదుర్చుకొనేటప్పుడు, ప్రాణం, ధనం, మానమరియాదలు కోల్పోయే ప్రమాదం ఉందని అనిపించినప్పుడు అబద్ధం ఆడటంలో తప్పులేదు. అలా ఆయన తప్పులేదని చెప్పాడనే ఆడవాళ్ళు తమ వయసుని తక్కువ చేసి చెప్పటం, పెళ్ళిళ్ళలో యిరుపక్షాల వారికి ఆ కుటుంబాల గురించి చాలా గొప్పగా, అది అబద్ధమే అయినా, చెప్పటం, ప్రాణం మీదకొచ్చినప్పుడు, గౌరవం మట్టికలిసిపోయేటప్పుడు, ఎదుటివాడినుంచి అప్పులు తీసుకొనేటప్పుడు, వసూలు చేసుకొనేటప్పుడు అబద్ధాలు చెప్పటం లోకంలో సంప్రదాయమైపోయింది. శుక్రుడు చెప్పిన సూత్రాన్ని మొట్టమొదటగా అనుసరించినవాడు దుష్యంతుడు. దుష్యంతుడు గాంధర్వం పేరుతో కణ్వుడి ఆశ్రమంలో దా(ఋ)రుణం చేసి, నమ్మకం కలిగించటానికి శకుంతల వేలికో ఉంగరం తొడిగి మెల్లిగా జారుకున్నాడు. వెళ్ళేటప్పుడు మనుషుల్ని పంపించి యింటికి పిలిపించుకుంటానన్నాడు. అతని రాక కోసం కొన్నాళ్ళు ఎదురు చూసింది. ఈ లోపుగా ఆమె తల్లి కాబోతున్నదన్న విషయం బయటపడి కణ్వుడికి జరిగినదంతా చెప్పింది. కణ్వుడు ఆమె తెలివితక్కువతనానికి బాధపడి, తన ఆశ్రమంలోని వారిని తోడు యిచ్చి దుష్యంతుడి దగ్గరికి పంపాడు. వేటకెళ్ళిన రాజుగారు ఏదో వెలగబెట్టారని సభలో వాళ్ళు అనుకొంటారని శకుంతలతో నువ్వెవరో తెలీదన్నాడు దుష్యంతుడు. పైపెచ్చు మనం యిద్దరు కలుసుకొన్నట్లు సాక్ష్యం ఉంటే చూపించమన్నాడు. ఆమె అతను యిచ్చిన ఉంగరాన్ని పారేసుకొన్నట్లు గమనించిన దుష్యంతుడికి ప్రాణం లేచి వచ్చింది. ఆమె ఎంత మొత్తుకున్నా ఆమె ఎవరో తెలీదని ఖండితంగా చెప్పేశాడు. అలా మోసపోయిన ఆమె కణ్వుణ్ణి బాధపెట్టడం యిష్టంలేక వెనక్కి తిరిగి వెళ్ళలేదు. ఎక్కడో మరో ఆశ్రమంలో బిడ్డను కని పెంచుతోంది. అదే దుష్యంతుడు ఆమె ఉన్న ఆశ్రమం ముందునుంచి వెడుతూ అక్కడ పులిపిల్లలతో ఆడుకొంటున్న భరతుణ్ణి చూశాకనే వీడు నా ఋణం తీర్చే కొడుకని, శకుంతల తాను ఋణపడ్డ పెళ్ళామని లోకమంతా చాటాడు.
" మరానాడు నీకేం తెలీదని అబద్ధమాడావేం?" అని అడిగితే " ఏ ముని శాపమో తగిలి ఉంటుంది. అందుకే మర్చిపోయాను " అనేశాడు.
శకుంతలకి భరతుడు గాక మరో శకుంతల పుట్టి ఉంటే దుష్యంతుడు ఆమెను ఆదరించేవాడా? కన్న కూతుర్ని ఎక్కడో పడేసి, ఎవరికో పుట్టిన కొడుకులను ఆసుపత్రిలో తస్కరించి తమ కొడుకులుగా చెప్పుకొనే ప్రబుద్ధులున్న దేశంలో, ఖచ్చితంగా ఆదరించేవాడు కాదని మా వరాలు చెబుతుంది. శకుంతల కధని కళ్ళారా చూసినా, అబద్ధాన్ని ఆదరించే దుష్యంతుడి వారసులు, వాళ్ళ చేతిలో మోసపోయే శకుంతలలు నేడూ ఉన్నారు. కాకుంటే నేటి దుష్యంతుడు, మరికాస్త ముందడుగు వేసి " శకుంతల నా చెల్లెలు " అని తీయని అబద్ధమాడేస్తాడు. చాలా రంగాల్లో వెనుకబడిన మనదేశం అబద్ధాలాడటంలో మాత్రం చాలా దాఋణంగా అభివృద్ధి చెందింది.
" వదినగారూ!" వర్ధనమ్మ గొంతు విని నా ఆలోచనలు చెదిరిపోయాయి. 
" మీరా వదినగారూ! ఏమిటి విశేషం? " అంటూ వంటింట్లోంచి వచ్చింది వరాలు. 
కలాన్ని కట్టిపడేసి వసారాలోకి తొంగిచూశాను. వర్ధనమ్మ చేతిలోని "కప్పు ", ఆమె రాకలోని ఆంతర్యాన్ని బయటపెట్టింది. అలాగని ముందే అడిగి బయటపడే తెలివితక్కువది కాదు వరాలు. వ్యాసానికి ముందు ఉపోద్ఘాతంలా ఉపక్రమించింది వర్ధనమ్మ.
" నిన్న రాత్రి పార్వతమ్మ యింట్లో గొడవైంది. మీకు తెలీదా?"
తెలిసినా తెలియనట్లు నటించటంలో వరాలు ఘనాపాటి. ఒక విషయాన్ని నల్గురినోట విని, ఆ నాల్గురకాలను మదింపు చేసుకొని తానుగా ఒక అభిప్రాయానికి రావటం ఆమెకి అలవాటు. ఆమె అంత తేలిగ్గా ఎదుటివారి బుట్టలో పడే రకం కాదు.
" పార్వతమ్మ మొగుడు లేడూ?" ఉపోద్ఘాతంగా మొదలెట్టింది వర్ధనమ్మ.
" నిన్న సాయంత్రం కనిపించాడే! ఇప్పుడు లేడా? ఎక్కడికెళ్ళారో తెలిసిందా?" వరాలు ప్రశ్నలు సంధించేసరికి వర్ధనమ్మ కోపంగా చూసింది.
" చెప్పండి " అని వరాలు అనగానే వచ్చిన కోపాన్ని దిగమింగుకొని చెప్పసాగింది.
" పార్వతమ్మ మొగుడు పక్కా తాగుబోతు కదా!" 
" ఏం చేస్తామండీ! ఈ దేశంలో ప్రతీ ఆడపిల్ల తనకు శ్రీరాముడు లాంటి భర్త వస్తాడని ఆశ పడుతుంది. కానీ మన ఖర్మకొద్దీ యిలాంటి తాగుబోతులు కొందరు తగిలి, ఆడపిల్ల జీవితాలను నాశనం చేసేస్తున్నారు" అంటూ వరాలు అందుకొంది.
"నన్ను చెప్పనిస్తారా?" ఆమె మాటలకు మౌనం దాల్చి చెప్పమన్నట్లు తలూపింది వరాలు.
" నిన్న రాత్రి ఆవిడ మొగుడు బాగా తాగి వచ్చి పార్వతమ్మ మెళ్ళో తాళిబొట్టు తెంపబోయాట్ట. ఆవిడ ఎదురు తిరిగి మొగుణ్ణి రెండు తగిలించిందట. ఎంత చెడ్డా భర్త కదా! ఆతన్ని పూజించాలి, ఓపిగ్గా దారిలో పెట్టాలి గాని యిలా ఆవేశపడితే నష్టపోయేదెవరు? తాగి ఉన్నాడు గనుక సరిపోయింది గానీ లేకుంటే ఏం జరిగేది? ఆమెను తన్ని తగిలేసేవాడు. మన మొగుళ్ళూ మనపై చిరాకు పడుతూంటారు. ఎప్పుడైనా యిలా చేశామా?" వర్ధనమ్మ ప్రశ్నకి వరాలు వింటున్నానేమోనని నేను ఉన్న వైపు చూసింది. చాటుగా వినటంలో చాలా సర్టిఫికెట్లు తీసుకున్నవాణ్ణి గనుక వరాలికి కనబడకుండా వెనక్కి జరిగాను.
వరాలి జవాబు కోసం కొద్దిక్షణాలాగిన వర్ధనమ్మ ఆమెనుంచి ప్రతిస్పందన రాకపోయేసరికి తిరిగి మొదలెట్టింది. 
" ఏంటీ? వంటపనిలో ఉన్నారా?" 
"ఔనండీ!" వరాలు బదులిచ్చింది.
" నేనూ వంట మొదలెట్టాను. ఈ లోపున మీ అన్నయ్యగారి స్నేహితులట. . .వచ్చారు. వచ్చినవాళ్ళకి శాంతమ్మలాగ కేవలం మంచినీళ్ళే యిచ్చి ఊరుకోలేం కదా! అందుకే కాఫీ కలుపుదామని డబ్బా తీసి చూస్తే పొడి నిండుకొంది. ఈ కప్పుతో కాస్త పొడి యిస్తే, సాయంత్రం బజారు నుంచి తెప్పించి యిచ్చేస్తాను." అంది.
" ఎంత భాగ్యం ? " అంటూ వరాలు లోపలికెళ్ళింది.
వర్ధనమ్మకి తీసుకొన్నదేదీ తిరిగి యిచ్చే అలవాటు లేదు. ఆ విషయం వరాలు నాతో చాలాసార్లు చెప్పింది. ఇప్పుడేంటి? ఆవిడ గురించి తెలిసి కూడా యివ్వటానికి లోనికెళ్ళింది.
" ఈ రోజు మీ యింట్లో కూరలేం చేస్తున్నారు? " చేతిలో డబ్బాతో వస్తూ వరాలు అడిగింది. వర్ధనమ్మ బదులేమి యిచ్చిందో నాకు సరిగా వినపడలేదు.
" కప్పు పట్టండి" అంటూ డబ్బా మూత తీసి తన చెయ్యి లోపల పెట్టింది. 
" అరే! కాఫీ పొడి అయిపోయిందే! చూసుకోలేదు " అంటూ వరాలు విచారం వ్యక్తం చేసింది.
" నా మతిమండా! నిన్న సాయంత్రమే అయిపోయింది కదూ! పొద్దున్నే తెప్పిద్దామనుకొన్నా! " 
ఇలాంటి నాటకాలలో ఆడవాళ్ళు చాలా చురుగ్గా వ్యవహరిస్తారు. వరాలి నాటకం వర్ధనమ్మకి తెలుసు. వర్ధనమ్మ వ్యవహారం కాపురానికి వచ్చిన కొత్తలో అనుభవంపై గమనించింది గనుక వరాలికీ తెలుసు. అయినా యిద్దరూ ఎంత గొప్పగా నటించేస్తున్నారో!
"పోనీలెండి! అయిపోతే మీరేం చేస్తారు? పోయి ఆ పార్వతినే అడుగుతాను" అంటూ వెళ్ళబోయింది.
" వదినగారూ! ఉండండి. నేనూ వస్తాను. ఉదయం లేవగానే వారికి కాఫీ యిచ్చాననే అనుకొంటున్నాను. ఇవ్వలేదని మీవల్ల తెలిసింది. ఆయన కూడా ఎంతసేపటినుంచి కాఫీ కోసం కాచుక్కూర్చున్నారో? పదండి. పార్వతి దగ్గర కెడదాం" అంటూ ఖాళీడబ్బాని వంటింట్లో పెట్టి తానూ ఒక కప్పు పట్టుకొని వర్ధనమ్మతో పార్వతమ్మ యింటికెళ్ళింది. 
నాకూ కాఫీ తాగానో, లేదో అనుమానమొచ్చి చూస్తే కుర్చీప్రక్క ఖాళీగ్లాసు కనిపించింది. వరాలు యిస్తే నేను కాఫీ తాగాను. మరి వరాలు మర్చిపోయిందా? కాఫీ పొడి నిన్న సాయంత్రమే ఆఫీసునుంచి వస్తూ తెచ్చాను. ఇంట్లో ఉన్నది యిద్దరమే. రాత్రి బంధుబలగాలెవ్వరూ యింటికి రాలేదు. ఏడు దాటాక కాఫీ తాగితే నిద్ర ఆలశ్యమవుతుందని రాత్రి నేను కాఫీ తాగను. మరి యింతలోనే కాఫీపొడి ఎలా అయిపోయింది? అనుమానం తీర్చుకొందామని వంటింట్లో డబ్బాలన్నీ వెతికాను. గూట్లోని పై అరలో నాలుగైదు ఖాళీ డబ్బాలున్నాయి. క్రింది అరలోని డబ్బాల్లో నిన్న తెచ్చిన సరుకులన్నీ ఉన్నాయి. ఇంట్లో ఉన్న కాఫీ పొడి, వర్ధనమ్మకి తిరిగియిచ్చే అలవాటు లేదని, యివ్వలేదు. మరి కాఫీపొడికోసం వర్ధనమ్మతో పాటు వరాలు కూడా ఎందుకెళ్ళిందో నాకు అర్ధం కాలేదు.
"పోపులడబ్బాలో చిల్లర సవరిస్తున్నారా?" హఠాత్తుగా వరాలు గొంతు విని త్రుళ్ళిపడ్డాను.
" అదేంటండీ? ఏదో తప్పు చేసినవాళ్ళా అలా ఝడుసుకొన్నారు?" అంది నవ్వుతూ.
తలెత్తి చూసిన నాకు కప్పునిండుగా కాఫీపొడితో వరాలు కనిపించింది.
"అకస్మాత్తుగా మాట వినిపించేసరికి త్రుళ్ళిపడ్డాను అంతే! అదిసరే! ఇంట్లో కాఫీపొడి ఉండగా పార్వతమ్మ దగ్గరనుంచి మళ్ళీ కాఫీపొడి తెచ్చావేంటి?"
"మీకు నగరాల్లో కొత్తేమో గానీ మా పల్లెటూళ్ళల్లో యిలాంటి నాటకాలు మామూలే! మీకు తెలుసుగా వర్ధనమ్మకి ఏమిచ్చినా తిరిగి వసూలు కావటం కష్టమని. అందుకే ఆమె అడిగినది యివ్వలేదు. అలాగని ఆమెను నిరాశపరిచినట్లు కనపడకూడదు. రేప్పొద్దున్న ఆవిడతో ఏం అవసరం వస్తుందో చెప్పలేం కద! అందుకే ఆ ఖాళీడబ్బాలన్నీ! ఆమె ఎప్పుడైనా ఏ వస్తువైనా అడిగినప్పుడు యీ ఖాళీ డబ్బాలు ఆమెముందుకు పట్టుకెళ్ళి అయ్యో! అయిపోయిందా? అంటే ఆమె ఏమీ అనలేదుగా! ఇలా కొన్నాళ్ళు చేస్తే మన యింటికి అప్పుకి రాదు. ఇక పార్వతమ్మ యింటికెళ్ళటం గురించి. పార్వతమ్మ మీద చెప్పి కదా కాఫీపొడి అడిగింది. అది యివ్వటం యిష్టం లేకే యిలా నాటకమాడానని వర్ధనమ్మకీ తెలుసు. అందువల్ల పార్వతమ్మ దగ్గర నామీద ఏవో లేనిపోనివి చెప్పి కాఫీపొడి అడుగుతుంది. వర్ధనమ్మకు ఆ అవకాశం యివ్వదలచుకోలేదు. అందుకే ఆమె కూడా వెళ్ళా! ఈ పొడి యిలాగే ఉంచి, రేపు సాయంత్రం మావారు తెచ్చారని యీ కాఫీపొడినే పార్వతమ్మకి తిరిగి యిచ్చేస్తా" వరాలి అందమైన కల్పనకి కళ్ళు తిరిగినట్లయింది.
" ఏంటలా ఉన్నారు? మీరేగా చెబుతూంటారు" ప్రాణ విత్త మాన భంగమందు అబద్ధాలాడితే తప్పులేదని శుక్రాచార్యులు చెప్పారని. ఇక్కడ విత్తభంగమవుతోంది. విత్తభంగమయ్యేది ఎవరికైనా అప్పు యిచ్చినప్పుడే! అప్పుడు యిలాంటి నాటకాలు, అబద్ధాలు తప్పవు. అయినా మా ఆడవాళ్ళ సంగతి మీకెందుకండీ- మీ కధారచన ఏదో చూసుకోక? " 
ఎవరైనా ఆపద్ధర్మంగా అబద్ధాలాడటం విన్నాను గానీ ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవటానికి యిలా నటించటం ఎక్కడా చూడలేదు. వరాలేదో పల్లెటూరుబైతు అనుకొన్నాను గానీ అమోఘమైన తెలివితేటలున్నాయని యిప్పుడే అర్ధమైంది.
అంతటితో యీ కధ ఆగిపోతే వర్ధనమ్మ గొప్ప, వరాలి చాకచక్యం మీకెలా తెలుస్తాయి?
అప్పుల విషయంలో తనకు కొరుకుడు పడని వరాలు లేని సమయంలో వర్ధనమ్మ విజృంభించి నన్ను దెబ్బ తీసింది.
ఒకసారి వరాల్ని నెల్లాళ్ళపాటు పుట్టింటికి పంపవలసివచ్చింది.
ఆ సమయంలో రెండురోజులు హోటల్లో తిన్నాను. హోటల్ తిండి కన్న స్వయంపాకమే మెరుగన్న జ్ఞానబోధ కలిగి, యింట్లోనే బియ్యం ఉడకేసుకు తింటున్నాను.
ఒక సాయంత్రం నేను ఆ హడావిడిలో ఉండగా వర్ధనమ్మ వచ్చింది.
" అన్నయ్యగారూ!"
ఆమె గొంతు వినగానే తప్పుచేస్తూ దొరికిపోయినవాళ్ళా చేతిలో గరిటె ప్రక్కనపడేసి బెరుగ్గా ఆమె ముందుకొచ్చాను.
" అయ్యో మీరు చెయ్యి కాల్చుకొంటున్నారా? వదినగారు లేక మీకెంత యిబ్బంది వచ్చింది. ఆఫీసుపనుల్లో సతమతమై, యింటికొచ్చి యీ చాకిరీ చేసుకోవాలంటే కష్టమే! అందుకే పొద్దున్న మా యింట్లో చేసిన కాకరకాయ కూర తెచ్చాను " అంటూ లేని చొరవ తీసుకొని, నా ప్రక్కనుంచి వంటింట్లో దూరి, తన చేతిలోని కప్పు అక్కడ పెట్టి వచ్చింది. 
" ఎందుకమ్మా యివన్నీ?" మొహమాటంగా అన్నాను.
" ఎందుకేమిటన్నయ్యా? తినటానికి. వదినగారు పుట్టింటి కెడుతూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పి వెళ్ళారు. మొహమాటపడకన్నయ్యా! ఏం కావాలన్నా అడగండి. నేను మీకు స్వంత చెల్లెల్నే అనుకోండి !" బదులిచ్చే అవకాశం యివ్వకుండా గబగబ నాలుగూ చెప్పేసి వెళ్ళిపోయిందామె. 
మగాడికో బలహీనత ఉంది. కట్టుకొన్న పెళ్ళాం మీద ఖయ్య్ మని లేచేవాడు, పక్కింటావిడ పళ్ళికిలిస్తూ జేబులో చెయ్యిపెట్టి సొమ్ములట్టుకుపోతున్నా ఏమనలేడు. నా పరిస్థితీ అదే! వర్ధనమ్మ యీ ఉదార సాయానికి కారణమేమిటో అర్ధమై చావటం లేదు.
ఇలాగే వారం రోజులపాటు వర్ధనమ్మ కూరలు, సాంబార్లు తెచ్చియిస్తూంటే, నా శ్రమ తగ్గుతోందని మౌనంగా తీసుకొంటున్నాను.
ఒకరోజు సాయంత్రం తాపీగా పేపరు చూస్తున్నాను. ఉన్నట్లుండి వర్ధనమ్మ పిలుపు వినిపించి తలెత్తి చూశాను.
" మరేంలేదన్నయ్యా! ఉల్లిపాయ పులుసు యిద్దామని వచ్చాను" అంటూ వంటింట్లో పెట్టి వచ్చింది. ఆమె వెళ్ళిపోతుంది కదాని తిరిగి పేపరు పఠనంలో మునిగిపోయాను. వర్ధనమ్మ సకిలింపు విని తలపైకెత్తాను.
" ఏంటమ్మా?" 
" వదినగారు వెళ్ళి చాలా రోజులైనట్లుంది. క్షేమంగా ఉన్నారా?" అని అడిగింది.
" ప్రొద్దున్నే మొబైల్లో మాట్లాడాను. బాగానే ఉందట. మిమ్మల్ని అడిగానని మరీమరీ చెప్పమంది" బదులిచ్చాను.
"ఏమిటో? పిచ్చి అభిమానం. ఎప్పుడొస్తున్నారటా?"
"మరో పదిహేను రోజులు పట్టవచ్చు"
"అంటే మరో పక్షం కష్టపడాలన్నమాట. వస్తానన్నయ్యా!" 
"మంచిదమ్మా" అని తిరిగి వార్తాపత్రికలో తల దూర్చాను.
గుమ్మం వరకూ వెళ్ళిన వర్ధనమ్మ తిరిగి వెనక్కి వచ్చింది. అది గమనించిన నేను ఆమెవైపు చూశాను.
"ఏంటమ్మా?" అన్నాను.
" మరేంలేదన్నయ్యా! మావారు అవసరానికి ఆఫీసు సొమ్ము వాడుకొన్నారట! ఆ విషయం ఆఫీసర్ కి తెలిసిందట. రెండురోజుల్లోగా ఆ మెత్తం కట్టకపోతే సస్పెండ్ చేస్తారట. ఏం చేయాలో బోధపట్టం లేదు" చెబుతున్న ఆమె కంఠం రుద్ధమైంది. కళ్ళు నీళ్ళతో నిండాయి. 
"అయ్యోపాపం ! అలాగా? ఇప్పుడెలాగా?" 
" ఒక్క పదివేలు సర్దితే నెలకింత చొప్పున నాలుగు నెలల్లో తీర్చేస్తానన్నయ్యా!" ప్రక్కలో బాంబు పేలినట్లు శబ్దమై త్రుళ్ళిపడ్డాను. కుర్చీలోంచి లేచి వీధిగుమ్మం వరకూ వెళ్ళి చూశాను. మా యింటిముందే, ఎవరో వెడుతున్న స్కూటర్ టైరు పంచరై అంత శబ్దం వచ్చిందని గ్రహించి లోనికొచ్చాను. వర్ధనమ్మ అక్కడే నిలబడి ఉంది. వారంరోజులనుంచి ఆమె యిచ్చిన కూరపళ్ళాలు, సాంబారు గిన్నెలు కళ్ళముందు గుండ్రంగా తిరుగుతున్నాయి. కాదనకుండా ముందుగానే కాళ్ళకు బంధం వేసేసింది. ఇప్పుడు టపటపా రెక్కలు కొట్టుకొంటే మాత్రం ప్రయోజనమేముంది?
" అంటే. . .నా దగ్గర యిప్పుడంతసొమ్ము లేదు. రేపు బాంకునుంచి తెచ్చి యివ్వాలి" నీళ్ళు నమిలాను.
" ఎందుకన్నయ్యా? మన వీధిచివర ఏ.టి.ఎం. ఉందిగా! అదెక్కడుందో తెలియకపోతే, చూపించటానికి మా బుజ్జిగాణ్ణి పంపిస్తాను" 
ఆమె అంత పీకలమీద కూర్చుంటే, ఆమెనుంచి సాయం పొందినోణ్ణి, ఎలా తప్పించుకోగలను?
నేను బట్టలేసుకొని బయటకెళ్ళేవరకూ ఆమె అక్కడనుంచి కదల్లేదు. మనసు కీడుని శంకిస్తున్నా, ఏ.టి.ఎం. లో డబ్బులు తీసి యింటికొచ్చాను. ఆమె గుమ్మం దగ్గరే కాపు కాసి ఉంది. నేనిచ్చిన సొమ్ము తీసుకొని, నమస్కారాలతో నామీద ఒక దండకం చదివేసి మాయమైంది.
మర్నాడు సాయంత్రం అన్నం చేసుకొని, కూరలొస్తాయోమోనన్న ఆశతో చాలాసేపు చూశాను. అభిమానం గల "వర్ధనమ్మ చెల్లెలి" జాడే లేదు. ఇక ఆమె రాదని నిర్ధారించుకొన్నాక ఆవకాయతో ఆ రోజు అయిందనిపించాను. మరునాటికి అర్ధమైంది " అమె మరి రాదని".
ఆ రోజు వాళ్ళింటిముందు ఆటో ఆగటం చూసి " ఎవరొచ్చారా? " అని చూశాను. వాళ్ళ బుజ్జిగాడు, ఆవిడ ఆటోలోంచి దిగారు.
"బహుశా ఊరెళ్ళి ఉంటుంది " అనుకొంటూండగానే పెద్ద స్క్రీను టి.వి. ఆటోలోంచి బయటకొచ్చింది. ఆఫీసు సొమ్ము వాడుకొని టి.వి. కొంటున్నారా? అనుకొంటున్న నా బుర్రలో లైటు ఆలశ్యంగా వెలిగింది. 
" ఆ టి.వి.లో నీ పదివేలు కూడా ఉన్నాయిరా నాన్నా! " అని అంతరాత్మ పరిహాసమాడింది. నాలో కోపం పొంగివచ్చినా లాభమేముంది? 
వాళ్ళింటి ముందునుంచి వెనుదిరిగి పోతున్న ఆటోలోంచి " అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా! గొప్ప నీతివాక్యమిదే వినరా పామరుడా!" అన్న పాట వినిపించి, యింట్లోకిపోయి బుర్ర కొట్టుకొన్నాను. కధలో పాత్రలను చలాకీగా నడిపించే నేను కూర, సాంబారు పాత్రలకు పడిపోయి. . . .నా తెలివితక్కువకు నన్ను నేనే తిట్టుకొన్నాను.
" లేకపోతే? నీకు ఆవిడ అమ్మ చుట్టమా? అయ్య చుట్టమా? అన్నయ్యా అని పిలవగానే అయిసైపోతావా? ఆమె కూరలు, సాంబార్లు యిస్తూంటే ఆనందంగా తీసుకొన్నావే! అప్పుడు నీకు అన్యాయం అనిపించలేదా? ఇప్పుడు ఆవిడ నీ సొమ్ముతో టి.వి. కొనుక్కొంటే గింగిరాలు తిరిగిపోతావా? లాభం లేకుండా నీకెవరూ సాయం చేయరోయ్! నీ కన్న వరాలే నయం. మొదట్లో తెలీక ఆవిడ వలలో పడినా, ప్రస్తుతం ఆవిణ్ణి ఎలా ఢీకొట్టాలో బాగా నేర్చుకొంది. ఆమె యిలాంటిదని తెలిసి ఉండి కూడా నువ్వు వల్లో పడ్డావంటే ఏమనాలి?" సణుగుతున్న అంతరాత్మని చూసి వెర్రిమొహం వేశాను.
మరునాడు ఆఫీసుకెడుతూంటే వర్ధనమ్మ ఎదురుపడింది. 
బండి ఆపి " ఏమ్మా! మీవారు ఆఫీసు డబ్బు కట్టేశారా?" అని అడిగాను. 
ఆమె తలవంచుకొని నా మాటలు వినపడనట్లే వెళ్ళిపోయింది. "సరే! నెల కాగానే నాలుగోవంతు డబ్బులు సర్దుతానందిగా! అప్పుడు మొత్తం అడిగేద్దాం" అనుకొంటూ ఆఫీసుకెళ్ళిపోయాను.
వరాలు నా మంచిచెడ్డలు చూడమందని, నేను కష్టపడుతూంటే చూడలేకపోతున్నానని ఎన్నెన్నో చెప్పిన వర్ధనమ్మ, వరాలు ఊరినుంచి వచ్చినా, పలకరింపుకైనా మా యింటివైపు రాలేదు. 
" ఏమండీ! ఈ మధ్య వర్ధనమ్మ మన యింటివైపే చూట్టం లేదు. వారానికి ఒక్కసారైనా మన యింటికి రాకుండా ఉండలేని మనిషి, అకస్మాత్తుగా ఆపేసిందంటే కారణమేమై ఉంటుంది?" వరాలి ప్రశ్నకు చిరాకు పడ్డాను.
" నాకేం తెలుస్తుంది? ఆవిడింటికెళ్ళి అడుగు" అని మొహం చాటేశాను. కాలం గడిచిపోతోంది. నా పదివేలకు కాళ్ళొచ్చేసినట్లేనా? అన్న శంక మనసుని దొలిచేస్తోంది. రెండు నెలలు చూశాక నాలో సహనం నశించి విషయం వరాలికి చెప్పేశాను.
" ఈ విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు?"
" మర్యాదస్తురాలిగా కనిపిస్తోంది కదా! నెలకి నాలుగోవంతు యిచ్చినా ఫరవాలేదని ఊరుకొన్నాను."
" ఆమె సంగతి ముందునుంచీ చెబుతున్నాగా! అయినా పదివేలు ఎలా యిచ్చారండీ?" 
" వాళ్ళాయన ఆఫీసు డబ్బు వాడుకొన్నారని. . . ."
" కన్నీళ్ళు పెట్టుకొంటే యిచ్చేశారు. ఆ వర్ధనమ్మ సంగతి నాకు బాగా తెలుసండీ! అయినా మనలాంటి వాళ్ళంటే సరే నమ్మొచ్చు. ఇంట్లో రెండు కార్లు ఉన్న వ్యక్తి, బాంకు ఖాతాల్లో బాగా డబ్బులు మూలుగుతున్న వ్యక్తి , ఆఫీసు డబ్బు వాడుకొన్నారంటే మీరెలా నమ్మారండీ? కొంతమందికి యింట్లో ఎంత ఉన్నా, పరాయిసొమ్ము కాజేస్తే గానీ కడుపు నిండదు. వర్ధనమ్మ అదే బాపతు " 
ఆ వర్ధనమ్మ బుట్టలో పడటానికి ఆవిడ యిచ్చిన కూరలు, సాంబార్లే కారణమని చెబితే యింకేమన్నా ఉందా?
" ఏదో జరిగిపోయిందిలే! నువ్వు ఆ బాకీ వసూలు చేయగలవా? లేదంటే ఆ పదివేలకీ నీళ్ళొదిలేద్దాం" నిరాశగా అన్నాను.
" ఆవిడ మీద జాలి పడి మీరొదిలేయవచ్చు. నేను నయాపైస కూడా వదిలేదాన్ని కాదు. చూస్తూండండి ఎలా వసూలు చేస్తానో? " వరాలి ఆత్మవిశ్వాసం మీద నాకు బాగా నమ్మకముంది.
"చూడండీ! ఎప్పుడైనా పెడసరంగా మాట్లాడుతానేమో గానీ మీ తప్పుల్ని ఎత్తి చూపి చిన్నబుచ్చే రకాన్ని కాదు. ఆవిడకి డబ్బిచ్చిన సంగతి నాతో చెప్పటానికి నామోషీ ఫీలయ్యారు కదూ! భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదండీ! ఉంటే యిలాగే మధ్యవాళ్ళు బాగుపడతారు. ఆవిడకి డబ్బులిచ్చిన సంగతి మీరు గాక వేరేవాళ్ళు చెబితే, నాకేమనిపిస్తుందో కవులు మీకు వేరే చెప్పనక్కరలేదు. ఆమె ఎప్పటికీ యీ విషయం ఎత్తదు, మీరామెను గట్టిగా అడగలేరు. సర్లెండి. ఇప్పటికైనా మించిపోలేదు. అవకాశం నాకిచ్చారు గనుక మీ డబ్బులు తిరిగి వచ్చేసినట్లే" ఏదైనా వసూలు చేయటంలో మగాళ్ళ కన్న వనితలే దిట్ట.
పదిహేను రోజుల తరువాత -
" రేపు మీరు మీ అమ్మగారిని చూట్టానికి మీ ఊరు వెడుతున్నారు" ఆఫీసునుంచి యింటికి రాగానే ఆజ్ఞ జారీ చేసింది వరాలు. 
" ఏం? రమ్మని ఉత్తరమేమైనా వచ్చిందా?" అడిగాను.
"లేదు. వర్ధనమ్మ నుంచి సొమ్ము వసూలు చేశాను. ఈ రెండువారాలు మీరు ఆఫీసు కెళ్ళింది మొదలు వాళ్ళింటి కెళ్ళి సతాయించగా చివరికి సొమ్ము యిచ్చింది. ఆమె దగ్గర నేనన్న మాటలు నిజమనిపించుకోవాలంటే మీరు ఊరెళ్ళాలి"
" ఇదేం చోద్యమోయి! ఆవిడ దగ్గర బాకీ వసూలు కావటానికీ, నేను ఊరెళ్ళటానికి సంబంధమేంటి?" 
"నేను సొమ్ము గురించి అడగ్గానే త్రుళ్ళిపడింది. మీ దగ్గర సొమ్మెక్కడికీ పోదన్న ధైర్యంతోనే అప్పిచ్చి రెండు నెలలైనా అడగలేదని, అర్జెంటుగా అత్తయ్యకు సొమ్ము పంపాల్సిన అవసరం వచ్చిందని, ఆ రోజు మీకు అప్పు యివ్వబట్టే యీ రోజు కొండంత అండగా కనిపించిందనీ, మీరు సొమ్ము యిస్తే మావారు ఊరెళ్ళి ఆ సొమ్ము వాళ్ళమ్మకి యిచ్చి వస్తారని వెంట పడ్డాను. ఏవేవో కధలు చెప్పింది. అయినా వదల్లేదు. ఇక నా పోరు పడలేక బాకీ తీర్చేసింది. నా మాట అబద్ధం కాదని ఆమెను నమ్మించటానికి మీరు ఊరెళ్ళాల్సిందే!"
" ఇప్పుడెందుకోయి? అయిదు వందలు దండగ" అన్నాను.
" కన్నతల్లిని చూట్టానికి వెళ్ళటం కూడా దండగ అనుకొంటే ఎలా?"
" అదికాదు. వచ్చేనెల ఎలాగూ వెళ్ళే పని ఉంది. అప్పుడు వెడతాను" 
"తెల్లారితే వర్ధనమ్మా నేను ముఖాముఖాలు చూసుకొంటామాయె! తన సొమ్ము వసూలు చేసుకొందుకు నేను అబద్ధమాడినట్లు ఆవిడ అనుకోకూడదు. అలా అనుకొంటే ఆమె నాపై దుష్ప్రచారాలు మొదలెడుతుంది. దానికి నేను అవకాశమివ్వకుండా ఉండాలంటే మీరు ఊరెళ్ళి తీరాల్సిందే!" 
అప్పు చేయటంలోనే కాదు వాటిని వసూలు చేయటంలో కూడా యిలాంటి నాటకాలు గట్రా ఆడవలసివస్తుందని మొదటిసారిగా చూస్తున్నాను.
అప్పు చేయటంలో వర్ధనమ్మ రాజకీయ పంధా, దానిని వసూలు చేయటంలో వరాలి పంధాల ముందు ఆవేశంతో రోడ్డెక్కి దుమ్మెత్తి పోసుకొనే రాజకీయనాయకుల ఎత్తుగడలు తీసికట్టే! కర్ర విరక్కుండా, పాము చావకుండా చేయటంలో ఆడవాళ్ళ చాతుర్యమే వేరు. 
ఇక్కడ ఒకరిమీద ఒకరికి నమ్మకం లేకపొయినా, స్నేహాన్ని భలే గొప్పగా నటించేస్తుంటారు. 
అప్పుల విషయంలో యిలాంటి ఋణమానాలు, నాటకాలు నగరాల్లో కన్నా పల్లెటూళ్ళల్లో బాగా కనిపిస్తాయి. వర్ధనమ్మ, వరాలు ఆ పల్లెటూరి నాటకాల్లో పండిపోయి వచ్చినవారే కదా!
మరునాడే వరాలు కోరినట్లుగా నా మాతృశ్రీకి సొమ్మునిచ్చే వంకతో నాటకీయంగా మా ఊరికి బయల్దేరక తప్పలేదు. 
****

1 comment:

Pages