మదనగోపాల శతకము - మేకా బాపన్న - అచ్చంగా తెలుగు

మదనగోపాల శతకము - మేకా బాపన్న

Share This

మదనగోపాల శతకము - మేకా బాపన్న

పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం 



కవి పరిచయం:
శ్రీమదనగోపాల శతక కర్త మేకా బాపన్న నరసాపురం తాలూకా ఆచంట గ్రామవాస్తవ్యుడు. క్రమనాయకులను కమ్మవారి కులమునకు చెందియుండును. ఈకవి క్రీ.శ. 1850 ప్రాంతములందలివాడు. చతుర్ధకుల సంభవుడని చెప్పికొనినాడు. తల్లి చెల్లమాంబ, తండ్రి నాగయ్యల పెద్ద కుమారుడు. ఒక సోదరి రామకృష్ణమ్మ, సోదరుడు చినబాపన్న. శాస్త్రపురాణములలో నిష్ణాతునిగా తెలియచున్నది. ఈ కవి మదనగోపాల శతకమునే కాక, ఆచంట రామేశ్వర శతకమును కూడా రచించినాడు. క్రీ.శ. 1853 లో కవి మదనగోపాల శతకమును, 1850 లో ఆచంట రామేశ్వరశతకమును రచించెను. సంస్కృతాంధరములందు మంచి పట్టుకలిగిన కవి. ఈ కవి ఇరతరచనలు కానీ మరే వివరములు కానీ లభ్యం కాలేదు.
శతకపరిచయం:
మదనగోపాల శతకము భక్తిరస పూరితమైన సీసపద్య శతకము. 142 సీసపద్యాలు అల ఈశతకము "భుదజనోల్లాస! ఆచంటపుర నివాస! భక్త జనపాల! మదనగోపాలబాల!" అనే మకుటంతో ఆచంటలోని గోపాలుని సంభోదిస్తూ వ్రాసిన శతకము.
ప్రాచీనకావ్యాలలో అనుసరించిన పద్ధతిలో ఈశతకంలో కవి ముందుగా ఇష్టదేవతా ప్రార్ధనాదులతో శతకాన్ని ఆరంభించాడు. ఈశతకము నందలి పద్యములు స్తోత్రోపయోగములై శ్రావ్యముగా నర్ధగాంభీర్యము కలిగి ఉన్నాయి.
సీ. ఘన ఘనా ఘన రమా కలితాప ఘన ఘన, ఘనవాహ ముఖ సురగదిత మహిమ
హిమ కరోపమనఖ కమనీయ పదభాగ, భాగత కాంచన పటువికాస
కాసరాశ్వ తనూజ కామిత పూరణ, రణరంగ విజితాశవ నీప,
నీపాలయాజప నియమ నామ విశేష, వాగ విషయ సిద్ధ వంద్య భూమ
గీ. భూమ హర్భర నిరసన కామ భావ
భావ భవకోటి భాస్వర ప్రౌఢ రూప! !! బుధ !!
(ముక్తపదగ్రస్త శబ్ధాలంకారము)
లక్ష్మీదేవి పైని ఈ అచ్చతెలుగు సీసము చూడండి.
సీ. నెత్తమ్మి మాళిగ నెలకొన్న పూబోడి, రాచిల్క తత్తడి రౌతుతల్లి,
ముక్కంటి తలపూవు ముద్దుతోబుట్టువు, ముజ్జగంబులు నేలు ముద్దరాలు
సోకుమూకల దోలుజోడు పట్టపురాణి, కలుముల నీనెడి కల్వకంటి
మలచూలి నల్వ వేములగాడు ప్రోయాలు, లేముల నెడబాపు చామ మిన్న
గీ. కడలి రేనికి కూతురౌ కమల నురము
నందు ధరియించి బెంపొంది యలరితౌర!  !!బుధ !!
ఈశతకమంతా భక్త్యావేశంలో ఉప్పొంగిన భావాలు ప్రవాహంలా సీసపద్యరూపంలో పొంగిపొర్లాయా అన్నట్లుగా సాగిపోతాయి. ఉదాహరణకు  పద్యం చూడండి.
సీ. నీల నీరద గాత్ర! నిర్జర నితిపాత్ర!, పాపలతాదాత్ర! పద్మ నేత్ర!
దుష్ట కంద ఖనిత్ర! దుస్సహ సుర జైత్ర!, పావన చారిత్ర! పతగ పత్ర!
భవ విమోచన సూత్ర! పాలిత మునిపుత!, కువలయా వనచిత్ర! సవనపాత్ర!
సాందీపక చ్ఛాత్ర! సమ్య గుధ్రుతగోత్ర!, భక్తాఘ వనచైత్ర! పరమ మిత్ర!
గీ. ఆపదర్నవ తరణైక యానపాత్ర!
కంధి గర్వ విదారణ కంకపత్ర! !! భుధ !!
భక్తిమయ పూరితమైన శతకంలో శ్రీ కృష్ణ జననం గురించిన పద్యాలు, బాల్య క్రీడలు, లీలలు, రాసక్రీడలు మొదలైన విషయాలను చక్కగా చిత్రించారు.
సీ. కావలి వారల కన్నులు పొరగప్ప, వసుదేవు సంకెలల్ వదలిపోవ
ఘన కవాటంబులు కడిది తాళములూడ, నదుల నీరముల్ కాల్నదగ బార
ఘనమాయ యుదవించి కంస దానవ భీతి, వలనొప్ప మందకు వలస బోయి
పొలుపొంద నందుని పొలతుక పొదిగిట, పసిబిడ్దవై నీవు పవ్వళించి
గీ. పెరిగితివి నాటి నాటికి పేర్మిమీర
పరగ పడరాని బదవ పడితివయ్య  !! బుధ !!
సీ పెరుగులమ్మెడు గొల్ల నెరహొంతకారుల, యెదలపై బొదలు పయ్యెదలు బట్టి,
చెక్కులు ముద్దాడ జిగిచన్ను గవ బట్టి, యలతి కెమ్మోవుల యమృతమాని
జిగిబిగి కౌగిట జిక్కన గదియించి, బాలిమీరగ రతికేళి దేల్చి
గప్పుచిప్పుగ నొరుల్ గనకుంద దరిచేరి, చిడిముడి నడితప్పటడుగులిడిచు
గీ. గోలతన మచ్చువడ తల్లిమ్రోల జాల
క్రీద లొనరించు నీ మాయ జూడవశమె      !! బుధ !!
ఈ నిందాస్తుతి గమనించండి
సీ. అదితి చన్నుల పాల నారగించగ గదా, కొంచక బలిని యాచించినావు
కోసలాత్మజ పాల గ్రోలియుందగ గదా, దురమున రావణు దునిమినావు
అల యశోదాస్తన్య మానియుందగ గదా, కానలో పసులను గాచినావు
పూతన విసపుపాల్ పూని ద్రావగ గదా, మాపట్ల కఠినంబు జూపినావు
గీ. పాల గుణమంచు మదినెంచ బడును గాని
నిన్ను నెపపెట్ట పనివేరె యున్నదయ్య   !! బుధ !!
సీ. ప్రహ్లాదు డేపాటి పారితోషిక మిచ్చె?, కరిరాజు నీకేమి కట్నమిచ్చె?
వెస విభీషణుడెంత విత్తంబు నీకిచ్చె?, ద్రౌపది నీకేమి ద్రవ్యమిచ్చె?
పుండరీకుండేమి భూషణంబు లొసంగె? నారదుండేమేమి నగలు బంపె?
అంబరీషుడు రత్నహారము లెన్నిచ్చె, గంగాత్మజుండెంత కనక మిచ్చె
గీ. నేను నీకేమి దర్శింప నెరనైతి
నన్నుపేక్షింప నీకేమి న్యాయమయ్య     !! బుధ !!
కృష్ణ జనన, లీలలపై పద్యాల తరువాత దశావతార వర్ణనము, అదేవిధంగా భారత భాగవతంలోని అనేక సంఘటనల ఆధారంగా రచించిన అనేక పద్యాలు ఈశతకంలో మనకు కనిపిస్తాయి.
ఈ శతకమంతా భక్తిరసమయం. ప్రతిపద్యంలోని ప్రతిపాదంలో భక్తిరసం మనం గమనించవచ్చు. ఈ శతకం ఈ కవి భక్తితత్పరతతో పాటు భాషపై ఈతనికి ఉన్న పట్టు, పురాణ, శాస్త్రలపై ఈకవికి ఉన్న అవగాహన మనకి తెలియచేస్తుంది. మన సాహిత్యంపై మక్కువ ఉన్న ప్రతి తెలుగు వాడు చదవ వలసిన ఒక మంచి శతకం.
మీరు చదవండి ఇతరులచే చదివించండి.
******

No comments:

Post a Comment

Pages