Thursday, September 22, 2016

thumbnail

గోవిందుడినే స్మరించు

గోవిందుడినే స్మరించు

రావి కిరణ్ కుమార్ 


మరణ కాలం చేరువైన వేళ
వ్యాకరణ జ్ఞానం నిను చేదలేదు
గోవిందుడినే స్మరించు గోవిందుడినే స్మరించు
ఓ మూఢమతీ గోవిందుడినే స్మరించు !
ధనాశ  వీడి సత్కర్మ ఫలమున
దొరికిన మితఫలమే హితమని
సంతుష్టి తో జీవన యానం సాగించు
గోవిందుడినే స్మరించు గోవిందుడినే స్మరించు
ఓ మూఢమతీ గోవిందుడినే స్మరించు !
అతివల ఘన హృదయ సౌందర్యానికి
వసుడవు కాబోకు నునుపైన తోలు తొడిగిన
                                            రక్త మాంసపు ముద్దని మరల మరల తలుచుకో   // గోవిందుడినే స్మరించు //
చంచలమీ జీవితం చపలమగు  బుద్ధి
నా అను అహంకారం రోగభరిత శరీరం
                                   కలగలిసిన సోకమయమే ఈ లోకం    // గోవిందుడినే స్మరించు //
చేతిలో కాసులు గల గల లాడినంతకాలం
బంధు జనుల సందోహం తో గృహము కళ కళ లాడు
వయసుడిగి చేతులు ఖాళీ అయినవేళ
                                       కానరారు కనులకెదురుగా అయిన వారెవరూ   // గోవిందుడినే స్మరించు //
కాయం కదులుతున్నంత కాలం
కుశల మడుగుదురెల్లరును
కదలిక లాగి కట్టె బిగిసిన వేళ దరి చేరరు
                భయముతో భార్యా బిడ్డలును   // గోవిందుడినే స్మరించు //
ఆట పాటలతో బాల్యము కాంతా
కనకపు మొహమున యవ్వనము
ముగింపు లేని పలు చింతలతో
ముదిమి కరిగిపోవు కాని విడువక
                                                 గోవింద స్మరణ చేయు నరులెవ్వరు లోకంలో  // గోవిందుడినే స్మరించు //
 ఆలు బిడ్డలను చింతలు మాని
నా దను మోహము వీడి చిత్రమగు జీవన
చిత్రపు లోతులు తరచి తరచి చూచిన
                           తత్వం తెలియనగు సోదరా   // గోవిందుడినే స్మరించు //
సత్సాంగత్యమున అబ్బును నిస్సంగత్వం
నిస్సంగత్వ మిచ్చును నిర్మోహత్వం
నిర్మొహత్వముతొ కలుగు నిశ్చలతత్వం
                                    నిశ్చలతత్వమున దొరకు జీవన్ముక్తి కి త్రోవ   // గోవిందుడినే స్మరించు //
శుష్క శరీరము కామ వికారము నొందునా
జలం శోషించిన సరస్సు లందుమా
విత్తం పోయిన పరివారం మిగులునా
                                 తత్వం తెలిసిన సంసార మోహముండునా  // గోవిందుడినే స్మరించు //
ధన జన యవ్వన గర్వం
తొలగించును కాలం  క్షణ కాలంబున
 అనిత్యమౌ మాయా లోకపు బ్రాంతిని విడచి
                                     నిత్యసత్యమౌ బ్రహ్మపధంబు చేర వేగిరపడుమా  // గోవిందుడినే స్మరించు //
 దివా రాత్రములు రుతు చక్రములు
మరల మరల మరలి  వచ్చు
కాలము ఆయుష్కాలము కదలి పోవు
కాని మరలి రావని నిజంబెరిగియు
                                     ఆశా పాశములు తెంచ బోడు మానవుడు    // గోవిందుడినే స్మరించు //
సతీ విత్తములపై చిత్తము వీడి
సత్సాంగత్యమను నౌకను చేరు
                                               భవ జలధి ని దాటించి భవహరుని దరి చేర్చు   // గోవిందుడినే స్మరించు //
శిరో ముండనం కాషాయాడంబరం జటాధారణం
కనులుండి కనలేని మూఢులు కట్టెదరు
                    పొట్ట కూటికై బహుకృత వేషం   // గోవిందుడినే స్మరించు //
 నల్లని కురులు పాల పొంగాయే
బోసి నోటిలో మాట తడబడే
వెన్ను వంగిపోయే చేతి కర్ర ఊతమాయె
                                    అయినను ఆశల మూట బరువెక్కదాయే   // గోవిందుడినే స్మరించు //
వృక్ష మూలమున విశ్రాంతి
దోసిలి భిక్ష తో ఉదర పోషణ
శీతొష్ణముల తో సహవాసమున్నా
                                 మది మాత్రం ఆశల బంధీనే హన్నా   // గోవిందుడినే స్మరించు //
కోటి తీర్ధ స్నానము  వేల వ్రతా చరణము
శక్తి  కొలది దానము చేర్చలేవు ముక్తి ధామము
       ఆత్మజ్ఞాన మించుకైన అబ్బనిచో   // గోవిందుడినే స్మరించు //
గుడి ప్రాంగణములు చెట్టు మొదళ్ళే ఆవాసములు
రాతి నేలలే పట్టుపరుపులు
జంతు చర్మములే పట్టు వస్త్రములుగా
                               తలంచు జ్ఞాన విరాగి సుఖములు పొందకుండునే   // గోవిందుడినే స్మరించు //
యోగి యైనను పరమ భోగి యైనను
ఏకాకి కాని సరాగి కాని నిరతము
                  గోవింద స్మరణ చేయువాడే నిత్య సంతోషి   // గోవిందుడినే స్మరించు //
భగవద్ గీతా పారాయణం గంగాజల పానం
మురారి నామ స్మరణం అనుదినము కొలది
                    మాత్రము చేసిన కాలునితో కలహమెక్కడ   // గోవిందుడినే స్మరించు //
దుర్భర గర్భావాసం చావు పుట్టుకల చక్ర బ్రమణం
తప్పించుకొన సాధ్యమా మానవులకు
మురారి నీ కృప లేకను  // గోవిందుడినే స్మరించు //
దొరకిన గుడ్డ పీలికల గోచి కట్టి
పాప పుణ్యముల చింతన మాని
యోగమందు మనస్సు నిలిపే యోగి
    పిచ్చి వానివలె ఆత్మానందము నొందు  // గోవిందుడినే స్మరించు //
నీవెవరు నేనెవరు తల్లి తండ్రు లెవరు
ఎటు నుండి ఎటుకు పయనం
చింతన చేసిన లోకమెల్ల సార హీనమని
స్వప్న సదృశ్యమని  సత్యము తెలియు   // గోవిందుడినే స్మరించు //
నీలో నాలో సకల జీవులలో నిండినది ఒకే
విష్ణు తత్వమని తెలిసిన వేళ అకారణము నైనను
సకారణము నైనను అసహనముండదు అన్యులపై
        మోక్షము కోరితివా సమబుద్ది ని సాధించు  // గోవిందుడినే స్మరించు //
శత్రువుతో పుత్రునితో భందువుతో
నెయ్యమైనను కయ్యమైనను నెరపబొకు
సర్వులలో ఏకాత్మ ను దర్శించి
అన్నివేళలా అభేదం పాటించు  // గోవిందుడినే స్మరించు //
కామం క్రోధం లోభం మొహం విడచిన మనలో
మనకు హరి స్వరూపమగుపించు
            ఆత్మజ్ఞానమొందని వారు నరక వాసులై నశించు  // గోవిందుడినే స్మరించు //
గీతా నామ సహస్రముల గాన మాలపించు
శ్రీహరి రూపమే ధ్యానించు
సజ్జన సాంగత్యం వైపుకు మనసును మళ్ళించు
దీన జనుల కొరకు ధనమును వెచ్చించు  // గోవిందుడినే స్మరించు //
కామిని కూడికతో సుఖ పడు కాయం
తత్ఫలముగా  వ్యాధులతో వెతల్ పాలగు
      మరణం తధ్యమని తెలిసీ వదలడు పాపాచరణం  // గోవిందుడినే స్మరించు //
ధనవంతుడు బిడ్డలతోనూ భీతి నొందు
సంపద నొసగదు యించుక నిజ సౌఖ్యం
యిది లోక రీతి తెలిసి
విత్తము పై చిత్తము విడనాడు  // గోవిందుడినే స్మరించు //
శ్వాసను నియమించి విషయ వాసనల
నుండి మనసు తొలగించు
నిత్యానిత్య విచారం సమాధి స్థితిలో
నామ జపం క్రమ పద్దతిలో కొనసాగించు   // గోవిందుడినే స్మరించు //
గురు  పాదములే రక్షయని తెలిసిన వాడా!
మనస్సేంద్రియములను నియంత్రిచు
జనన మరణ చక్రము దాటి
నీలో నిలచిన పరమాత్మను దర్శించు
గోవిందుడినే స్మరించు గోవిందుడినే స్మరించు
ఓ మూఢమతీ గోవిందుడినే స్మరించు
(శంకర భగవత్పాదుల భజ గోవిందం నకు ఓ అవివేకి అనువాదపు తెగింపు )

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information