వసంత శోభ - అచ్చంగా తెలుగు

వసంత శోభ

Share This

వసంత శోభ

రచన: ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం.


చ.  తెల తెల వారుచుండె, మది తీయని స్వప్నము తోడ నిండె, నే
తులుచన లేచి చెంత గల తొటకు నేగితి దైవపూజకై
నలరులు కోయగా - నట నబ్బురమొప్పగ ప్రస్ఫురిల్లె క
న్నులు మిరుమిట్లు గొల్పగ వినూతన దృశ్యము లొక్కపెట్టునన్.

తే.గీ.  అపుడె ఉదయించు నాదిత్యు నరుణకాంతి
కొలది కొలదిగ దిక్కులన్నియును కవిసి
నేల తల్లికి పారాణి నిమిరెననగ,
ప్రకృతి కాంత కనబడె నవ వధువు వోలె.

తే.గీ.   మొల్ల, సంపంగె, తంగేడు, పొగడ, మల్లె
మొల్లముల నుండి బహువర్ణ పుష్పవృష్టి  
నింగి హరివిల్లు నేలకు వంగుచుండె
ననగ నానంద పరచె  నా మనము నందు.

తే.గీ.  మొన్న మొన్నటి అవనతాంబురుహ కుట్మ
లాంగనలు ఫుల్లమై లేచి  భృంగ తతికి
నధర మకరంద నిష్యంద మధురములగు
చెఱుకు విలుతు లకోరీల  బఱపె నపుడు.

తే.గీ.  రంగు రంగుల పువ్వుల రంగశాల,
రంగశాలను నర్తించు భృంగచయము
లింపుగా తోచె కమనీయ దృశ్యముగను
హోలి యాడెడు రంగారు యువత వోలె.
                                           
తే.గీ.  పిల్ల గాలికి పూబాల ప్రేంకణములు,
ప్రేంకణంబుల చెలరేగి ప్రీతిగొల్పు
సరస పరిమళ సుమగంధ సౌరభంబు
లపుడు ప్రకటించె నవ వసంతాగమమ్ము.

మధుమతి:
వనము చూడగ నా
మనము సంతసిలెన్
తనువు ఝల్లుమనెన్
కనుల పండువయెన్.
తురగవల్గన రగడ:
ఆమని సొగసుల వఱలిన ఆ వని నయ సోయగములు
కామకళా కుసుమ మధుర గంధ సాయకములు,
కూజిత గానములు భ్రాంతి గొలుపు హృదయ మోదకములు
వీజిత మృదు శీకరములు, ప్రేమికజన రంజకములు.

నవమయూరము: 
విప్పినవి పింఛములు విందులను సేయన్,
కప్పినవి భూతలము కన్నులకు హాయై
త్రిప్పినవి కంఠములు  తీరుపులతోడన్,
ఒప్పినవి ఆ వనమయూరములు ప్రీతిన్.

కుసుమ విచిత్రము:
వనమున పూవుల్ వలపుల జూపన్
ఘనముగ చెట్లన్ కలయగ పూచెన్
మనమున ప్రీతై మమతల నింపెన్
కనగను హాయై తనువు తలర్చెన్.

నవనవలాడెన్ నవ వనమంతన్
అవని సరాగం బాకృతి దాల్చెన్
కవనము చెప్పెన్ కలువల కన్నెల్
యువకుల డెందా లోటమి పొందెన్.

భ్రమర విలసితము:
సంజన్ కాంచంగ స్మరుని శరముల్
జంజాటంబుల్ విసరెను హృదులన్,
మంజిష్టంబౌ సుమసముదయముల్
రంజిల్లన్ జేసె రసిక యువతన్.    

కనక లత:
అలరు విలతుని కుసుమ శర హరువుల విరసమునన్
కెలవున చిలుకలు జతలై కిలకిలమని కులికెన్
కలువలు తలకెను నటు నిటు కలపడి విరహమునన్
నలిగొని యువకుల మనములు నలువుగ కలుచవడెన్.

ఉ .  ఏమిది నేడు భూమి వసియించెడు స్థావర జంగమ వ్రజం
బామని శోభ దేలుచు సుఖాయుత దివ్య మనోజ్ఞ  నాట్య గీ
తామృత  మాస్వదించుటకునై మది నీ విధి నిశ్చితార్థులై 
కామనతో వసంత సభ కాముని పండువుగా రచించిరో!

తే గీ.  సురభి పొంగారు ఆమని శోభ కనగ,
పృథివి చిగురించి మకరంద మధువు కురిసి
నట్టు లనిపించి నా మస్సనంత నిండె
తేనె తరగల అనుభూతి దివ్యముగను.

తే. గీ.  దివ్యమయిన ఆ అనుభూతి తీరు చూడ
భవ్య నూతన వత్సరంబు
మనల కాయురారోగ్య కామ్యముల నిచ్చి
 బ్రోచు నను ఆశ మనమున తోచె నాకు.16


X         X         X

No comments:

Post a Comment

Pages