Saturday, November 22, 2014

thumbnail

భక్తి మాల – 1

భక్తి మాల – 1
-      మల్లాది వేంకట సత్యనారాయణ మూర్తి

విఘ్నేశ్వర స్తుతి
  1. కందము  :
అనఘా ! ఘన గణపతి ! ఓ
యి ! నాగ వదనా ! సురమును లెల్లరు నిను వం
దనముల గొలువగ ముందుగ
ఘనతను పొందితి నగసుత గారా లసుతా !
తాత్పర్యము : ఓ పాపరహితుడా ! గొప్పవైన ప్రమధ గణముల నాయకా ! ఓ ఏనుగు ముఖము కలవాడా ! దేవతలు, ఋషులందరూ ముందుగా నిన్ను నమస్సులతో ఆరాధించగా, ఓ పార్వతి యొక్క ముద్దు బిడ్డడా ! నీవు కీర్తిని పొందినావు. ఆరోగ్య కారకుడు సూర్య స్తుతి 2.       మత్తేభము
ఘన భూషాన్వితా ! కశ్యపాత్మ భవ ! కారుణ్య వారానిధీ !
వనజాత ప్రియ ! వాంచితార్ధ ఫలదా ! బ్రహ్మేంద్ర దేవార్చితా !
మునిశ్రేష్టుల్ సయితమ్ము గొల్చు వరదా ! మోక్షప్రదాతాగ్రణీ !
అనఘా ! నిన్ను భజింతు నా మది సదా ఆరోగ్యసంవృద్ధికై !
తాత్పర్యము : గొప్పవైన ఆభరణములు కలవాడా ! కశ్యపుని పుత్రుడా ! కరుణకు సముద్రము వంటివాడా ! పద్మ ప్రియుడా ! కోరిన ఫలముల నొసగువాడా ! బ్రహ్మ, ఇంద్రాది దేవతలచే పూజింపబడే వాడా ! ఋషులు కూడా ఆరాధించు వరముల నొసగువాడా ! మోక్షమును ప్రసాదించుటలో మొట్టమొదటి వాడా ! ఆరోగ్యవృద్ధికి నేనెల్లప్పుడూ నా మనస్సులో నిన్ను పూజించెదను. సర్వవిద్యాప్రదాయిని సరస్వతీ స్తుతి 3.      తేటగీతి
డంభములు పల్కు నర్భక డింభకులకు
తుంబురాది విద్వాంసుల కంబవగుచు
సర్వవిద్యల నొసగెడు సారసాక్షీ !
సకల సద్గుణ నికురంబ ! శారదాంబ !
తాత్పర్యము : విద్యాహీనులై ఉచితానుచిత విచక్షణ లేక పలికేవారికైనా , తుంబురుడు మొదలైన విద్వాంసులకైనా, అమ్మవలె నీవు అన్ని విద్యాబుద్ధులను ప్రసాదించెదవు. ఓ పద్మముల వంటి కన్నులు కలదానా ! సర్వ గుణములకు నిలయమైన ఓ సరస్వతీదేవి ! బ్రహ్మ స్తుతి 4.       ఆటవెలది
సృష్టికర్తవయ్యి జీవుల సృజియించి
ప్రాణదాతవైన బ్రహ్మదేవ !
నీదుకరుణ జీవులాది యనాదిగా
వెలుగుచుండెజగతి వెలుగు చూపి !
తాత్పర్యము :సృష్టికర్తగా జీవులను పుట్టించి ప్రాణమునిచ్చు ఓ బ్రహ్మ దేవా ! నీ కరుణ వలన జీవులు ఆది –అంతము అనునది లేక, ఈ జగమునకు వెలుగు చూపుచూ వెలుగుచున్నారు. విష్ణు స్తుతి 5.       ఆటవెలది
జీవులెల్లరకును స్థితి కారకుండవై
లోకమందు మనగ లోకులకును
చాకచాక్యమొసగు సరసిజనాభ ! యో
విష్ణుదేవ ! నిన్ను ప్రీతిగాంతు !
తాత్పర్యము : జీవులందరి మనుగడకు కారకుడిగా, ఈ లోకమునందు వసించుటకు తెలివితేటల నొసగే ఓ విష్ణుమూర్తీ ! పద్మము నాభియందు కలవాడా ! నిన్ను ఎంతో ఇష్టంగా చూచెదను.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information