కనకదుర్గ ఐ.పి.ఎస్ -1
(మినీ నవల)
టేకుమళ్ళ వెంకటప్పయ్య
సూర్యుడు అస్తమిస్తున్నాడన్న సంకేతంగా ఆకాశం
ఎర్రబారింది. అది ఊరికి కాస్త దూరంగా ఉన్న రెసిడెన్షియల్
కాలనీ. దగ్గరలో ఉన్న సిమెంటుఫ్యాక్టరీ
ఉద్యోగులకోసం అక్కడ చిన్నవీ పెద్దవీ కలిపి దాదాపు రెండువందల క్వార్టర్స్ దాకా
ఉన్నాయి. దూరంగా ఫ్యాక్టరీ పొగగొట్టంలో నుండి
వచ్చే దుమ్ము గాలివాటుగా కాలనీ మీద పడుతోంది.
"అబ్బబ్బా...ఏంటండీ బాబూ.. ఈ దుమ్ము? రోజూ మూడు పూటల చిమ్మినా ఇంకా దుమ్మే! ఛస్తున్నా అనుకోండి" అంది
మాధవి.
"గొంగళిలో భోంచేస్తూ వెంట్రుకలు వస్తున్నాయి
అన్నాట్ట వెనకటికెవరో! అలా ఉంది. మన బ్రతుకులే దుమ్ము ధూళి బ్రతుకులు.
కోట్లు ఖర్చుపెట్టి కాలుష్య నియంత్రణ యంత్రాలు పెట్టాం
అంటారే కానీ ఎప్పుడూ అవి పని చేసి
చావవు. ఒక పని చెయ్. పొద్దునా సాయంత్రం చిన్న బెల్లంముక్కలు తింటూ ఉండు. మా ప్యాకింగ్ హవుస్‌లో రోజూ అందరికీ
ఇస్తాం. దుర్గకు కూడా పెట్టు. దానికి అదే విరుగుడు"
అన్నాడు రాఘవ.
"దుర్గ అంటే గుర్తొచ్చింది... ఏమండీ... వేలడంత లేదు అదీ..
చుట్టుప్రక్కల యిళ్ళల్లో ఉన్న పిల్లలతో తగాదాలు పడుతున్నాదండీ" అంది భర్తకు కాఫీ యిస్తూ.
"........."
"ఏంటండీ ఏమీ మాట్లాడరు….అందరికీ సర్ది చెప్పలేక సతమతమౌతున్నాను. మీకేం మగ మహారాజులు చక్కగా
పొద్దున్నే డ్యూటీకి వెళ్తారు. హాయిగా సాయంత్రానికి వస్తారు. దాన్ని అల్లరి
చేయవద్దని గట్టిగా చెప్పండి."
"ఎక్కడుంది యిప్పుడు?"
"ఒసేయ్ రాక్షసీ… రా! మీ నాన్న పిలుస్తున్నాడు. ఏ
ముహూర్తాన కనక దుర్గ అని పేరుబెట్టారోగానీ.. మహానుభావా.. అది నిజంగా భద్రకాళే!" అని రెండు చేతులూ ఎత్తి
దేవుడికి దణ్ణం పెట్టి "ఎక్కడున్నావే! రా! " అని
గట్టిగా అరిచింది.
"అమ్మా..చెప్పు.. ఏమైంది?" అంటూ వచ్చింది.
"అమ్మా..దుర్గా! యిలారా!" అని పిలిచిన రాఘవ
వళ్ళో కూర్చొ బెట్టుకొని "అల్లరి చేస్తున్నావా? తప్పు కదా!"
"ఏమిటీ.. అమ్మ
అరుస్తోంది?"
"చూశారా! చూశారా! నిండా మూడేళ్ళు లేవు నిన్నూ.." అని వేలు చూపించి
వంట గదిలోకి వెళ్ళింది.
"అమ్మలూ..ప్రక్క క్వార్టర్స్ పిల్లల్తో గొడవలు
పడుతున్నావా?"
"నో..డాడీ.. వాడు… వాడు.. ప్రక్కింటి బుడుగున్నాడు కదా... వాడితో ఆడుకుంటున్నానా…. వాడు నన్ను లడ్డు పిల్ల.. లడ్డు పిల్ల అని పిలవడమే కాకుండా… అందరినీ అలా పిలవమని చెప్తున్నాడు"
"అప్పుడు నువ్వేం చేశావు?"
"నెత్తి మీద ఒక్కటిచ్చాను. దెబ్బకి ఏడుస్తూ
వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడు. వాళ్ళ అమ్మేమో మనింటికి తగదాకు వచ్చింది. నేనేమో
నన్ను లడ్డు పిల్ల అన్నాడు అందుకే కొట్టాను అని చెప్పాను. దానికి ఆవిడ
అంతమాత్రానికే చేయి చేసుకుంటారా జాగ్రత్త! మీ అమ్మాయిని అదుపులో పెట్టుకో! అని కోపంగా
వెళ్ళిపోయింది." ఒక్కసారి తండ్రి కళ్ళల్లోకి
చూసి "అమ్మైనా చెప్పాలిగదా డాడీ.. మా అమ్మాయిని అలా అనొద్దని… అమ్మ కూడా నన్నే తిట్టింది. అదీ కథ.." అని నవ్వేసి “అవునూ…. నాకు బార్బీ బొమ్మ తెస్తానన్నావు
తేలేదేం?" అని అడిగింది.
"తెస్తాను గానీ..అవునూ...రోజూ యిలా…. ఏదో ఒక కథ… ఉండాల్సిందేనా? తల్లీ..."
"ఆ..మీరు గారాబం చేస్తూ ఉంటే రోజుకు రెండు… మూడు… కథలు కూడా ఉంటాయి" అంది
వంటింట్లో నుంచీ వస్తూ మాధవి.
* *
*
"పిల్లకు నాలుగో
యేడు వచ్చిందండీ..ఏదైనా దగ్గరగా ఉండే కాన్వెంటులో ఎల్.కె.జి లో పడేద్దాం. దాని అల్లరి భరించలేకపోతున్నానండీ."
"అవును. రోజూ అనుకుంటూనే ఉన్నాను
మరచిపోతున్నాను. ఈ ఆదివారం పంతులు గారిని కలుస్తాను. అక్షరాభ్యాసం జరిపించి, మంచిరోజు చూసి స్కూల్లో వేద్దాం. ప్రక్క సందులోనే సరస్వతీ కాన్వెంట్ అని ఒకటుంది కదా! అందులో వేద్దాం. దగ్గరగా
ఉంటుంది. దాన్ని నడిపే సోమశేఖర్ నాకు బాగా
తెలిసినవాడే!"
మాటలు వింటున్న దుర్గ "ఐ… నేను బళ్ళో చేరుతున్నానా? అయితే ప్రక్కింటి సుజాతకు లాగా మనింటికి కూడా ఇంక నుంచీ నా ఫ్రెండ్స్
వస్తారన్నమాట" అంది.
"ఆపవే గోల.
ఫ్రెండ్స్… గిండ్సూ… అంటూ వెంటబెట్టుకొని రాకూడదు. అవన్నీ స్కూలు వరకే. బుద్ధిగా
చదువుకోవాలి"
"అమ్మా! బుజ్జి తల్లీ.. నువ్వు బాగా శ్రద్ధగా చదువుకుంటే, డాక్టరో లేకపోతే పెద్ద ఇంజినీరో అవుతావు సరేనా?"
"అలాగే డాడీ బాగా
చదువుకుంటాను…నువ్వు ఏమి చెప్తే అదే చదువుతాను. ప్రామిస్ !" అంది చేతిలో చెయ్యివేస్తూ.
"అవునులే..తండ్రీ
కూతురూ ఒకటి… చాకిరీ చెయ్యడానికి నేను.. అంతేగా!" రాఘవ, దుర్గా పెద్దగా నవ్వుకున్నారు మాధవి మాటలకు.
* * *
"రాఘవా! మీ అమ్మాయి మంచి తెలివి గల అమ్మాయి.
రెండు నెలల్లో ఇంగ్లీషు అక్షరాలన్నీ నేర్చుకొని పదాల్లోకి వచ్చేసింది. ఎక్కాలు కూడా బాగా
అప్పజెప్పేస్తోంది."
"అవునూ... శేఖర్...అల్లరేం చేయడంలేదు కదా!"
"పిల్లలు అల్లరి చెయ్యకుండా ఎలా ఉంటారు చెప్పు?
అందునా చిన్నపిల్లలు. నేను గమనించిందేమిటంటే.. మీ అమ్మాయిని ఎవరైనా చిన్న మాట అన్నా
ఊరుకోదు. తిరగబడుతుంది. అయినా.. ఆడపిల్లలు అలాగే ఉండాలి రాఘవా! మెతకగా ఉంటే ఈరోజుల్లో కుదరదు."
"అవున్రా శేఖర్..ఈ రోజుల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ
ఎంత ఘోరంగా తయారవుతున్నారో పేపర్లల్లో చూస్తూనే ఉన్నాం కదా! కలికాలం ఏం చేస్తాం."
"మీ అమ్మాయికి చిన్నప్పటినుండి అన్నీ వివరంగా
చెప్పండి. జాగ్రత్తగా పట్టుకొని రావాలి అమ్మాయిలను
ఈరోజుల్లో."
"అవును మాధవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. రోజూ
దుర్గను చదివిస్తుంది. ఎక్కాలు బట్టీ పట్టిస్తూ ఉంటుంది."
"అవునూ మీ ఫ్యాక్టరీ ఎలా ఉంది? విశేషాలేమిటి?"
"బాగానే నడుస్తోంది. ఏదో పాల్‌టెక్నిక్ చదివాను కాబట్టి బతుకు బండి అలా అలా నడుస్తోంది.
ఉదయం షిఫ్ట్ వేస్తున్నారు. ఎప్పుడో ఇబ్బంది అయితేనే నైట్ షిఫ్ట్" అని చిరునవ్వు నవ్వాడు.
"అది సరే… జీతాలు సరిగ్గా ఇస్తున్నారా.. అని అడుగుతున్నా."
"పర్వాలేదులే రా! మరీ సూపర్ అని అనను గానీ. ఓనర్ మంచి వాడు
కాబట్టి బాగానే నడుస్తోంది. నలభై వేలదాకా వస్తుంది జీతం. పైన బోనసులూ.. ఓవర్ టైములూ అవీ ఇవీ బాగానే ఉన్నాయి. నడుస్తోంది సంసారం అలా..అలా.."
"నేనూ నీలాగే ఏదో ఉద్యోగం చూసుకుంటే సరిపోయేది.
ఈ కాన్వెంట్ ఒకటి నెత్తిన పెట్టుకున్నాను. అవునూ.. పిల్ల కాలేజీ చదువుకొస్తే
లక్షలు లక్షలు కావాలి. డాక్టర్లు… ఇంజినీరింగ్ కోర్సులు అంటే దోపిడీనే.
చూస్తున్నావు కదా కాస్తా కాస్తా డబ్బు దాచుకోండి ఇప్పటినుండే."
"అవును ఆ పన్లన్నీ మధవికే అప్పజెప్తా! బ్యాంకులు, డిపాజిట్లూ ఆ వ్యవహారాలన్నీ తనే హ్యాండిల్ చేస్తుంది. చాలా పొదుపుగా
చేస్తుందిలే మాధవి. సరే ! ఇక వస్తాన్రా ! మా అమ్మాయిని కాస్తా కనిపెట్టి ఉండు. జాగ్రత్త! నువ్వున్నావన్న ధైర్యంతో యిక్కడ చేర్చాను."
"దుర్గ చదువు గురించి నువ్వేం దిగులు పడకు. చాలా
శ్రద్ధగా చదువుతుంది."
"ఓ కే… ఉంటాను.." అని దుర్గను తీసుకొని యింటికి బయల్దేరాడు రాఘవ.
* * *
(ఇంకా ఉంది)




No comments:
Post a Comment