వెండితెర వేలుపు
పెయ్యేటి రంగారావు
సభలో ఇసక వేస్తే రాలనంత జనం.
ఆరోజు “సనాతన ధర్మ ప్రవీణ”,
“జ్ఞాన సుధాంబుధి చంద్ర”, “మహా మహోపాధ్యాయ”, మహానంద సరస్వతి
స్వామి వారి ప్రవచనం జరుగుతోంది. వారిది గంభీరమైన కంఠం.
వారు దేని మీదనైనా అనర్గళంగా ప్రసంగించగలరు.
ఉపన్యాసం మధ్యలో హాస్యోక్తులు, ఛలోక్తులు
విసురుతూ, రామాయణ భారత భాగవతాది గ్రంథాల
నుంచి నీతిదాయకమైన, భక్తి రసప్లావితమైన
శ్లోకాలను, పద్యాలను, పాటలను
శ్రావ్యమైన గొంతుతో శ్రుతియుక్తంగా,
లయబద్ధంగా పాడుతూ ప్రేక్షకులను సమ్మోహితులను చేసి కదలకుండా కట్టి పడేస్తారు. భారత ప్రభుత్వం
వారిని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆ రోజున వారు హైదరాబాద్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో శ్రీ మహావిష్ణువు దశావతారాల లోని నరసింహావతారం
గురించి ప్రసంగిస్తున్నారు. హిరణ్యకశిపుడు బ్రహ్మ
నుంచి వరాలు పొంది మదోన్మత్తుడై, తామస
ప్రవృత్తితో చెలరేగిపోతూ,
శ్రీ మహావిష్ణువును నిందిస్తూ,
మునులను ఋషులను హింసిస్తూ, ఎలా ప్రజా
కంటకంగా తయారైనది వర్ణించి
చెబుతున్నారు. హిరణ్యకశిపుడు వస్తున్నాడు
అంటే మునులతో సహా పురుషులు, స్త్రీలు, పిల్లలు, ఆఖరికి దేవతలు
కూడా, అతడి నిందావాక్యాలు వినలేక, ఆగడాలు భరించలేక, ఎలా పారిపోయే వారో వివరిస్తున్నారు. ప్రేక్షకులు
ఎంతో శ్రద్ధగా వారి ఉపన్యాసాన్ని ఆలకిస్తున్నారు. ఉన్నట్లుండి సభలో గందరగోళం నెలకొంది. ప్రేక్షకులందరూ ఒక్కసారిగా లేచిపోయి పరిగెత్తసాగారు. చూస్తుండగానే సభంతా ఖాళీ అయిపోయింది.
మహానంద సరస్వతి గారికి ఏమీ అర్థం కాలేదు. వేదిక మీద ఉన్న
ఒక
నిర్వాహకుడిని అడిగారు, “ఏమిటండి,
జనం ఎందుకలా పరిగెడుతున్నారు? నా ఉపన్యాసం వారికి నచ్చటం లేదా?”
ఆ నిర్వాహకుడు, “అదేమీ
కాదు స్వామీ! వెండితెర వేలుపు,
సినిమాలకి కథ, మాటలు, పాటలు రాసి, సంగీతం సమకూర్చి, తానే
పాడి, హీరోగా నటించే దగా
సెన్సేషనల్ స్టార్, పక్కనే ఉన్న మండపంలో సభకి
వస్తున్నాడండి. ఇప్పుడు ఆయన తన కొత్త సినిమా “తొక్క తీస్తా” విడుదలకు ప్రచారం
కోసం వచ్చి, పాటలు పాడి, కొన్ని
డైలాగులు చెప్పబోతున్నాడండి.” అని చెబుతూ, తాను కూడా
సంభ్రమంగా పరిగెడుతూ వెళ్లిపోయాడు.
“ఓహో!
సినిమా నటులంటే జనానికి ఎంత పిచ్చి! ఇంత
చక్కని ఉపన్యాసం వినకుండా పరిగెత్తారే!”
అని సభలో మిగిలిపోయిన ఒకే ఒక ముసలాయన ఆశ్చర్యపోయాడు.
కాని, ఆయన ఆశ్చర్యాన్ని మరింత పెంచుతూ మహానంద
సరస్వతీ స్వామి వారు కూడా పరిగెత్తారు.
“ఏమిటి ఆయన కూడానా?” అని ఆ ముసలాయన
తెల్లబోయాడు.
ఇంతకీ ఆ వస్తున్న మహానటుడు
ఎవరో తెలుసా? పచ్చి బూతు పాటలు రాసి, వరసలు కట్టి, పాడే
అశ్లీలసామ్రాట్ ‘క్షుద్ర నీచ’
అనే హీరో. హిరణ్యకశిపుడు వస్తుంటే మునులు దేవతలు పారిపోయినట్లు,
ఈ ‘క్షుద్ర నీచ’
వస్తుంటే, వాడి బూతుకూతలు వినలేక, జనం హాహాకారాలు చేస్తూ భయంతో
పారిపోతారు. అంతటి మహానంద
సరస్వతి గారు కూడా ఆ క్షుద్రనీచ కూసే ఎన్ని బూతులు
వినాల్సి వస్తుందో అని భయపడి
పారిపోయారు.
చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడ వద్దు. బయట గాని, టి.వి.లో గాని, సినిమాలలో గాని………
జీవితాలు నాశనమవుతాయి. సమాజం భ్రష్టు పట్టి పోతుంది.
అలాగే…..
నిర్మాతలూ! బాధ్యతగా ప్రవర్తించండి. చెడు చూపకండి, టి.వి. కార్యక్రమాలలో గాని,
చలనచిత్రాలలో గాని…..
అలాగే……
ప్రభుత్వాలూ! బాధ్యతగా చట్టాలు తీసుకు రండి.
మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించండి.
సమాజాన్ని కలుషితం చెయ్యకండి.
***************




No comments:
Post a Comment