పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -19
బాలకాండ
దినవహి సత్యవతి
18 వ సర్గ
దశరథ సుతుల జననము, విశ్వామిత్రుని ఆగమనం...
283.
దశరథుడు అశ్వమేధయాగం పూర్తిగావించెను,
పత్నులగూడి యాగదీక్షా నియమాలు పాటించెను,
భృత్య, బల, వాహనాలతో అయోధ్య ప్రవేశించెను,
అనంతరం పుత్రకామేష్టి యాగము పూర్తిచేసెను,
దేవతలు హవిర్భాగములు గైకొని వెడలిరి, సత్య!
284.
ఆహూతులైన రాజులెందరో యాగానికి వచ్చిరి,
తగువిధంగా దశరథుని చేత పూజింపబడిరి,
అనంతరం వారు వసిష్టునికి నమస్కరించిరి,
పిదప అయోధ్యనుండి స్వస్థలాలకు తరలిరి,
ఆయా రాజుల సైన్యాలు ఆనందంతో ప్రకాశించె, సత్య!
285.
దశరథుడు, రాజులందరకూ వీడ్కోలు పలికెను,
పిదప సద్బ్రాహ్మణులతో అయోధ్య ప్రవేశించెను,
ఋష్యశృంగుడు, భార్య శాంతతో, స్వస్థలమునకేగెను,
రోమపాదుడు పరివారంతో వారిననుసరించెను,
దశరథుడు, పుత్రోత్పత్తికై వేచుచు, సుఖానయుండె, సత్య!
286.
యజ్ఞము పూర్తై ఆరు ఋతువులు గడచెను,
సుమారు సంవత్సరము పూర్తికావచ్చెను,
పండ్రెండవ మాసమైన చైత్రమాసము వచ్చెను,
పునర్వసు నక్షత్రయుక్త నవమి తిథి వచ్చెను,
నాడు ఐదుగ్రహములు ఉచ్ఛ స్థానమందుండె, సత్య!
287.
సూర్యుడాదినమున మేషరాశియందుండెను,
కుజుడాదినాన మకరరాశియందుండెను,
గురుడానాడు కర్కాటకరాశియందుండెను,
శుక్రుడాదినమున మీనరాశియందుండెను,
శని, తులారాశిలోనూ, ఉచ్ఛస్థానములందుండిరి, సత్య!
288.
గురుచంద్రులొకటైన కర్కాటక లగ్నమందున,
సకల జగన్నాథుడూ సర్వలోక నమస్కుడైన,
సర్వలక్షణ సంపన్నుడు, విష్ణ్వంశసంభూతుడైన,
ఇక్ష్వాకు వంశవర్థనుడు, మహాభాగ్యవంతుడైన,
రాముడిని కుమారునిగా పొందెను కౌసల్య, సత్య!
289.
రామునితో కౌసల్య దేవమాతవలె ప్రకాశించెను,
కైకేయి, భరతుడను, పుత్రునికి, జన్మనిచ్చెను,
అతడు విష్ణువుయొక్క నాల్గవభాగమైయుండెను,
సత్యపరాక్రముడు, సద్గుణ సంపన్నుడైయుండెను,
సుమిత్ర, లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చెను సత్య!
290.
రాముడు, పునర్వసునక్షత్ర కర్కాటకలగ్నమందు,
భరతుడు, పుష్యమీనక్షత్ర మీనలగ్నమునందు,
లక్ష్మణుడు, ఆశ్లేషనక్షత్ర కర్కాటకలగ్నమందు,
శత్రుఘ్నుడునూ అదే నక్షత్రాన అపరాహ్ణమందు,
విష్ణ్వంశసంభూతులై, భువిలో నరులై, జన్మించిరి, సత్య!
291.
సమస్త గుణవంతులు, అనురూపులైనవారు,
ఉత్తరాభాద్ర, పూర్వాభాద్ర తారాకాంతిగలవారు,
బుద్ధిమంతులు, సౌందర్యవంతులైన నలుగురు,
దశరథ పత్నులకు సుతులుగా జనించినారు,
అట్టి తరుణాన నింగినుండి పుష్పవర్షం కురిసె, సత్య!
292.
అపుడు గంధర్వులు మధురగానము చేసిరి,
అప్సరసలు అద్భుతముగా నాట్యము చేసిరి,
ఇంద్రాదిదేవతలు దుందుభులను మ్రోగించిరి,
ప్రజలంతా ఉత్సాహంగా ఉత్సవంలో పాల్గొనిరి,
వీధులన్నియూ జనముతో క్రిక్కిరిసియుండె, సత్య!
293.
పురవీధులు నట, నర్తకాదులతో నిండిపోయెను,
వివిధ వాద్య, నాటకధ్వనులు మిన్నుముట్టెను,
వందిమాగధుల స్వరధ్వనులు మిన్నంటెను,
దశరథమహారాజు అందరికీ కానుకలిచ్చెను,
బ్రాహ్మణులకు, గోవులు ఇత్యాదులు, దానమొసగె, సత్య!
294.
కౌసల్యసుతునికి రాముడను నామమిడి,
కైకేయిసుతునికి భరతుడని నామమిడి,
సుమిత్ర యొక సుతునికి లక్ష్మణుడని పేరిడి,
రెండవ సుతునికి శత్రుఘ్నుడని నామమిడి,
వసిష్ఠ మహర్షి, నలుగురకూ, నామకరణం చేసె, సత్య!
295.
దశరథసుతులకు జాతకర్మలు చేయబడెను,
అన్నప్రాశన, ఉపనయన సంస్కారాలు జరిగెను,
చౌలాది సంస్కారాలు యథాకాలాన జరిగెను,
దశరథుడు, బ్రాహ్మణులకు రత్నాలు దానమిచ్చెను,
బ్రాహ్మణ, పౌర, జానపదులకు సంతర్పణలు చేసె, సత్య!
296.
దశరథసుతులు జ్ఞానసంపన్నులు, వేదవేత్తలు,
లోకక్షేమమందు ఆసక్తులు, సద్గుణ శోభితులు,
తేజోవంతులు, దీర్ఘాలోచన చేయగల సమర్థులు,
తప్పు పనులు చేయుటకు సిగ్గిలువారు, శూరులు,
పుత్రులగాంచి దశరథుడు సంతుష్టాంతరంగుడయ్యె, సత్య!
297.
జ్యేష్ఠుడైన రాముడు ధ్వజమువలె సర్వోన్నతుడు,
ధనుర్వేదంలో శ్రద్ధాళుడు, తండ్రికి ప్రీతిపాత్రుడు,
నిర్మల చంద్రునివలె సర్వలోకులకు యిష్టుడు,
బ్రహ్మవలె సర్వప్రాణుల ఆదరం పొందినవాడు,
గజాశ్వరథములపైనుండి పోరాడ సమర్థుడు, సత్య!
298.
లక్ష్మణుడు సంపదలను వృద్ధి పొందించువాడు,
అన్న, రాముడిపై అత్యధిక స్నేహం కలవాడు,
అన్నకై ప్రాణాలు సైతము అర్పించగలవాడు,
తమ్ముని తోడులేకుంటే నిద్రించలేడు రాముడు,
తమ్ముడులేకున్న భోజనం చేయకుండె రాముడు, సత్య!
299.
కౌసల్య, కైకల సుతులు రాముడు, భరతుడు,
సుమిత్ర కుమారులు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు,
రామునికి ప్రియమైన సోదరుడు లక్ష్మణుడు,
భరతునికి ప్రియమైన సోదరుడు శత్రుఘ్నుడు,
రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులాదర్శ సోదరులు, సత్య!
300.
దశరథుడు పురోహితాదులతో కూడియుండెను,
కుమారుల వివాహవిషయం చర్చించుచుండెను,
అంతలో ద్వారపాలకుడచటకు అరుదెంచెను,
విశ్వామిత్రుని రాకను దశరథునికి తెలిపెను,
దశరథుడు, విశ్వామిత్రునికి ఎదురేగెను, సత్య!
301.
విశ్వామిత్రమహర్షి గొప్ప తపఃసంపన్నుడు,
కఠినవ్రతములెన్నియో ఆచరించువాడు,
దశరథుడతనిగాంచి ప్రఫుల్లవదనుడైనాడు,
కౌశికునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించినాడు,
అంత విశ్వామిత్రుడు, ఉపస్థితుల, కుశలమడిగె, సత్య!
302.
మహర్షిరాక అమృత ప్రాప్తివంటిదియనె,
నీళ్ళులేని చోట వర్షం కురియుటవంటిదనె,
పోగొట్టుకొన్న వస్తువు దొరుకుటవంటిదనె,
సంతానహీనునకు పుత్రుడు జన్మించుటయంతనె,
వృద్ధి సమమైన మోదమిచ్చెనని దశరథుడనె, సత్య!
303.
దశరథుడు, కౌశికుని, ప్రీతిగా స్వాగతించెను,
అతని రాకకుగల కారణము తెలుపుమనెను,
అతడి కోర్కెనూ, తీర్చు మార్గమునూ చెప్పుమనెను,
సత్పాత్రుడౌ మహర్షిని కలియుట అదృష్టమనెను,
జన్మసఫలమై, జీవితం సుజీవితమైనదనె, సత్య!
304.
రాజర్షి బిరుదు కౌశికుని శక్తిని సూచించుననె,
మహర్షికౌశికుడు తనకు సర్వదా పూజ్యుడనె,
మహర్షి రాక తనకు ఆశ్చర్యజనకమైనదనె,
మహర్షి దర్శనం పుణ్యక్షేత్ర సమతుల్యమనె,
తనకు పవిత్రత చేకూర్చెనని దశరథుడనె, సత్య!
305.
మహర్షి వచ్చిన కార్యమును తెలుపుమనెను,
ఆజ్ఞారూపమగు అనుగ్రహము చేయుమనెను,
కార్యసాధనకై తాను సిద్ధంగాయుంటిననెను,
కార్యమేదైనా తెలుపగ సందేహించవలదనెను,
మహర్షి తనకు దైవసముడని దశరథుడనె, సత్య!
306.
కౌశికుని రాకతో అభ్యుదయం లభించెననెను,
మహర్షి రాకచే కల్గిన ధర్మమెంతో గొప్పదనెను,
దశరథుడట్లు వినయపూర్వకముగా పలికెను,
దశరథుని పల్కులు శ్రోతలకు సంతసమాయెను,
మహర్షియునూ, దశరథుని పల్కులకు ఆనందించె, సత్య!
******




No comments:
Post a Comment