శ్రీథర మాధురి - 143
(పూజ్య శ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)
గొప్ప వ్యక్తుల పుట్టిన రోజులను తగిన విధంగా జరుపుకుంటారు. అసామాన్యమైన గొప్ప వ్యక్తులను అవతార పురుషులు అంటారు.
'మీరు ఎక్కడైనా అసామాన్యమైన గొప్పతనాన్ని చూసినట్లయితే వారిలో వైష్ణవాంశ ఉందని తెలుసుకోండి.' - అంటూ కృష్ణ భగవానుడు అర్జునుడికి గీతలో చెబుతారు.
మనం శిరిడి సాయి బాబాను అవతారపురుషుడు అంటాము. అలాగే రాఘవేంద్ర స్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, మెహర్ బాబా వీరందరూనూ. దైవం అనేక రూపాల్లో ఈ భూమిపై అవతరించవచ్చు. దివ్యమైన ఆత్మలు అనేకమార్లు జన్మిస్తూ ఉంటాయి. దానికి కారణం ఏమిటి? ఈ అవతారాలు అసలు ఎందుకు దాల్చుతారు? ప్రతి వ్యక్తి అవతారపురుషుడు ఎందుకు కాలేడు? నిజానికి ప్రతి వ్యక్తి దైవం యొక్క అవతారమే. కాని మనకది తెలీదు, అంతే. కొంతమంది తాము అవతారం దాల్చామని అని గుర్తిస్తారు, చాలామంది గుర్తించలేరు.
తాము అవతారం దాల్చామని గుర్తించిన వారు తమని తాము అలా పిలుచుకోవచ్చు. ఇతరులు తమను కేవలం మానవ మాత్రులుగా భావించుకోవచ్చు. మనం మన గురించి ఏమనుకున్నా, ఎలా భావించినా కూడా, నిజం ఏమిటంటే - మనందరమూ భగవంతుడి యొక్క అవతారాలమే.
ఈ నిజాన్ని మనం ఎలా గుర్తించగలం? చాలా సులభం - ఆత్మజ్ఞానానికి చక్కటి దారి సేవ చెయ్యడమే. నా దృష్టిలో 'నిస్వార్ధమైన సేవ' అని అనాల్సిన అవసరం లేదు. స్వార్థం లేనప్పుడే సేవ నిజమైన సేవగా మారుతుంది. ఒక వేళ తిరిగి సేవను పొందాలని ఆశించినా, అది రోజు కూలీని పొందే వారి స్థాయికి పడిపోతుంది.
చేసిన సేవకు గాను గుర్తింపు పొందాలని అనుకోవడం కూడా కూలీని పొందడం కిందకే వస్తుంది. అందుకే ఆశించడం లేకుండా సేవ చేయండి. మీరు కుడి చేత్తో చేసే మంచి, ఎడమచేతికి కూడా తెలియాల్సిన అవసరం లేదు. అందుకే మన పెద్దలు గుప్త దానం(ఇతరులకు తెలియకుండా దానం) చెయ్యమని చెప్పారు. దానం అనేది( తగ్గిన వారికి భిక్షను ఇవ్వడం )అందరికీ సేవ చేయడానికి ఒక మార్గం. దానం చేయాల్సిన విధానాలను గురించి వివరించే తైత్తరీయోపనిషత్తు, ఎవరికైనా భిక్ష వేసినా కూడా, దాన్ని ఎవరికీ చెప్పకూడదని శాసిస్తుంది.
మనం ఇతరులకు సేవలు లేక అవసరమైనవారికి దానాలు ఎందుకు చేయాలి?
ప్రహ్లాదుడు తన ప్రవర్తనతో దీనికి జవాబు ఇస్తాడు. అతడు అవసరంలో ఉన్నవారికి, వారు తన తల్లిదండ్రులన్న భావనతో గౌరవిస్తూ సేవ చేసేవాడు. అంతేగాని ఆ సేవ గురించి అతడు గొప్పలు చెప్పుకోలేదు. తను వారికి సహాయం చేస్తున్నాం అన్న ఆలోచన కూడా అతడికి ఎన్నడూ కలగలేదు. తన తల్లిదండ్రులకు సేవ చేయడాన్ని అతడెలా తన బాధ్యతగా భావించాడో, అలాగే అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడాన్ని కూడా అతడు తన బాధ్యతగా భావించాడు. అతనికి అంతా విష్ణుమయమే 'సర్వం విష్ణుమయం.'
మనం విష్ణువును ఎక్కడ కనుగొనగలము? ప్రహ్లాదుడు విష్ణువును అన్నిచోట్లా చూశాడు- దరిద్రులలో, ధనవంతుల్లో కూడా. అంతే గాక వారిని తన తల్లిదండ్రులు గా భావించి వారికి సేవ చేయడానికి బయలుదేరేవాడు. కృతయుగంలో ప్రహ్లాదుడి వంటివారు కూడా చాలా అరుదుగానే ఉన్నారు.
కాని అటువంటివారిని మనం ఇప్పుడు ఎలా కనుగొనగలము? నిస్వార్ధమైన సేవ చేస్తున్న వారు, సేవ పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, అదృష్టవశాత్తూ, ఇప్పుడు కూడా ఉండి ఉండవచ్చు. అటువంటి మంచి వారందరిని ఒక్క త్రాటిపైకి తెచ్చి, అవసరంలో ఉన్నవారికి మౌనంగా, శాయశక్తులా సహాయం చేసే ప్రయత్నం చేయడమే మా పని. 'సత్సంగత్వం' అంటే ఒక మంచి బృందంలో చేరడమే.




No comments:
Post a Comment