పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -14 - అచ్చంగా తెలుగు

పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -14

Share This

  పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -14

బాలకాండ

                                                                                                       దినవహి సత్యవతి 






12 వ సర్గ

 యాగము చేయింపుమని దశరథుడు, ఋషులను, కోరుట... 

204.

కొంతకాలము పిదప వసంతఋతువు వచ్చెను, 

దశరథుడపుడు యజ్ఞము చేయనభిలషించెను,  

ఋష్యశృంగుడిని, ఋత్విక్కుకమ్మని, ప్రార్థించెను, 

రాజు అభ్యర్థనను, ఋష్యశృంగుడు, అంగీకరించెను, 

యజ్ఞసామగ్రి కూర్చి, యాగాశ్వము విడువమనె, సత్య!

205.

దశరథుడు, మంత్రి సుమంత్రుని ఆజ్ఞాపించెను,  

ఋషి వసిష్ఠుని, బ్రాహ్మణాదుల రప్పించుమనెను, 

మహారాజు, ఆహూతులను, స్వాగతించి పూజించెను, 

తాను అశ్వమేధయాగం చేయదలంచితినెను, 

ఋష్యశృంగుని ప్రభావంచే తన కోరిక తీరుననె, సత్య! 

206.

వసిష్ఠాదులు, దశరథుని నిర్ణయమును మెచ్చిరి,   

రాజుది ధర్మసమ్మతమైన ఆలోచనయనిరి, 

మహారాజు  కోరిక తప్పక నెరవేరుననిరి, 

రాజుకు, పరాక్రములౌ పుత్రులు కలిగెదరనిరి, 

బ్రాహ్మణుల పల్కులకు దశరథుడు సంతసించె, సత్య! 

207.

అమాత్యులకు దశరథుడు ఆదేశములిచ్చెను,  

యజ్ఞసామగ్రి కూర్చి, అశ్వము వదలమనెను, 

యజ్ఞభూమికై, సరయూ తీరాన్ని సిద్ధం చేయుమనెను,   

యజ్ఞానికి భంగం రాకుండ ఏర్పాట్లు చేయమనెను,   

క్రతువు శాస్త్రరీతి పూర్తియగునట్లు చూడమనె, సత్య!  

208.

మంత్రులు రాజును పొగిడిరి, ఆజ్ఞ  పాటించిరి,  

బ్రాహ్మణులు, పురోహితులూ రాజును పొగిడిరి,  

రాజు అనుజ్ఞ గైకొని స్వస్థానములకు  వెళ్ళిరి, 

మంత్రులు కూడా నిర్దేశిత కార్యార్థులై వెడలిరి,   

పిదప దశరథుడు స్వగృహములో ప్రవేశించెను, సత్య!

*****

     13 వ సర్గ

       పత్నీ సమేతుడై దశరథుడు యాగ దీక్షగొనుట...  

209.

     సాలు గడిచి మరల వసంతఋతువు వచ్చెను,

యాగదీక్షుడౌ, దశరథుడు యాగశాలకు వచ్చెను,  

     వసిష్ఠునికి నమస్కరించి, శాస్త్రరీతి పూజించెను, 

    శాస్త్రప్రకారం యజ్ఞము జరుగునట్లు చూడుమనెను,

     యాగాంగములలో విఘ్నాలు రాకుండా చూడుమనె, సత్య! 

210.  

    వసిష్ఠమహర్షి తన మిత్రుడని, దశరథుడనెను, 

పూజ్య వసిష్ఠుడు ఉత్తమమైన పురోహితుడనెను, 

పురోహితునిదే యజ్ఞ కార్యభారమంతాయనెను, 

రాజు పల్కులు విని, వసిష్ఠుడటులే చేతుననెను,   

యజ్ఞకర్మలలో నిష్ణాతులను రప్పించె వసిష్ఠుడు, సత్య!   

211.

     యజ్ఞ నిర్వాహకులకు పనులు అప్పగించెను, 

సహస్రములగు ఇటుకలను తెప్పించుమనెను, 

అతిథులకై వసతి గృహాలను నిర్మింపుమనెను,

బ్రాహ్మణులకై చక్కని గృహాలను నిర్మింపుమనెను, 

అందు భక్ష్యాలు, అన్నపానాదులు సమకూర్చమనె, సత్య! 

212.

     పౌరులకొరకు విశాలభవనాలు నిర్మింపుమనె, 

అందునూ వివిధ భక్ష్యభోగాదులు కూర్చమనె,

గ్రామాలనుండి వచ్చువారినీ ఆదరింపుమనె,  

ఆహారాదులిచ్చి ఉచితరీతి సత్కరింపుమనె,  

సర్వవర్ణాల వారినీ గౌరవించి పూజింపమనె, సత్య! 

213.

     అతిథులనెపుడూ అవమానింపబోకుమనె, 

యాగకర్మకారులను అర్హతపై  సత్కరింపుమనె, 

కావలసిన ధనమిచ్చి భోజనము పెట్టుమనె, 

పనులందెట్టి లోటూ కలుగకుండ చూడుమనె, 

ప్రేమార్ద్రమైన మనసులతో ఏర్పాట్లు చేయమనె, సత్య!  

214.

     పిమ్మట, యాగనిర్వాహకులు వసిష్ఠుని కలిసిరి,

గృహనిర్మాణములు జరుగుచున్నవని తెలిపిరి, 

అన్నాదికములకు లోటు రానీయమని తెలిపిరి, 

పిదప వసిష్ఠమహర్షి, సుమంత్రుని పిలిపించిరి, 

వర్ణభేదమెంచక ఎల్లరినీ ఆహ్వానించుమనిరి, సత్య ! 

215.

     మిథిలాపతి, పూర్వసంబంధి జనకమహారాజుని,

మహారాజు మిత్రుడు, స్నేహశీలుడు కాశీరాజుని,  

పుత్రసమేతంగా వృద్ధుడైన కేకయ రాజుని, 

అంగదేశ రాజు, భాగ్యవంతుడు, రోమపాదుడిని, 

సత్కారాలతో స్వయంగా తోడ్కొని రమ్మనె వసిష్ఠుడు,  సత్య!  

216.

    భూమండలంలో ధార్మికులౌ రాజులందరను,     

     తూర్పు, సింధు, సౌవీర, సౌరాష్ట్ర రాజులను, 

సమస్త దేశాల రాజులూ, విదేశ రాజులను, 

స్నేహితులు మరియూ, బంధువులౌ రాజులను 

సపరివారముగా తోడ్కొని రమ్మనె వసిష్ఠుడు, సత్య! 

217.

      పిదప వసిష్ఠుడు యజ్ఞకర్మకారుల రప్పించెను,  

 యజ్ఞసంబంధిత విషయాలు తెలుసుకొనెను, 

 ఎవ్వరేమి అడిగినా కాదనకుండా ఇవ్వమనెను, 

 ఎటువంటి అమర్యాద, అశ్రద్ధ చూపవద్దనెను,

 అటులైన దాతకు హానియగుననె, వసిష్ఠుడు, సత్య! 

218.

     యజ్ఞానికై నానాదేశాల రాజులు అయోధ్య జేరిరి, 

దశరథునకు కానుకగా రత్నాలు గొనివచ్చిరి, 

వసిష్ఠ ఋష్యశృంగులు, రాజుకా వార్త తెలిపిరి, 

యాగమునారంభించుమని దశరథునికి చెప్పిరి,  

దశరథుని యాగశాలకు చేరుకొమ్మని చెప్పిరి, సత్య! 

219.

     దశరథుడు, ఋత్విక్కుల, ఆదేశము పాటించెను, 

శుభనక్షత్రాన యాగశాలకు బయలుదేరెను, 

వసిష్ఠుడు ఋష్యశృంగునితో యాగశాల చేరెను, 

ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా నియమించెను,   

వారు యథాశాస్త్ర, కల్పోక్తరీతి యజ్ఞమారంభించిరి, సత్య!  


 ***** 



No comments:

Post a Comment

Pages