సుపుత్రుడు (కథ) - అచ్చంగా తెలుగు

 సుపుత్రుడు (కథ)

- కర్లపాలెం హనుమంతరావు



 

రాఘవయ్యగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్. క్రమశిక్షణే ప్రాణంగా బతికిన మనిషి. కానీ ఆయన కొడుకు కిరణ్ మాత్రం దానికి పూర్తిగా భిన్నం. జూదానికి, చెడు అలవాట్లకు బానిసైన 'సుపుత్రు'డు అతగాడు.

 

మూడునెలల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో కిరణ్ చనిపోయాడు.

కొడుకు పోయిన పదమూడో రోజు వాడి రూమ్ సర్దిస్తుంటే    డైరీ కంటబడింది రాఘవయ్యగారికి! అందులోని ఓ పేజీ  ఆయన  దృష్టిని ఆకర్షించింది.

 

"తప్పు చేశాను. ఈ రెండు లక్షల 'బాకీ' తప్పకుండా తీర్చెయ్యాలి. అప్పుడే నా పాపానికి నిష్కృతి" అని రాసి ఉంది. ఆ మాటల పక్కనే ఒక ఫోటో,  అడ్రసు  కనిపించాయి.

 

ఫోటో లోని వ్యక్తులను చూసిన తరువాత రాఘవయ్యగారి   గుండె బద్దలయింది. ఒక పండుముసలి మనిషి, ఆమె పక్కన ఓ చక్కదనాల చుక్క.. పది పన్నెండేళ్ళ పిల్ల! వాళ్ళ కట్టూ బొట్టూ చూస్తే కటిక దరిద్రంలో ఉన్నవాళ్ళని ఇట్టే తెలిసిపోతుంది.

 

తన ఘనుడు ఈ తల్లీ కూతుళ్లని ఏ మోసమో  చేసి  రెండు లక్షలు కొట్టేసినట్లున్నాడు. సుపుత్రుడి నిర్వాకానికి రాఘవయ్యగారు ఖిన్నుడయ్యారు .

 

చేసిన పాపం చెబితే పోతుందంటారు. తప్పు చేసింది తాను కాకపోయినా ఆ తప్పు చేసిన వాడిని కన్న పాపిష్టి తను. పోయిన వాడు పోనే పోయాడే... తండ్రిగా వాడి తప్పును సరిదిద్దటం తన  బాధ్యత.

 

బ్యాంకు నుంచి రెండు లక్షలు డ్రా చేసి , ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లారు రాఘవయ్యగారు.

 

ఊరి చివరి మురికివాడలో ఉం  ఆ చిరునామా తాలూకు  పూరిగుడిసె. ఆ పాత కొంపలో  కనిపించిన   తల్లీ కూతుళ్ళు డైరీలోని  చిరునామాలో  ఉన్న వాళ్ళే!

 

ఆ ముసలి మనిషి కుక్కి మంచం మీద  మూలుగుతూ   పడి వుంది! వంటికి అనువైన దుస్తులైనా లేకుండా దీనస్థితిలో ఉన్న ఆ  పసిపాపను  చూసి తన కొడుకు ఎంత ఘాతుకానికి ఒడిగట్టాడో  అర్థమయింది రఘురామయ్యగారికి.

 

అపరాధభావన ఆయనను నిండా ముంచెత్తింది. అతికష్టం మీద  గొంతు సవరించుకుని ముసలమ్మతో అన్నారు రఘురామయ్యగారు, "అమ్మా, నేను కిరణ్ కన్నతండ్రిని. ఆ త్రాష్టుడు  మీకు చేసిన ద్రోహానికి నన్ను క్షమించండి! మావాడు మీ దగ్గర కొట్టేసిన  డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చాను" అంటూ వెంట తెచ్చిన  రెండు లక్షల కట్టను ఆమె చేతిలో పెట్టారు రఘురామయ్యగారు.

 

ఆ ముసలమ్మ ఒక్క క్షణంపాటు నివ్వెరపోయింది. వెంటనే తేరుకుని కంట నీరు పెట్టుకుంటూ గద్గద కంఠంతో  అంది, "అయ్యా, మీ అబ్బాయి మా దగ్గర డబ్బు కొట్టేయటమేంటి? అల్లరి చిల్లరగా తిరుగుతాడు కాబట్టి అంతా మీవాడిని  చెడ్డవాడు అనుకుంటున్నారు. ముందులో  నేనూ అలాగే అనుకున్న మాట నిజం. కాని మీ బిడ్డ దేవుడయ్యా! ఎప్పుడూ ఈ ఎదుటున్న తుప్పల్లో పడి పేకాడుతుండేవాళ్ళు మీ అబ్బాయి.. ఇంకొందరు  అతని స్నేహితులు. వాడిలో  ఏ వెధవ కాలే  కాలే సిగిరెట్టు పీక ఇటు వైపు   విసిరేశాడో గానీ క్షణాల్లో పాకకు నిప్పంటుకుంది. ఆ  మంటల్లో నా కూతురు బూడిదయింది. అసలే తండ్రిలేని బిడ్డ, తల్లినీ పోగొట్టుకున్న ఈ  పసిదాన్ని సమయానికి ఆదుకొన్నది మీ బిడ్డేనయ్యా!  ఆ మంటల మధ్యలో ఇరుక్కుని  వళ్ళంతా కాలిని ఈ  పసిదాన్ని ఆసుపతిలో చేర్పించాడు మీ అబ్బాయి. అయిన ఖర్చంతా  ఆ బంగారు తండ్రే పెట్టుకున్నాడు! ఆ బిడ్డ  నాకు బాకీ ఏంటి?! ఈ పేదముండే ఆ పుణ్యాత్ముడికి  రుణపడి ఉంది!"

 

ముసలమ్మ మాటలు విన్న రఘురామయ్యగారు కొయ్యబారిపోయారు. బ్యాంకులో వెయ్యమని తానిచ్చిన  రెండు లక్షలు  వెళ్ళే దారిలో   పోయాయని  చెప్పాడు ఆరోజు. ఆ డబ్బు మూలకంగా తామిద్దరి మధ్యా అయిన దెబ్బలాటలు అన్నీ ఇన్నీ కావు. ఏ పేకాటకో నా కష్టార్జితం   తగలేసాడనుకొన్నాడు గానీ ఇలా ఓ ధర్మకార్యానికి వెచ్చిస్తాడని కల్లో కూడా ఊహించలేకపోయాడు. రాఘవయ్యగారి  కళ్ళు కట్ట తెగిన చెరువులే అయ్యాయి. అంత దుఃఖం లోనూ ఆయన మదిని  మెలిపెడుతున్న సందేహం అలాగే ఉండిపోయింది.

 

"మరి డైరీలో రాసి ఉన్న ఆ 'బాకీ' అనే మాట ?!" మనసులోని మాట తెలీకుండా   బైటికే వచ్చేసింది రఘురామయ్యగారి నోటి గుండా .

 

"ఆ బాకీ మీకే బాబూ! అవును... ఈ పిల్లకు బాగయి ఇంటికొచ్చిన రోజు ఆ బంగారుతండ్రి నాతో  ఏమన్నాడో తెలుసా సామీ!  'నాకు ఓ ఉద్యోగం వేయించి ప్రయోజకుణ్ణి చెయ్యాలని మా నాన్నగారు  తపించేవారు. పాప కోసం వాడిన  సొమ్మంతా   ఆయన నా కోసమని దాచిన డబ్బు నుంచి తెచ్చిందే! ఏదైనా చేసి ఆయన   సొమ్ము ఆయనకు   తిరిగిచ్చెయ్యాలి. నాన్నగారి   బాకీ తీర్చేదాకా నాకు మనశ్శాంతి లేదు' అన్నాడయ్యా ఆ పిచ్చినాయన"

 

రఘురామయ్య గారికి అప్పుడు అర్థమైంది... వంశానికి మచ్చలా పుట్టుకొచ్చాడీ  సుపుత్రుడు అనుకొన్నాడు గానీ.. వంశానికి వన్నె తెచ్చేలా ప్రవర్తించిన తన  కొడుకు  నిజమైన   'సు' పుత్రుడు అని. 

 

తెచ్చిన డబ్బు తీసుకోడానికి ససేమిరా అంది ముసలమ్మ. అయినా సరే... బలవంతంగా డబ్బు ఆమె చేతుల్లో కుక్కి " అమ్మా, మావాడు నా దగ్గర తీసుకున్నది వట్టి కాగితాల కట్ట  మాత్రమే. కానీ మీకు ఇచ్చింది ఒక బిడ్డ నిండు జీవితాన్ని. ఈ డబ్బు మీ పాప బాగోగుల కోసమైనా తీసుకోవాలి! అప్పుడే పోయిన నా కొడుకు ఆత్మకు శాంతి" అంటున్న  రఘురామయ్యగారు,  ఇక కంటి ముందు ఎన్నటికీ    కనిపించని తన కన్న సుపుత్రుడు కిరణ్ మనసులో మెదిలి  వలవలా ఏడ్చేసారు

***

 

 

 

No comments:

Post a Comment

Pages