నీ అడుగు జాడలో... - అచ్చంగా తెలుగు

నీ అడుగు జాడలో..(కథ )

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.




దుకాణంలో కూర్చుని లెక్కలు చూసుకుంటున్నాడు రోశయ్య.
అప్పుడే అక్కడికి ఆంజనేయస్వామి గుడి ధర్మకర్త రామశాస్త్రి వచ్చాడు.ఆయనను చూడగానే సంతోషంగా లేచి "ఏమిటి స్వామీ!ఎండనబడి వచ్చారు? నేనే సాయంత్రం గుడికి వచ్చేవాడినిగా!"అన్నాడు రోశయ్య ఆదరంగా.
"బీసెంటు రోడ్డులో సామాన్లు కొనుక్కుందామని వచ్చాను. దారే కదా!మిమ్మల్ని చూసి పోదామని!"అంటూ చేతిసంచీ లోనుంచి నాలుగు జామపళ్ళు తీసి రోశెయ్యచేతిలో పెట్టాడు రామశాస్త్రి.
భక్తిగా పళ్ళను కళ్ళ కద్దుకొని ప్రక్కన పెట్టాడు రోశయ్య.
తనే లేచి కూజాలోంచి మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు.
కాసేపు ఈ కబురు ఆ కబురు చెప్పి, సొరుగులోంచి డబ్బులు తీసి రామశాస్త్రి చేతిలో పెట్టి " గుళ్ళో నీళ్ల మోటారు పాడయ్యిందట కదా!బాగు చేయించండి!లేకపోతే వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగుతుంది!"అన్నాడు.
కాసేపటికి వెళ్తానని లేచాడు రామశాస్త్రి.
ఆయనను గుమ్మందాకా సాగనంపి వచ్చి మళ్ళీ కూర్చుని లెక్కలు చూసుకోసాగాడు రోశయ్య.
ఈ తతంగమంతా చూస్తున్న రోశయ్య పెద్ద కొడుకు కామేషుకు చెప్పలేనంత చికాకు వేసింది.
తండ్రి అంతే!మారనే మారడు!దానధర్మాలు చెయ్యటమంటే ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది.
"ఆ గుళ్లో చెడిపోయినవన్నీ బాగుచేయటానికి మనమే ఉన్నామా నాన్నా!మంచి సెంటరులో ఉంది.. దేవుడికి ఎంత లేదన్నా నెలకు లక్ష కంటే ఎక్కువే వస్తుంది... ఆ దేవుడికి మనం చేయించకపోతే జరగదా? కొంచెం తగ్గించుకో నాన్నా!"విసుక్కుంటూ చెబుతున్న కామేషును చూచి చిన్నగా నవ్వి తన పని తాను చేసుకోసాగాడు రోశయ్య.

నిట్టూర్చాడు కామేష్.

రోశయ్యది కనిగిరి. తండ్రి కామయ్య ఊళ్ళో చిన్న కిరాణా కొట్టును నడుపుకుంటూ ఉండేవాడు. సొంత ఇల్లు కూడా లేదతడికి. తిండికి లోటు లేకుండా సంసారాన్ని లాక్కొస్తున్నాడు కామయ్య. రోశయ్యకు పదహారేళ్ల వయసప్పుడు సముద్ర స్నానానికని పాకలకు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి రానేలేదు. ముసలి బామ్మ దగ్గర ఉన్న రోశయ్య దిక్కులేని వాడయ్యాడు. బామ్మ ఏం చేస్తుంది? బామ్మను పోషించడానికి చిన్నాన్న సిద్ధపడ్డాడు కానీ అన్న కొడుకుని దగ్గర పెట్టుకొని చదివించటానికి సిద్ధంగా లేడు.

రెండు నెలలుగా రెంట్ కట్టలేదని కిరణాషాపు ఓనరు వత్తిడి తెచ్చాడు. షాపులో సరుకును, ఇంట్లో ఉన్న సామానును ఇంకొక వ్యాపారికి అమ్మేసి తండ్రి చేశాడని చెప్పిన అప్పులు తీర్చేశాక రోశయ్య చేతికి వచ్చిన డబ్బులు తక్కువే!చిన్న రూములో నలుగురు కూలీ పనివాళ్లతో పాటు ఉంటూ ఆ ఊర్లోనే ఆ పనీ ఈ పనీ చేసుకుంటుంటే, కామయ్య స్నేహితుడైన గోవిందయ్య దగ్గర్నుంచి' విజయవాడలో పని చూపిస్తానని వెంటనే రమ్మని' ఉత్తరం వచ్చింది.
ఇంట్లో సర్దుకోవటానికి సామాన్లు ఏమున్నాయి కనుక? తనకంటూ ఉన్న ఆస్తి ఒక స్టీలు కంచం, నవారు మంచం అంతే!వాటితో సహా ఉన్న నాలుగు బట్టలు సర్దుకొని విజయవాడ బస్సెక్కాడు రోశయ్య.

ఏలూరు రోడ్డులో ఉండే బృందావన్ హోటల్లో రోశయ్యను సర్వరుగా కుదిర్చాడు గోవిందయ్య.
రెండేళ్ల తర్వాత హోటల్లో పరిచయమయిన నరసింహతో కలసి చిన్న హార్డ్ వేర్ షాపు తెరిచాడు రోశయ్య.
సుడి అంటారు దాన్నే!అదృష్టం కలిసి వచ్చి వ్యాపారం పుంజుకుంది. పదేళ్లకు సొంత ఇల్లు కొన్నాడు. డబ్బులు రావటంతో బంధువులు ఒక్కొక్కళ్ళుగా వచ్చి రోశయ్యకు పిల్లనిస్తామని బారులు తీరటం మొదలు పెట్టారు.వాళ్లందరినీ కాదని నరసింహం చెల్లెలైన నాగరత్నాన్ని పెళ్లి చేసుకున్నాడు రోశయ్య.
కొత్త కాపురం!గంపెడు సామానుతో లక్ష్మీదేవిలా ఇంట్లోకి అడుగు పెట్టింది నాగరత్నం.
పెళ్ళిలో రోశయ్యకు వెండి కంచం చదివించాడు నరసింహం.
కొత్త దంపతులకు ఖరీదైన పట్టె మంచం అమరింది.

ఆ రాత్రి భోజనానికి కూర్చున్నాడు రోశయ్య.
వెండి కంచంలో భోజనం వడ్డించింది భార్య.

"నా కంచమేది? అదే స్టీలు కంచం!"అడిగాడు రోశయ్య.

" వెండి కంచముండగా ఆ పాత కంచమెందుకు? 

"మా అమ్మా నాన్నల గుర్తు అదే!ఏదో దానిలో తింటే వాళ్ళు నా దగ్గరగా ఉన్నట్లు ఉంటుంది. నువ్వు వెండి కంచంలో తిను!నాకు నా కంచం తీసుకురా!"అన్నాడు రోశయ్య. అతడి కళ్ళల్లో తడి!... తన విజయాన్ని చూడటానికి తల్లిదండ్రులు లేరు.. వాళ్లకు బదులుగా కంచం, మంచం మిగిలాయి. అవే తనకు తల్లిదండ్రులు.
భర్త హృదయం అర్ధం అయింది నాగరత్నానికి.
రోజూ సాయంత్రం పెరట్లో ఉన్న బాదం చెట్టు కింద ఆ నవారు మంచం కింద కాసేపు పడుకోవటం అలవాటు రోశయ్యకు.
నలుగురు పిల్లలు పుట్టారు.
పెద్దవాడికి తన తండ్రి పేరు కామయ్య అని పెట్టుకున్నాడు. వాడే కామేష్.
రెండో వాడికి తల్లి పేరు మాణిక్యం.. వాడే మణి.
మూడో కొడుకుకు తన తాత పేరు నాగయ్య. వాడే నాగేష్.
నాలుగోవాడికి గోవిందయ్య పేరునే స్థిరపరిచాడు. వాడే గోపి.
పిల్లలతో పాటు సంపద కూడా పెరిగింది. రోజూ సాయంత్రం పూట నలుగురు పిల్లల్ని బాదం చెట్టు కింద కూర్చోబెట్టుకొని కథలు చెబుతూ కలిపి ముద్దలు పెట్టటం రోశయ్యకు అలవాటు.

అతడి కున్న మరొక అలవాటు తన సంపాదనలో పాతిక శాతం దానధర్మాలకని పక్కన పెట్టటం!

ఆ విషయమే నచ్చదు పిల్లలకు.

"ఏదో లోకాచారంగా పదో పరకో దానం చెయ్యి నాన్నా!మరీ అపరకర్ణుడిలా ఏమిటిది? నేను చెప్తే మీరు వినరు!..." అంటూ కామేష్ విసుక్కుంటే 
"ఒరేయ్!చిప్ప చేత పట్టుకొని విజయవాడ వచ్చానురా!ఈ దుర్గమ్మ దయవల్ల ఈ రోజు మనమందరం వైభోగంగా బ్రతుకుతున్నాము.. ఆ రోజుల్ని మరచిపోతే ఎలాగా? ఎవరో ఒకరు సహాయం చేయబట్టి ఈ స్థితికి వచ్చాను! ఏ పూర్వ జన్మ పుణ్యమో ఇది!మనం ఇంకొకరికి ఊతమిస్తే మన పుణ్యం నిలబడుతుంది!నీకు అర్ధం కాదు!"అనేవాడు రోశయ్య.

"తెప్పలుగా చెరువు నిండిన సామెత ఉంది కదా!అదన్నమాట!" అనేవాడు కామేష్.

నవ్వేవాడు రోశయ్య.
కాలం గడుస్తోంది.
నలుగురు కోడళ్ళు వచ్చారు.

మరో పెద్ద భవనం కట్టాడు రోశయ్య. నలుగురు కొడుకులకు నాలుగు అంతస్తులు. కోడళ్ళు ఉన్నతమైన కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు.వాళ్ళు ఏం కోరినా క్షణంలో సమకూర్చి పెడతాడు రోశయ్య.
మనవళ్ళు మనవరాళ్ళతో ఆ ఇల్లు కళకళలాడి పోతోంది.
ఇప్పుడు కూడా రోజూ సాయంత్రం పూట మనవళ్ళని మనవరాళ్ళని పెరట్లో ఉన్న మామిడి చెట్టు చెట్టు కింద కూర్చో బెట్టుకొని కథలు చెబుతూ కలిపి ముద్దలు పెడుతున్నాడు రోశయ్య. పిల్లలకు తాతయ్య అంటే,ఆయన చెప్పే కథలంటే ప్రాణం!

దేవుడికి దయలేదో ఏమో ఒక రోజు నాగరత్నం కళ్లు తిరిగి పడిపోయింది.హుటాహుటిన ఆస్పత్రికి తరలించారందరు.గుండెపోటని తేల్చారు డాక్టర్లు.
అంత ఇంటిని, రోశయ్యను వదలి వెళ్ళి పోయిందా ఇల్లాలు.భార్య పోయిన బాధను దిగమింగుకున్నాడు రోశయ్య. మిత్రులతో కలిసి నాగరత్నమ్మ హృదయ ట్రస్టును ఏర్పాటు చేశాడు. పేదవాళ్లకు గుండె ఆపరేషన్లను ఉచితంగా చేయటం ఆ ట్రస్టు యొక్క ప్రధానలక్ష్యం!

తలకొట్టుకున్నాడు కామేష్.
"వెఱ్ఱి ముదిరి రోకలి తలకు చుట్టు కొన్నట్లు!ఉన్నవి చాలక... ఇదో కొత్తది తయారయ్యింది!అంతా జల్లెం బుల్లెం చేసుకుంటే రేప్పొద్దున ఎనిమిది మంది సంతానం ఉన్నారు!ఎలాగో ఏమిటో?" అంటూ బాహాటంగా తండ్రిని విమర్శించే వాడు కామేష్.
కామేషుకు తండ్రి అంటే బాగా చనువు.మాట్లాడినా పొట్లాడినా నాన్నతోనే!దానధర్మాల విషయంలో అభిప్రాయభేదాలు ఉన్నా తండ్రి అంటే విపరీతమైన ప్రేమ కామేషుకు.
మణి, నాగేషులకు తండ్రి పట్ల గౌరవంతో కూడిన భయం ఉంది. అందుకని ఆయనను ఏదైనా అనటానికి అంతగా సాహసించరు. చిన్నవాడైన గోపి ఇప్పటికీ తండ్రి దగ్గర ముద్దులు గుడుస్తూ ఉంటాడు.

"నువ్వు మా నాన్నవిరా!నువ్వు ఎన్ని మాటలన్నా నాకు కోపం రాదు!"అంటూ చిన్నగా నవ్వుతూ తన పని తాను చేసుకుంటాడు తప్ప కామేషుతో ఎటువంటి వాదనా పెట్టుకోడు రోశయ్య.ఎన్ని అనుకున్నా ఆయన్ని దాటిపోయే వాళ్లు కాదు మిగిలిన పిల్లలు కూడా!

డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన కోడళ్లకు మామగారు చేసే పనులకు చికాకు పడటం అలవాటయ్యింది.
"ఇంత ఐశ్వర్యం ఉంది! ఆ బీదాబిక్కీ వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటారు!.. మా పుట్టింటి వాళ్లకు ఎగతాళిగా ఉంటుందక్కా! ఆ నీరుగావి పంచలు కట్టుకొని మురికి వాడల్లో తిరుగుతుంటే చిన్నతనంగా ఉంటుంది!"అంటూ వాపోయేది చిన్న కోడలు.

"మురికిజనాల్ని ఇంటికి తీసికొస్తారు!మన సోఫాల్లో అట్లాంటి వాళ్ళు కూర్చుంటే నాకు పరమ అసహ్యం వేస్తుందక్కా!"అనేది మూడో కోడలు.

"పోనీలే!ఏదో చాదస్తం!మనం అడిగినవే కాకుండా అడగనివి కూడా తెచ్చి పెడుతుంటారు!ఆయన తత్వం ఆయనది!"అనేది పెద్ద కోడలు.
పిల్లలకు ఎన్ని కోట్లు సంపాదించి ఇచ్చినా అప్పుడప్పుడు వాళ్ళు ఆయన చేసే పనులకు మనసులో విసుక్కుంటూ ఉంటారు. దీనినే 'జనరేషన్ గ్యాప్'అంటారేమో!
మరో ఆరేళ్లు గడిచాయి.
రోజూ తెల్లవారక ముందే నిద్రలేచే రోశయ్య ఆ రోజు ఎంతసేపటికి లేవలేదు.
శాశ్వతంగా నిద్రపోయాడు.

కర్మకాండకు భారీగా జనం తరలి వచ్చారు. ఊపిరి సలపటం లేదు పిల్లలకు. విజయవాడ ఊరు ఊరు కదిలి పోయింది. ఎక్కడెక్కడి వాళ్ళో పిల్లల్ని పరామర్శించటానికి వస్తూనే ఉన్నారు. వాళ్ళల్లో చాలా మంది ఆయన చేత సహాయం పొందిన వాళ్ళే కావటం గమనార్హం!రోశయ్యకు సంతాప సభలు పెట్టారు జనం. పిల్లలు నలుగురు హాజరయ్యారు.
ఊరిలో తండ్రికి మంచి పేరుందని పిల్లలకు తెలుసు కానీ ఆయన కోసం జనం ఇంత స్పందిస్తారని తెలియదు.

అంతా సద్దుమణిగే సరికి నెలరోజులు పట్టింది. నెల తర్వాత పొద్దున్నే దుకాణానికి వచ్చాడు కామేష్.నాన్న లేడు!... మంచి చెడు చెబుతూ బిజినెస్సును నేర్పించిన నాన్న!విసుక్కున్నా నసుక్కున్నా "నువ్వు మా తాతవురా!.. నువ్వు మా అమ్మవురా!... నువ్వు మా నాన్నేరా!"అంటూ నవ్వుతుండే నాన్న
అంతా నిశ్శబ్దం!చిన్న కొడుకులు కూడా తండ్రి మీద బెంగతో మౌనంగా పని చేసుకుంటున్నారు.

తండ్రి కూర్చునే కుర్చీ బోసిగా ఉంది. దుఃఖం పొంగుకొని వచ్చింది కామేషుకు. కాసేపు దాన్నే తడుముతూ కూర్చున్నాడు. గోపి అన్న దగ్గరికి వచ్చాడు.ఆఖరివాడు!
"నాన్న లేకపోతే బెంగగా ఉందన్నా!"అంటూ బేలగా కామేషును పట్టుకొన్నాడు.
తమ్ముడిని దగ్గరకు తీసికొన్నాడు కామేష్.తనిప్పుడు ఇంటికి పెద్దవాడు. దిగులు పడకూడదు!... చిన్న వాళ్లకు ధైర్యం చెప్పాడు. కాసేపటికి పనిలో పడ్డారందరు.
ఆ రోజు ఆదివారం.
తండ్రి గదిలోకి వెళ్ళాడు కామేష్.
అల్మరాలో పట్టుమని పది జతల బట్టలు కూడా లేవు.
టేబుల్ సొరుగులో డైరీ దొరికింది. డైరీ నిండా దానధర్మాల లిస్టు. ఓపిగ్గా కూర్చుని చదివాడు. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇస్తున్నాడో క్రమపధ్ధతిలో వ్రాసి పెట్టి ఉంది. డైరీని పక్కన పెట్టాడు.
బీరువా తెరిచాడు.
విల్లు దొరికింది.
విల్లు కాగితాలు తీసికొని హాల్లోకి వచ్చాడు కామేష్.
కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు.

అందరికి ఉత్కంఠగా ఉంది.

"కచ్ఛితంగా ట్రస్టుకు పెద్ద మొత్తంలో వ్రాసారేమో!"గుసగుసలాడింది చిన్న కోడలు.

గుళ్ళు గోపురాలకు ఎంత పోయిందో? " రెండో కోడలు సందేహం.

"బీదాబిక్కి దరిద్రులకు రాయకుండా ఉండరు!" మూడో కోడలు ఆరాటం.

"ఊరుకోండి!ఊరుకోండి!ఇప్పుడే తెలుస్తుందిగా!"మందలించింది పెద్ద కోడలు.

తండ్రి వ్రాసిన విల్లును పెద్దగా చదివాడు కామేష్.
రోశయ్య తన స్వార్జితమైన మొత్తం ఆస్తుల్ని తన నలుగురు పిల్లలకు సమానంగా పంచాడు.డిపాజిట్ల రూపంలో ఉన్న డబ్బుని,, నగలను కూడా పిల్లలకే పంచి ఇచ్చాడు.

అంతే ఇంకేమీ లేదు!

ట్రస్తు ఊసే లేదు! గుళ్ళు గోపురాల పేరస్సలు లేదు...ఇంక పేద వాళ్ళ గురించి.. హుళక్కి!..
నిరుత్సాహం ఆవరించింది అందరికీ.
కోడళ్లకయితే నోట మాట రాలేదు.
మామగారిని విమర్శిద్దామంటే విషయం ఏముందని? అంతా తమకే వచ్చేసింది. ఎవ్వరూ ఎగిరి గంతు వేయలేదు!... గిల్టీగా ఉంది నలుగురు కోడళ్లకు.
అందరి మనస్సులో ఒకటే ప్రశ్న!ఇదేమిటి? ఇలా చేశారు?
ఏదో నైరాశ్యం చుట్టుకొంది అందరిలో.
"తల్లిగా!ఇదిగోమ్మా!నీ కోసం పట్టుచీర!, నచ్చిందామ్మా!" అంటూ ఒక్కో కోడలిని పిలిచి చీరలు, నగలు కొనిపెట్టే మామగారు లేరు.కోడళ్ల మనస్సులో కూడా పూడ్చలేని వెలితి.

సాయంత్రం దుకాణం నుంచి వచ్చాడు కామేష్.

తాతయ్యలేడు. పిల్లలు మామిడి చెట్టు కింద అటూ ఇటూ తిరుగుతూ ఆడుకొంటున్నారు.అక్కడే ఉంది నవారు మంచం. తండ్రికి గుర్తుగా...
మంచం వాల్చుకొని కూర్చున్నాడు కామేష్. పిల్లల్ని కూర్చో బెట్టుకొని ఏదో కథ అల్లి చెప్పాడు.
"తాతయ్య ఇంతవరకు చెప్పారు!"అంటూ రోశయ్య చెప్పిన కథని చెప్పారు పిల్లలు. సగం కథ అది.. ఏదో కల్పించి కథని పూర్తి చేశాడు కామేష్. పిల్లలు నవ్వుతున్నారు.
వంటవాడిని పిల్చి పిల్లలకు అన్నం కలిపి తీసుకొని రమ్మన్నాడు.
వంటవాడికి హుషారు వచ్చింది.
గబగబా అన్నం కలిపి తీసికొని వచ్చాడు.ఈ లోపల మణి,గోపి, నాగేషులు వచ్చారాక్కడికి.
వెనుకనే కోడళ్ళు.
అందరూ మంచాలు వేసుకుని కూర్చున్నారు.
పిల్లలకు కలిపి ముద్దలు పెడుతూ కథలు చెబుతున్నాడు కామేష్. 
"ఇప్పులు పెద్దనాన్న తాతయ్య అయిపోయాలు!"అన్నాడు ముద్దుగా గోపి కొడుకు.
"అవునురా!నిజంగానే నేను మా నాన్నకే నాన్నని!అంటే మీకు ముత్తాత నన్నమాట!"
అంటూ కామేష్ నవ్వుతుంటే అందరూ నవ్వేశారు. అందరి మనసులు చల్లబడ్డాయి.

రెండోరోజు ట్రస్తుకు వెళ్ళాడు కామేష్.
అసలక్కడికి అతడు వస్తాడని ఊహించలేదెవ్వరు.
"కూర్చోరా!"అంటూ కుర్చీ చూపించాడు రోశయ్య స్నేహితుడు సుబ్బయ్య.

కామేష్ వచ్చాడని తెలియంగానే ట్రస్తు సభ్యులందరు ఒక్కొక్కళ్లుగా వచ్చారక్కడికి.
కాసేపు సానుభూతి మాటలు... వేదాంత చర్చ అయింది.

"నాన్న ఉన్నప్పటిలాగానే ట్రస్టును నడిపించండి బాబాయ్! కొంత డబ్బు డిపాజిట్ వేస్తాను. ఆటోమాటిగ్గా ట్రస్తు అకౌంటులో డబ్బు పడుతూ ఉంటుంది. ప్రతినెలా నేను గుర్తు పెట్టుకొని వేయనక్కరలేదు కూడా!"అన్నాడు కామేష్.

ఆశ్చర్యపోయారు ట్రస్టు సభ్యులు.
వాళ్లకు కామేష్ మనస్తత్వం తెలియంది కాదు.
కళ్ళనీళ్లతో కామేష్ చేతులు పట్టుకొన్నాడు సుబ్బయ్య.
నోటమాట రావటం లేదు.దుఃఖంతో గొంతు పూడుకు పోయిందతడికి.

"మీ నాన్నే కనిపిస్తున్నాడురా!"అని మాత్రం అనగలిగాడు.
ఆయన భుజం తట్టాడు కామేష్.

ఆ సాయంత్రం తమ్ముళ్లను, మరదళ్లను పిలిచాడు.

"నాన్న ఉన్నప్పటికీ లాగానే నడిపిద్దాము!డైరీలో ఎవరికి ఎంతెంత పంపించాలో వ్రాసి పెట్టి ఉంది. మీ అందరి మీద భారం పెట్టదల్చుకోలేదు.. నా వాటాలో నుంచే ఖర్చుపెడతాను!"అతడి గొంతు దృఢంగా వినిపించింది.

"అదేమిటన్నయ్యా!నీ మాట నేనెప్పుడన్నా కాదన్నానా? నేను కూడా నీతోపాటే!"అన్నాడు మణి. 
"మమ్నల్ని దూరం పెడుతున్నారా మీ ఇద్దరు.."
అంటూ చిన్న తమ్ముళ్లు కూడా వచ్చి పెద్ద అన్నలిద్దరి పక్కన కూర్చున్నారు.

కోడళ్ళ ముఖాల్లో గిల్టీ ఫీలింగ్ లేదిప్పుడు.
"మంచిపని!మేము కూడా అదే ఆలోచిస్తున్నాము!"అన్నారు ముక్త కంఠంతో.

ఆ రోజు రాత్రి అందరూ భోజనాలకు కూర్చున్నారు.
తండ్రి వాడిన స్టీలు కంచాన్ని తెచ్చుకున్నాడు కామేష్.
"ఇంటికి పెద్దవాడిని నేను కాబట్టి దీని మీద అధికారం నాది!ఏమంటారు?"అంటూ కంచంలో అన్నం వడ్డించుకొన్నాడు కామేష్.
"ఒక ముద్ద నాక్కూడా పెట్టన్నయ్యా!"అంటూ చెయ్యి చాపాడు చిన్నవాడు గోపి.
కళ్లనీళ్లు తుడుచుకొని తలా ఒక ముద్ద పెట్టి తనూ ముద్ద నోట్లో పెట్టుకుంటూ అక్కడే గోడకు తగిలించిన తండ్రి ఫోటో వైపు చూశాడు కామేష్.
తండ్రి నవ్వుతూ కనిపించాడు.
"నువ్వు మా నాన్నవేరా!"అంటున్న తండ్రి గొంతు వినిపించిదతడి హృదయానికి.

"అవును నాన్నా!నేను నీకే నాన్నను" కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అనుకున్నాడు ఇంటికి పెద్దవాడైన కామేష్.

***

No comments:

Post a Comment

Pages