సూక్తి మహిమ
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి(నాగిని)
"ఏఁవిటో... బాధ్యతలు తీరి భక్తిగా తీర్థయాత్రలకు వెళదాం అంటే లెక్కలు వేస్తారీయన... సన్నాయి నొక్కులు సరళా దేవి నుంచీ.
"జపములు, గంగా యాత్రలు,
దపములు, నోములును, దాన ధర్మంబులును, పు
ణ్య పురాణము పతి భక్తికి
నుపమింకను సాటి రాదుయుందు కుమారీ!" పద్యము వినపడుతోంది, ప్రక్కన నుంచి.
ప్రక్కింట్లో కిటికీ దగ్గర కూర్చుని ౘదువుతోంది గాయత్రి గారి మనవరాలు సుగాత్రి!
ఒక్క సారిగా ఆలోచనలో పడింది సరళా దేవి, " నిౙమే, భర్త ఆర్థిక, సమయాల వెసులుబాటు తను ౘూడలేదేఁవిటీ! ఇన్నేళ్ళుగా అత్త, మామలు, వారి పెద్దలు అందఱినీ ౘూసుకుంది, వారితో పాటుగా వచ్ఛి, పోయే వారినీ ఆదరించింది, ఊరిలో అందఱికీ సాయంగా ఉంది!
ఇప్పుడు పిల్లలు వారి, వారి జీవితాల్లో స్థిరపడ్డారు, ఇంట్లో పనీ-పాటా లేదని ఇప్పుడు ఇలా యాత్రలనుకుంది కానీ, 'రైతు' - నిరంతర కృషీవలుడు తనకు విరామం దొఱకదు, పొలమే క్షేత్రం, పంటయే దైవం గా బ్రతికే భర్తను ఇలా విసిగించానా" అనుకుని బాధ పడింది.
వెంటనే తన మనసు మార్చుకుంది.
అరుగు మీద కూర్చుని ఉన్న సరళా దేవి భర్త విశ్వం, "పోనీ పిల్లలకెటూ ఈ పొలం పుట్రా తీసుకునే ఉద్దేశం లేదు, ఊరి చివర కొంత కాలం క్రితం తన తండ్రి గతించే ముందు కొన్న ఆ అరెకరం అమ్మేద్దామా, ఇన్నేళ్ళుగా తన స్వార్థం అంటూ ౘూసుకోని భార్య మొట్టమొదటి సారిగా అడిగింది, అదీ ఎవఱినీ ఇబ్బంది పెట్ట-నిధీ, ఈ వయసు లో అందఱికీ సాధారణంగా ఉండే 'తీర్థయాత్ర' ల కాంక్ష, మేలు చేసేదే కదా, ఆ చెక్కనమ్మి తీర్చేద్దాం", అనుకోసాగాడు.
"అన్నము పెట్టు వరంబును
సున్నితంబౌ మనసున శోభిలు రైతే
మన్నన గోరక నొందిన
వెన్న మనస్కుడు ధరణిన! వినుమో మనసా. "
పద్యం వినపడింది, మళ్ళీ ఆ ప్రక్కింటి కిటికీ లో నుంచీ నే.
ఏ విషయానికీ ఇంత సందిగ్ధత అవసరం రాని విశ్వానికి ఇప్పుడు ఈ పద్యం ఆ సంకటం తెచ్చింది, "భార్య భక్తిపూర్వక కాంక్ష నా, భూమి తల్లి పరిరక్షణనా!?".
మొదటి పద్యానికి ఆ సరికే తన ఆలోచనా సరళి దిశను మార్చుకుని, 'ఏ యాత్రా వద్దం'టూ, చేతిలో ౘల్లటి మజ్జిగ లోటూనూ, మనసు లో నుంచీ ఈ మాటనూ అందించింది.
ఆ సరికి పిల్లలు ఆహ్లాద, ప్రహ్లాద్ లు ఫోన్ చేసారు, వీళ్ళని తీర్థయాత్రలకు తీసుకుని వెళ్తామని వీళ్ళ వీధి ఎదర వీధి నాగరాౙు మామయ్య చెప్పటంతో ఊళ్ళో చాలామంది వెళుతున్నారు కనుక వీళ్ళనీ వెళ్ళమని చెప్దామని ఫోన్ చేసా" మన్నారు. పైకం గుఱించి ఆలోచింౘ వద్దంటూ, 'తాము మనస్ఫూర్తిగా సర్దుతామని' చెప్పారు.
"పిల్లల డబ్బు వద్ద"ని వీళ్ళు సున్నితంగా తిరస్కరిస్తే,
" తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
సంతసంబునెట్లు సాగగలడు!
పేర్మి తోడ తమ పెన్నిధిలను ౙూౘు
వరము మాకొసగుమ! వలదు యనక!"
అంటూ పద్యం ౘదివి వినిపించి, తమ పెద్దలను ౘూసుకునే అవకాశం ఇమ్మని కోరారు.
సంతోషంగా ఒప్పుకున్నారు సరళా దేవి, విశ్వంలు.
ఇలా, సాహిత్యం అడుగడుగునా మన జీవితంలో మన నడవడికను నిర్దేశిస్తూ/ సలహాలనిస్తూ, దారి ౘూపిస్తూ ఆదుకుంటుందని, పద్య, సామెత, జాతీయ, నానుడుల రూపంలో అవి మనకు అనునిత్యం తోడుంటాయి కనుక, మాతృభాష అయిన మన తీయని తేట తెనుఁగు భాషని వదలవద్దని వాగ్దేవి సూచనను ఆ పై అందఱకూ నేర్పుతూ ఆనందంగా జీవించారు ఆ కుటుంబం కలకాలం.




No comments:
Post a Comment