దోమాయణం
ప్రతాప వేంకట సుబ్బారాయుడు
కాసేపు పుస్తకం చదివి, ఇవాళన్నా హాయిగా నిద్రపోదామని బెడ్ రూంలోకి వచ్చాను.
బెడ్ రూం మెత్తటి పరుపులు పరచిన డబల్ కాట్స్ తో విశాలంగా ఉంది. గోడలు పేల్ బ్లూ కలర్ తో ఉన్నాయి, అక్కడక్కడా రవివర్మ తైలవర్ణ చిత్రాలు వేళాడదీశాను. అసలు ఇంత చక్కటి ఐసొలెటెడ్ బెడ్రూం చూసే ఈ ఇంట్లోకి వచ్చేద్దామని టెంప్ట్ అయ్యాను. ఏసీ ఆన్లో ఉండడం వల్ల హాయిగా ఉంది. ఎయిర్ ఫ్రెష్నర్ స్ప్రే చేయడం వల్ల రూమంతా సుగంధభరితంగా ఉంది.
మంచం మీద శరీరం వాలంగానే కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రలోకి జారుకోబోతుండగా..జుం శబ్దంతో..ముఖం మీద ల్యాండ్ అయి కుట్టసాగిందో దోమ. ద బ్లడీ మస్క్యుటో! తర్వాత శరీరం మీద ఎక్కడెక్కడో వాలి కుడుతున్న దాన్ని కొట్టి చంపాలని ప్రయత్నిస్తూ నన్ను నేనే నొప్పెట్టేలా కొట్టుకున్నా.
మరుసటిరోజు అద్దంలో చూసుకుంటే ముఖం మీద నాలుగైదు దద్దుర్లు. ఎర్రటి కళ్లతో ఆఫీసుకు వెళ్ళాను.
సాయంత్రం వస్తూ మస్క్యుటో రిపెల్లెంట్ అగరబత్తీలు తెచ్చి బెడ్రూంలో వెలిగించి తలుపులు మూశాను. స్నానపానాదులు ముగించి నిద్రపోదామని బెడ్రూంలోకి వచ్చి మంచం మీద వాలాను. షరామామూలే. అది నా మీద దాడి మొదలెట్టింది. నేను పెట్టింది దేవుడి అగరబత్తీనా, దోమలను వెళ్లగొట్టేదా? అన్న అనుమానంతో ప్యాకెట్ చూశాను. అది దోమలను తరిమేదే. మరెందుకు ఇలా జరిగింది, ఒకవేళ డూప్లికేటా?
తర్వాతిరోజు అద్దంలో చూసుకుంటే ముఖం మీద మరో రెండు దద్దుర్లు యాడయ్యాయి. మరింత ఎర్రబారిన కళ్లతో ఆఫీసుకు వెళ్ళాను.
ఆఫీసు నుంచి వస్తూ మస్క్యుటో రిపెల్లెంట్ ఎలెక్ట్రానిక్ గాడ్జెట్ తీసుకు వచ్చాను. అది రూంలో ఆన్ చేసి పెడితే దాన్నుంచి వచ్చే మనకు వినబడని శబ్ద తరంగాలకు దోమలు పారిపోతాయట, హ..హ్హా, ఇక దాని పని ఔట్!
రూంలో ఆ మెషిన్ ఆన్ చేసి పెట్టి, తొందరగా పనులన్నీ చేసుకుని నిద్రకు ఉపక్రమించాను. దోమకు నాకూ మళ్ళీ యుద్ధం మొదలైంది. గెలుపు దానిదేనన్నది ఆబ్వియస్ రిజల్ట్.
ముఖం మీద మరో రెండు దద్దుర్లు, మరింత ఎర్రబారిన కళ్లతో ఆఫీసుకు వెళ్ళాను.
ఆఫీసు నుండి వస్తూ మస్క్యుటో కిల్లర్ ఎలెక్ట్రిక్ బ్యాట్ తెచ్చాను.
మంచం మీద పడుకునే ముందు తలుపులేసి, బ్యాట్ తో దోమలని కొట్టడానికి రూమంతా పరుగులెత్తాను. దోమల్ని చంపినట్టుగా కాంతి, టప్..టప్ అన్న సౌండ్లు కొద్ది సేపు వచ్చి ఆగిపోయాయి. దోమల్ని చంపాక వచ్చిన మాడిన వాసన వల్ల రూంలో ఇర్రిటేటింగ్ గా ఉంది. అయినా, ఇంక దోమన్నది లేదన్న విజయ వీర గర్వంతో మంచంపై మేను వాల్చాను. మళ్ళీ మొదలైంది నామీద దోమ స్వైర విహారం. మళ్ళీ బ్యాట్ తీసుకుని వెంట పడ్డాను. అది మాత్రం బ్యాట్ కి పడలేదు. నన్ను పడుకోనివ్వలేదు.
యథాప్రకారం ముఖంపై దద్దుర్లు, చింత నిప్పుల్లాంటి కళ్లతో ఆఫీసుకు వెళ్ళాను.
అల్ట్రా వేవ్స్ తో పనిచేసే ఎలెక్ట్రిక్ గ్రిడ్ పరికరాన్ని తీసుకొచ్చి రూంలో వేళాడదీసాను. అందులోంచి వెలువడే నీలపు కాంతికి ఆకర్షింపబడి దోమలు..ప్లేట్ కు అతుక్కుని చచ్చిపోతాయట!
కిచెన్ లో అన్నం వండుకుని, తిని, బెడ్రూం లోకి వచ్చాను. కొన్ని దోమలు, పురుగులూ దానికి అతుక్కొని ఉన్నాయి. వాటిల్లో ఆ శాడిస్ట్ దోమ కూడా ఉండే ఉంటుంది, అప్రయత్నంగా పెదాలపై కసిగా నవ్వు మొలిచింది.
పరుపు మీద నడుం వాల్చాను. ‘జుం’ శబ్దమూ, దాంతోపాటు నా పోరాటమూ మొదలయ్యాయి.
ఆదివారం. చాయ్ తాగుదామని ఇంటి పక్కనే ఉండే బండి దగ్గరకి వెళ్లాను.
"సార్, ముఖం దద్దుర్లతో పీక్కుపోయి, ఉబ్బిన కళ్లతో అలా ఉందేంటండి?" అనుమానంగా అడిగాడు బండి వాడు. నేను గత నాలుగురోజులుగా దోమతో చేస్తున్న యుద్ధం, నిద్రకోసం పడుతున్న అగచాట్లు పూసగుచ్చాను.
అంతా విని నిట్టూర్చి, "అయ్యా, నేనొకటి చెబుతాను. మీరు కొట్టిపారేయకూడదు మరి. చాలాకాలం క్రితం అక్కడి స్థలంలో ఓ పెద్దాయన ఎంతో ఇష్టంగా ఆ ఇల్లు కట్టుకుని పిల్లాపాపల్తో గృహప్రవేశం చేశాడు. పిల్లలు పెరిగి పెద్దయి, తన బాధ్యతలు తీరాక ఆయన కన్నుమూశాడు. వాళ్లు ఆ ఇల్లమ్మి, తాము ఉద్యోగాలు చేసే చోట ఇళ్ళు కొనుక్కుని వెళ్లిపోయారు. ఆ ఇంట్లోకి ఎవరొచ్చినా, నిద్ర కరవుతో పట్టుమని పదిరోజులుండడం లేదు. దానిక్కారణం...ఆ పెద్దాయన ఆత్మ దోమను ఆవహించిందట. టైముకు పోయి ఉద్యోగం చేసుకునేటోళ్ళు, రాత్రి నిద్ర లేకపోతే ఎట్టయ్యా, బేగి ఖాలీ చేసి ఎళ్లిపో" అన్నాడు.
‘మనిషి ఆత్మ మానవ రూపంలోనే ట్రాన్స్ పరెంట్ గా తిరగడం సినిమాల్లో చూశాను. ఆత్మ దోమను ఆవహించడమేంటి? ఖర్మ కాకపోతే! బహుశా ఆయన బతికున్న రోజుల్లో ఈగ సినిమా చూసుంటాడు, అందుకే ఇలా వినూత్నమైన ఐడియా వచ్చుంటుంది. ‘అసలు అలాంటి దిక్కుమాలిన దోమలుంటాయా? ఈ కాలంలో ఆత్మలు ఆవహించడమేంటి, నాన్సెన్స్’ లాంటి ఛానల్ టీవీ చర్చలు నాకనవసరం. ఒక్క రూం దొరికినా వెంటనే ఇల్లు ఖాలీ చేసి, రాత్రికి హాయిగా నిద్రపోవాలి.’ అనుకుంటూ అలా లుంగీమీదే ఇళ్ల వేటకి బయల్దేరాను.
***




No comments:
Post a Comment