దివ్యజ్యోతి (పెద్ద కథ ) - 2
రోజా రమణి
గతం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నిశ్చేష్టురాలై ఒక మూలగా నిల్చుని తదేకంగా తనవైపే చూస్తున్న రంగమ్మపై జ్యోతి దృష్టి పడింది. జ్యోతి ఒక్కక్షణం నివ్వెరపోయి చూసింది. పక్కనే మాసిన నిక్కరు, చొక్కా వేసుకున్న తమ్ముడిని చూసింది. ఇంతలో ఒక్కసారిగా జన సమూహం ఎక్కువ అవటంతో.. "మేడమ్, మేడమ్" అంటూ కాస్త గట్టిగా పిలుస్తున్న బోడీగార్డ్ వైపు చూసింది. " మేడమ్ మనం వెళ్ళాలి ఇంకా ఉంటే తొక్కిసలాట జరిగే ప్రమాదముంది. పదండి, పదండి" అంటూ కార్ డోర్ తీసి నిలబడ్డాడు. చేసేదేం లేక, కార్ లో ఎక్కి కూర్చుంది జ్యోతి.
"చూశావా! విక్రమ్! 'అక్క' మనల్ని చూసి కూడా చూసీచూడనట్టు ఎలా వెళ్ళిపోయిందో! ఎంత స్వార్థపరురాలు. మనం ఎలా పోయినా పరవాలేదనుకుని తన దారి తను చూసుకుంది. అందుకే నేను రానన్నాను.నాకు దాని సంగతి ఇదివరకే అర్థమయ్యింది" అంది రంగమ్మ, ఇదివరలో బీడీ ఫ్యాక్టరీలో చేసిన తన శ్రమనంతా తల్లికే అప్పగించిన జ్యోతిని నిందిస్తూ..
గేట్ తీసిన వాచ్మాన్ ను దాటుకుంటూ 'జ్యోతి కార్' తన ఇంటిముందు పోర్టుకోలో ఆగింది. కార్ దిగి గబాగబా తన ఇంటివైపు నడిచింది. తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుని మంచంపై బోరిగిల్లా పడుకుని సన్నగా కన్నీరు పెట్టుకుంది. తనకు అమ్మ, తమ్ముడు గురించి ఆలోచన వచ్చింది. ఇల్లు విడిచివచ్చిన తరువాత ఒక్కసారి కూడా 'అమ్మ' నా గురించి అలోచించిందో లేదో! అసలు కనీసం ఎక్కడికెళ్లిందో ఏంటో! ఎవరికైనా చెప్పి వెతికిస్తే బావుండు అనైనా అనుకుందో.. లేదా ఇల్లు వదలి వచ్చేశానని నాద్వారా తనకు రావలసిన మొత్తం తనకు రాలేదని తిట్టుకుందో! ఛీ, ఛీ అలా ఎందుకనుకుంటుంది. ఎంతైనా నా తల్లి తను నా తల్లి 'అని మళ్ళీ అనుకుంటూ ఇలా తనలో తానే సంఘర్షణ పడుతున్నప్పుడు గతం జ్ఞాపకం తలుపు తట్టింది.
అర్థరాత్రి, కట్టుకున్న బట్టలతో ఇల్లు విడిచిపెట్టిన జ్యోతి నెమ్మదిగా పక్క ఊరి రైల్వేస్టేషన్ కు చేరుకుంది. సరిగ్గా తెల్లవారుఝామున 4 గంటలకు ఓ ట్రైన్ వచ్చింది. ఏ మాత్రం ఆలోచించకుండా గభాలున ఆ ట్రైన్ ఎక్కేసింది. బెరుకు బెరుకుగా ఒక సీట్ లో కూర్చుంది. అక్కడ పొడుగాటి సీట్లు ఉన్నాయి. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని ఉన్నారు. "ఏయ్ అమ్మాయ్ టికెట్ చూపించు అంటూ TC గర్జించాడు." ఆ అరుపుకి జ్యోతి గజగజా వణికిపోయింది.
ట్రైన్ ఎక్కడం ఇదే మొదటి సారి. అనుకోకుండా రిజర్వుడ్ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కేసింది. TC కి తనకు మధ్యన జరుగుతున్న సంభాషనను గమనించిన ఒకావిడ TC కి కొంత డబ్బులు ముట్టజెప్పి, నచ్చజెప్పి పంపించింది. ముడుచుకు కూర్చుని బిక్కు బిక్కు మంటూ చూస్తున్న జ్యోతి వాలకం గమనించిన ఆవిడ సమయం చూసి మెల్లిగా జ్యోతితో మాటలు కలిపింది. జ్యోతి మాటలు విన్నాక "జ్యోతి" పారిపోయి వచ్చిందని, ఆమెకు అర్థమయ్యింది.
"చెన్నైలో ఎవరన్నా తెలిసిన వాళ్ళున్నారా?"
"లేరండీ!"
"మారెలా? ఎక్కడికి వెళ్దామనుకుంటున్నావ్?"
"నాకు తెలీదు,ఆ భగవంతుని మీద భారం వేసి ట్రైన్ ఎక్కేశాను . ఎక్కడో ఒకచోట ఏదైనా పని దొరకితే చేసుకుంటానని"
"సరే అయితే నాతో వస్తావా! మా ఇల్లు చాలా పెద్దది. పని వాళ్ళు కూడా సరిగ్గా దొరకటం లేదు. నీకు ఏదైనా పని దొరికినంతవరకు నాతోనే వుందువు గాని. పని దొరికాక వెళ్లిపోదువుగాని " అని చెప్పింది.
ఆవిడ మీద నమ్మకం కలిగిన జ్యోతి " సరే మేడమ్" అంది.
తనతో పాటు ఆమె ఇంటికి వెళ్ళింది. అక్కడ ఇంటి పనులు చేస్తూ.. రోజులు గడుపుతోంది. ఆ ఇంటావిడ పేరు అనసూయమ్మ. ఆమె చాలా డబ్బున్న మనిషి. పెద్ద పెద్ద వారితో వ్యవహారాలు, ఇంటికి వచ్చి పోయే వారు ఎక్కువమందే.. జ్యోతి అంటే ఆమెకు చాలా అభిమానం. జ్యోతికి పెద్ద పెద్ద ఇండ్లలో పని ఎలా చెయ్యాలో, పెద్ద వారు వచ్చినప్పుడు వారిని ఎలా గౌరవించాలో , ఇటువంటి విషయాలను చక్కగా అభిమానపూర్వకంగా చెప్పేది. సంఘంతో ఎలా మెసలాలి అనే విషయాలను కూడా చెప్తూ ఉండేది.
ఒక రోజు ఆ ఇంటికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. పొడుగ్గా, సన్నగా టక్ చేసుకుని ఉన్నాడు.దాదాపు 30 సంవత్సరాలు ఉంటాయి అతనికి.
"జ్యోతీ! 'కృష్ణారావు' గారు వచ్చారు. కూల్ డ్రింక్ తీసుకొనిరా!" అని పిలిచింది అనసూయమ్మ.
జ్యోతి ఒక అందమైన గాజు గ్లాస్ లో కూల్ డ్రింక్ పోసి దానిని అందమైన ట్రే లో పెట్టి తీసుకొచ్చి కృష్ణారావుకు ఇచ్చింది.
"ఎవరీ అమ్మాయ్? కొత్తగా కనిపిస్తోంది" అడిగాడు కృష్ణారావు.
"కొత్తగా వచ్చింది. తెలిసిన వాళ్ళ అమ్మాయి. వచ్చి రెండు మూడు నెలలయ్యింది. "ఈ అమ్మాయికి ఏదైనా పని ఉంటే కాస్త చూసిపెట్టండి " అంది అనసూయమ్మ. " "ఏమైనా చదువుకుందా?"
" 10 వ తరగతి వారుకూ చదువుకుంది. కాస్త వీలు చూసుకుని దూరవిద్య ద్వారా మళ్ళీ చదువుకుంటానంటోంది.ఈ లోపు ఏదైనా చిన్న ఉద్యోగం అయినా చేస్తానంటోంది. అందుకని మీరైతే నమ్మకస్తులని మీకు చెబుతున్నాను " అన్నారు అనసూయమ్మగారు.
"దానికేం ! ఏదైనా మంచి అవకాశం ఉంటే తప్పక చెబుతాను" అన్నాడు కృష్ణారావు.
కొన్ని రోజుల తరువాత అనసూయమ్మగారికి ఫోన్ వచ్చింది.
"నేను కృష్ణారావుని. సినిమా సెట్లో క్లర్క్ పనిచెయ్యటానికి మనుషికావాలి. మీరు జ్యోతిని పంపుతారా"?
"దానికేం! అలాగే పంపిస్తాను ఎప్పటినుంచి పంపించాలి?"
రేపటినుంచి పంపించండి. ఉదయాన్నే ఆరింటికి మా వాన్ వస్తుంది అందులో ఎక్కితే ఇక్కడ దింపుతారు " చెప్పాడు కృష్ణారావు.
"అలాగే" అన్నారు అనసూయమ్మగారు.
అతను సినిమాలకు సైడ్ డాన్సర్ లను, పని వాళ్ళను సప్లై, చేస్తుంటాడట. నాకు అప్పుడే తెలిసింది. 'సినిమా అంటే నాకు భయం. అయినాచేసేదేముంది.అనసూయమ్మగారు పంపిస్తానని మాటిచ్చాక, వెళ్లాల్సిందే' అని మనసులో అనుకుంది జ్యోతి. అనసూయమ్మగారి మీద తనకున్న గౌరవాభిమానాలతో.
తనను అన్నిరకాలుగా ఆదరించి, అన్నంపెట్టిన అమ్మ అనసూయమ్మగారు. అందుకే జ్యోతికి ఆవిడంటే గౌరవం అభిమానం.
మరుసటి రోజు నుంచి పనిలోకి వెళ్ళటం ప్రారంభించింది. ఒక రోజు అనుకోకుండా ఒక సైడ్ డాన్సర్ తక్కువ అయ్యారు. వెంటనే అక్కడ డైరెక్టర్ జ్యోతిని చూసి "ఈ అమ్మాయ్ బాగానే ఉంది. కొన్ని స్టెప్స్ నేర్పించి చూడండి. Ok అంటే పెట్టేదాం. మనకు అట్టే సమయం కూడా లేదు" అని డైరెక్టర్ టీమ్ తో చెప్పాడు.
అనుకోకుండా జ్యోతి డాన్స్ బాగా చెయ్యటమే కాకుండా హావభావాలు కూడా చక్కగా పలికించింది. అలా సైడ్ డాన్సర్ గా కూడా జ్యోతి కొన్ని రోజులు కొనసాగింది. ఒక రోజు హీరోయిన్ రావటం లేటయ్యింది . దానితో హీరోయిన్ కి డైరెక్టర్ కి మధ్య ఒక యుద్ధమే జరిగింది. హీరోయిన్ సినిమా చెయ్యనని వెళ్ళిపోయింది. వెంటనే డైరెక్టర్ దృష్టి జ్యోతిపై పడింది.
"అమ్మాయ్ జ్యోతి ఇలారా!"
"ఈ అమ్మాయ్ కి స్క్రీన్ టెస్ట్, మేకప్ టెస్ట్ చెయ్యండి" అని
టీమ్ ని ఆజ్ఞాపించాడు. చకచకా అన్నీ జరిగిపోయాయి. అన్ని టెస్ట్లు ok అయిన జ్యోతి "దివ్యజ్యోతి" గా వెండితెరపై అరంగేట్రం చేసింది. ఇప్పుడు ఆమె సాధారణమైన జ్యోతి కాదు. "సహజనటి దివ్యజ్యోతి"
అతి తక్కువ పారితోషకంతో వెండితెరపై అరంగేట్రం చేసిన ఆమె తరువాతి కాలంలో.. నాట్యంతో పాటు ఇంగ్లీష్, హిందీలు కూడా శిక్షణలో భాగంగా నేర్చుకుంది. మొదటి సినిమా తరువాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. 2 సంవత్సరాలలో మూడు, నాలుగు సినిమాలలో నటించి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఆమె నటనకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. ధియేటర్ లన్నీ చప్పట్లతో
మారుమోగుతున్నాయి. చాలా కార్యక్రమాలకు కూడ ప్రత్యేక అతిథిగా వెళుతున్న జ్యోతి ఈ రోజు తన సొంత ఊరు పక్కన ఉన్న "రాయవరం" అనే చిన్న పట్టణానికి పేరు మోసిన 'గోల్డ్ జ్వెల్లరి షాప్ ఓపెనింగ్' కి ప్రత్యేక అతిథిగా వచ్చింది. అనుకోకుండా ఆ సందర్బంలో తనతల్లిని తమ్ముడిని చూసింది.
***
 

 



 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment