అమెరికా నుంచి అమలాపురానికి - అచ్చంగా తెలుగు

అమెరికా నుంచి అమలాపురానికి

Share This

 అమెరికా నుంచి అమలాపురానికి

డాక్టర్ . బీ. యన్. వీ. పార్ధసారధి




రేవంత్ పై చదువులకి హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళాడు. తల్లిదండ్రులు అతి కష్టం మీద బ్యాంకు లో అప్పు చేసి రేవంత్ ని  అమెరికా పంపించారు. రేవంత్ చెల్లి చాందిని అతనికన్నా ఆరేళ్ళు చిన్న. చాందిని కాలీజీ కి వచ్చే సరికి రేవంత్ అమెరికాలో చదువు ముగించి ఉద్యోగం లో స్థిరపడతాడు అని అతని తల్లిదండ్రులు ధైర్యం చేసి బ్యాంకు లోన్ తీసుకుని రేవంత్ ని అమెరికా పంపించారు. ఒక ఏడాది సజావుగానే గడిచింది. ఇంతలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్నట్టు , ట్రంప్ అధ్యక్షుడు అవటం రేవంత్ లాంటి చాలామంది  అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులని తీవ్ర ఇబ్బందులకి గురిచేసింది.

రేవంత్ తన తల్లిదండ్రులని ఎక్కువగా ఆర్ధికంగా ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి అమెరికాలో యూనివర్సిటీ లో క్లాసులు ముగిసాక రోజుకి ఆరు గంటలు ఒక హోటల్ లో పనిచేసేవాడు. గంటకి ఏడు డాలర్లు ఇచ్చేవారు. అమెరికా స్టూడెంట్ వీసా రూల్స్ ప్రకారం విదేశాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్ధులు వారానికి ఇరవై గంటలు వరకు పార్ట్ టైం ఉద్యోగాలు చేయవచ్చు. యూనివర్సిటీ శలవల్లో అయితే ఎన్నిగంటలయినా పనిచేయవచ్చు. ఈ నిబంధనలని ఉల్లంహించిన విద్యార్ధులని దేశం నుంచి బహిష్కరించి వాళ్ళని వారి స్వదేశాలకి తిరిగి పంపిస్తారు. ఈ నిబంధనలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ వాటిని కఠినం గా అమలు పరచలేదు. కానీ ట్రంప్ రెండవ సారి అధ్యక్షుడు అయ్యాక ఈ నిబంధనల అమలు తీవ్రతరం దాల్చింది. దానితో యూనివర్సిటీ లో చదువుకుంటూ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే విద్యార్ధులు అందులో ముఖ్యంగా భారతీయ విద్యార్ధులు బాగా ఇబ్బందికి గురయ్యారు. వాళ్లకి పార్ట్ టైం ఉద్యోగాలు దొరకటం కూడా కష్టంగా మారింది. ఈ నేపధ్యంలో రేవంత్  మధ్యలోనే చదువు మానేసి ఇండియా కి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. యూనివర్సిటీ వారి ద్వారా కావలసిన అనుమతులు అధికారికంగా  తీసుకుని హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు.

రేవంత్ ఇలా అమెరికాలో చదువు ఆపి అర్ధాంతరంగా ఇండియాకి తిరిగిరావటం అతని తల్లిదండ్రులకి సుతారమూ ఇష్టం లేదు. “ ఇప్పటికే  నాకోసం పాతిక  లక్షల అప్పు చేసారు. ఇంకా రెండేళ్ళు నేను అమెరికా లో వుంటే మీరు మరో పాతిక లక్షలు పైన నాకు అమెరికాకి పంపాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ మన భారతీయ విద్యార్ధులకి పార్ట్ టైం ఉద్యోగం దొరకం కూడా ఇప్పటి పరిస్థితుల్లో చాలా కష్టం గా వుంది. ఎలాగోఅలాగా కష్టపడి చదువు పూర్తి చేస్తే ఉద్యోగం వస్తుందన్న భరోసా లేదు. చివరికి నా చదువుకి చేసిన అప్పు వడ్డీ తో పాటు తడిపి మోపెడవుతుంది. ఆ అప్పెలా తీరుస్తాం ? చాందిని ని కాలీజీ చదువు ఎలా చదివిస్తాం ? ఇవన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. “ అన్నాడు రేవంత్.

ఒక వారం రోజులు గడిచాయి. రేవంత్ ఒక మధ్యాహ్నం ఇంటర్నెట్ కేఫ్ కి వెడుతుండగా దారిలో ఎవరో కొబ్బరి బోండాలు అమ్మే అతనితో బేరం ఆడుతున్నారు. “కాయ డెబ్భై రూపాయలా ? అరవై రూపాయలకి ఇయ్యి. రెండు బోండాలు తీసుకుంటాను. “ అంటున్నాడు కొనటానికి వచ్చిన వ్యక్తి. ససేమిరా కుదరదు అని కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తి అంటున్నాడు.

ఈ సంభాషణ విన్న రేవంత్ కి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. తన పని ముగించుకుని గబగబా ఇంటికి వచ్చాడు. అమలాపురం సమీపంలో రేవంత్ వాళ్ళ నాన్నకి అతని తండ్రి ద్వారా ఆస్తి పంపకంలో వచ్చిన కొబ్బరి తోట వుంది. హైదరాబాద్ కి ఉద్యోగ నిమిత్తం ఇరవై ఏళ్ల క్రితం వచ్చినప్పుడు  రేవంత్ తండ్రి తన వాటా కొబ్బరి తోట ని కూడా చూసుకోమని తన తమ్ముడు కి అప్పచెప్పాడు. ఈ ఇరవై ఏళ్లలో దాని మీద కాస్త ఆదాయం వస్తూనే వుంది.

సాయంత్రం తండ్రి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక రేవంత్ , “ నాన్నా ! మనం మన ఊళ్ళో కొబ్బరి బోండాలని మధ్య వర్తుల ప్రమేయం లేకుండా హైదరాబాద్ కి తీసుకువచ్చి దుకాణ దారులకి అమ్మగలిగితే మనకి కనీసం రెండింతల ఆదాయం వస్తుంది. “ అన్నాడు. తండ్రీ తనయుల చర్చలు మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి వచ్చాయి.

రెండు నెలల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రేవంత్ తమ తోట లోని కొబ్బరి బోండాలని , తమ బాబాయి తోట లోని కొబ్బరి బోండాలని హైదరాబాద్ కి లారీల ద్వారా తరలించి హైదరాబాద్ లోని దుకాణాలకి మధ్య వర్తుల ప్రమేయం లేకుండా అమ్ముతున్నాడు. దాని వల్ల అటు దుకాణ దారులకి, ఇటు రేవంత్ తండ్రికి, రేవంత్ బాబాయికి లాభదాయకం గా ఉంటోంది. ఇది చూసిన ఊర్లోని మిగతా వాళ్ళు కూడా మధ్య వర్తులని మానిపించి రేవంత్ వద్దకి వచ్చారు. రేవంత్ ఒక సహకార సంఘం స్థాపించి అందులో వారందరినీ సభ్యులుగా చేర్చాడు. ఇప్పుడు రేవంత్ ఆ సహకార సంఘాన్ని తమ ఊరి చుట్టుపక్కల విస్తరించి మరింత మందిని సభ్యులుగా చేర్చుకునే ప్రయత్నం లో వున్నాడు. బ్యాంకు లో తన అమెరికా చదువుకోసం చేసిన అప్పు ని ఇప్పుడు నెల నెలా తీరుస్తున్నాడు. తమ సహకార సంఘానికి రుణ సహాయం కోసం ప్రభుత్వ సంస్థ అయిన కోకోనట్ బోర్డు అఫ్ ఇండియా వారితో రేవంత్ సంప్రదింపులు జరుపుతున్నాడు.

ఇప్పుడు రేవంత్ కి వున్నవి రెండు లక్ష్యాలు. ఒకటి- నాలుగేళ్ళలో బ్యాంకు ఋణం పూర్తిగా తీర్చెయ్యటం. రెండు- అయిదేళ్ళలో కొబ్బరి బోండాలతో పాటు కొబ్బరి నుంచి ఉత్పత్తి అయ్యే ఇతర వస్తువులని కూడా తయారు చేసి మన దేశం లోనే కాకుండా విదేశాలకి ఎగుమతి చెయ్యటం.

***

   

No comments:

Post a Comment

Pages