'శ్రమ సౌందర్య ప్రగతి రథసారధులు..శ్రామికులు!'
--సుజాత.పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్.
చెమట చిందిన గాథల బలిమి..
తడిసిన దేహం నిప్పుల కొలిమి..
రక్తం మరిగే సలసల వేడిమి..
ఎర్రని నిప్పుల సూర్యుడి ముందు
శ్రమించే గుండెలు గర్జించాయి..
ఆకాశపుటంచున నిలిచిన మేడల
అందమైన రూపం వెనుక దాగున్న
శ్రమ సౌందర్యం విలువ ఎంతో చెప్పమని
నిలదీసే ప్రశ్నల వేడికి
అగ్నికణాల రుధిరవర్ణం
అరుణ కేతనమై రెపరెపలాడింది..
అలుపెరుగని ఆ చేతులు..
అలసిపో చేతల నడుమ
నిరంతరం సాగే శ్రమయజ్ఞ విక్షేపాలు నిదర్శనంగా నిలిచాయి.
గుండె పగిలినా బీటలు వారినా
పట్టు విడువని మొండి ధైర్యం ముందు
ప్రపంచమే తలవొంచక తప్పదలేదు..
నిండు మనసున్న
శ్రమజీవులకు నిలువ నీడలేదు
తడిసిన కన్నుల దుఃఖపు ఛారికల బాధ గుర్తించిన వారేలేరు..
తెగిన మబ్బుల చినుకులు రాలినా
తమ కన్నీటిని తుడుచుకోరెవ్వరూ..
ఆ సమయాన్ని కూడా శ్రమకే వినియోగించే నిస్వార్ధపరులు పాట్లమారులు..
మండుటెండను లెక్క చేయని కండలు
నింగిని తాకే మేడలు..
రహదారులకై రాళ్ళు ఎత్తిన
ఆ చేతులు
కడుపు నింపుకొనటానికెన్నడూ నోచుకోలేదు..
బడుగుజీవుల కాయకష్టం గుర్తించి,
శ్రమ దోపిడి సంకెళ్ళు తెంచిన చట్టం..
పని గంటల బరువు తగ్గించిన శాసనమే.. 'కార్మిక దినోత్సవం!'
అహర్నిశం శ్రమించే ఆ కష్ట జీవులు
సమాజపు ప్రగతికివారే రథసారధులు..
వారి స్వేదపు బలాన్ని
లోకానికి చాటిన
శ్రామిక నినాద గుండె చప్పుడే 'మే'డే!
***
No comments:
Post a Comment