పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -8 - అచ్చంగా తెలుగు

పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -8

Share This

                                  పంచపదులలో- శ్రీమద్రామాయణ కావ్యం -8

బాలకాండ

దినవహి సత్యవతి



        5 వ సర్గ 

అయోధ్యా నగర వర్ణన...  

115.

     పూర్వం, భూమి, అష్టాదశద్వీప పరిమితమైయుండెను, 

మనువువంటి సమర్థరాజుల వశములో యుండెను, 

వారి వంశములో సగరుడను చక్రవర్తి యుండెను, 

సగరుడు, సాగరం త్రవ్వింపనది వైశాల్యం పొందెను, 

సగరుడు ఇక్ష్వాకువంశానికి చెందిన గొప్పరాజు, సత్య! 

116.

     రామాయణం పవిత్ర ఆఖ్యానంగా ప్రసిద్ధిచెందినది, 

మహాత్ములైన ఇక్ష్వాకువంశములో పుట్టినది, 

రామాయణం లోకమంతా ప్రవర్తింపజేయదగినది, 

ధర్మార్థకామములనే పురుషార్థాలు తెలుపునది, 

రామాయణం అసూయలేకుండా వినదగిన కావ్యం, సత్య! 

117.

     సరయూనదీ తీరాన విశాల కోసలదేశముండె,  

ధనధాన్యాలతో తులతూగు ప్రజతో నిండియుండె,

అందులో సుప్రసిద్ధమైన అయోధ్యనగరియుండె, 

నాడు, మనువు సర్వమానవుల ప్రభువైయుండె,

మనువు, తన సంకల్పబలముచే అయోధ్య నిర్మించె, సత్య!  

118.

     అయోధ్యలో చక్కగా ఏర్పరుపబడిన మార్గాలుండె,  

నగరి, పండ్రెండు యోజనముల పొడవుయుండె,  

అయోధ్య, మూడు యోజనముల వెడల్పునయుండె, 

నగరి, చక్కని విశాలమౌ రాజమార్గాలతోయుండె,

అట్లు అయోధ్యనగరి శోభాయుతమై యుండెను, సత్య !

119.

     రాజమార్గం నిత్యము నీటితో తడపబడుచుండె, 

రాజమార్గముపై పుష్పములు చల్లబడుచుండె, 

అయోధ్య, దేవేంద్రుని స్వర్గము తలపించుచుండె,

సమర్థుడౌ దశరథుడు అయోధ్యనేలుచునుండె, 

అయోధ్యలోనతడు దేవేంద్రునివలె వసించుచుండె, సత్య! 

120.

    అయోధ్య వెలుపల ద్వారబంధాలు ధృఢమైనవి, 

అంగడి వీధులు మధ్యలో చక్కగా తీర్చియున్నవి, 

అంగళ్ళలో వివిధ యంత్రాలు నెలకొల్పబడినవి,

భిన్నమైన ఆయుధాలు కూడా నెలకొల్పబడినవి, 

అయోధ్యలో ఎందరో శిల్పులు నివసించుచుండిరి, సత్య! 

121.

      అయోధ్య సూతులు, మాగధుల గృహమైయుండెను, 

అత్యధిక  వృద్ధితో, శోభతో, ప్రకాశించుచుండెను, 

అందలి ధ్వజములు ఉన్నతముగ యుండెను, 

నగరిలోని కోటబురుజులు ఎత్తుగా యుండెను, 

వందల శతఘ్నులచటచట అమర్చబడియుండె, సత్య! 

122.

     అయోధ్యలో పలు నటీనట సంఘములుండెను, 

నగరి నలువైపులా శాఖా నగరములుండెను,  

ఉద్యానవనములు, మామిడితోపులు ఉండెను, 

నగరము చుట్టూ ఉన్నత ప్రాకారములుండెను,  

విశాల నగరికియవి వడ్డాణమువలె యుండెను, సత్య!  


123.

     అయోధ్య చుట్టూ అగాధమైన అగడ్తయుండెను, 

ప్రవేశింపనశక్యమై, శత్రుదుర్భేద్యమైయుండెను, 

గుఱ్రాలు, గోవులవంటి వాటితో నిండియుండెను,   

వివిధ దేశాల వ్యాపారస్తులతో నిండియుండెను,  

కప్పమీయ వచ్చిన సామంతరాజులతో నిండియుండె, సత్య! 

124.

      రాజగృహాలన్నీ రత్నాలతో అలంకృతమైయుండె,

క్రీడాపర్వతములతో ప్రకాశవంతమైయుండె,  

మేడలపై కట్టిన మేడలతో నగరి నిండియుండె, 

అత్యంతసౌందర్యంతో అయోధ్య శోభిల్లుచుండె,  

ఇంద్రరాజధాని అమరావతిని తలపించుచుండె, సత్య!  

125.

     జూదపు పీటవలె అగుపించు నగరము, 

సుందర స్త్రీలతో నిండియున్న నగరము, 

అన్ని విధములైన రత్నాలున్న నగరము, 

ఏడంతస్తుల భవనాలతో  వెలుగు నగరము, 

దట్టంగా ఇళ్ళు కట్టియున్న నగరము అయోధ్య, సత్య! 



No comments:

Post a Comment

Pages