క్రొత్తనీరు .(ఏడవ భాగం )
రచన :టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
ప్రణయ్ కి ఫోన్ చేశాడు మిత్ర.
"ప్రణయ్! కాస్త ఖాళీ చూసుకొని హైదరాబాద్ వస్తావా! ఒక ప్రాజెక్టు గురించి నీతో మాట్లాడాలి!"
"ప్రస్తుతం పొలం పనుల్లోఉన్నాను. ఒక పదిరోజుల తర్వాత వస్తాను!సరేనా!"
"సరే!సరే!"
ప్రణయ్ తను హైదరాబాద్ వస్తున్నట్లు సమీరకు ఫోన్ చేశాడు.
"నువ్వు వస్తే ఇంటికి రాకూడదూ!అమ్మా వాళ్ళను చూసినట్లుంటుంది!"
అడిగింది సమీర.
"చూద్దాం!మిత్రతో మాట్లాడి, నా పనులు చూసుకొని ఆ తర్వాత టైం ఉంటే వస్తాను!ఎలా ఉంది నీ కిచెన్?"
"పని వాళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉంది.ఎవరో ఒకరు మానేస్తున్నారు. ఇంకా ఇద్దరినీ ఎక్స్ట్రా పెట్టుకున్నాను.లేబర్ ప్రాబ్లం లేకపోతే బాగుండేది. మిత్రాని అడగాలి! రెగ్యులర్ గా వచ్చే వాళ్ళని ఎవరినైనా పంపిస్తాడేమోనని!..."
"మిత్రాని ముగ్గురం కలుద్దాం.!"
"సరే!మాళవిక,నేను వస్తాము!సేమ్ ప్లేస్ కి కాఫటేరియాకు..."
ప్రణయ్ రాక సమీరకు చాలా ఆనందంగా ఉంది.
మాళవికకు ఫోన్ చేసింది.మిత్ర ఇంతకుముందే విషయం చెప్పాడని చెప్పింది మాళవిక.
**** *** *** *** **** ****
మిత్రులు నలుగురు కాఫటేరియాలో ఒక మూల సమావేశమయ్యారు.
"విషయం ఏమిటో చెప్పు మిత్రా!"
అడిగాడు ప్రణయ్.
"ఈ మధ్య గార్డెన్ వెడ్డింగ్స్ బాగా జరుగుతున్నాయి.నీ పొలంలో ఇలాంటి వెడ్డింగ్ ఈ వెంట్స్ చేయడానికి వీలవుతుందా?"
మొదలు పెట్టాడు మిత్ర.
"పూర్తిగా చెప్పు మిత్రా!పొలంలో ఏమి చెయ్యాలి?"
అడిగాడు ప్రణయ్.
"అయితే వినండి!ఈ మధ్య పెళ్లిళ్లు క్రొత్త రకంగా చేసుకుందామని బాగా డబ్బులున్న వాళ్ళు రిసార్ట్లోనూ,గార్డెన్స్ లోనూ, ఫారెస్ట్ ఫార్మ్స్ లోనో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.గోవా లాంటి చోట్లకి వెళ్లి పెళ్లిళ్లు చేసుకొని రావటం ఎక్కువయింది. మనకు తోట ఒకటి ఉంటే దానిలో పెళ్లి మండపం వేసి ట్రెడిషనల్ మ్యారేజెస్ చేయవచ్చు!ప్లాస్టిక్ రహితంగా ఈవెంట్స్ అంటే పుట్టినరోజు పార్టీలు, పెళ్లి రోజు పార్టీలు కూడా ఇలా జరుగుతున్నాయి. మీకు పొలం ఉంది కాబట్టి వీటికి కొంత స్థలం కేటాయిస్తే నేను కొన్ని వెడ్డింగ్ ఈవెంట్స్ ని అక్కడ పెట్టుకోవచ్చు!పెళ్లిళ్లకు వచ్చిన బంధువులని చుట్టుప్రక్కల చూపించే ట్రావెల్ ప్యాకేజీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇది నా ప్లాను!....మనమందరం కలిసి చేసుకుందామని!.."
వివరించాడు మిత్ర.
"అయితే నేను నా మేనేజర్ తో ట్రావెల్స్ ప్యాకేజీ గురించి మాట్లాడగలను!"
అంది మాళవిక.
నవ్వాడు మిత్ర.
" మీ మేనేజర్ తో ఎందుకు మల్లీ!నువ్వే చేయలేవా చెప్పు!"
"నేను అంత సమర్థవంతంగా చేయలేనేమో మిత్రా!నేను కేవలం పాసింజర్స్ ని బుక్ చేస్తాను!అంతే!"
"చూడమ్మా!పుస్తకాలు పేపర్లు చదవడం మంచిదే!ఆ పుస్తకాల్లో మనం ఎందుకు రాయలేము?అని అనుకోవాలి!ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయడం చాలా మంచివిషయం..కానీ కంపెనీ పెట్టాలనుకోవడం గొప్ప విషయం కదా!స్వీట్లు, హాట్స్ కొనుక్కుని తింటారు అందరూ.వాటిని సక్సెస్ ఫుల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తోంది మన సమీర.అలా ఆలోచించు!"
మిత్ర మాటలకి నవ్వింది మాళవిక.
"అందరికీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి వచ్చినట్లు సక్సెస్ వస్తుందా? కంపెనీలు పెట్టడం సమర్థత లేక నష్టాలతో మూసేయటం!.... ఎన్నో స్టార్టప్ కంపెనీలు మునిగిపోవడం మనం రోజూ చూస్తున్నాము! అందరికీ ప్రోడక్ట్స్ ని సరిగ్గా మార్కెట్ చెయ్యటం రావాలి కదా! స్వంత బిజినెస్ అంటే రిస్క్ తో కూడుకున్నది. అందులో ట్రావెల్ ఏజన్సీ ని నడపటం అంత సులభం కాదు!..."
" అందుకే చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి!మరీ వర్రీ పడొద్దు మాళవికా!ఒకటి రెండుసార్లు మీ మేనేజర్ చేసేది చూచి నేర్చుకోవటానికి ప్రయత్నం చెయ్యి!... మొదట నేను కూడా వ్యవసాయంలోకి రావటానికి సందేహించాను. చివరకు ధైర్యం చేశాను!.. "
అన్నాడు ప్రణయ్.
" నా ప్రాబ్లం వినండి!పనివాళ్ళు ఒంట్లో బాగాలేదనో,ఇంట్లో పనుందనో సాకులు చెప్పి ఎక్కువ రోజులు మానేస్తున్నారు. వాళ్ళని మేనేజ్ చేయడం నాకు చాలా కష్టంగా ఉంది! పని వాళ్ళ మీద ఒక సూపర్వైజర్ కావాలి!... నేను ప్యాకింగ్,లెక్కలు,ఆర్డర్స్ చూసుకుంటున్నాను!.. నా కిచెన్ కు ఒక యాప్ క్రియేట్ చెయ్యాలనుకుంటున్నాను!"చెప్పింది సమీర.
"సమీరా మేడం! నేను ఎమ్మెస్ చేసి వచ్చాను!మీకు యాప్ తయారు చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాను!మీరు నాకు ఆజ్ఞాపించండి!సేవకుడు చేసిపెడతాడు!"
నవ్వుతూ అన్నాడు ప్రణయ్.
మిగిలిన మిత్రులు నవ్వారు.
"సమీరా! మా బంధువు ఒకాయన ఉన్నాడు.నాకు చిన్నాన్న వరుస అవుతాడు.అరవై ఏళ్ళు వచ్చాయి. పెద్దవాడయ్యాడని ఖాళీగా ఉన్నాడు. సూపర్వైజర్ గా వస్తాడేమో కనుక్కుంటాను!ఆయన పేరు కాశీపతి.కాస్త గట్టివాడు. వంటవాళ్ళను గదమాయించి పనిచేయిస్తాడు!"
భరోసా ఇచ్చాడు మిత్ర.
"నా దగ్గర ఉన్న పొలం ఐదు ఎకరాలు మాత్రమే! కొంత చందూ పొలం ఉంది.మీ వెడ్డింగ్స్ కి తోట కావాలి అంటే సమీర మావయ్య రామకృష్ణ బాబాయిని అడగాలి.! ఆయనకు ఐదెకరాల మామిడి తోట ఉంది.అందులో కొన్ని చెట్లు తీసేసి ఖాళీ చేయాలి! ... నేను ఊరు వెళ్ళాక బాబాయితో మాట్లాడుతాను!కానీ కళ్యాణమండపాలు తోటల్లో కట్టించడం వలన నేల పాడవుతుంది.. ఎలాగా అన్నదే సమస్య?.."
ఆగాడు ప్రణయ్.
" తోటలో కాంక్రీటు బిల్డింగ్ వద్దు ప్రణయ్!వెదురు,మట్టితో ఇప్పుడు స్ట్రాంగ్ గా కడుతున్నారు. వాన పడినా కూడా నీళ్లు లోపలికి రావు. సోలార్ ఎలక్ట్రిసిటీ పెట్టు!నేను దీని గురించి పూర్తి వివరాలు కనుక్కొని నీకు మెయిల్ చేస్తాను!"
"చూస్తాను మిత్రా!పొలాల దగ్గర కాంక్రీట్ నాకు ఇష్టం లేదు! నేను అమెరికాలో ఉన్నప్పుడు రాజమండ్రిలో ఒక వేయి గజాలు స్థలం కొన్నాను. ఆ లోన్ తీర్చేసాను. ప్రస్తుతం నాకు నష్టాలు లేవు..నెయ్యి,నూనె తయారు చేయడం వలన ప్రస్తుతం ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నాను.కానీ కళ్యాణమండపం అనేది కొద్దిగా పెద్ద ప్రాజెక్టు.. ఎంత అవుతుందో చూసి అడుగు వేద్దాం! ముందు తోట దొరకాలి కదా!"
నీ ప్రయత్నం నువ్వు చెయ్యి!వివరాలు నేను కొనుక్కుంటాను!"
మిత్ర చేయి చాచాడు.మిగిలిన మిత్రులు మిత్ర చేతి మీద చేయి వేశారు.
సమావేశం ముగిసింది.
** ** ** *** *** **** **** **
ఆరోజు సాయంత్రం ప్రణయ్, మిత్ర, మాళవికలు ఇంటికి వస్తున్నారని పద్మకు మెసేజ్ పెట్టింది సమీర. రఘురామ్ అప్పటికే ఆఫీసు నుండి వచ్చి ఉన్నాడు.
మిత్రులను తీసుకొని మొదట కిచెన్ కి వచ్చింది సమీర. సమీర పనితనం చూసి బాగుందని మెచ్చుకున్నారు మిత్రులు. అక్కడి నుండి సమీర ఇంటికి వచ్చారు అందరూ. రఘురామ్ , పద్మలకు మాళవిక,మిత్రలు ముందు నుండి తెలిసిన వాళ్ళు. తల్లిదండ్రులకు ప్రణయ్ ని పరిచయం చేసింది సమీర.
తన స్నేహితురాలు సరస్వతి కొడుకు ప్రణయ్ అని తెలియడంతో అందరి గురించి అడిగింది పద్మ.ఆమె అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం చెప్పాడు ప్రణయ్.కొంతసేపటికి మిత్రులు బయలు దేరారు. వాళ్లకు డబ్బాల్లో స్వీట్లు పెట్టి ఇచ్చి వీడ్కోలు పలికింది సమీర.
వాళ్లు అటు వెళ్లారు. లోపలికి వచ్చింది సమీర.
" సరస్వతి ఖర్మ!....దానికి పెళ్లయిన దగ్గర నుంచి కష్టాలే!...ఉమ్మడి కుటుంబం....జన్మంతా ఆర్థిక ఇబ్బందులు!...తీరా పిల్లలైనా ఎక్కి వచ్చి సుఖ పెడతారనుకుంటే వీడు ఎమ్మెస్ చదివి వ్యవసాయం చేస్తున్నాడూ!... తెలివి తక్కువ దద్దమ్మ!...అదృష్టం అందలం ఎక్కిస్తే ఇస్తే బుద్ధి బురదలోకి లాగిందట!... అలా ఉంది!ఇంక వీడి తమ్ముడి మెడిసిన్ చదువు ఎలా అఘోరిస్తుందో!.... అయినా ఈ కాలం పిల్లలకి మంచి చెప్తే వింటారా?......వాళ్ళ మొండితనం వాళ్ళది!...ఎక్కడిదాకా ఎందుకు?మన పిల్ల సంగతే అనుకోవాలి!..సంబంధాలు సంబంధాలు వచ్చిపోతున్నాయి!.. వయసా తక్కువ లేదు....పనికిమాలిన వంటలు చేసుకుంటూ కూర్చుంది!అంతా తలరాత!... "
వంటింట్లో గిన్నెలను డబడబా మోగిస్తూ అరుస్తోంది పద్మ.
" ఊరుకోమ్మా! ఎప్పుడు చూడు!ఒకటే నస!... చూడు నాన్న!అమ్మ... నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. "
అంటూ సమీర తండ్రికి ఫిర్యాదు చేసింది.
" రోజు ఉండేదేగా!అమ్మ మాటలు పట్టించుకోకు!"అంటూ చిన్నగా కూతురిని అనునయించాడు రఘురామ్.
ప్రణయ్ తమ ఇంటికి రావడంతో ఆనందంతో తేలిపోతోంది సమీర. రిలాక్సుడుగా టి. వి. చూస్తూ కూర్చుంది.
** ** ** ** ** ** **
ద్రాక్షారామం
సమీర పంపించిన స్వీట్లు తీసుకుని రామకృష్ణ ఇంటికి వచ్చాడు ప్రణయ్. స్వీట్ ముక్క ఒకటి నోట్లో పెట్టుకొని "
"బ్రహ్మాండంగా చేయిస్తోంది బంగారు తల్లి!..ఇక్కడ మాకు తెలిసిన వాళ్లకు కూడా స్వీట్లు పంపించమని చెప్పాను!"
అన్నాడు రామకృష్ణ.
" మీతో మీ మామిడి తోట గురించి మాట్లాడడానికి వచ్చాను బాబాయ్!"
"ఏమిటి విషయం? "
"మీ తోట కౌలుకు తీసుకుందామని!...దానిలో కొన్ని చెట్లు తీసేసి కళ్యాణమండపం కట్టిద్దామని!"
అంటూ విషయం అంతా వివరించాడు ప్రణయ్.
ప్రణయ్ చెప్పింది ఓపిగ్గా విన్నాడు రామకృష్ణ.
" బాగుంది కానీ నా పొలం రంగరాజుకు కౌలుకు ఇచ్చాను.అతడితో మాట్లాడాలి! ఎప్పటినుండో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే మాకు కౌలుదార్లు. వెడ్డింగ్ ఈవెంట్లో నీకు లాభం ఎంత వస్తుంది?సరిగ్గా చేసే వాళ్ళు కావాలి కదా!పూర్తిగా అవగాహన లేకుండా దిగటం కొంత నష్టాన్ని తెస్తుంది ఆలోచించు!"
" ఆలోచించాను బాబాయ్! కాంక్రీట్ బిల్డింగ్ కాదు...మట్టి, వెదురు ఉపయోగిస్తున్నాము! ఖర్చు తక్కువ!..ఇంకా సున్నం కూడా వేయొచ్చు!మన పూర్వీకులు మట్టితో కోటలే కట్టారు కదా! భూసారం క్షీణించకుండా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటాం! ఇంక లాభాల మాట అంటారా!ఎలాగో మామిడి తోట ఉంది..కాపు మీద కొంత వస్తుంది కదా!"
"అలా అన్ని సార్లు అనుకోలేము! ఈసారి ఏప్రిల్ నెలలో వానలు పడ్డాయి! మామిడి కాపు ముందే రాలిపోయింది.. నష్టం తప్ప లాభం రాలేదు. సాహసం అన్నిచోట్ల పనికిరాదు. నువ్వు నెమ్మదిగా అడుగువేయి!"
రామకృష్ణకు ఈ కుర్రవాడి పోకడ కొంచెం ఆశ్చర్యంగా ఉంది. యువతరం... తొందరపాటు ఎక్కువ..అనుభవరాహిత్యం!...డబ్బులు పోసి ఏదో కొత్త ప్రాజెక్టు అని మొదలు పెట్టడం.. అది సరిగ్గా నడపటం చేతకాక చతికిల పడటం!... ఎంత మందిని చూడడం లేదు...
"కల్యాణ మండపం గురించి అయితే నా ఫ్రెండ్ ఈవెంట్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నేను కొంచెం ధైర్యం చేస్తున్నాను!మీరు సపోర్ట్ ఇస్తే నాన్నతో కూడా మాట్లాడతాను!"
బ్రతిమిలాడుతున్నట్టుగా చెప్పాడు ప్రణయ్.
"సరే!సరే! రంగరాజుతో మాట్లాడి చెప్తాను!ముందు మీ నాన్నను ఒప్పించు!"
ఉత్సాహంగా వెళ్లాడు ప్రణయ్.
ప్రణయ్ వెళ్లిన వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు రామకృష్ణ.
' వీడు సమీరను హైదరాబాద్లో కలుస్తున్నాడు. ఇక్కడి పరిచయం హైదరాబాదులో కూడా కొనసాగుతోందా?.. ఎలాంటి పరిచయం అది?.'చిన్న ఊహ రామకృష్ణ మనసులో మెదిలింది.
''అబ్బెబ్బె!అలాంటిదేమీ ఉండదు!మహా మహా కంపెనీల్లో పనిచేసే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంబంధాలు ఊదేసింది సమీర. వీడొక గాలివాటం వెధవ! ...వీడి గురించి అస్సలు ఆలోచించదు.....నెత్తి మీద వజ్రాల కిరీటం పెట్టి, మహారాజని గుర్రం ఎక్కిచ్చినా వీడి తలకాయ చూస్తే ఆడపిల్లలు ఆమడదూరం పారిపోతారు! అసలు నాది పిచ్చి భ్రమ..'అని మనసులో అనుకున్నాడు రామకృష్ణ.
ఇంటికి వచ్చి తల్లికీ,తండ్రికీ విషయం చెప్పాడు ప్రణయ్.
సరస్వతి కొడుకు చెప్పింది విన్నది కానీ ఆమెకు అంతగా లోతుపాతులు తెలియవు...కొడుకు అమెరికా నుంచి వచ్చాడు...సంపాదిస్తున్నాడు. అప్పులు తీరుస్తున్నాడు.. ఏం చేసినా సమర్ధవంతంగా చేస్తున్నాడు.ఆమెకు అంతే తెలుసు.
"పొలం కౌలుకు తీసుకొని కళ్యాణమంటపం కట్టే కంటే ఇల్లు బాగుచేయించరాదూ!
కొంప చూడు! వాన వస్తే కారుతోంది.."అన్నాడు వరప్రసాదరావు.
"ఇప్పుడు ఇల్లు రిపేరు అని కదిలించుకుంటే ఇరవై లక్షలకు తక్కువ కాదు నాన్నా!నేను కొంత సెటిల్ అయ్యాక మెల్లగా చేస్తాను!"
" ఈ దైవాధీనం పనుల కంటే చక్కగా సాఫ్ట్ వేర్ జాబ్ చూసుకోరాదూ!కాయకష్టం చేసుకోవడం ఎందుకు?..లక్షల్లో జీతం వస్తుందిగా! హాయిగా ఉండొచ్చు!"
" నాకు అటువంటి జాబ్ సరిపడలేదు నాన్నా!ఇక్కడ నేను లక్షలు సంపాదించకపోవచ్చు!... ఇల్లు గడవడానికి సరిపోతుంది..ఒక రెండేళ్లు మనం సర్దుకుందాం!తర్వాత ఇల్లు బాగు చేయిస్తాను!.. కళ్యాణమంటపంతో నష్టాలు రావని మాత్రం మాట ఇస్తున్నాను! నేను అమెరికాలో ఉండి లక్షల సంపాదించి ఇక్కడికి పంపించలేదని మీ బాధ.. కానీ ఆలోచించండి! ఈరోజు ఆ పరాయి దేశంలో మన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తున్నారు.అక్కడ సేఫ్టీ అస్సలు లేదు నాన్నా!మనదేశంలో గంజినీళ్లు త్రాగినా నిశ్చింతగా ఉంటాం!..పరాయి దేశంలో బంగారం తిన్నా కూడా భద్రత లేక పోతే బ్రతకగలమా!"
ప్రణయ్ కంఠం రుద్దం అయింది.
అక్కడి నుండి లేచి మేడ పైకి వెళ్ళాడు.
" వాడి ఇష్టం!నేను చెప్పేది చెప్పాను!డబ్బుతో పని..జాగ్రత్తగా చేసుకోమను!అన్నాడు వరప్రసాదరావు చేసేదేమీ లేక.
సరస్వతి మేడ మీదకు వచ్చింది.
కళ్ళ మీద చేయి పెట్టుకొని ఉయ్యాల మీద పడుకుని ఉన్నాడు ప్రణయ్.కొడుకు తల మీద చెయ్యిపెట్టింది సరస్వతి.తల్లిని చూచి కొంచెం ప్రక్కకు జరిగాడు ప్రణయ్.ఆమె అతడి తలను తీసి ఒళ్ళో పెట్టుకుంది.
" నీ ఇష్టం నాన్నా!మీ నాన్నకు డబ్బు గురించి దిగులు అంతే!మళ్ళీ అప్పుల్లోకి సంసారం వెళ్తుందని భయం!..నీ మీద నమ్మకం లేక కాదు.. నువ్వు ఇక్కడే ఉండడం కంటే మాకు కావాల్సింది ఏముంది? చిన్నవాడు కూడా ఇక్కడికి వచ్చేస్తే నిశ్చింతగా ఉంటుంది. అక్కడ హాస్టలులో తినీ తినక ఎలా ఉన్నాడో వాడు.. "
"దిగులు పడకమ్మా!వాడు బాగానే ఉన్నాడు..అయినా ఇంకో సంవత్సరంలో వాడి చదువు అయిపోతుంది. వాడు కూడా ఇక్కడికే వచ్చేద్దామనుకుంటున్నాడు."
తల్లి చీరలో తల దాచుకున్నాడు ప్రణయ్. కాసేపు అయ్యాక
"సమీర చేసిన స్వీట్స్ ఎలా ఉన్నాయమ్మా? "అన్నాడు ప్రణయ్.
"చాలా బాగా చేసిందిరా!పిల్ల చాలా తెలివైనది.అంత బాగా వంటలు చేస్తుందని తెలియదు.ఈరోజు గుడిలో సమీర పంపించిన స్వీట్లు కొన్ని పంచి పెట్టాను. అబ్బో! అందరూ పిల్లని ఎంత మెచ్చుకున్నారో!పద్మత్త ఎలా ఉంది?.. చెప్పు!విషయాలేమిటి?"
"బాగుంది!బాగుంది!నిన్ను అడిగానని చెప్పమంది!"
సమీర ప్రసక్తి రావటంతో కాస్త తేలికపడ్డాడు ప్రణయ్. ఆరోజు భోజనం చేశాక సమీర పంపించిన స్వీట్లలో సగం పైగా ఖాళీ చేసేశాడు ప్రణయ్.
(సశేషం )
** ** ** ** ** ** ** *
No comments:
Post a Comment