భగవంతుని అనన్య చింతన - అచ్చంగా తెలుగు

భగవంతుని అనన్య చింతన

Share This

భగవంతుని అనన్య చింతన  

సి.హెచ్.ప్రతాప్



భగవద్గీత 8 వ అధ్యాయం, 8 వ శ్లోకం

శ్లో:    అభ్యాసయోగ యుక్తేన చేతసా నాన్యగామినా
                    పరమం పురుషం దివ్యం యాతి పార్ధానుచింతయన్

ఓ అర్జునా, మనస్సును ఎల్లప్పుడూ నా స్మరణ యందే నియుక్తం చేసి , ఏ మాత్రం మార్గం తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానం చేసేవారు తప్పక నన్ను అంతిమంగా చేరగలడని పై శ్లోకం భావం. భగవంతుని అనన్య చింతన చేస్తే ఆయనను చేరగలగడం అసాధ్యమేమీ కాదని పై శ్లోకం ద్వారా భగవానుడు మానవాళికి భరోసా ఇస్తున్నాడు.

ఈ కలియుగంలో ఇది ఒకింత కష్ట సాహ్యమేనని చెప్పవచ్చును ఎందుకంటే కలియుగం సమస్త దోషాలకు నిలయం, మానవుడు నిత్యం ఒక గమ్యం లేకుండా , కోరికల సాధనలో అవిశ్రాంతంగా పరుగులు తీస్తునే వుంటాడు. ఫలితంగా అంతులేని దుఖం, అశాంతి, ఆందోళనలను పోగు చేసుకునే వుంటుంటాడు. ఈ ప్రయాణంలో భగవంతుని చేరాలంటే మనస్సును అభ్యాసం చేత నియంత్రించి భగవంతుని పాదాల యందే దృష్టి కేందీకృతం అయ్యేలా చూసుకోవాలి.ఇందుకు ధృఢమైన సంకల్పం ఎంతో అవసరం.

భగవంతుని పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి వుండాలంటే కాస్తంత వైరాగ్యం కూడా అలవరచుకోవడం అవసరం . వైరాగ్యం అంటే కేవలం మనస్సు తప్పుడు దిశలో వెళ్ళటం లేదు అని. కానీ జీవితం అంటే ప్రతికూల పరిస్థితులను కేవలం నివారించటమే కాదు. శ్రేయస్కర విషయాలలో కూడా నిమగ్నమవ్వటమే జీవితం. నిజంగా కోరతగిన జీవిత లక్ష్యము  ప్రస్తుతం మనం జీవిస్తున్న పరిస్థితుల్లో గృహస్థాశ్రమంలో ఇలా కోరుకోగలగడం సాధ్యమేనా? అని అనిపిస్తుంది. అందుకే ఈ గృహస్థాశ్రమంలో ధర్మాచరణ, కర్తవ్యనిష్టతో ఉండి, అంతా పరమాత్మ సంకల్పమే అనే భావనతో ఉంటూ శరణాగతిని పాందాలి. అంతేకాదు నిత్యం ఎంతోకొంత సేపు ఆ భగవంతుని పై దృష్టి ఉంచి, అనుష్ఠాన కార్యక్రమాలు చేస్తుంటే భగవంతుడు మనలని కాపాడతాడుఅంటే దానిని భగవంతుని యొక్క చరణారవిందముల వద్ద అంకితం చేయటమే ఉత్తమ మార్గం.భౌతిక సుఖాలతోపాటు అనేక వికారాలను పొందే ఈ శరీరం, సంపదలు అన్నీ ఎప్పటికైనా నశించిపోయేవే. ఒక్క పరమాత్మ మాత్రమే శాశ్వతం. ‘పరమాత్మ కూడా తానే’ అన్న సత్యాన్ని తెలుసుకొనే గొప్ప అవకాశం మానవజన్మలోనే సాధ్యం. దీన్ని గ్రహించి, ప్రతి ఒక్కరూ పరమాత్మ పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. తన క్షేమం (మోక్షం) కోసం శరీరం నశించేలోపే ప్రయత్నించాలి. అందుకోసమే భగవంతుడిని ఆశ్రయించాలి. పరమాత్మను చేరడానికి భక్తి ఒక్కటే సులభ సాధనం అని వేదాంతులు చెబుతుంటారు.

క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు అన్న అపురూప జీవన సత్యాలను భగవద్గీతలో 8 వ అధ్యాయం అక్షరపరబ్రహ్మ యోగము లో భగవానుడు మానవాళికి ఇచ్చిన అమూల్యమైన సందేశం ఇమిడి వుంది.  

 

No comments:

Post a Comment

Pages