శతక సాహిత్యము - అచ్చంగా తెలుగు

 శతక సాహిత్యము

అంబడిపూడి శ్యామ సుందర రావు 


తెలుగు సాహిత్యములో శతక సాహిత్యానికి ప్రత్యేకతలు ఉన్నాయి వంద పద్యాలతో రచించే  సాహితి ప్రక్రియను శతకము అంటారు మన సాహిత్యం లో వేమన శతకము సుమతి శతకము వంటివి బాగా ప్రసిద్ధి చెందినవి. వేమన శతకం అంటే జీవత పాఠాలు నేర్పేది, సుమతి శతకం నీతి పద్యాల నిధి,లోకజ్ఞానాన్ని పెంచేది భాస్కర శతకము, సద్గుణాలు పెంచేది భాస్కర శతకం,సద్గుణాలు పెంచే దాశరథి శతకం, ధర్మనిరతిని పెంచే శ్రీ కాళహస్తీశ్వరా శతకము, కుమార శతకం, కుమారి శతకం, నరసింహ శతకం, శ్రీకృష్ణ శతకం. ఇలా తెలుగు వారికి సుపరిచితమైన శతకాలు ఎన్నో ఉన్నాయి. శతకాలలోని ప్రతి పద్యం ఒక లక్ష్యం తో ఉంటాయి ప్రాథమిక విద్య అభ్యసించే విద్యార్థుల చదువుల్లో  శతక పద్యాలూ అనర్గళం గా చెప్పగలగటం కొలబద్ద లాగా ఉండేది. పాఠ్య పుస్తకాలలో ప్రాధమిక తరగతుల నుండి పదవ తరగతి వరకు ఈ శతక (నీతి) పద్యాలు ఉండేవి విద్యార్థులు తప్పని సరిగా అభ్యసిస్తే  వారు నీతి మంతులు అవుతారు అన్నది యదార్ధము. సాధారణంగా కావ్యాలు, ఇతర సాహితి ప్రక్రియలు పండితులకు మాత్రమే పరిమితం, అంటే వారికి మాత్రమే అర్ధమయేవిగా ఉండేవి.అటువంటి దశలో వేమన శతకం సుమతి శతకం దాశరధి శతకం,భాస్కర శతకం లాంటి వచ్చి ప్రజాదరణ పొందుతూ తెలుగు నేలపై బాగా ప్రాచుర్యం లోకి వచ్చాయి ఇలా తెలుగులో శతక సాహిత్యం సామాన్యునికి- పండితునికి మధ్య వారధిగా నిలిచింది తెలుగు సాహిత్య ప్రక్రియలలో సామాన్య ప్రజలు కూడా చదివి అర్థం చేసుకోవడానికి వీలుగా ఉన్నవి శతకాలు. ఎంతో లోతైన భావాలను వాడుక భాషలోని పదాలతో చెప్పి, సామాన్యున్ని జ్ఞానిని చేయగలిగినవి శతకాలు. పద్యాల ద్వారా సమాజానికి నీతిని భోదించి, జ్ఞానాన్ని వికసింపజే యవచ్చని నిరూపించాయి మన తెలుగు శతక పద్యాలు.

పన్నెండవ శతాబ్దం లో ఈ శతకము రాసే విధానం మొదలైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు పాల్కురికి సోమన (సా.శ.1300) వృషాధిప శతకము మొట్టమొదటి సంపూర్ణ శతకము.సుమారు ఈ కాలము లోనే బద్దెన సుమతీ శతకము, యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వెలువడ్డాయి. ఈ శతకాలలో ఉన్న గొప్ప విశేషం జీవితాన్ని బతకాల్సిన విధానాన్ని సరళ మైన వ్యవహారిక భాషలో తెలియజెప్పడం. అందువల్ల ఈ శతకాలు బాగా ప్రాచుర్యాన్ని పొందాయి.శతకాలలోని నీతి సూత్రాలు అన్నికాలాలకు వర్తించేవిగా ఉంటాయి.అంటే రాసిన కాలానికి మాత్రమే కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కూడా ఉంటాయి. ఇది శతకకారుల ముందు చూపుకు నిదర్శనం.శతకాల్లోని పద్యాలు ఏ పద్యానికి ఆపద్యం తప్ప మరొక పద్యానికి సంబంధం ఉండదు కాబట్టి శతకాల్లోని పద్యాలను ముక్తకాలు అంటారు ఒక పద్యానికి మరో పద్యానికి చెప్పిన నీతి లేదా విషయం వేరు వేరుగా ఉంటుంది. అంటే శతకకారుడు సమాజాన్ని గమనిస్తూ తన స్వంత అనుభవాలను ఆలోచనలు తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఆ నీతులను పాటించాలని లేదా  జీవితంలో ఉపయోగించుకొని సన్మార్గంలో నడవాలని ఆశిస్తాడు.

శతకములు పురాణముల లాగా  కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల లాగా  వర్ణనా ప్రాధాన్యము గావు, గేయ కృతుల వలె సంగీత ప్రాధాన్యం  గావు, అయినప్పటికీ  తెలుగు నాట పండిత పామరులనే తేడా, పిల్లలు- పెద్దలు అనే తేడా లేకుండా , చదువురాని వారితో సహా అందరి లోనూ బహుళ ప్రచారం నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యము పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదని  నిస్సందేహముగా చెప్పవచ్చు".సజీవ స్రవంతి వలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తోంది శతకమే" అని శతక సాహిత్యం పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణారావు గారి అభిప్రాయం.భారతీయ భాషలలో దేనిలోనూ ఇంతటి బహుముఖ వికాసము  పొందిన ప్రక్రియ లేదని చెప్పవచ్చు.ఈ ఎనిమిది వందల ఏళ్లలో తెలుగు శతకం బాగా విస్తరించింది కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కన్నా ముందే ప్రారంభమైనా సంఖ్యా పరంగా తక్కువ ఆ విధంగా తెలుగు సాహిత్యములోశతక సాహిత్యం తన ప్రత్యేకతను చాటుకున్నది 

ఇంకా శతక లక్షణాలను తెలుసుకుందాము.1. మకుట నియమము :-  శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని మకుటము అంటారు ప్రతి పద్యంలో చివర నున్న సంబోధనా పదమే మకుటము.ఈ సంబోధన కూడా ఒకే రీతిగా ఉండాలి  మకుటమునకు వాడిన పదానికి సంబంధించిన పదానికి పర్యాయ పదములు గానీ, సమానార్థమైన పదములు గాని ఉండ కూడదు   ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనునది వేమన శతకమునకు మకుటము, అలాగే సుమతీ అనునది సుమతీ శతకమునకు మకుటము, అలాగే వేంకటేశ్వరా, దాశరథీ అనునవి ఇతర ఉదాహరణలు.

2. సంఖ్యా నియమము:-పేరును బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ శతకము లో నైనా వందకు తగ్గకుండా పద్యాలు ఉండాలి.తక్కువ లేదా ఎక్కువ ఉంటె వేరు వేరు పేర్లు ఉన్నాయి ఉదాహరణకు పది పద్యములుంటే  దశకము, ఇరవై ఐదు పద్యములతో నున్నదానిని పంచవిశంతి అనీ, ముప్పది రెండు పద్యములు గల దానికి రాగ సంఖ్య అనీ, మూడు వందల పద్యములున్నచో త్రిశతి అనీ వాటికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి 

3. వృత్త నియమము:-  శతకము లోని మకుట నియమాన్ని బట్టి వృత్త నియమము ఏర్పడింది.ఉదాహరణకు తొలి తెలుగు శతకము శ్రీ గిరి మల్లికార్జున శతకము ఈ శతకములో మకుటం శ్రీ గిరి మల్లికార్జునా కాబట్టి చంపకమాల,ఉత్పలమాల పద్యాలు తప్ప వేరే వృత్తములు ఇమడవు. అలాగే వేమన పద్యాలలో మకుటం విశ్వదాభి రామ వినుర వేమా ఇందులో ఆటవెలది తప్ప మరొకటి ఉండే అవకాశం లేదు.కాబట్టి శతకం లోని ప్రతి పద్యం ఒకే వృత్తంలో ఉండాలి అని నియమము ఏర్పడింది. 

4.రస నియమము :- శతకము లోని పద్యాలు ఏ రసానికి ప్రాధాన్యత ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకొని పద్యాలనూ ఆ విధంగా రచన చేస్తారు ఉదాహరణకు భక్తి రస ప్రధానమైన శతకములో ఇతర రసాలకు తావు ఉండదు.ఆ విధంగా భక్తి శతకం, శృంగార శతకం,నీతి శతకం  లాంటివి అనేకము  వచ్చాయి

5. భాష నియమము:- శతకము లన్ని సలక్షణమైన కావ్య భాషలో ఉంటాయి శతకాల్లోని భాష చాలామటుకు గ్రామ్యము. 

 తెలుగున శతక సాహిత్య ప్రక్రియకు ఆద్యులు శివ కవులే నని రూడిగా చెప్పవచ్చు.బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యం సంఘంలో ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిలో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వ వేత్త. అందరూ అనుకున్న దానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలిచిన మహానుభావుడు వేమన.

 ***


No comments:

Post a Comment

Pages