అండమానవుడు - అచ్చంగా తెలుగు
అండమానవుడు 

 పి.వి.ఆర్. శివ కుమార్ 
 

అమ్మాయి నవ్వింది. వెనక్కి తిరిగి చూసుకున్నాడు చిట్టితండ్రి. వెనకెవరూ కనబడలేదు. 
‘తనని చూసే నవ్వింది’ అని నిర్ధారణకు వచ్చాడు. తిరిగి నవ్వుదామనుకున్నాడు. అనుకునేలోపలే ఆమె తల తిప్పేసుకుంది. ఆమెని గుర్తుపట్టాడు, 
‘నిశ్చయంగా కొత్త బాస్ కూతురే. మొన్న డ్రైవర్ సెలవు పెడితే, స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆయన్ని ఆఫీస్ లో దింపినప్పుడు తను గమనించాడు. అప్పుడే ఆమె తనని చూసి ఉండచ్చు.’
ఆమెని అనుసరించి ఆ స్వీట్ షాప్ లోకి నడిచాడు. పలకరించటానికి ధైర్యం చాలలేదు. కొద్ది దూరంలో నిలబడి దీక్షగా స్వీట్ రాక్స్ మీద దృష్టి పెట్టాడు. ఆమె జీడిపప్పు పకోడీ, గుల్ల చేగోడీలు, పప్పు చెక్కలు, మిక్స్చర్  ప్యాకెట్ తీసుకుంది.  “బిల్ ఇవ్వండి” అంది.  “స్వీట్స్ ఏమీ వద్దా మేడం?”
“వద్దు. నాన్నగారికి హై డయాబెటిస్. కానీ, స్వీట్ వాసన చూస్తే వదల లేని బలహీనత. మేం తింటూ, తనకి పెట్టకపోతే తట్టుకోలేనంత కోపం. అందుకే, ఆయన ఉన్నప్పుడు ఇంట్లో అసలు స్వీట్ పేరే ఎత్తం. ఆ విధంగా ఆయనని ఎప్పుడూ స్వీట్స్ కి ఆమడ దూరం పెడతాం” నవ్వుతూ చెప్పిందామె. 
“షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా ఉన్నాయి మేడం.”
“ఫ్రీ గా ఇచ్చినా వద్దండీ, షుగర్ ఫ్రీ అయినా సరే, ఏ రకమైన తీపి కూడా ఆయనకి పడదు.” 
చమత్ ‘కారంగా’  తిరస్కరించేసింది.   
‘ఓహో...’ మనసులోనే తలెగరేశాడు  చిట్టితండ్రి. ‘అనుకోకుండా కొత్త బాస్ గురించి ఒక ముఖ్యమైన ఆంతరంగిక విషయం తెలిసింది.’ అతడి మనసేదో తెలియని ఆనందంతో ఉప్పొంగిపోయింది. 
ఆమె బిల్లు చెల్లించి వెళ్లిపోతూ, అతడిని చూసి మళ్ళీ చిరునవ్వు నవ్వింది,
ఈ సారి చిట్టితండ్రి తెగించి, చిరునవ్వు బదులిచ్చేశాడు. 
“మీరు మా డాడ్ ఆఫీస్ లోనే కదూ.” పలకరింపుగా అంది. 
చిట్టితండ్రి తబ్బిబ్బయ్యాడు, “మీరాయన కూతురే కదూ, థాంక్స్.” అనేశాడు.  
థాంక్స్ ఎందుకు చెప్పాడో అర్థం కాని ఆమె అతడికేసి వింతగా చూసి, “ఔను. బై” అనేసి  వెళ్ళిపోయింది. 
***
నెల రోజుల తరవాత ఓ శుభోదయాన స్టాఫ్ లీడర్ సుందరం అనౌన్స్ చేశాడు, 
“పై గురువారం మన బాసు గారి పుట్టిన రోజు. 
మన ఆఫీసులో చార్జ్ తీసుకున్నప్పటి నుంచీ, ఆయన ఎంత రిజర్వుడ్ ఉంటున్నారో చూస్తున్నారుకదా! 
ఇది ఆయన యాభయ్యవ బర్త్ యానివర్సరీ అని ఆఫీస్ రరికార్డులలోంచి కనుక్కున్నాను.
ఆయనని, ‘ఇది గోల్డెన్ జూబిలీ బర్త్ డే’ కనుక దయచేసి మా వేడుక కాదనవద్దనీ ఎంతో బలవంత పెట్టగా, అతి కష్టం మీద, సింపుల్ సెలబ్రేషన్ కి ఒప్పుకున్నారు, అదీ ఆఫీస్ టైమింగ్స్ లోనే, ఆఫీస్ పని చెడకుండా... ఇత్యాది నిబంధనలతో!! 
ఆయనకి అంతో ఇంతో దగ్గర కావటానికి, ఇది మనకి ఒక సువర్ణ అవకాశం. కాబట్టి, లంచ్ టైమ్ లోనే భారీగా కేక్ కటింగ్ పెడదాం. అ వెనకే చిన్న పార్టీ ఇద్దాం.” 
చెప్పటం పూర్తిచేసిన తరవాత, సుందరం అందరి దగ్గరా చందాలు వసూలు చేయటం మొదలు పెట్టాడు.
నెల రోజులుగా ఆఫీసులో అందరికీ కొత్త బాస్ తీరు తెలిసిపోయింది. ఎవరికీ చనువివ్వటం అటుంచి, దగ్గరకే రానివ్వటం లేదు. పియ్యే శ్రీమహాలక్ష్మికి కూడా, ఇంటర్ కామ్ లోనే డిక్టేషన్లూ – ఇన్స్ట్రక్షన్లూ గా సాగుతోంది వ్యవహారం! మొహం ఎప్పుడూ మొటమొట... మాట ఎప్పుడూ చిటపట...
‘త్వరలో మూడేళ్లు నిండి, స్థాన చలనం రోజులు రానున్నాయి. బాసుని ఎలాగైనా పట్టి, ఈసారైనా సొంత ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని ఆలోచిస్తుంటే, ఉరమని పిడుగులా దిగబడ్డాడు ఈ కొత్త బాసురుడు! ఇటువంటి బాసురుడిని, బాసుదేవుడిగా మార్చుకుని, వరం ఎలా పొందగలనా’ అని చిట్టితండ్రి మధన పడుతున్న వేళ 
కోరని వరమై వచ్చింది ఈ బంగారు జన్మదినోత్సవ  బంగారు అవకాశం! 
టికెట్ కొనని లాటరీలో లక్ష ప్రైజ్  తగిలినట్టు ఎగిరిగంతేశాడు చిట్టితండ్రి. కొత్త బాసుని కొంచెమన్నామంచి చేసుకుని, దగ్గరయ్యే మార్గం సుగమ మయిందనుకొన్నాడు. 
‘ఈ తీరుగ నను దయ జూచితివా దేవా!’ అనుకుంటూ దేవుడికి పాట నైవేద్యం కూడా సమర్పించేశాడు. 
‘ఎంతటి చిటపట రాయుడైనా, రేపు  తాను చూపే ప్రత్యేక శ్రద్దకి పడిపోకుండా నిలదొక్కుకోవటం మాత్రం ఆయన తరం కాదు.’ అనీ అనుకున్నాడు. 
సుందరంతో భేటీ వేశాడు. 
“చందా దండిగా ఇవ్వటమే కాదు, కిలో బరువుoడే  కేకు ఏర్పాటు కూడా, నా ఖర్చుతో నేనే చూసుకుంటాను. అలాగే పార్టీ ఐటమ్స్ ఆర్డర్ విషయం కూడా నాకు వదిలెయ్. ఐటమ్స్ బిల్ మాత్రం చందాల సొమ్ములో నుంచేలే!” అని బతిమాలి, సుందరాన్ని ఒప్పించాడు. 
సగం పని తప్పుతున్నందుకు, సుందరం సంతోషంగా ఒప్పుకున్నాడు. 
ఎదురు చూసిన గురువారం రానే వచ్చింది. ఒక్క పూటలో లంచ్ టైమ్ కూడా వచ్చేసింది. 
కేక్ కటింగ్ ఏర్పాట్లు మొదలయ్యాయి. కేకుతో సిద్ధమైపోయాడు చిట్టితండ్రి. 
కేటరింగ్ వాడు కూడా అన్నప్రకారం ఆఫీస్ లోని పాతిక మందికి పార్టీ ఐటమ్స్ తీసుకుని పన్నెండున్నరకే వచ్చేశాడు. 
అంతా మీటింగ్ హల్లో చేరారు. దగ్గరుండి బాసుని పిలుచుకు వచ్చాడు సుందరం. 
ఆర్భాటంగా కేకు బాక్స్ తెరిచాడు చిట్టితండ్రి. 
పెద్ద చాకొలెట్ కేక్. పైన బంగారం రంగులో మెరుస్తూ, డెజిగ్నేషన్ తో సహా బాసు పేరు, శుభాకాంక్షలతో అక్షరాలు. 
మధ్యలో సంగీతం పాడుతూ యాభై ఆకారపు కొవ్వొత్తి. 
అప్రయత్నంగా మందహాసం మెరిసింది బాస్ ధుమధుమల వదనం మీద!
‘శభాష్’ అనుకున్నాడు చిట్టితండ్రి. 
కేక్ కట్ చేశాడు బాస్. అంతా కోరస్ గా బర్త్ డే పాట పాడారు. చిట్టితండ్రి చొరవ చేసి, కేకు ముక్క బాస్ నోటికి అందించాడు. అదే మందహాసం కంటిన్యూ చేస్తూ, పెదాలతో కేకుముక్క అందుకున్న బాస్, కొద్దిగా చప్పరిస్తూనే మొహం వికారంగా పెట్టి, ఉమ్మేశాడు,
“ఏమైంది సార్?” కంగారుగా అడిగాడు సుందరం.
“ఇదేం కేక్? పైన చేదుగా ఉంది? లోపల చప్పగా గడ్డిలా ఉంది?” ఉద్రేకంగా అరిచాడు బాస్, “అందరూ కలిసి నన్ను ఫూల్ ని చేయాలనుకున్నారా?”  
సుందరంతో సహా అందరూ ఉలిక్కిపడ్డారు. కోరస్ గా కాళ్ళు వణికించారు. 
ఆ రియాక్షన్ ముందే ఊహించినట్టుగా, చెక్కు చెదరకుండా, చిద్విలాస్యంగా నవ్వాడు చిట్టితండ్రి, 
“మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, తదనుగుణంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని తయారు చేసిన కేకు సార్. 
మా బామ్మ దిబ్బరొట్టె  స్పెషలిస్ట్. ఎత్తుకెత్తు వెన్న వేసి, దోరగా కాల్చింది. మధ్యలో జీడి పప్పు, పిస్తా పప్పులు  కూడా ఉన్నాయి. ఆ దిబ్బరొట్టె మీద లాఘవంగా, దాసిన చెక్క పొడి కలిపిన కోకో పౌడర్ కోటింగ్ చేశాను. ఏ మాత్రం తీపి కలపలేదు. మీ డయాబెటిస్ ప్రాబ్లమ్ నాకు తెలుసు కదా!”
“నాకు డయబెటిసా? ఎవడ్రా నీకు చెప్పింది?”  పర్జన్యంలా గర్జించాడాయన. 
“కేక్ చూస్తే టెంప్ట్ అవుతారని తెలుసు. తీపి చూస్తే ఆగలేరని, పెట్టకపోతే కోపగిస్తారనీ కూడా తెలుసు సార్, అందుకే పార్టీ ఐటమ్స్ లో కూడా స్వీట్ అనేది లేకుండా జాగ్రత్త తీసుకున్నాను.” 
చిరునవ్వు చెదరకుండా చెప్పాడు చిట్టితండ్రి. 
చేతిలో ఉన్న కత్తిని చిట్టితండ్రి కేసి గురి చూసి విసిరాడు బాస్. ప్లాస్టిక్ కత్తి గనుక బతికిపోయాడు చిట్టితండ్రి. ఎక్కడ తేడా కొట్టిందో తెలియలేదుగానీ, వారం గడవకముందే వచ్చిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూసుకుని  బావురుమంటూ బాసు గదిలోకి వెళ్ళాడు,  
“ అండమాన్ దీవుల్లో మన ఆఫీసు బ్రాంచి లేదుగదండీ?” అనడిగాడు, బెక్కుతూ. 
“నీకోసం పెట్టిస్తున్నాను. నువ్వే మనాఫీసు మొదటి అండమానవుడివి అక్కడ,” సురసుర చూస్తూ, కసిగా చెప్పాడు బాసుర్ సర్. 
“వెళ్ళు. జాయినింగ్ టైం కూడా ఇవ్వట్లేదు నీకు. రేపే బయల్దేరు. అద్దెకు తీసుకున్న పాత బిల్డింగ్లో బూజులు దులుపుకుని, పని మొదలు పెట్టు.” 
తెలుసుకున్న రహస్యంతో, తెలివిగా అమలుపరిచిన ప్రణాళికా అడ్డంగా అడ్డo తిరిగి, తనకు ‘అండo’ ఎందుకు మిగిల్చిందో అతడికి ప్రశ్నార్ధకమే అయింది. 
అతడిని బాధిస్తున్న ప్రశ్నా, అతడికి తెలియకుండా మిగిలిపోయిన రహస్యం ఒక్కటే!
బాసుగారిది తాత తండ్రులకాలం నుంచీ చెక్కు చెదరని, పాతకాలపు ఉమ్మడి కుటుంబం. సదరు చిరునవ్వుల చిన్నది చిన్నతనం నుంచీ ఆ ఉమ్మడి కుటుంబంలోనే  పెరిగింది. 
ఉద్యోగాలకోసం ఊళ్ళు వేరయ్యాక కూడా, వాట్సాప్ పుణ్యనా, మొబైళ్ల భాగ్యానా, ఆ పెద్ద కుటుంబం అంతటా వయసు వారీగా వాట్సప్ గ్రూపులు, సందర్భం వారీగా చాటింగ్, ఫార్వర్డ్ లతో  నిరంతరం కబుర్లు కలబోసుకుంటూ,  కలిసే ఉంటారు. ఆ కుటుంబంలో ఉన్న కజిన్స్ అందరూ ఐడెంటిఫికేషన్ కోసం, తమ స్వంత తల్లిదండ్రుల్ని ‘డాడీ – మమ్మీ’ అని పిలిస్తారు. 
అలాగే, పెద్దనాన్న, పెద్దమ్మలని ‘అమ్మ- నాన్న’, పిన్ని, బాబాయిలని ‘చిన్నమ్మ- చిన్నాన్న‘ అని పిలవటం అలవాటు చేసుకున్నారు.  
పోయిన నెలలో ఆమె పెద్ద నాన్న, వారం రోజుల కోసం తన తమ్ముడి దగ్గరకు చుట్టం చూపుగా వచ్చాడు. 
ఆ సందర్భంలో పెద్ద నాన్న కోసం హాట్ ఐటమ్స్ కొనటానికి స్వీట్ షాప్ వచ్చిన చిన్నది, పెదనాన్నని ‘నాన్న’ అని రిఫర్ చేస్తూ చెప్పిన ‘తీపి కబురును అపార్ధం చేసుకుని, కాజా తిన్న చిట్టితండ్రి, ఆ కాజా ఇప్పుడు ఘాటైన మిర్చి బజ్జీలా నషాళానికి అంటటంతో, ఎక్కడ పొరబాటు జరిగిందో అర్థం కాక, శోక తప్తుడై, అండమాన్ బాట పట్టాడు. 

***
 

No comments:

Post a Comment

Pages