ఏగతి నుద్ధరించేవో యింతటిమీదట మమ్ము 22-03-24 - అచ్చంగా తెలుగు

ఏగతి నుద్ధరించేవో యింతటిమీదట మమ్ము 22-03-24

Share This
ఏగతి నుద్ధరించేవో యింతటిమీదట మమ్ము 22-03-24
(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 

రేకు: 0353-04  సం: 04-312

పల్లవి: 

ఏగతి నుద్ధరించేవో యింతటిమీదట మమ్ము

భోగపుగోరికలచేబొలిసె గతులు

చ.1: 

పరగి నాలుకసొంపు పరసిపోయ

పరులనే నుతియించి పలుమారును

విరసపుబాపములవినికిచే వీనులెల్లా

గొరమాలె మాకు నేటి కులాచారము

చ.2: 

మొక్కలాన పరధనమునకు జాచిచాచి

ఎక్కువజేతులమహి మెందో పోయ

తక్కక పరస్త్రీల దలచి మనసు బుద్ధి

ముక్కపోయ మాకు నేటి ముందటిపుణ్యాలు

చ.3: 

యెప్పుడు నీచులయిండ్లకెడతాకి పాదములు

తప్పనితపములెల్ల దలగిపోయె

యిప్పుడె శ్రీవేంకటేశ యిటునిన్ను గొలువగా

నెప్పున నేజేసినట్టి నేరమెల్లా నణగె


భావం:

పల్లవి:

వేంకటేశా !  ఏ రకంగా ఇక మీద మమ్మలిని  ఉద్ధరిస్తావో తెలియదు.

భోగాల మీద ఉన్న కోరికలచే మా  ఉత్తమ గతులన్ని నశించిపోయాయి.

చ.1:

వేంకటేశా !  నిన్ను కాకుండా ఇతరులను అనేక మార్లు  పొగిడి  నా నాలుక అందం  మాసిపోయింది. ( స్వామిని పొగిడితేనే నాలుకకు అందమని భావం)

అనుకూలము కాని పాపములవినికిడిచే చెవులన్నీపనికిమాలినవయ్యాయి. ఇక మాకు ఎందుకు   కులాచారము?( అవసరము లేదని భావం)

చ.2:

ఉత్సాహముతో పరధనమునకు చేయి చాచిచాచి చేతుల మహిమ ఎక్కడికో పోయింది.( ఎవరిదగ్గర యాచించకూడదని భావం)

పరస్త్రీలను తలచి మనసు బుద్ధి ముక్కలయ్యాయి.  మాకు ఇంకా ముందర రాబోవు పుణ్యాలు కలుగుతాయా? ( రావని భావం)

చ.3:

ఎప్పుడు నీచుల ఇండ్లకు నా పాదములు వస్తూ పోతున్నాయి.అందువల్ల తప్పనితపములన్నీ తొలగిపోయాయి.

శ్రీవేంకటేశ! ఇప్పుడే  ఈవిధముగా నిన్ను ఉపాయముతో కొలువగా నేను చేసిన నేరమంతా అణగిపోయింది.


***

No comments:

Post a Comment

Pages