తమలపాకులు - అచ్చంగా తెలుగు

తమలపాకులు 

అంబడిపూడి శ్యామసుందర రావు 



తమలపాకులను ఇంగ్లీషు లో బీటల్ లీవ్స్ అంటారు వక్కలను బీటల్ నట్స్ అంటారు ఇది కొద్దిగా తికమకగా ఉంటుంది  ఈ రెండు జంట కవుల లాంటివి ఎందుకంటే తాంబూలము లో తమలపాకులు, వక్కలు (వక్కపొడి) ఈ రెంటికి విడదీయరాని సంబంధం ఉంటుంది ఈ సంబంధము తప్ప ఇంకా వేరే సంబంధం లేదు  ప్రస్తుతం మనము తమలపాకుల గురించి తెలుసుకుందాము  ఇంట్లో ఏ శుభ కార్యక్రమం అయిన తమలపాకులు కావాలి దేవుడి దగ్గర ఉండే పండు తాంబూలం లేదా పెద్దవారికి ఇచ్చే తాంబూలం అంటే తమలపాకులు కావాలి ఆ విధంగా హిందూ సంప్రదాయం లో అరటిపండు వక్కలు తమలపాకులు లేకుండా ఏ కార్యక్రమం జరుగదు కార్యక్రమలకే కాకుండా  ఆరోగ్యానికి, వైద్య పరంగా కూడా తమలపాకులు చాలా ఉపయోగకరమైనవి  భారతీయ సంస్కృతిలో తమలపాకులకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది 400 బిసి నుండి పురాతనమైన వైద్య విధానం ఆయుర్వేదంలో తమలపాకులు ప్రస్తావన ఉంది చరకుడు సుశ్రుతుడు, మొదలైన వైద్య ప్రముఖులు వారి ఆయుర్వేద గ్రంధాలలో వీటి ఉపయోగాల గురించి వివరించారు.ఈ వ్యాసంలో ఆ విషయాలను తెలుసుకుందాం.
తమలపాకుల సాగు ఎక్కువగా ఆసియాలోని దక్షిణ మరియు ఆగ్నేయ ప్రాంతాలైన ఇండియా నుండి పపువా న్యూ గినియా వరకు ఉంటుంది. ఈ మొక్క బలహీన కాండము అంటే తీగలాగా ఉంటుంది కాబట్టి దానికి ఊతంగా మరో మొక్క కావాలి తమలపాకుల సాగుకు మంచి సారవంతమైన నేల కావాలి నీటి మురుగు ఉన్న నేలలు ,ఉప్పుడు నేలలు, చవుడు నేలలు పనికి రావు ఈ మొక్క సౌత్ ఈస్ట్ ప్రాంతానికి చెందినది అయినా దీని సాగు ఆస్ట్రోనేషియన్ వలసల వల్ల ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందింది కోలోనియల్ యుగము లో ఈ పంట కరేబియన్ ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఈ మొక్క సాంకేతిక నామం పిపెర్ బీటల్ ,పిపెరసీఏ కుటుంబానికి చెందినది ఇది ద్వివార్షిక తీగ మొక్క,ఆకులు హృదయము ఆకారములో ఉండి ఉపరితలం ఆకు పచ్చగా మెరుస్తూ ఉంటాయి.ఈ ఆకులకు ఉండే రుచి సువాసన కోసం ఈ పంటను పెంచుతారు.బిటల్  అనే పేరు మళయాలం భాషలోని వేటిల్ల (పోర్చుగీసు భాష  నుంచి దిగుమతి అయిన పదము) నుండి వచ్చింది. 
బంగ్లాదేశ్ లో ఈ పంట సాగు ప్రత్యేకముగా ఉంటుంది ఈ ఆకులను బంగ్లా ఆకులు అంటారు ఈ తమలపాకుల తోటలను బరౌయి అంటారు ఈ తోటల చుట్టూ వెదురు కర్రలతో, కొబ్బరి ఆకులతో కంచె కడతారు. నేలను  75 సెమీ లోతు , 75 సెమీ వెడల్పు 10 నుండి 15 మీ పొడవుగా  దున్నుతారు. పిండి చెక్క ,ఎరువులు పచ్చి రోట్ట ను ఆ గాళ్ళలో వేసి కాండ ఛేదనాలను నాటుతారు ఇదంతా వర్షాకాలానికి ముందు చేస్తారు ఈ పంటకు సరి అయినా నీడ ఏర్పాటు చేస్తారు నేల తేమ గా ఉండేటట్లు ( ఎక్కువ నీరు నిల్వ  ఉండకూడదు) 15 రోజులకు ఒకసారి ఎండు ఆకులు కర్ర కాల్చిన బూడిద ఆవు పేడ  వేస్తారు. ఈ పంట ఆరు నెలలకు చేతికి వస్తుంది.3 నుంచి 6 నెలలలో ఈ తీగ 150 నుండి 180 సెమీ ఎత్తుకు పెరుగుతుంది. ఆకులను తొడిమ వద్ద తుంచి కలెక్ట్ చేస్తారు ఈ పంట 15 రోజుల నుంచి నెల వరకు ఉంటుంది ఈ పంటను స్థానికంగా వాడుకుంటూ ఇతర ప్రాంతాలకు (యూరప్ అమెరికా) ఎగుమతి చేస్తారు.  
తమలపాకుల రసాయన కాంపోజిషన్ గురించి తెలుసుకుందాము ఈ రసాయన కాంపోజిషన్ కూడా నేల స్వభావాన్ని బట్టి మారుతూ  ఉంటుంది వీటిలో ఎక్కువగా చావిబెటోల్ అనే రసాయనం ఉంటుంది. శ్రీ లంక లోని తమలపాకులలో సఫరోల్ అనే రసాయనం అధికముగా ఉంటుంది. ఇవే కాకుండా యూజినల్, ఐసో యుజినల్ మరియు జర్మసెన్,చావికోల్, హైడ్రోక్సి చెవికోల్,కార్యోఫీల్లెన్ వంటి రసాయనాలు కూడ ఉంటాయి.మొక్క కాండములో ఫైటో స్టెరాల్స్ ఆల్కలాయిడ్స్, ఇతర బయో యాక్టివ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ బయో యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ఒలినోలిక్ ఆమ్లం ,డి హైడ్రో పిపెర్ నోనలిన్ మొదలైనవి.వేర్లలో అరిస్టోలక్టమ్ వంటి రసాయనాలు ఉంటాయి. తమలపాకుల నుండి తీసిన ఎస్సెన్షియల్ ఆయిల్ లో 50 రకాల కాంపౌండ్స్ ఉంటాయి.
తమలపాకుల ముఖ్యమైన ఉపయోగము ఆకులను వక్కలతో కలిపి కిల్లి లేదా పాన్ గా తింటారు కొన్ని సందర్భాల్లో ఈ కిల్లీకి సువాసన కోసం పొగాకు కలుపుతారు.ఈ అలవాటు 5000 సంవత్సరాల క్రితము ఫిలిపైన్స్ లో మొదలయింది.ఏదైనా శుభ కార్యక్రమానికి సూచనగా పెద్దవారికి పండు తాంబూలం (ఆకు వక్క తో) ఇవ్వడం మన హిందూ సాంప్రదాయం బెంగాల్ లో వివాహం అప్పుడు వధువును వరుని దగ్గరకు తీసుకు వచ్చేటప్పుడు వధువు ముఖాన్ని తమలపాకులతో కవర్ చేసి తీసుకు వస్తారు 
తమలపాకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:1తలనొప్పికి:- తమలపాకులలో నొప్పిని తగ్గించే చల్లదనాన్ని కలుగజేసే లక్షణాలు ఉన్నాయి. అందువల్ల  తీవ్రమైన తలనొప్పి త్వరగా తగ్గుతుంది. ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జంతువులతో మనుషుల పైన జరుగుతున్నాయి. .
2. క్యాన్సర్ ను నివారిస్తుంది.: తమలపాకు కు ఉండే  యాంటీ క్యాన్సర్ ధర్మాలు మనలను క్యాన్సర్ నుండి కాపాడుతాయి. తమలపాకుల్లోని ఫినోలిక్ కాంపౌండ్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగింపు చేస్తాయి.ఏది ఏమైనా క్యాన్సర్ ప్రమాదకరమైన జబ్బు కాబట్టి తమలపాకుల వల్ల పూర్తిగా నయం అవదు కాబట్టి వైద్యుడిని సంప్రదించి వైద్యం చేయించుకోవాలి.
3. ఫంగల్  ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది: తమలపాకుల్లోని హైడ్రోక్సిహవికాల్ అనే కాంపౌండ్ ఫంగల్ పెరుగుదలను అరికడుతుంది. టిపికల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించటానికి తమలపాకులను ఉపయోగిస్తారు లేదా ఓరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నివారించటానికి తమలపాకు రసాన్ని మౌత్ వాష్ గా ఉపయోగిస్తారు.
4.గ్యాస్ట్రిక్ అల్సర్ కి : వీటికి ఉండే గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ ధర్మం వల్ల తమలపాకులను కడుపులో ఏర్పడే పుండ్లను నయం చేయడానికి వాడతారు. వీటికి ఉండే యాంటీ ఆక్సిడెంట్ ధర్మం వల్ల ఇవి ఎంజైమ్,చర్యలు వేగవంతం చేస్తాయి. అంటే కాకుండా తమలపాకులు ఉదరంలోని  లోపల గల శ్లేష్మాన్ని పెంచి  యాసిడ్ వాల్యూమ్ ను తగ్గించటం ద్వారా  అల్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
5. మధుమేహానికి మందుగా పని చేస్తుంది:ఎలుకలపై చేసిన పరిశోధనలు తమాల పాకులు బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి అని తెలుపుతున్నాయి.మధుమేహ రోగులు ఎక్కువగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు లోనవుతారు దీని ఫలితంగా శరీరములోని యాంటీ ఆక్సిడెంట్స్ క్షీణిస్తాయి. దీనివల్ల ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. తమలపాకులు దీనిని నిరోధించి నిరోధక వ్యవస్థను పటిష్ట పరుస్తాయి. మధుమేహ రోగులు తమలపాకుల నూనె ను కూడా వాడవచ్చు   
6.తమలపాకులు గాయాలను నయం చేయడానికి వాడవచ్చు.గాయాలను నయం చేయడంలో తమలపాకుల రసం బాగా పని చేస్తుంది. ఎందుకంటే ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికముగా ఉంటాయి కాబట్టి ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి.ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు గాయాలు నయం అవ్వడం ఆలస్యము అవుతుంది.ముఖ్యంగా కాలిన గాయాలు నయం చేయడానికి తమలపాకులు బాగా పనిచేస్తాయి. 
7 ఆస్తమా రోగులకు బాగా ఉపయోగిస్తాయి:అందరి దృష్టిలో ఆస్తమా అంటే శ్వాసకు సంబంధించిన రోగాలు అని కానీ ఇది ఇన్ఫ్లమేషన్ సమస్య అని చాలా మంది గుర్తించరు.తమలపాకులో యాంటీ  ఇన్ఫ్లమేటరీ ధర్మాలు ఉన్నాయి. కాబట్టి ఆస్తమా రోగులకు ఉపయోగిస్తుంది.ఆస్తమా రావడానికి హిస్టమైన్స్ కారణం ఇది ఆస్తమా కు ముఖ్య కారణం అయిన బ్రాంకో కంస్ట్రక్షన్ కలుగజేస్తుంది.తమలపాకులు ఉండే యాంటీ హిస్టమైన్స్ ధర్మాలు అస్తమాను కంట్రోల్ చేస్తాయి
8. డిప్రషన్ సమస్యలను తగ్గిస్తుంది.:-:డిప్రషన్ తగ్గించడానికి యాంటీ డిప్రెషన్ మందులు ఉన్నప్పటికీ హెర్బల్ మందులు సైడ్  ఎఫెక్ట్స్ లేకుండా బాగా పని చేస్తాయి తమలపాకులు మంచి హెర్బల్ మందు గా పని చేస్తుంది.ఎందుకంటే తమలపాకులు నములుతున్నప్పుడు కేంద్రీయ నాడీ వ్యవస్థ చురుకుగా పని చేస్తుంది.ఫలితంగా మనసు తేలిక అవుతుంది.కొంత సంతోషాన్ని కలుగజేస్తుంది.తమలపాకులు ఆరోమేటిక్ ఫినోలిక్ కాంపౌండ్స్ ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.ఫలితముగా డిప్రషన్ తగ్గుతుంది.
9. తమలపాకులు నోటి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి.:- తమలపాకులను మౌత్ ఫ్రెష్ నర్స్ గా వాడతారు. తమలపాకులు నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను అరికడుతుంది ఫలితంగా చాలా రకాల నోటి ఇన్ఫెక్షన్ అరికట్టబడతాయి.
10. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది:- తమలపాకుల్లోని యూజినాల్ అనే రసాయనం కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి ఉపయోగ పడుతుంది అంతే కాకుండా యూజినాల్ కాలేయంలో ఉత్పత్తి ఆయె కొలెస్ట్రాల్ ను నిరోధిస్తుంది ఫలితముగా ప్రేగుల్లో లిపిడ్స్ శోషణ తగ్గించి శరీరానికి మేలు చేస్తుంది.
11.తమలపాకులకు యాంటీ మైక్రోబియల్ ధర్మాలు ఉన్నాయి ఇవి బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్ తో పోరాడుతాయి. తమలపాకుల్లో ఫినోలిక్ మరియు ఫైటోకెమికల్స్ ఉండటం వల్ల గ్రామ్  పాజిటివ్ మరియు గ్రామ్  నెగటివ్ బ్యాక్టీరియా పై ప్రభావాన్ని చూపుతాయి 
12. తమలపాకులకు యాంటీ పారసైటిక్ ధర్మాలు ఉన్నాయి తమలపాకుల్లోని టెర్పెన్స్ అనే కాంపౌండ్ కు యాంటీ మలేరియల్ ధర్మాలు ఉన్నాయి. అంటే కాకుండా దీనిలోని ఫ్లేవనాయిడ్స్ కు యాంటీ పారసైటిక్ ధర్మాలు ఉన్నాయి. ఇవి మలేరియాను సంబంధించిన పరాన్నజీవి పోరాడుతాయి. తమలపాకులు ను యాంటీ మలేరియా ధర్మం కోసం వాడటం చాలా కాలం నుండి జరుగుతున్నది. ఈ అలవాటు మలేషియాలో మొదలైంది. ఈ ఆకూ మలేరియా వల్ల కలిగే ప్రమాదలను నుండి రక్షిస్తుంది. అంటే కాకుండా కొన్ని ప్రమాదకర జబ్బులనుండి కూడా రక్షణ కలుగజేస్తుంది.
13.గ్యాస్ట్రైటిస్ సిస్టం కోసం తమలపాకులు : తమలపాకులలోని  ఫైటోకెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ అల్సర్ ధర్మాలు ఉంటాయి కాబట్టి కడుపులో ఏర్పడే అల్సర్ కడుపులో లైనింగ్ కు కలిగే నష్టాలు నివారించబడుతుంది.ఆల్సర్లు ఏర్పడిన తగ్గుతాయి.ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. 
తమలపాకుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ మరియు అది కలుగజేసే ఎలర్జీలు:  మీరు కనుక పాన్ ఎక్కువగా నములుతూ ఉంటే :పొగాకు కు సంబంధించిన ఉత్పత్తులలో చాలా భాగం నోటి క్యాన్సర్ కు కారణమవుతాయి.కానీ తమల పాకులు మాత్రమే నములుతూ ఉంటే ఈ ప్రమాదం లేదు.ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తమలపాకులతో పాటు పొగాకు నమలడం క్యాన్సర్ కి కారణమని చెప్పింది కాబట్టి తమలపాకులతో పొగాకు కలిపి నమలడం అనారోగ్యానికి కారణం .
ప్రస్తుతం భారతదేశంలో తమలపాకుల సాగు పరిస్థితి గమనిద్దాం 2006 లో జరిపిన అధ్యయనం ప్రకారం తమలపాకుల సాగు 55000 హెక్టార్లకు విస్తరించింది దీని వలన తమలపాకుల ఉత్పత్తి వలన ఆదాయం 9000 మిలియన్ల రూపాయలు , మరియు సుమారు 400,000 నుండి 500,000 మంది వ్యవసాయ కుటుంబాలకు జీవనోపాధి కలుగుతుంది.  మార్చ్ 2011 లో జరిపిన అధ్యయనంలో తమలపాకుల సాగు తగ్గినట్లు తెలుస్తోంది దీనికి కారణం వ్యవసాయానికి పెట్టే ఖర్చు దాదాపు ఎకరాకు 26,000 రూపాయల వరకు పెరగటమే.ఈ విధంగా  ప్రతి సంవత్సరం ఖర్చు పెరుగుతూ వస్తుంది. ఆదాయం తగ్గుతు ఉంది ప్రపంచవ్యాప్తంగా తమలపాకుల వినియోగం కూడా ఆరోగ్య సంస్థ సూచనల వలన పాన్   వాడకం తగ్గుతూ వస్తుంది.2000- 2010 మధ్య కాలంలో తమలపాకులు వ్యాపారం 65% తగ్గటం వలన తమలపాకుల సాగు పట్ల మోజు రైతులలో  తగ్గింది. 
***

No comments:

Post a Comment

Pages