శ్రీథర మాధురి - 119 - అచ్చంగా తెలుగు

శ్రీథర మాధురి - 119

Share This

 శ్రీథర మాధురి - 119

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


 ఊసరవల్లి రంగు మారుస్తుంది కనుక అందరూ దాన్ని నిందిస్తారు.

 
ఇది సత్యం కాదు.

రంగులు మార్చడం ద్వారా ఊసరవల్లి తన పరిసరాలకు అనుగుణంగా మారుతుంది. అలా జరగకపోతే కొత్త వాతావరణం లో దాన్ని ఒక శత్రువుగా, తిరుగుబాటుదారుగా అనుమానించే అవకాశం ఉంది.

మనలో ఎంతమంది మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మార్చుకోగలుగుతాము? చాలా కొద్ది మంది మాత్రమే! మనం మారకపోగా షికాయితులు చేసేదాకా వెళ్ళిపోతాము.

ఒక సురక్షితమైన జీవనం కోసం మన పరిసరాలకు అనుగుణంగా మనం ధరించాల్సిన ముసుగును ధరించము. హాస్పిటల్లో బెడ్స్ లేవని, ఆక్సిజన్ లేదని ప్రభుత్వాలు పనికిమాలినవని తిడుతూ ఉంటాము.

కాబట్టి ఊసరవల్లిలా మారండి. పరిసరాలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి.

*****
ఒకానొకప్పుడు ఆమె చాలా అందమైన నటి. ఇప్పుడు ఆమెకు వయసొచ్చింది కానీ ఆమె తన వయసును అంగీకరించలేకపోతోంది. మీకు వయసు పెరిగిన కొద్దీ, అందం తగ్గుతుంది. ఒక విధమైన పరిణితితో కూడిన హుందా వస్తుంది. పెద్దవారు చాలా హుందాగా, అందంగా ఉంటారు. వయసు వారిలో ఒక రకమైన దివ్యత్వాన్ని వారి ఆకృతికి చేరుస్తుంది. యుక్తవయసులోని అందం లౌకికమైనది, వయసు పెరిగే కొద్దీ అది అలౌకికంగా మారుతుంది. ఒకరు ఈ నిజాలను అంగీకరించి, జీవితంలో ముందుకు సాగడం నేర్చుకోవాలి.
 
*****
మోసంతో, అబద్ధాలతో కూడుకున్న ఒక పూర్తి బూటకపు జీవితాన్ని కేవలం మనుషులే జీవించగలరు. ఈ ప్రకృతిలోని ప్రతి ఇతర జీవి చాలా నిజాయితీగా బ్రతుకుతుంది.
 
ఒకసారి మల్లె విరబూసాక, అది పరిమళాన్ని ఇవ్వాల్సిందే! అది గులాబీలా పరిమళాన్ని ఇవ్వదు. అరటి చెట్టు కేవలం అరటికాయలను మాత్రమే ఇస్తుంది, నారింజలను కాదు. పద్మం వికసించి కేవలం దాని సౌందర్యంతో అందరినీ ఆకర్షిస్తుంది. ఇవన్నీ ఉనికిలో ఒకటిగా, సత్యంతో జీవిస్తున్నాయి.
 
మనుషులు ఉనికిలో భాగంగా జీవించలేరు. అలా జీవించకుండా ఉండేందుకు ఏదో ఒకటి చేస్తుంటారు. వేడిగా ఉన్నప్పుడు వారికి ఏసీ కావాలి, చల్లగా ఉన్నప్పుడు హీటర్ కావాలి. మనం గాలిలోకి విషాన్ని వెదజల్లి, ఆ తర్వాత దాక్కుని లేదా ముసుగులు ధరించి తిరుగుతుంటాము. మనం అడవిలో జంతువులను కూడా ప్రశాంతంగా బతకనివ్వము. వాటిని చూడడానికి సఫారీ టూర్లంటూ వెళ్లి అవి సహజమైన నివాసంలో,  వాతావరణంలో ఎలా జీవిస్తాయో చూడాలనుకుంటాము. మనకు ప్రైవసీ కావాలి, కానీ మనం వాటిని వాటి స్వంత పరిసరాల్లో చూడాలనుకుంటూ వాటి ప్రైవసీలోకి చొచ్చుకొని పోతాము. దీన్నంతా మనం అధ్యయనం లేదా ఆటవిడుపు యాత్రలు లేదా పరిశోధన అంటాము.
 
మనం మేధస్సుతో దీవించబడ్డాం గనుక, మనమే అందరికంటే ఉన్నతులమని, అత్యంత శక్తివంతులమని భావిస్తాము. మన మేధాశక్తిని మొత్తం వాడేస్తాం, కానీ చాలాసార్లు అది ఉనికితో లేక ప్రకృతితో సరితూగదు. మన నూతన ఆవిష్కరణలు, కనుగొనడాలు చూసి గర్విస్తాము. ప్రకృతి నుంచి దూరమవుతూ మనల్ని మనం నాశనం చేసుకునే దిశగా మనం కదులుతున్నాము. మనం ప్రకృతిని నాశనం చేయాలనుకుంటాం కనుక ప్రకృతి వైపరీత్యాల రూపంలో అది మనపై తన ఆగ్రహాన్ని చూపుతోంది.

No comments:

Post a Comment

Pages