అక్షర హాలికుడు - అక్షరం ప్రభాకర్ - అచ్చంగా తెలుగు

అక్షర హాలికుడు - అక్షరం ప్రభాకర్

Share This
అక్షర హాలికుడు - అక్షరం ప్రభాకర్ 



1. తెలుగు భాష పట్ల మీకు మమకారం కలిగేలా ప్రేరణ కల్పించినవారు ఎవరు?
చాలా చక్కటి ప్రశ్న. మేడం గారు మీకు ముందుగా 'అచ్చంగా తెలుగు' అన్న పేరుతో తెలుగు భాష కోసం అహర్నిశలు పరిశ్రమిస్తూ, నిత్యం తెలుగు భాష హితం కోసం ఒక అంతర్జాతీయ అంతర్జాల పత్రికను నడుపుతూ, పుస్తకాలు ప్రచురిస్తూ, పరిచయ వేదికలను ఏర్పాటు చేస్తూ, ప్రముఖ రచయితలను,కవులను, కవయిత్రులను, సాహితీ పెద్దలను ముఖాముఖి చేస్తూ, పుస్తక సమీక్షలు చేస్తూ, భాష కోసం కృషి చేస్తున్న మీరు నాలాంటి ఒక మామూలు కవిని కూడా నలుగురికి పరిచయం చేయాలనుకుని, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.

తెలుగు భాష పట్ల మమకారాన్ని కలిగించిన నా తల్లి మట్టి పాదాలకు ముద్దు పెడుతూ
ప్రణమిల్లుతున్నాను. మా అమ్మకు అక్షరం ముక్క రాదు. కానీ, మా అమ్మ నోటి వెంట వచ్చిన ప్రతి మాట అమృతమే! మా అమ్మ పలికిన ప్రతి పలుకు అతి మధురమే! నాకు ఇంకా ఇప్పటికి నిత్య నూతన ఉత్సాహమే!
ఎవరిని పిలిచినా .. ఆ పిలుపు ద్వారా ఎవరితో మాట్లాడినా ప్రతి పనిలో, ప్రతి సందర్భంలో  వాడిన ప్రతి పదము అత్యద్భుతమే! అలా అమ్మ నుండి తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచుకోవడమే కారణం!
ఎందుకంటే తెలిసి తెలియని ప్రాయంలో భాషా వ్యవహారము అప్పుడు సమంగా తెలియదు.
ఇకపోతే మా నాన్న... ఆయన కాస్త చదువుకున్న వ్యక్తి, వ్యవహారం తెలిసిన వాడు.
కాబట్టి, వారు మాట్లాడే భాషలో వ్యాకరణం కంటే, వివరానికి ఆయనిచ్చే విలువతో భాష పట్ల కొంత యావ కలిగింది.
ఇదే సరిపోతుంది అని చెప్పలేను. నా బాల్యం లో, బహుశా రెండో తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా... మా గురువుగారు చెప్పిన ఆవు పులి కథ, ఆ పాఠం చెప్పిన విధానం... ఇప్పుడు కాదు, ఎప్పటికీ మర్చిపోలేను!
ఇలా చెప్పుకుంటూ పోతే నాతో పాటు మనందరికీ ఉన్న అనుభవాలే భాష పట్ల మమకారం పెరగడానికి ముఖ్య కారణాలు.
డిగ్రీలో ఉన్నప్పుడు మా గురువుగారు 'నువ్వు తెలుగు భాషలో బాగా రాణించగలవు. అటువైపుగా ఆలోచించు' అని నా చేయి పట్టి, డిగ్రీలో నన్ను చేర్పించారు.
తెలుగు చదివితే ఉద్యోగాలు ఏమీ ఉండవని నా స్నేహితులు చాలామంది ఎక్కిరించారు.
కానీ ఆ తెలుగు భాష నాకు అన్నం పెడుతోంది.
జ్ఞానపీఠ సినారె గారితో ఉన్న అనుబంధం భాష పట్ల నాకే తెలియని ఒక తల్లి బిడ్డల సంబంధాన్ని పెంపొందించింది. పోతన గారి పద్యాలు, ప్రజా కవులు రాసినటువంటి పాటలు, మా ఊరి మట్టి లో పుట్టిన దాశరధి కృష్ణమాచార్యులు, దాశరధి రంగాచార్యులు, ఒద్దిరాజు సోదరులు, అలాగే సాహిత్యంలో నేను బాగా ఆరాధించే కవి గుంటూరు శేషేంద్ర కవి, సినిమా పాటలలో తల్లిగా, తండ్రిగా భావించే నా పూజ్యులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, మా ఊరి జిల్లా వాసి మా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, చంద్రబోస్ అన్న విశ్వ వినీల సినీ ఆకాశంలో నోబెల్ ప్రైజ్ లాంటి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చి, మన తెలుగు పటిమను నిరూపించిన వారంటే, నాకు బాగా ఇష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు భాష పట్ల మమకారం కలగటానికి ఎందరెందరో మహానుభావులు కారణం! అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూన్నాను.

2. మీ వృత్తి, విద్యాభ్యాసానికి సంబంధించిన అంశాలు చెబుతారా?
నేను ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేస్తున్నాను. నేను  ఎంఏ తెలుగు ఉస్మానియా విశ్వవిద్యాలయం లో  చదివాను. తెలుగు పండిత శిక్షణ కూడా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలలో చదివాను.


3. తెలుగు వాచకాలు చాలానే ఉన్నాయి కదా. అసలు ఒక పుస్తకం ప్రత్యేకంగా వ్రాయాలని ఎందుకనిపించింది? ఇందులోని ప్రత్యేకతలేమిటి?
తెలుగు వాచకాలు చాలా ఉన్నప్పటికీ అన్ని వాచకాలలో ఉన్న పద్ధతి కాకుండా, కొత్త పద్ధతిలో, నూతన ఒరవడిని ఇందులో పరిచయం చేయడం జరిగింది.
ప్రత్యేకతలు ఏమిటంటే...
*ఈ బుక్కు ఇప్పటివరకు నాలుగు ముద్రణలు పూర్తిచేసుకుని ఐదో ముద్రణకు సిద్ధంగా ఉంది.
*వర్ణమాల చుట్టే 20 అభ్యాసాలను +
పాఠాలను, పరిచయం చేయడం, ఈ వర్ణమాల పాఠాలలో, అభ్యాసాలలో ఒక గుణితాక్షరము కానీ ఒక ఒత్తు అక్షరం కూడా కలవకుండా చూడడం.
*అలాగే గుణిత అక్షరాలు నేర్పినప్పుడు, గుణితాక్షరాలతో సుమారు 20 పాఠాలు + అభ్యాసాలు పరిచయం చేస్తూ, ఇందులో 
ఒక్క ఒత్తు అక్షరం కూడా కలవకుండా చూడడం.
*ఇకపోతే ఒత్తులు పరిచయం చేసినప్పుడు ఒత్తులను కూడా ఒక క్రమ పద్ధతిలో పరిచయం చేయడం వాటి చుట్టూ 20 పాఠాలు 20 అభ్యాసాలు, రూపొందించడం.
*ఇది ఇదివరకు వచ్చిన ఏ తెలుగు పాఠ్య పుస్తకం ఇంత నూతన ఒరవడితో రాలేదు.
ఈ పుస్తకం కొత్త సరళమైన నూతన పద్ధతిలో  వచ్చిందని భాషావేత్తలు, అధ్యాపకులు, విద్యావేత్తలు, భాషాభిమానం ఉన్న పెద్దలు అన్నారు. కనుక, దీనిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను.

5. ఈ పుస్తకానికి స్పందన ఎలా ఉంది?
ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాలలోనే ఆంధ్ర, తెలంగాణలో ఉన్న తెలుగు భాషాభిమానం కల అందరి చేత ప్రశంసింపబడి, అభినందింపబడి, చాలా మంచి స్పందనతో ముందుకు పోతుంది.
అలాగే అంతర్జాల పద్ధతిలో అమెజాన్, అచ్చంగా తెలుగు,ఇంకా ప్రత్యక్ష పుస్తక ఆలయాలలో అందుబాటులో ఉంటూ అమెరికా మరియు ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్లు ఈ పుస్తకాన్ని అడిగి తెప్పించుకుంటున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపిస్తుంది.
6. ఈ పుస్తకానికి సంబంధించిన ఒక మర్చిపోలేని సంగతి ఏదైనా చెబుతారా?
ఈ పుస్తకము ప్రచురించిన కొత్తలో విజయవాడలో కృష్ణా పుష్కర పుష్కరాలు జరుగుతున్నాయి. కృష్ణ పుష్కరాలను చూడటానికే కాకుండా, విజయవాడ మా అత్తగారి ఊరు కనుక సాధారణంగా వెళ్లాము.
విజయవాడ అంటే నిత్యం సాహిత్య సంగీత  కళా సౌరభాలతో వర్ధిల్లుతున్నటువంటి 
కళామతల్లి భూగర్భం వంటిది. ఒకరోజు ఒక సాహితీ విద్యావేత్త షష్టిపూర్తి సందర్భంగా చాలా అందంగా, వైభవంగా జరుగబోతున్న  సభ గురించి, పత్రికలో సమాచారం చూసి అక్కడికి వెళ్లాను. నా అక్షరాభ్యాసం పుస్తకాలు పట్టుకొని, అక్కడికి‌ వెళ్లాను. హడావుడిగా వచ్చి పోయే పెద్దలతో అక్కడి వాతావరణం అంతా సందడి సందడిగా, కోలాహాలంగా ఉంది.
అక్కడ పుస్తక రచయితలు, భాషాభిమానులు  ఒక ప్రక్కన తమ తమ పుస్తకాలను ప్రదర్శిస్తూ కూర్చున్నారు. ఇక్కడ ఏమి పుస్తకాలు ఉన్నాయా అని పరిశీలిస్తూ వెళ్లాను. కృష్ణా పుష్కరాల మీద ఒక పుస్తకం రాసినటువంటి
ఒక మేడం గారు నా చేతిలో ఉన్న పుస్తకాన్ని అడిగిమరీ తీసుకొని, 'చాలా బాగుంది.
ఈ పుస్తకాన్ని ఎవరో ఆదరించాలని, లేదా ఆదరించట్లేదని మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకములో ఉన్న మంచి విషయపరిజ్ఞానమే మిమ్మల్ని ముందుకు తీసుకు పోతుంది. మీరు ఏమీ నిరుత్సాహపడకండి. ఎవరి పనులలో వాళ్లు ఉంటూ, ఒత్తిళ్లతో కూడిన జీవన విధానంలో ఒకరు మనకోసం ఆగి, ప్రశంసించడం, అభినందించడం జరగకపోవచ్చు. అందు గురించి బాధపడకుండా మీ ప్రయత్నం మీరు చెయ్యండి' అని మెచ్చుకున్నారు.
ఆవిడెవరో కాదు! 'అచ్చంగా తెలుగు' వ్యవస్థాపకురాలు శ్రీమతి భావరాజు పద్మినీ ప్రియదర్శిని గారు. ఆవిడ నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, అభినందన నేను మర్చిపోలేను! నిజంగా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. 
ఈ పుస్తకం పురుడుపోసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా చూసింది మీరే, స్పందించింది, పుస్తకం పట్ల ప్రశంసను అందించింది మీరే! ఈ పుస్తకానికి మీరు అందించిన అభినందనలను మర్చిపోకుండా ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని మనస్పూర్తిగా తెలియజేస్తున్నాను.

7. ప్రముఖులు ఈ పుస్తకాన్ని చూసి ఎలా స్పందించారు?
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె గారు  ఈ పుస్తకం చూసి, బాగుందన్నప్పుడు మా అమ్మ అభినందించినట్టు అనిపించింది.
అలాగే విద్యావేత్త చుక్కా రామయ్య గారు చూసి, "చాలా కష్టాలు పాలు అవుతావు. పుస్తకాల అచ్చు వేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదని హెచ్చరిస్తూ, మా ఇంటికి వచ్చి, భాష వాచకం మీద పుస్తకం రాస్తున్నానని చెప్పిన నిన్ను అభినందిస్తున్నాను" అని చెప్పి, వారి చేతితో ఇంటిలో అన్నం వడ్డించిన జ్ఞాపకం మర్చిపోలేను.
అలాగే తెలుగు జాతికి వన్నెతెచ్చిన మహోన్నతమైన వ్యక్తిత్వం భారత ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు నాకు ప్రత్యేకంగా ప్రశంస నందిస్తూ లేఖ పంపించారు. అది ఒక మధురమైన జ్ఞాపకం.

అలాగే ప్రముఖ సినీ కవి రచయిత బిక్కి కృష్ణ గారు ఈ పుస్తకానికి గిడుగు రామమూర్తి పంతులు జాతీయ పురస్కారం అందించారు.

అలాగే పద్మశ్రీ కొలకలూరి ఐనాక్ గారు 'ముచ్చటేస్తోంది నీ భాషాభిమానం చూస్తుంటే'
అని పలికిన పలుకులు, అలాగే డాక్టర్ తిరునగరి గారు, డాక్టర్ కాలువ మల్లయ్య గారు, వంగపల్లి విశ్వనాధం గారు, కవి యాకుబ్ గారు, ప్రజాకవి జయరాజు గారు, తెలుగు భాషా విమర్శకుడు భాషా శాస్త్రవేత్త కోవెల సుప్రసన్నాచార్యులు గారు, ప్రొఫెసర్ డాక్టర్ బన్న ఐలయ్య గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ గారు,
అలాగే తెలుగు రాష్ట్రాలలో ఉన్న చాలామంది పెద్దలు,భాషాభిమానులు దేశ విదేశాలలో నుండి అందించే ప్రశంసలు మర్చిపోలేను.

8. భవిష్యత్తులో ఇంకా ఏమి వ్రాయబోతున్నారు?
చదువును మించిన ఆయుధం లేదని ప్రకటించి, పాటించి, అనేక రకాలుగా విజయాలను సాధించి, మన జీవితాలలో వెలుగులు నింపిన మహోన్నతమైనటువంటి మహానుభావులందరి మాటలను, జ్ఞాపకాలను, తత్వాలను - పరిశీలిస్తూ, పరిశోధిస్తూ, చదువుతూ నిరంతరం విద్యార్థిగా సాగాలనేదే నా భవిష్యత్ ప్రణాళిక మరియు నా ఆకాంక్ష.
అలాగే నాకు తెలిసిన విషయాన్ని, అనుభవాన్ని, పరిచయాలను వివిధ రూపాలలో
కవితలుగా, గేయాలుగా, పాటలుగా, వ్యాసాలుగా ముద్రిస్తూ వస్తున్నాను. మున్ముందు కూడా ఇదే ప్రయత్నం చేస్తాను.

ఇప్పటికే ప్రచురింపబడిన పుస్తకాలు
1. అక్షరం సాక్షిగా... (కవితా సంపుటి)
2. కన్నీళ్ల పంటలు (దీర్ఘ కవిత)
3. ఆ పది జిల్లాలు - ఆపద జిల్లాలు
(తెలంగాణ ఉద్యమ నేపథ్య సందర్భంలో రాసిన దీర్ఘ కవిత)
4. అక్షరాభ్యాసం తెలుగువాచకం
5. అక్షరామృతం (గేయ సంపుటి)
ఈ అక్షరామృతం గేయాలు 1000 గేయాలు రాయబోతున్నాను.

ముందుగా అక్షరామృతం గేయాలు 101
తెలుగులో పూర్తి చేశాను. ఈ గేయాలు హిందీ, ఇంగ్లీషులోకి కూడా అనువదించబడ్డాయి.
అక్షరామృతం గేయాలు మూడు భాషలలో మన ముందుకు వచ్చాయి.

ఇక రాబోతున్న పుస్తకాలు...
1. అక్షర స్వరం (కవితా సంపుటి)
2. అక్షర కోకిల (గేయ సంపుటి)
3. అక్షర భారతి (వ్యాస మాలిక)
4. అలికిన అక్షరాలు (కలిపి రాతలు)

ఇప్పటికైతే ఇవి. మరికొన్ని త్వరలో మీ ముందుకు వస్తాయని తెలియజేస్తూ... ఈ రచనలన్నీ మీ ఆదరణ వల్లనే ఈ ఘనతను సాధించాయని, నాకు వచ్చే ప్రతి ప్రశంస, అభినందన అది తెలుగు భాషాభిమానులైన పాఠకుల వల్లనే వచ్చిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సందర్భంగా
ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు.

ఇప్పటిలాగే ఇక ముందు కూడా నన్ను ఆశీర్వదిస్తూ, ఆదరిస్తూ నన్ను ముందుకు నడిపిస్తారని నా తెలుగు పాఠకులందరికీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ...
అక్షరం ప్రభాకర్ 
మానుకోట
9951537533

***

No comments:

Post a Comment

Pages