సీతాపతి సంసారంలో సరిగమలు!... - అచ్చంగా తెలుగు

సీతాపతి సంసారంలో సరిగమలు!...

Share This

సీతాపతి సంసారంలో సరిగమలు!...

కె.వి.సుమలత





"ఒరేయ్ సీతా! ఎక్కడున్నావురా? ఎంత సేపటి నుండి పిలిచినా పలుకవేంట్రా?" అంటూ అరుస్తూ హాల్లోకి వచ్చింది కాంతమ్మ.

"ఏమయింది అత్తయ్య గారు? ఎందుకలా అరుస్తున్నారు?" అంటూ వంటగదిలో నుండి చెయ్యి తుడుచుకుంటూ వచ్చింది భాను.

"నీకు అరుపుల్లా వినిపిస్తున్నాయా?" బుస్ బుస్... అంటూ ఆయాసంగా వగరుస్తూ అంది కాంతమ్మ.

"అదేంటి? మీరు బుస కొడుతున్నారు? మీ నోట్లో పళ్ళు పెట్టుకోలేదా? అందుకే బుస బుస మని శబ్ధం వస్తుంది" అని ఘోళ్లున నవ్వింది భాను.

కాంతమ్మ పళ్లకు ఇన్ఫెక్షన్ రావడంతో సర్జరీ చేసి పళ్ళన్నీ తీసేసి సెట్టు అమర్చారు.

"అదే... నా పళ్ళు ఏమయ్యాయని అడుగడానికే వచ్చాను. నీకు నేనంటే బాగా ఎగతాళి ఎక్కువయింది..." కోపంగా అంది కాంతమ్మ.

"అది కాదు అత్తయ్య గారు! మీరు మాట్లాడుతుంటే నిజంగానే పాము బుసలా వినిపిస్తుంది. ఈయనేంటి... కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నారా? మనం ఇంత పెద్దగా మాట్లాడుతున్నా పట్టించుకోవడం లేదు" అని సీతాపతిని తట్టింది భాను.

"ఒరేయ్ సీతా! నీ పెళ్ళాం నన్ను వేళాకోళం చేస్తున్నా నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావా? రాను రాను నేనంటే లెక్కలేకుండాపోతోంది" కోపంగా అంది కాంతమ్మ.

"బుష్ బుస్స్... ఎక్కడో పాము బుస కొట్టినట్లు వినబడుతుంది... ఎక్కడ ?" భార్య తట్టడంతో స్పృహ లోకి వచ్చాడు సీతాపతి.

"చూసారా అత్తయ్య గారు! మీరు నేనే బుస బుస అన్నానన్నారు" చీర చెంగు అడ్డు పెట్టుకొని నవ్వుతుంది భాను.

"నన్ను వెక్కిరిస్తున్నారా? ఇక ఈ ఇంట్లో నాకు విలువ లేనట్లే... ఏదయినా ఆశ్రమానికి వెళ్లిపోతాను" అని గిర్రున వెనక్కు తిరిగింది కాంతమ్మ.

"అమ్మా! అలా అలగబాకే! నువ్వంటే నాకు చాలా ఇష్టమని నీకు తెలుసు. నేను బతికుండగా నిన్ను ఏ ఆశ్రమానికి  పంపను. నువ్వు నా దగ్గరే ఉండాలి... నా పిల్లలను పెంచాలి. అసలు నీకు కోపం ఎందుకొచ్చింది? భానూ! మా అమ్మను ఏమైనా అన్నావా?" కంగారుపడుతూ అన్నాడు సీతాపతి.

"నువ్వూ అన్నావుగా బుస్ బుస్ అని... ఎక్కడున్నాడో మీ నాన్న? ఆయన పేరు పెట్టుకున్నానని నెత్తిన పెట్టుకొని చూసుకుంటే నన్ను వెక్కిరిస్తున్నావు?" బుడి బుడి రాగాలు తీస్తుంది కాంతమ్మ.

"అదుగో... బుస్ స్ స్.. నీ నోట్లో నుండి వస్తుందా? అమ్మా! నన్ను క్షమించవే! నేను పాము బుస అనుకున్నాను. ఇంతకీ నీ నోట్లో పళ్ళ సెట్టు ఎందుకు పెట్టుకోలేదు? " చేతులు పట్టుకొని బ్రతిమిలాడాడు సీతాపతి.

"అది కనబడకే కదా నేను వెతుకుతుంది? రాత్రి నీళ్ళల్లో వేసి మంచం దగ్గర పెట్టుకున్నాను. ఉదయం నుంచి వెతుకుతుంటే దొరకడం లేదు." బుష్... బుస్ అంటుంది కాంతమ్మ.

"నువ్వలా బుస కొట్టబాకే అమ్మా! నీ పళ్ళు ఎక్కడకూ పోవు. భానూ! నువ్వు ఎక్కడయినా చూసావా? " అన్నాడు సీతాపతి.

నేను చూడలేదని తల అడ్డంగా ఊపింది భాను.

"మరేమయ్యాయి? వాటికి రెక్కలొచ్చి ఎగిరిపోయాయా?" అంటూ కాంతమ్మ గదంతా హడావిడిగా వెతికాడు సీతాపతి.

ఉహూ... పళ్ళ సెట్టు ఎక్కడా కనిపించలేదు.

"అందరూ కోమట్లే, కోడి కనిపించడం లేదు అన్నారట. ఎవరూ తీయకుండా మoచం కింద పెట్టుకున్నవి ఎలా పోయాయి?" అన్నది కాంతమ్మ.

"భానూ! పిల్లలెక్కడ? వాళ్లేమైనా తీసారంటావా?" అన్నాడు సీతాపతి.

"అటు తిప్పి ఇటు తిప్పి పిల్లల మీదకు తెస్తున్నారా? వాళ్ళు ఇటు వైపుకి రానే రాలేదు" ముఖం మాడ్చుకుని అంది  భాను.

"వాళ్ళు ఈ మధ్య చాలా అల్లరి చేస్తున్నారు...క్రమ శిక్షణలో పెట్టుకోమంటే మీరు పట్టించుకోవడం లేదు." రుస రుస లాడుతూ అంది  కాంతమ్మ.

"అబ్బే! వాళ్ళు ఉదయం నుంచి బయటే ఆడుతున్నారమ్మా! పిల్లలయుండరు" అన్నాడు సీతాపతి.

"నోరు మూసుకోరా సీతా! కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నావు... నీకు ఇంట్లో విషయాలు కూడా తెలుసా? అసలు అంత కొంపలు మునిగే ఆలోచనలేంటి?" బుస కొడుతోంది కాంతమ్మ.

"అమ్మా! అదేంటో చెప్తే నువ్వు మళ్ళీ కోపడతావేమో?" అనుమానపు చూపులు చూస్తున్నాడు సీతాపతి.

"నీ పెళ్ళాం మాటలు విని అంత తప్పు ఆలోచనలు చేస్తున్నావా?" మళ్లీ బుస కొడుతోంది కాంతమ్మ.

"అదుగో! భూమి గుండ్రంగా ఉన్నట్లు చుట్టూ తిరిగి మళ్ళీ నా దగ్గరకే వచ్చి ఆగారా?" కోపంగా అంది భాను.

"నిన్ను కాదు అనాల్సింది, వీడిని అనాలి... పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవడం చేత కాదు. పిల్లలనూ అదుపులో పెట్టుకోవడం చేత కాదు" అంది కాంతమ్మ.

"అమ్మా! నాకు నువ్వంటే ఇష్టం... భాను అన్నా ఇష్టమే. నాకిష్టమైన మీ ఇద్దరూ ఎప్పుడూ గొడవ పడుతుంటే నాకు నచ్చడం లేదు. ఎలా మీ ఇద్దరినీ ఎలా ఒకటి చేయాలాని ఆలోచిస్తున్నాను" దీనంగా మొహం పెట్టి అన్నాడు సీతాపతి.

అప్పుడే లోపలకు పరుగులు తీస్తూ మున్నా , కన్నా వచ్చారు.

"నానమ్మా! నువ్వు అచ్చు పాములా  బుస్ బుస్ అంటున్నావేంటి?" అన్నాడు మున్నా.

"ఒరేయ్! నీకు కూడా నేను లోకువయిపోయానా? ఇంత అవమానం జరిగాక నేనుండను గాక ఉండను" అంటూ లోపలకు వెళ్ళబోయింది కాంతమ్మ.

"అమ్మా! చిన్న పిల్లవాడు! వాడి మాటలు పట్టించుకుంటే ఎలా?.. నేను నీ పళ్ళ సెట్టు వెతికిస్తాగా?" అంటూ గడ్డం పట్టుకున్నాడు సీతాపతి.

"మున్నా, కన్నా ! మీరు నానమ్మ పళ్ళు తీయలేదని ఆవిడకు చెప్పండి. మీరు తీసారనుకుంటున్నారు" పిల్లలతో అంది భాను.

పిల్లలిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. వాళ్ళల్లో తడబాటు కనిపిస్తుంది. అది కాంతమ్మ కనిపెట్టేసింది.

"ఒరేయ్ భడవల్లారా! నా పళ్ళు ఎక్కడ పెట్టార్రా?" బుస్ బుస్ మంటుంది కాంతమ్మ.

"నువ్వలా అనకు నానమ్మా! నాకు భయమేస్తుంది" అన్నాడు మున్నా.

"తియ్యనప్పుడు మీరు భయపడకూడదు మున్నా" అంది భాను.

"మరేమో! నా పన్ను ఊడిపోయినప్పుడు ఇంటి మీద పడేసి ఏదయినా కోరిక కోరుకుంటే దేవుడు తీరుస్తాడు అని అమ్మ చెప్పింది. మా పళ్ళు ఊడటం లేదని నీ పళ్ళు తీసుకోవాలనుకున్నాం" అన్నాడు మున్నా.

"నేను చెప్పానా? పిల్లలు తీసి ఉంటారని, అలాగే తీసారు" సాగదీస్తూ అంది కాంతమ్మ.

"నానమ్మ! మేము తీయలేదు, ఇప్పుడు తీసుకుందాం అనుకున్నాం" అన్నాడు కన్నా.

"బాబ్బాబు! అబద్ధాలు చెప్పకండిరా! నేను ఏమీ అనను కానీ నానమ్మ పళ్ళు ఇచ్చేయండిరా" అన్నాడు సీతాపతి.

"మీరు అనోవసరంగా పిల్లల మీద అభాండాలు వేయకండి " అంటూ వేగంగా పిల్లల దగ్గరకు రాబోయిన భాను కాలు మెలి తిరిగి పడిపోయింది.

"అయ్యో! నీకు అన్నింటికీ తొందరే!" అంటూ పట్టుకుంది కాంతమ్మ.

"అమ్మో! అమ్మో!" అంటూ కాలు నెప్పితో విల విల లాడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు సీతపతి.

 అమ్మ ఏడుస్తుంటే బిక్క ముఖాలతో నిలబడ్డ పిల్లలను దగ్గరకు తీసుకుంది కాంతమ్మ.

మూడు గంటల తరువాత ఇంటికి వచ్చిన సీతాపతి, భానులకు హాల్లో మున్నా,కన్నాలకు కథ చెపుతూ అన్నం తినిపిస్తున్న కాంతమ్మ కనిపించింది.

పాపం! బోసి నోటితో పలుకలేక బుస కొడుతున్నట్లు మాట్లాడుతోంది. మున్నా, కన్నా పక పక నవ్వుతున్నారు. పిల్లలు ఎంత ఏడుస్తున్నారో అనుకుంటూ వచ్చిన వారిద్దరికి ఆ దృశ్యం చూస్తుంటే ఆనందం కలిగింది.

"కాలుకి కట్టుకట్టినట్లున్నారు, విశ్రాంతి తీసుకో భాను! వంట అయిపోయింది, సీతా! అమ్మాయికి అన్నం పెట్టివ్వు, తిని మందులు వేసుకుంటుంది" అంది కాంతమ్మ.

ఆ మాటలకు భాను ఆశ్చర్యపోయింది.
సీతాపతి కూడా అయోమయంగా చూస్తూ వంట గదిలోకి వెళ్ళి కంచంలో అన్నం, కూరలు వేసి భానుకి తెచ్చిచ్చాడు. 

భాను మాట్లాడకుండా తినేస్తుంది అత్తగారి వంక చూస్తూ.

"అమ్మా! భాను కాలు బెనికిందని డాక్టర్ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలని అన్నారు. పనమ్మాయిని ఇంట్లో ఉండమని అడుగుదాము... నీకు పళ్ళ సెట్టు దొరకలేదు కదా అన్నం ఎలా తింటావు?" అన్నాడు సీతాపతి.

"నేనుండగా భాను కోసం మరొకరు ఎందుకు? నా తిండి గురించి నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను" అని పిల్లలకు అన్నం పెట్టడం పూర్తి చేసి లేచింది కాంతమ్మ.

ఆ రోజు నుండి కాంతమ్మ ఎక్స్ ప్రెస్ లాగా పిల్లలకు కావలసినవి, భానుకి కావలసినవి అన్నీ సమయానికి అమర్చిపెట్టేది. అత్తగారిని అలా చూస్తున్న భానుకి కొత్తగా కనిపించడం మొదలైంది. అత్తగారంటే భర్తకు ఇష్టమని అత్తగారoటే గిట్టదు భానుకి.

బోసి నోటితో కాంతమ్మ మాట్లాడుతుంటే భానుకి నవ్వు రావడం లేదు. మున్నా, కన్నాలకు పళ్ళు ఊడిపోతే ఎలా కనిపిస్తున్నారో అలాగే అనిపిస్తుంది. పిల్లలు, భర్త కూడా ఇంట్లో గొడవలు లేకుండా  ప్రశాంతంగా కనిపిస్తున్నారు. తను ఆమెను ఎంత దూరం పెట్టి గొడవలు చేసినా నవ్వుతూ తనకు సేవలు చేస్తున్న అత్తగారిలో ఇప్పుడు అమ్మ కనిపిస్తుంది. మనసoతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. 

భాను కాలు నెప్పి నాలుగు రోజుల విశ్రాంతితో తగ్గలేదు, వారం రోజుల సమయం పట్టింది. వారం రోజుల్లో ఒక్కసారి కూడా అత్తగారు భాను మీద  విసుక్కోలేదు. 

అత్తగారి పళ్ళ సెట్టు సంగతి భాను  రెండు మూడు సార్లు సీతాపతికి గుర్తు చేసినా పట్టించుకోలేదు. 

నడవడం వచ్చాక వంట గది లోకి వచ్చిన భాను" అత్తయ్యా! మీరు నన్ను క్షమించాలి! నేను ఒక తప్పు చేసాను" అంది.

"ఏమిటది? పళ్ళ సెట్టు దాయడమా?" అంటుంది బోసినోటితో బుస కొడుతూ.

"అది మీకెలా తెలుసు? " అవాక్కయింది భాను.

"అమ్మకే కాదు నాకూ తెలుసు, నువ్వు బియ్యం డ్రమ్ము వెనుక దాచిన గిన్నె మనం ఆసుపత్రికి వెళ్ళిన రోజే అమ్మ చూసింది. బియ్యం చేజారితే శుభ్రం చేయడానికి డ్రమ్ము తీయడం వల్ల చూసింది. నేను ఆస్పత్రికి వెళ్దాం అని అడిగితే నీ పేరు చెప్పకుండా ఎలుకలు ఇక్కడ దాచాయని చూపించింది. కానీ నాకే అర్థమయింది అది నీ పనేనని... నిన్ను అడగవద్దని అమ్మ చెప్పడంతో అడగలేదు" అప్పుడే అటుగా వచ్చిన సీతాపతి నవ్వుతూ అన్నాడు.

"అత్తయ్యా! ..." అంది ప్రేమగా భాను.

"భాను! నా పళ్లసెట్టు నువ్వు దాచి పెట్టడం కూడా మంచిదే అయింది కదా?" అంది అందంగా బోసి నోటితో కాంతమ్మ.

"నేను తప్పు చేసి మిమ్మల్ని ఏడిపించాలనుకున్నా మీరు నన్ను ప్రేమతో ఏడిపిస్తున్నారు "అంది చెమర్చిన కళ్లతో భాను.

"హమ్మయ్యా! నా కోరిక నెరవేరిందోచ్!" అన్నాడు సీతాపతి ఆనందంగా!...

*****

No comments:

Post a Comment

Pages