ఒకటైపోదామా ఊహల వాహినిలో - 9 - అచ్చంగా తెలుగు

ఒకటైపోదామా ఊహల వాహినిలో - 9

Share This

 ఒకటైపోదామా ఊహల వాహినిలో - 9 

కొత్తపల్లి ఉదయబాబు


విరాజ్ సన్నగా అందంగా ఉన్నాడు.  కావలసినంత డబ్బుంది. చూసిన వెంటనే అచ్చమైన మగాడు అనిపించే 'మగటిమి' ఉన్నది. తన తండ్రితోనే   కాదు... నిర్మలంగ తన ప్రేమను ధైర్యంగా వ్యక్తం చేసే మనస్తత్వం ఉంది. ఇంతకన్నా ఒక సగటు ఆడపిల్లకేం కావాలి?

తాను ప్రేమించిన వాడికన్నా తనను ప్రేమించే వాడి దగ్గర ప్రతి ఆడపిల్ల ఎంతగానో సుఖపడుతుంది... అని ఏదో ఒక ప్రేమ నవలలో చదివింది.

 ఆడది ఎంత చదువు చదివినాచివరికి ఒక మగవాడి పంచన చేరితే ఆమె జన్మ చరితార్ధం అర్థమవుతుంది.

 విరాజ్ ఏమన్నాడు? తనను తలుచుకుంటేనే అతని రక్తం ఉత్సాహంతో ఉరకలేస్తోందట.

 ఒకవేళ తాను ఒప్పుకుంటే మూడేళ్ల పాటు ప్రేమించుకోవాలట. ఒకరి మనసులొకరు పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలట.

ఇలాంటి విపరీత పరిస్థితి వచ్చినప్పుడు  తన తండ్రి ఉండి ఉంటే ఏం చేసేవాడు?

 ఆమెకి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తన చిన్నతనంలో ఆటలు చాలా బాగా ఆడేది. ముఖ్యంగా 'టచ్ మీనాట్' ఆట చాలా బాగా ఆడేది. మగపిల్లలతోపాటు సమానంగా పరిగెత్తి  వారిని అవుట్ చేసినప్పుడు మిగతా వాళ్ళంతా తనకేసి ఎంతో ఆరాధనగా చూసేవారు.

 " అమ్మా! హరితా! ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. కనిపించని ఆకాశానికి కూడా హద్దు ఉంది కాబట్టి భూమి గుండ్రంగా ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

 ఆంక్షలు పెట్టి నిన్ను నిరుత్సాహపరచను గాని  ఈ సమాజం పురుషాధిక్య సమాజం. తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం లక్ష్మణ రేఖ దాటిన సీతాదేవి ఎన్ని కష్టాలు పడిందో  నీకు రామాయణం చెప్పినప్పుడు వివరించాను.

 ఆమె ఆ క్షణాన ఆ గీత దాటకుండా ఉంటే రామాయణం మరోలా ఉండేది.

 అందుకే ఒక హద్దు దాటబోయే ముందు దాటితే ఏమవుతుంది దాటక పోతే ఏమవుతుంది? అని రెండు విధాలుగా ఆలోచించగలిగినప్పుడే నీ ఆలోచన పదునెక్కుతుంది. ఆలోచించాక  దేనిని ఆచరిస్తే బాగుంటుంది? అని బేరీజ్ వేసుకొని  మనకు అనుకూలమైన విధంగా ఆచరించడం మనిషి కనీస ధర్మం.

 అలాగే తనను చూసి నవ్విన ద్రౌపదిని కురుసభకు ఈడ్చుకువచ్చి ఈ భూమి మీద ఏ చరిత్రలోను లేని విధంగా  ఏకవస్త్ర అయిన  తనను అవమానపరచినఇద్దరు మగవాళ్ళు ..ఒకడు దుర్యోధనుడు, మరొకడు అన్నగారి ఆదేశానుసారం ఆమెచీరకొంగును పట్టుకుని ఆమెను సభలో పరుగెత్తించి వివస్త్రను చేయబోయిన దుశ్శాసనుడు. వారిద్దరిని   భీముడు  యుద్ధభూమిలో చంపుతానని ప్రతిజ్ఞ చేసినపుడు ...వాడి చేయి తాకిన తన కురులను వాడు మరణించాకనే ముడి వేసుకుంటానని ప్రతిజ్ఞ పట్టిన వీరనారి ఆమె. యుద్ధభూమిలో ఆ దుశ్శాసనుడి గుండెలు చీల్చి ఆ రక్తాన్ని ద్రౌపది కురులకు రాసాకనే ఆమె మం శాంతింపచేసుకుని జుట్టు ముడి వేసుకుంది. తన అయిదుగురి భర్తల ప్రేమను అంతగా చూరగొన్న ఆమె ఎంతటి అదృష్టవంతురాలు?

 అందుకే ప్రతి విషయంలోనూ  బాగా ఆలోచించి  స్థిరమైన మనసుతో నిర్ణయం తీసుకోవాలి. అలాంటి తెలివితేటలు పెంచుకున్న కూతుర్ని నేను చూడాలనుకుంటున్నాను. " అని తన వెన్ను తట్టి ప్రోత్సహించిన రోజు తన జీవితాంతం మర్చిపోదు.

 " హరిత ఏం చేస్తున్నావ్? ఆ చదువుతున్న పుస్తకం తీసుకొని ఇలా రా!" శకుంతల గట్టిగా అరిచిన అరుపు విని రసాయశాస్త్రం నోట్స్ తీసుకుని తల్లి దగ్గరికి వచ్చింది హరిత -  " ఏంటమ్మా? " అంటూ.

 " ఏం ప్రశ్న చదివావో అది నాకు అప్పగించు " హరిత ఊహించని విధంగా పుస్తకం లాక్కొని అడిగింది శకుంతల.

 తల్లి ప్రవర్తనకి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది హరిత.

" ఇది ఏంటమ్మా ఎప్పుడో పదో తరగతిలో ఇలా అడిగావు. నా మీద నమ్మకం లేదా? "

" ఎందుకు కంగారు పడుతున్నావ్? గంట నుంచి చదువుతున్నావ్ గా...  చదివితే అప్పగించు." నార్మల్ గా అడిగింది శకుంతల.

 " నువ్వేమీ అనుకోనంటే ఒక్క మాట. గంట నుంచి పుస్తకం ముందేసుకుని కూర్చున్నా ఒక ముక్క కూడా ఎక్కలేదమ్మా. "

 " అతను చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ కూర్చున్నావు కదూ". కూతురు తల నిమురుతూ అడిగింది శకుంతల. 

హరిత మాట్లాడలేదు. నిశ్శబ్దంగా తలవంచుకుంది.

" చూసావా హరిత. మగవాళ్ళ మాటలు నాదస్వరంలా అలా ఉంటాయి. ఒక లక్ష్యంతో ఆడది చదువుకుంటూ ఉంటే ఆ మార్గాన్ని పక్కదోవ పట్టించి నీ లక్ష్యాన్ని దెబ్బతీసే  మాటలు అవి.

 అతని చదువు అయిపోయింది. చేసుకోవడానికి ఒక వ్యాపారం ఉంది.  పెళ్లి చేసుకునే వయసొచ్చింది. అందుకే  తెలివిగా  వాళ్ల నాన్న అతన్ని  కాలేజీ మీదికి పంపాడు.

వార్షికోత్సవంలో నీలాంటి కాస్త కూస్తో తెలివైన వాళ్ళు, బాగా చదువుకునేవాళ్లు బహుమతులు తీసుకుంటారు. వాళ్లలో నీకు నచ్చిన అమ్మాయిని ఎన్నుకో... అని పంపించాడన్నమాట. వెర్రిమాలోకానివి నువ్వు దొరికావు.

అతను ఇంటికి వచ్చి నాలుగు మాటలు చెప్పేసరికి నీ లక్ష్యాన్ని మర్చిపోయే ఆలోచనలో పడ్డావు. ఆడపిల్ల అలా ఆలోచనలో పడింది అంటే తన పతనం మొదలైంది అన్నమాట."

తల్లి మాట పూర్తిగా కుండానే చివ్వున తలెత్తిన హరిత కళ్ళల్లో నీళ్లు.

" సారీ మమ్మీ. నేనేం తప్పు చేశానో నాకు అర్థమైంది. నన్ను ...నన్ను క్షమించు.''

'' ఆమాటే నీ నోట వినకూడదు. మనిషి జీవితం భగవంతుడు ఇచ్చిన వరం. మళ్ళీ జన్మలో  జీవులలోకెల్ల ఉత్తమమైన ఈ మానవ జన్మ పొందుతామో లేదో తెలియదు.

మిగతా ప్రాణులకీ మనకీ ఉన్న తేడా ఒక్కటే. మనం ఆలోచించగలం. అటు మంచిగా, ఇటు చెడుగా కూడా. చెడుగా ఆలోచించి, చెడుగా జీవించి చచ్చిపోయేకన్నా పదిమందికి మనకు చేతనైన సాయం చేసేలా బ్రతకడం ఎంత మంచిది?

అదికూడా మనవల్ల కాకపోవచ్చు. కనీసం మనకోసం మనం ఒక పద్దతిగా, ప్రణాళికతో ఆలోచించి ఆచరించి బ్రతకలేకపోతే ఈ జన్మకి అర్ధమే లేదు. నువ్వు నాన్నగారికి ఇచ్చిన మాట గుర్తు ఉందా?''

 ఉంది అన్నట్టు కన్నీళ్ల కళ్ళతోనే తల ఆడించింది హరిత.

''ఎపుడో చనిపోయిన ఆయన చూస్తాడా? ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఏమవుతుంది? అని కూడా నీకు ఆలోచన రావచ్చు.

చక్కగా ఆలోచించి ప్రతీ పనీ చేసుకుపోయే మనిషికి అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. అది మనం తప్పు చేయాలనుకున్నప్పుడల్లా తుమ్మ ముళ్ళులా గుచ్చి ప్రశ్నిస్తూనే ఉంటుంది. చేసిన పని సరిదిద్దుకోలేక, అంతరాత్మకు సమాధానం చెప్పుకోలేక మనకు మనమే ప్రత్యక్ష నరక యాతన అనుభవించాల్సి వస్తుంది.

ఆ పరిస్థితి తెచ్చుకోవడం అవసరమా ? ఒక్కసారి ఆలోచించుకో తల్లీ...

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages