నరసింహ శతకము - కాకుత్థ్సం శేషప్పకవి - అచ్చంగా తెలుగు

నరసింహ శతకము - కాకుత్థ్సం శేషప్పకవి

Share This

నరసింహ శతకము - కాకుత్థ్సం శేషప్పకవి

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 






కవి పరిచయం:

కాకుత్థ్సం శేషప్పకవి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు కవి. 18 వ శతాబ్ధికి చెందినవాడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతానికి చెందినవాడు. చాత్తాద వైష్ణవుడు. ధర్మపురిలోని నరసింహాస్వామికి జీవితాన్ని అంకితం చేసినవాడు. నూతన పరిశోధనల ప్రకారం ఈ కవి పూర్వీకులు బహుశా ఆదిలాబాదు జిల్లా నిర్మల్ ప్రాంతంలోని మోటాపురం నుండి ధర్మపురికి వలవచ్చినట్లు తెలుస్తున్నది. మరికొన్ని ఆధారలప్రకారం ఈకవి క్రీ.శ. 1735లో పుట్టి 1875లో మరణించినట్లు తెలుస్తున్నది. ఈకవి ధర్మపురి క్షేత్రంలో వెలసిన నరసింహస్వామిపై అనేక రచనలు చేశాడు. ఈరచనల ఆధారంగా ఈ కవి పేదవాడనీ, భక్తుడనీ, దేశపరిస్థితులను ఎరిగిన వాడనీ తెలుస్తున్నది. శతకంలోని పద్యములలో శ్రీ మహావిష్ణువును సంబోధించడంలో మృదుత్వం, కాఠిన్యం, బెదిరింపు, కోపము జూపి తన భక్తి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. వీరి రచనలు 1.నరహరి శతకం, 2. ధర్మపురి రామాయణం, 3. శ్రీనృకేసరి శతకం, 4. నరసింహ శతకం 5. అవనిజా చరిత్రము.

శతక పరిచయం:

"భూషణవికాస! శ్రీధర్మపురనివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!" అనేమకుటంతో ధర్మపురి క్షేత్రంలో కొలువైన నరసింహస్వామిని సంబోధిస్తు నూరు సీస పద్యాలలో రచింపబడిన ఈశతకం భక్తిరస ప్రధానమైనది.  శతకసాహిత్యంలో అత్యంత ప్రజాదరణపొందిన వేమన, సుమతి, మొదలైన శతకాలకోవలోకి ఈశతకం కూడా  వస్తుంది. చాలమంది ఈశతకాన్ని పారాయణగా చేసేవారంటే ఈశతకానికి ఎంత ప్రజాదరణ ఉన్నాదో అర్థం అవుతుంది.
ఈశతకంలోని భాష సరళం. సామాన్యులకు సైతం సులభంగా  అర్థం అయ్యేరీతిలో ఉండటం వలన అత్యంత విశేషాదరణ పొందింది.

కొన్ని పద్యాలను చూద్దాము.

సీ. శ్రీమనోహర సురార్చిత సింధుగంభీర, భక్తవత్సల కోటిభానుతేజ
కంజనేత్రహిరణ్యకశ్యపాంతక శూర, సాధురక్షణ శంఖచక్రహస్త
ప్రహ్లాదవరద పాపధ్వంస సర్వేశ, క్షీరసాగరశయన కృష్ణవర్ణ
పక్షివాహన నీలభ్రమరకుంతలజాల, పల్లవారుణపాదపద్మయుగళ
తే. చారుశ్రీచందనాగరుచర్చితాంగ
కుందకుట్మలదంత వైకుంఠధామ
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

సీ. నరసింహ నీదివ్యనామమంత్రముచేత, దురితజాలములన్నిఁ దోలవచ్చు
నరసింహ నీదివ్యనామమంత్రముచేత, బలువైన రోగముల్ బాపవచ్చు
నరసింహ నీదివ్యనామమంత్రముచేత, రిపుసంఘముల సంహరింపవచ్చు
నరసింహ నీదివ్యనామమంత్రముచేత, దండాహస్తునిబంట్లఁ దఱుమవచ్చు
తే. భళిర నే నీమహామంత్రబలముచేత
దివ్యవైకుంఠపదవి సాధింపవచ్చు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

సీ. నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకుఁ, గమలవాసిని మమ్ముఁ గన్నతల్లి
నీభక్తవరులంత నిజమైన బాంధవుల్, నీకటాక్షముమాకనేక ధనము
నీకీర్తనలు మాకు లోకప్రపంచంబు, నీసహాయము మాకు నిత్యసుఖము
నీమంత్రమే మాకు నిష్కళంకపువిద్య, నీపదధ్యానంబు నిత్యజపము
తే. తోయజాతాక్ష నీపాదతులసిదళ్ము
రోగముల కౌషధము బ్రహ్మరుద్రవినుత
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

సీ. భువనరక్షక నిన్నుఁ బొగదనేరనినోరు, ప్రజకు గోచరమైన పాదుబొంద
సురవరార్చిత నిన్నుఁ జూడఁగోరనికనుల్, జలములోపల నెల్లిసరపుకనుల్
శ్రీరమాధిప నీకు సేవఁజేయనిమేను, కూలి కమ్ముడువోని కొలిమితిత్తి
వేడ్కతో నీకథల్ విననికర్ణములైనఁ గఠినశిలాదులఁ గలుగుతొలలు
తే. పద్మలోచన నీమీఁద భక్తిలేని
మానవుడు రెందుపాదాల మహిషమయ్య
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భక్తిరస ప్రధానమైన పద్యాలనేకాక శేషప్ప కవి ఆనాటి సమాజంలోని పరిస్థితులని కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. కొన్ని పద్యాలు చూద్దాము.

సీ. అధిక విద్యావంతులప్రయోజకులైరి, పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జనవిరోధంబాయె, వదరుపోతుల మాట వాసికెక్కె
ధర్మవాసనపరుల్ దారిద్య్రమొందిరి, పరమ లోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి, దుష్టమానవులు వర్ధిష్టులైరి
తే. పక్షివాహన! మావంటి భిక్షుకులకు
శక్తిలేదాయె నిక నీవె బాటుమాకు
భూషణవికాస శ్రీధర్మపురి నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

సీ. పరులద్రవ్యముమీఁద భ్రాంతినొందినవాడు, పరకాంతల నపేక్షపడెడువాడు
ఆర్థులవిత్తంబు లపహరిచెడువాడు, దానమియ్యంగ వద్దబెడువాడు
సభలలోపల నిల్చి చాడిచెప్పెడివాడు, పక్షపుసాక్ష్యంబు పలుకువాడు
విష్ణుదాసులఁజూచి వెక్కిరించెడువాడు, దర్మసాదులఁ దిట్టఁ దలఁచువాడు
తే. ప్రజల జంతుల హింసించుపాతకుండు
కాలకింకరగదలచేఁ గష్టమందు
భూషణవికాస శ్రీధర్మపురి నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఇప్పుడు ఈశతకం లోని కొన్ని అధిక్షేప పద్యాలను చూద్దాము

సీ. ప్రహ్లాదుఁ డేపాటిపైడికానుకలిచ్చె, మదగజం బెన్నిచ్చె మౌక్తికములు
నారదుం డెన్నిచ్చె నగలురత్నంబు ల, హల్య నీకేయగ్రహారమిచ్చె
ఉడుత నీకేపాటియూడిగంబులు చేసె, ఘనవిభీషణుఁ డేమికట్నమిచ్చె
పంచపాందవు లేమిలంచ మిచ్చిరినీకు, ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చె
తే. నీకు వీరందఱయునట్లు నేనుగాన
యెందుకని నను రక్షింప విందువదన
భూషణవికాస శ్రీధర్మపురి నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

సీ. వాంఛతో బలిచక్రవర్తిదగ్గఱఁ జేరి, భిక్షమెత్తితి వేల బిడియపడక
యడవిలో శబరి దియ్యనిఫలా లందియ్యఁ, జేతులొగితి వేల సిగ్గుపడక
వేద్కతో వేవేగ విదురునింటికి నేఁగి, విందుగొంటివదేమి వెలితిపడక
నడుకు లల్పము గువేలుఁడు గణించుక దేర, బొక్కసాగితి వేల లెక్కగొనక
తే. భక్తులకు నీవి పెట్టుట భాగ్యమౌను
వారికాశించితివి తిండివాఁడ వగుచు
భూషణవికాస శ్రీధర్మపురి నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

శెషప్ప  కవి ఢర్మపురి దేవాలయ కావలివానిగా పనిచేసేవాడని, సరియైన జీతభత్యములు లేక చాలకష్టాములు పడెడివాడని కథనము. అందుకు తార్కాణం ఈ క్రిందిపద్యాలుగా చెప్తారు.

సీ.కూటికోసరము నేఁ గొఱగానిజనులచే, బలుగద్దరింపులు బడఁగవలసె
దారసుతభ్రమ దగిలియుండఁగగదా, దేశదేశములెల్ల దిరుగవలసెఁ
బెనుదరిద్రత పైని బెనఁగి యుండఁగఁగదా, చేరి నీచులసేవ చేయవలసె
నభిమానములు మది నంటియుండగగదా, పరుల జూచిన భీతిపడగవలసె
తే. నిటుల సంసారవారధి నీఁడలేక
వేయువిధములనిన్ను నే వేడుకొంటి
భూషణవికాస శ్రీధర్మపురి నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

సీ.తిరుపతిస్థలమందు దిన్నగా నేనున్న, వేంకటేశుఁడు మేఁతవేయలేడొ
పురుషోత్తమమునకే బోయిన జాలు జ, గన్నథుఁ డన్నంబుఁ గడుపలేఁడొ
శ్రీరంగమునకు నేఁ జేరఁబోయినఁ జాలు, స్వామి గ్రాసముఁ బెట్టి సాఁకలేఁడొ
కాంచీపురములోనఁ గదిసి నేకొలువున్న, గరివరదుఁడు పొట్టఁ గడపలేఁడొ
తే> ఎందును బోవక నేను నీ మందిరమున
నిలిచితిని నీకు నామీద నెనరు లేదు
భూషణవికాస శ్రీధర్మపురి నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఇటువంటి అమూల్యమైన రత్నాలవంటి పద్యాలున్న ఈశతకం చాలా ప్రసిద్ధమైనది. మీరు చదవండి మీ మిత్రులచే చదివించండి.

No comments:

Post a Comment

Pages