చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 37(చివరి భాగం) - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 37(చివరి భాగం)

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 37(చివరి భాగం)

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mystery
నవలా రచయిత : Carolyn Keene
 


(మిసెస్ విల్సన్ ని దుండగుల బారి నుంచి రక్షించిన తరువాత, నాన్సీ, మిత్రులు ఆమెకు చంద్రమణిని పంపిన వ్యక్తిని పట్టుకోవాలని తీర్మానించుకుంటారు. చంద్రమణిని ఆ వ్యక్తి ఉత్తరంలో కోరినట్లుగా ఒక పొద దగ్గర వదిలి, చుట్టుపక్కల విడిగా దాక్కుని, పట్టుకొంటారు. ఆ వ్యక్తి న్యూయార్కులోని నాన్సీ మేనత్త యింట్లో పని చేసిన సెలియాస్మిత్ గా గుర్తిస్తారు. రూడీ రాస్పిన్ తన భర్త అని, అతను చేసే పనులు నచ్చక తాను చంద్రమణిని పంపుతూ ఆ లోయలో జరిగే కుతంత్రాలను ఆమెకు తెలియపరచాలని భావించినట్లు సెలియా చెబుతుంది. చంద్రమణి లోయలో ఒంటరి మహిళల యింట్లో పనివాళ్ళుగా చేరి, వారిని ప్రపంచానికి దూరం చేసి, ఆ మహిళల ఆస్తిపాస్తులను బలవంతంగా దోచుకోవటమే రాస్పిన్ బృందం లక్ష్యమని నాన్సీకి తెలుస్తుంది. నిర్మానుష్యమైన చంద్రమణి కోటను వారు తమ రహస్య స్థావరంగా చేసుకొన్నారు. అలాగే పసి పిల్లయైన జోనీ హర్టన్ని చిన్నప్పుడే అనాధాశ్రమం దగ్గర వదిలిపెట్టి, ఆమె స్థానంలో ఒమన్ దంపతుల కూతుర్ని రప్పించి, మిసెస్ హోర్ట్న్ ఆస్తిని దోచుకున్నారని బయటపడుతుంది. తరువాత . . ..)
@@@@@@@@@@@@@@@@

"వారు దీనిని సమావేశ స్థలంగా ఉపయోగించారని నాకు తెలుసు."

అకస్మాత్తుగా సెలియా పెదవి కొరుక్కొని, దృఢ నిశ్చయంతో అంది, "నేను రూడీ రాస్పిన్ వద్దకు ఎప్పుడూ తిరిగి వెళ్ళటం లేదు. నాకేమి జరిగినా నేను పట్టించుకోను. . . అతను దుర్మార్గుడని కనుగొన్నందుకు నేను సంతోషిస్తున్నాను. నన్ను క్షమించండి నాన్సీ! నేను ఈ కుంభకోణంలో కలసిపోయాను. చాలాకాలం క్రితమే నేను పోలీసుల వద్దకు వెళ్ళి ఉండాల్సింది."

"వారు మీ భర్తను ఎక్కడ కనుక్కోగలరో నాకు చెప్పండి" అంది నాన్సీ.

సెలియా ఏమాత్రం సంకోచించకుండా సమాధానం యిచ్చింది. "మేము ప్లెజెంట్విల్లే అన్న పక్క పట్టణంలో, మిస్టర్ హొరేస్ బోయిస్ అనే వృద్ధుడి దగ్గర పని చేస్తున్నాము. అతను బాగా సంపన్నుడు."

తమతో మరింత మాట్లాడటానికి మోటెల్లోని తమ గదికి రమ్మని సెలియాను నాన్సీ ఆహ్వానించింది. "నేను మీతో పాటు మీ కారు వద్దకు వస్తాను. దాన్ని లోపల పార్కింగు స్థలానికి నేనే నడుపుతాను" అందామె. జార్జ్ వైపు తిరిగి, "పోలీసులకు ఫోను చేసి, వాళ్ళకు రాస్పిన్ ఎక్కడ దొరుకుతాడో చెప్పు" అని గొణిగింది.

పది నిమిషాల తరువాత సెలియా మరియు ముగ్గురు అమ్మాయిలు పడకగదిలో కలుసుకున్నారు. మిసెస్ రాస్పిన్ కన్నీళ్ళు పెట్టుకొన్నప్పటికి, చివరకు తన మనస్సాక్షిని అనుసరించినందుకు ఉపశమనం పొందినట్లు కనిపించింది. నాన్సీ ప్రశ్నలకు జవాబిస్తూ, గూఢచారి డోనెల్లీ చేత డ్రూ యింటి నుంచి తరుమబడిన వ్యక్తి తన భర్తేనన్న నిజాన్ని ఆమె వెల్లడించింది. హోర్టన్ కేసులో తనను దోషిగా నిలబెట్టే పత్రాలేమన్నా దొరుకుతాయేమో వెతకటానికి అతను డ్రూ యింటిలో చొరబడాలనుకొన్నాడు. డీప్ రివర్ వెళ్ళకుండా నాన్సీని ఆపటానికి బోవెన్ దంపతులకు ఫోను చేసింది రాస్పినే!

ఒమన్ మిస్టర్ సీమన్ గా నటిస్తూ, తానెక్కడ పనిచేస్తున్నాడో ప్రజలకు తెలియకుండా ఉండటానికి కల్పించిన చిరునామా యిచ్చాడు. ఆమె డబ్బును ఒకే పెద్ద బాంకులో ఉంచితే సురక్షితంగా ఉంటుందని మిసెస్ హోర్టన్ని ఒప్పించాడు. అంతేగాక ఆమె సెక్యూరిటీలన్నీ యింట్లోని మందసంలో దాస్తేనే మంచిదని కూడా నమ్మబలికాడు. అందుకే ఆమె తన నిధులన్నింటినీ బదిలీ చేసింది.

మిసెస్ ఒమన్ ముసలామె హోర్టన్ పేరుతో రెండు నకిలీ పత్రాలపై సంతకం చేసింది. ఒకదానిలో తన మనుమరాలి న్యూయార్క్ నగర చిరునామాగా పేర్కొంది. మరొకదానిలో ఏకాంత ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించాలని అభ్యర్ధిస్తున్నట్లు వ్రాసింది. మిస్టర్ వీలర్ కి చూపించిన చీటీ యదార్ధమైనదైనా, నకిలీ జోన్ ఉపయోగించిన పత్రాలు మాత్రం ఆమె తల్లి చేత సృష్టించబడ్డాయి.

కోట సందర్శకుల గురించి, పోలీసులు తనిఖీల కోసం కోట వద్దకు వచ్చినప్పుడు సగ్స్, ఒమన్ దంపతులకు సంకేత సందేశాలు పంపుతుంటాడు. సందర్శకులు కోటలోకి రాకుండా దూరంగా ఉంచటానికి అతనే కందకంలో నీటిని నింపుతుంటాడు. కానీ నాన్సీ, జార్జ్ కందకం మీద వంతెనను కిందకు దించటాన్ని అతను చూడలేదు. అది పాడైపోయిందని అతను భావించాడు.

"మోటెల్ పార్కింగ్ స్థలంలో ఉంచిన నా కారుని ఎవరు తీసుకెళ్ళారో నువ్వు చెప్పగలవా?" నాన్సీ అడిగింది.

"తెలుసు. క్లారా ఒమన్ ఆ పని కూడా చేసింది. ఆమె, నా భర్త కలిసి మిస్టర్ వీలర్ని ఆసుపత్రి నుంచి ఎత్తుకొచ్చారు. మీరు దొంగ పేరుని వాడుతున్నట్లు మిసెస్ హేంస్టెడ్ కు చీటీ ద్వారా తెలియపరచాడు రూడీ. అది మీరు భయంతో పట్టణం వదిలి వెళ్ళిపోతారన్న యోచనతో చేసిన పని. మిమ్మల్ని, మీ స్నేహితుల్ని పడవలో అడ్డుకోవటానికి ప్రయత్నించింది అతనే!"

సుమారు గంట తర్వాత ప్లెసెంట్‌విల్లే పోలీసులు రూడీ రాస్పిన్ని అదుపులోకి తీసుకొన్నారని కబురు తెలిసింది. మరుసటిరోజు అతన్ని డీప్ రివర్కి తీసుకొస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని విని దాదాపుగా స్పృహ తప్పిన సెలియాను మోటెల్లోని మంచంపై పడుకోబెట్టారు. తెలివి తప్పిన ఆమె సంరక్షణను చూడటానికి కొంత, ఆమెను పారిపోకుండా చూడాలనే ఉద్దేశంతో కొంత నాన్సీ ఆమెతోనే ఉండిపోయింది. ఆమెను పోలీసులు ప్రశ్నించాలని అనుకొంటారని నాన్సీకి తెలుసు. మరునాడు ఉదయం యిద్దరు పోలీసు అధికారులు వచ్చి సెలియా రాస్పిన్ని తమతో తీసుకెళ్ళారు.

నాన్సీ తండ్రి బొవెన్ దంపతులతో వచ్చే సమయానికి ఆమె యింకా బయటకు వెళ్ళలేదు. శుభవార్త వినగానే వాళ్ళు సంతోషంలో తలమునకలయ్యారు.

"మా మనుమరాలు ఆనందంగా ఉందని విని మేము చాలా సంతోషిస్తున్నాం" అని మిసెస్ బొవెన్ చెప్పింది. "ఆరంస్ట్రాంగ్ దంపతులు అంగీకరిస్తే, మేము ఆమెతో మాట్లాడుతాం."

"నా భార్య, నేను క్రైస్తవ మత ప్రచారకులుగా తిరిగి ఆఫ్రికా వెళ్ళిపోవాలని నిర్ణయించుకొన్నాం. నిరుపేద ప్రజలకు సాయం చేయాలని మేము ప్రగాఢంగా వాంఛిస్తున్నాం" అని బొవెన్ అన్నాడు.

"నా సలహా ఏమిటని బొవెన్ దంపతులు నన్ను అడిగారు" డ్రూ చెప్పాడు. "మొత్తం కథను జోనీ తెలుసుకోవాలని నేను గాఢంగా కోరుకొంటున్నాను. అంతేగాక దొంగిలించబడ్డ ఆమె వారసత్వ సంపదను మనం తిరిగి పొందాలి."

ఒక పోస్టుకార్డు ఆధారంతో క్లైర్ అనబడే ఒమన్ ల కూతురు కాలిఫోర్నియాలో ఉందని గుర్తించినట్లు న్యాయవాది చెప్పాడు.

"మోసపూరితమైన మరియు నకిలీ పత్రాలను ఉపయోగించి జోనీగా తాను వ్యవహరించినట్లు ఆమె ఒప్పుకొంది. తన దగ్గర వారసత్వ సంపద ఏమీ మిగులలేదని క్లెయిర్ చెప్పింది. కానీ ఆమె మాటల్లో నాకు నిజాయితీ కనిపించలేదు. నేను ఆమెను కొన్ని ప్రముఖ ప్రశ్నలు అడిగాను. ఆ సొమ్ములో ఎక్కువ భాగం ఆమె తల్లిదండ్రులే ఉంచుకొన్నారని నేను భావిస్తున్నాను."

బెస్ మూలిగింది. "కానీ వారే ఆ సొమ్మును దాచి ఉన్నట్లయితే, దాన్ని ఎక్కడ దాచారో వారు ఎప్పటికీ చెప్పరు."

అకస్మాత్తుగా నాన్సీ కళ్ళు మెరిశాయి. "ఒమన్ దంపతులు, మిగిలిన దొంగలు పరిత్యజించబడిన ఆ కోటను ఎందుకు ఉపయోగిస్తున్నారో అన్న దానిపై నాకొక అనుమానం ఉంది! దేన్నో అక్కడ దాస్తున్నారు! అమ్మాయిలూ! ఇది ఖచ్చితంగా సురక్షితమైన ప్రదేశం. మనం అక్కడ కెళ్ళి నిజమైన శోధన చేద్దాం!"

ఆమె తన తండ్రిని వెంట రావాలనుకొంటున్నారా అని అడిగింది.

డ్రూ నవ్వి రానన్నట్లు తలూపాడు. "నేను వెళ్ళి ఆరంస్ట్రాంగ్ దంపతులను చూడాలి" అని చెప్పాడతను. "అమ్మాయిలంతా మీ శోధన మీరు కానివ్వండి. మన మిగిలిన ప్రణాళికలు ఏమిటన్నది ఈరోజే తరువాత నేను మీకు తెలియజేస్తాను."

ముగ్గురు అమ్మాయిలు ఉత్సాహంగా కారులో బయల్దేరారు. కోటకు వెళ్ళే దారిలో దొంగలు ఎక్కువగా దాచటానికి అనువైన స్థలం ఏమిటన్న దానిపై వాళ్ళు చర్చించుకొన్నారు.

"అది నేలమాళిగ అని నేను ఖచ్చితంగా అనుకొంటున్నాను" నాన్సీ చెప్పింది. "జార్జ్, నేను ఈత కొట్టి కోటవైపు కెళ్ళి, నేలమాళిగ వైపు వెళ్తున్నప్పుడు మాత్రమే ఒకసారి మనకు హెచ్చరిక వినిపించిందన్న విషయం గుర్తు చేసుకోండి."

ఈసారి అమ్మాయిలు ముగ్గురు తమ చేతుల్లో ఫ్లాష్ లైట్లను పట్టుకొన్న సాయుధులు అయ్యారు. కోటకు వెళ్ళే అసాధారణమైన చిత్తడి నేల వారికి చిరాకు పుట్టించలేదు. వాళ్ళు కటకటాల తలుపు ఉన్న చెరసాల వంటి గదిని చేరేవరకు వారి వేట నిష్ఫలంగా సాగింది. తాళం వేసి లేనందున వాళ్ళు జెయిలు గదిని తలపించే ఆ గదిలోకి వెళ్ళారు. చుట్టూ ఉన్న గోడలపై వాళ్ళు తమ చేతిలోని ఫ్లాష్ లైటు కాంతిని ప్రసరించినప్పటికీ, అనుమానాస్పదమైనదేదీ కనిపించలేదు.

"ఇక్కడ ఏదైనా దాచి ఉన్నట్లయితే, దాన్ని మట్టినేల అడుగున దాస్తారని నేను అనుకొంటున్నాను" అంది నాన్సీ. "అదైతేనే తవ్వటానికి సులువుగా ఉంటుంది."

ఆమె నేల మీద వెల్లకిలా చేతులు బారసాచి పడుకొంది. "ఈ ప్రపంచంలో ఏమి చేస్తున్నావు?" బెస్ అడిగింది.

"భూమిలో, చిన్నదైనా సరె, మూపురం లాంటిది తగులుతుందేమో చూస్తున్నాను."

అకస్మాత్తుగా నాన్సీ లేచి నిలబడి, ఆ చీకటి గదిలో మూలకు పరుగెత్తింది. "ఇక్కడ ఒకటుంది!" అందామె. "ఇప్పుడు మనం దేనితో తవ్వుదాం?"

పాత వంటగదిలో తానొక పారను చూసిన సంగతిని జార్జ్ గుర్తు చేసుకొంది. వెంటనే ఆత్రంగా ఆమె లోనికెళ్ళింది. చేతిలో పారతో ఆమె తిరిగి వచ్చి, వెంటనే దానితో తవ్వటం మొదలెట్టింది. త్వరగానే భూమి లోపల ఉన్న పెద్ద యిత్తడిపెట్టె బయటపడింది. వాళ్ళ నాడి వేగంగా కొట్టుకోసాగింది. అమ్మాయిలు గోతిలో ఉన్న పెట్టెను ఎత్తి పైన పెట్టారు.

"నాన్సీ! దీన్ని నువ్వు తెరు" అంది జార్జ్.

నాన్సీ పెట్టెమూతను పైకెత్తగానే ముగ్గురు అమ్మాయిలు ఊపిరిని ఎగపీల్చారు. ఆ పెట్టె నిండా నెగోషియబుల్ సెక్యూరిటీ పత్రాలు, డబ్బు కనిపించాయి. వాటితో పాటు మోసపోయిన వ్యక్తుల జాబితా కనిపించింది. ఈ ముఠాలో పనిచేస్తున్న మరో యిద్దరు జంటల పేర్లు కూడా వ్రాయబడ్డాయి.

"మనం తిరిగి దీన్ని పాతిపెట్టడమే మంచిది" బెస్ అంది, "దానికోసం పోలీసులను రానిద్దాం."

నాన్సీ బదులిచ్చేలోపునే, జార్జ్ అడ్డుకొంది. "లేదయ్యా! మనం యిన్ని యిబ్బందులను చవిచూశాక, ఆ వంచకులలో ఎవరో ఒకరు యిక్కడకు వచ్చి ఈ అదృష్టాన్ని తీసుకెళ్ళిపోతుంటే, నేను చూస్తూ ఊరుకోను!"

"నువ్వన్నది నాకు నిజమే అనిపిస్తోంది" నాన్సీ అంది.

పెట్టె చాలా బరువుగా ఉన్నందున, ముగ్గురు అమ్మాయిలు కలిసి దాన్ని కారు వద్దకు మోసుకెళ్ళారు. వెంటనే నాన్సీ కారుని డీప్ రివర్ పోలీసు ప్రధాన కార్యాలయానికి పోనిచ్చింది. ఇంతకాలం భూమిలో దాచిన సొమ్మును అందుకున్నందుకు చీఫ్ బుర్కె ఆశ్చర్యపోయాడు. దాన్ని సురక్షితంగా తన కార్యాలయంలో ఉంచుతానని చెప్పాడు.

"తరువాత మనం జాబితాలో పేర్లున్న ముఠాలోని మరో నలుగురిని పట్టుకోవాలి" అమ్మాయిలతో అన్నాడతను. "ప్రస్తుతం ముఠాలోని వ్యక్తుల లెక్కపై నాకొక అవగాహన వచ్చింది."

నాన్సీ చిరునవ్వుతో చీఫ్ చేసిన అన్నిరకాల సాయాలకు కృతజ్ఞతలు చెప్పింది. తేటతెల్లం కావలసిన విషయం మరొకటి యింకా ఉందని అతనికి చెప్పలేదామె. అదే జోడీ ఆరంస్ట్రాంగ్ తన తాత, మామ్మలను తిరిగి కలుసుకోవటం.

నాన్సీ, ఆమె స్నేహితురాళ్ళు మోటెలుకి చేరే సమయానికి, డ్రూ, ఆరంస్ట్రాంగ్ దంపతులు, బొవెన్ దంపతులు అక్కడ కనిపించారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపించారు.

" బొవెన్ దంపతులను రేపు కలవమని ఆరంస్ట్రాంగ్ దంపతులు జోడీని కోరారు. వాళ్ళంతా కలిసి ఒక గంట గడిపిన తరువాత, మిగతా మనందరిని తమ యింటికి రమ్మని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు" నాన్సీ తండ్రి చిరునవ్వుతో చెప్పాడు.

మరునాడు డ్రూలిద్దరు, జార్జ్, బెస్ ఆరంస్ట్రాంగ్ యింటికి వచ్చినప్పుడు, ఆనందంతో ములిగి తేలే సమూహాం వాళ్ళకు కనిపించింది. జోడీ అమ్మాయిల దగ్గరకు పరుగున వచ్చి వాళ్ళను కౌగలించుకొంది.

"ఓహ్! మీకు కృతజ్ఞతలు చెప్పవలసిన అద్భుత విషయాలు అనేకం ఉన్నాయి" అందామె. "ఈ ప్రపంచంలోనే అద్భుతమైన పెంపుడు తల్లిదండ్రులను కలిగి ఉన్న, అద్బుతమైన తాతామామ్మలను కనుగొన్న అదృష్టవంతురాలైన అమ్మాయిని అవుతానని మీరెప్పుడైనా ఊహించారా? వాళ్ళు నా పసితనంలోనే చనిపోయిన మా అమ్మానాన్నల గురించి చాలా విషయాలు చెప్పారు.. . .వాళ్ళు నన్నెంతగా ప్రేమించారో, యింత మంచి పెంపుడు తల్లిదండ్రులు దొరికారని తెలుసుకొన్న వారి ఆత్మలు ఎంత సంతోషిస్తాయో అన్నీ చెప్పారు."

"నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతురాలివి" నాన్సీ నవ్వుతూ చెప్పింది. "నిన్ను చూసి మేము చాలా సంతోషిస్తున్నాం."

దొంగిలించబడ్డ అమ్మమ్మ హోర్టన్ సెక్యూరిటీల్లో సగం వరకు కనుగొన్నట్లు, అవి పోలీసు ప్రధాన కార్యాలయంలోని యిత్తడి పెట్టెలో చెక్కుచెదరకుండా ఉన్నట్లు డ్రూ ప్రకటించాడు. మున్ముందు వాటిని జోడీ స్వీకరిస్తుంది. తరువాత న్యాయవాది యిలా వివరించాడు :

"ఒమన్లు వారి కిడ్నాప్ వ్యవహారాన్ని ఎలా ప్రారంభించారంటే, బెన్ ఒమన్ వీలునామా యొక్క ఒక కాపీని చూడటం నిజం. తరువాత తన స్వంత కూతురిని హోర్టన్ లబ్ధిదారుగా నటింపజేసాడు. వీలునామాలో మనుమరాలి వయసు, లేదా గార్డియన్ పేరు పేర్కొనబడలేదు. అది చూసిన తరువాతే ఒమన్ ఈ మోసపూరితమైన ప్రణాళికను రూపొందించాడు. పసిపిల్లయైన జోనీని ఎవరికీ కనిపించకుండా చేసాడు. నిర్భాగ్యురాలైన అమ్మమ్మ హోర్టన్ కు సరిగా తిండి పెట్టక, ఆమె మరణించేవరకూ మత్తు బిళ్ళలిచ్చేవాడు."

"ఎంత భయంకరం!" మెల్లిగా అంది బెస్.

"ఒక వైద్యుడు ఆమెకు వైద్యం చేయటానికి పిలవటానికి ముందే," డ్రూ చెప్పసాగాడు, "ఒమన్ భార్య పసిపిల్ల అయిన జోనీని దత్తత సంఘం వద్ద వదిలేసింది. దానివల్ల ఆ యింటికి వచ్చిన వాళ్ళెవరూ ఆమెను చూసే అవకాశమే ఉండదు."

"మనుషులెంత కర్కోటకులుగా మారిపోయారు!" జార్జ్ గట్టిగా అరిచింది.

డబ్బును స్వీకరించటం బాగానే ఉంటుందని జోడీ చెప్పింది. "కానీ దానిలో చాలా భాగం నా తాతామామ్మలు తమ పనిలో ఉపయోగించుకొందుకు యివ్వదలుచుకొన్నాను. ఇంక నాకు మిగిలిన దానిలో కొంతభాగం నాన్సీ డ్రూ, జార్జ్ ఫేన్, బెస్ మెర్విన్ లకు అందమైన బహుమతుల రూపంలో కేటాయిస్తాను" అని ఆమె ప్రకటించింది. "మొత్తం ప్రపంచంలోనే అత్యుత్తమ బహుమతికి వాళ్ళు అర్హులు!"

నాన్సీ నవ్వింది. "అదంతా నీ మంచితనం జోడీ! కానీ నాకు కావలసిన ప్రతిఫలం ఏమిటంటే, విచిత్రమైన సాంకేతిక పదం "తోడేలు కన్ను" అన్న దానికి అర్ధమేమిటో తెలుసుకోవటమే!"

జోడీ పుస్తకాల అలమర దగ్గర కెళ్ళి నిఘంటువులను, ఎన్సైక్లోపీడియాలను మరియు రిఫరెన్స్ పుస్తకాలను తిరగేస్తోంది. ఈలోపున నాన్సీ, ఆమెకు సాయం చేయలేక, ప్రస్తుతం ముగిసిన కేసులాంటి మరొక విచిత్రమైన కేసు ఎప్పుడు ఎదురవుతుందా అన్న ఆలోచనలో పడింది.

ఆసక్తికరమైన విషయాలను వెల్లడించే రిఫరెన్స్ పుస్తకాల్లో ఒకదాన్ని అధ్యయనం చేసింది. "నేను కనుగొన్నాను" అని ఉత్సాహంతో అరిచింది.

జోడీ ముసిముసి నవ్వులు నవ్వుతూ, "నాన్సీ! నమ్ము నమ్మకపో! చంద్రమణికి మారు పేరే "తోడేలు కన్ను!"
@@@@@@@@@@@@@@@@@@@@@@@@

No comments:

Post a Comment

Pages