చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 36 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 36

Share This

 చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 36

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery
నవలా రచయిత : Carolyn Keene
 


(చంద్రమణిని తీసుకోవటానికి హోటలు దగ్గరకు వస్తానన్న వ్యక్తికి రాస్పిన్ తో ఏదో సంబంధం ఉందని నాన్సీ అనుమానిస్తుంది. నాన్సీ, ఆమె స్నేహితురాళ్ళ సమాచారంతో పోలీసులు మిసెస్ విల్సన్ యింటిని చుట్టుముట్టి, ఆమెను రాస్పిన్ మూఠా బారి నుంచి రక్షిస్తారు. తనను రక్షించటంలో నాన్సీ బృందం హస్తం ఉందని తెలుసుకొన్న మిసెస్ విల్సన్ తనను తరువాత వచ్చి కలవమని, వారు చేసిన సాయానికి తాను ప్రత్యేక ధన్యవాదాలను అందజేస్తానని చెబుతుంది. తరువాత . . . .)
@@@@@@@@@@@@@@@@@

అమ్మాయిలు అలాగే చేస్తామని వాగ్దానం చేసి, ఆ గదిని విడిచిపెట్టారు. పోలీసులు ఆ యింటిని తమ స్వాధీనంలోకి తీసుకొంటారని, రూడీ రాస్పిన్ అక్కడకు తిరిగి వస్తే పట్టుకోవటానికి ఆ చుట్టుపక్కల గస్తీ తిరుగుతారని గూఢచారి నుంచి వాళ్ళు తెలుసుకొన్నారు.

"బహుశా అతను రేపు రావచ్చు" నాన్సీ గూఢచారికి చెప్పింది, "అయితే అంతవరకు మీరు వేచి ఉండాల్సిన అవసరం రాకపోవచ్చునని నమ్ముతున్నాను."

అధికారులు నాన్సీ, బెస్, జార్జి చేసిన పనికి, వారికి తమ అభినందనలు తెలియపరిచారు. అమ్మాయిలు యిబ్బందిగా నవ్వి, తరువాత తమ కారు దగ్గరకు నడిచారు.

"ఆ దుర్మార్గుడైన రూడీ రాస్పిన్ని మనం కనుగొనగలమని నేను వాంఛిస్తున్నాను" బెస్ అంది.

"నేనూ అదే అనుకొన్నా!" నాన్సీ సమ్మతించింది. "అయితే చంద్రమణిని నాకెవడు పంపాడో తెలుసుకోవటమే ప్రస్తుతం మన పని."

ఆ సాయంత్రం ముగ్గురు అమ్మాయిలు చిన్నదైన ఆకుపచ్చ పెట్టెను మోటెల్ వాకిలి ప్రారంభంలో ఉన్న రోడోడెండ్రాన్ పొద కింద వదిలిపెట్టారు. తరువాత వాళ్ళు సమీప ప్రాంతాల్లో విడివిడిగా దాక్కున్నారు. నాన్సీ అందరికన్నా దగ్గర ప్రాంతంలో వేచి ఉంది.

"మనం నిశ్శబ్దంగా ఉండటం మంచిది. ఎవరూ మాట్లాడొద్దు" ఆమె మిగిలిన వాళ్ళను పిలిచి చెప్పింది. అటూయిటూ పోతున్న ట్రాఫిక్ శబ్దాలు తప్ప చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది.

క్రమేపీ చీకటి చిక్కబడింది. రోడోడెండ్రాన్ పొద దగ్గరకు ఎవరూ రాలేదు. ఒక గంట గడిచిపోయింది. అశాంతితో అమ్మాయిలు కదలటం ప్రారంభించారు.

కార్లు యిరుదిక్కులకు వేగంగా పోతున్నాయి. అప్పుడప్పుడు కొన్ని మోటెల్ ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నాయి. కానీ రోడోడెండ్రాన్ పొద దగ్గర ఎవరూ ఆగలేదు.

"బహుశా యిదంతా బూటకం కావచ్చు" అనుకొంది జార్జి.

చీటీ వ్రాసిన వ్యక్తి రావటం విషయంలో తన మనసు మార్చుకొన్నాడా అని నాన్సీ చింతిస్తోంది. ఇంతలో ఒక కారు ఆమె దాక్కున్న ప్రదేశానికి దగ్గరగా ఉన్న రోడ్డుపై దూసుకొచ్చి, మెల్లిగా వేగాన్ని తగ్గిస్తోంది. అది రోడోడెండ్రాన్ పొదకు కొద్ది దూరంలో ఆగింది.

ముగ్గురు అమ్మాయిల్లో ఆదుర్దా మొదలైంది. ఉద్రిక్తతతో చూస్తున్న వారికి మహిళా డ్రయివరు కారు దిగటం కనిపించింది. ఆమె వేగంగా ముందుకు నడిచింది. కారులో యింకెవరూ లేరు. రోడోడెండ్రాన్ పొదను చేరగానే, ఆమె అకస్మాత్తుగా మోకాళ్ళపైకి జారి, చీకట్లో ఆ పొద కింద తడమసాగింది.

నాన్సీ ముందుకు దూకటానికి సిద్ధమైంది. ఆ స్త్రీ పెట్టెను తీసుకొని నిలబడ్డ మరుక్షణం, నాన్సీ ముందుకు దూకి తన ఫ్లాష్ లైట్ వెలుతురును ఆమె ముఖంపైకి నేరుగా ప్రసరింపజేసింది.

మరుక్షణం యువ గూఢచారి వెనక్కి తగ్గి ఆశ్చర్యంతో అరిచింది : "సెలియా స్మిత్!"

తక్షణమే ఆ స్త్రీ నాన్సీ చేతిలోని ఫ్లాష్ లైటుని పడగొట్టి, నేల మీద పడేలా ఆమెను నెట్టి, ఆపై కారు వైపు పరుగెత్తింది!

@@@@@@@@@@

ఉన్నపాటున బెస్, జార్జి తాము దాక్కున్న చోటునుంచి తటాలున ముందుకు పరుగెత్తి, ఆ స్త్రీని పట్టుకొన్నారు. అనుకోని దాడికి ఆమె బిత్తరపోయి తీవ్రంగా పోరాడింది. కానీ వాళ్ళు ఆమె చేతులను వెనక్కి విరిచి కదలకుండా పట్టుకొన్నారు. నాన్సీ మెల్లిగా పైకి లేచి, నేల మీద ఫ్లాష్ లైటుని చేతిలోకి తీసుకొని ముందుకు వచ్చింది. ఈసారి ఆ ఆగంతకురాలు నాన్సీ చేతిలోని లైటుని పట్టుకొని తన ముఖంవైపే తిప్పింది.

"నాన్సీ డ్రూ!" ఆ స్త్రీ అరిచింది.

జార్జి, బెస్ తెల్లబోయారు. "మీరు ఒకరికొకరు తెలుసా?" అడిగింది జార్జి.

"తెలుసు" నాన్సీ శాంతంగా చెప్పింది. "న్యూయార్క్ లోని నా మేనత్త ఎలోయిస్ డ్రూ యింట్లో సెలియా పగటిపూట మెయిడ్ గా చాలా ఏళ్ళు పనిచేసింది.....నిజం చెప్పాలంటే, తన పెళ్ళయ్యేవరకూ!"

"ఓ నాన్సీ! మిమ్మల్ని కొట్టినందుకు నన్ను క్షమించండి" సెలియా స్మిత్ ఏడుస్తూ అంది. "మాట్లాడుతున్నది మీరేనని నాకు తెలియదు. నేను మీకు ఆ చంద్రమణిని పంపినప్పుడు, ఆ భయంకరమైన ముఠా బారి నుంచి మిమ్మల్ని రక్షించాలని నేను ప్రయత్నిస్తున్నాను. వారు నిజంగానే మీ వెంటపడ్డారు! నా భర్త రానురానూ క్రూరంగా మారుతున్నాడు. దేనికీ వెనుదీయనంత దుర్మార్గుడయ్యాడు!"

"నీ భర్త ఎవరు?" నాన్సీ అడిగింది.

"రూడీ రాస్పిన్."

"అందుకే అతన్ని చూడగానే ఎక్కడో చూసినట్లు అనిపించింది" యువ గూఢచారి చెప్పింది. "నీ కాబోయే భర్త ఫొటోని ఒకసారి నాకు చూపించావు. కానీ అతని పేరేమిటో నాకు చెప్పలేదు."

అయిదేళ్ళ క్రితం పెళ్ళయినప్పటినుంచి సెలియా సంతోషంగా లేదని అమ్మాయిలు తెలుసుకొన్నారు. "రూడీ క్రూరుడే కాక కనికరం లేనివాడు. కానీ అతన్ని విడిచిపెట్టటానికి నేను భయపడుతున్నాను. అతను, అతని స్నేహితులు ఏమి చేస్తుంటారో నేను తెలుసుకొన్నాను. నేను అతన్ని యిబ్బంది పెడితే, నన్ను చంపేస్తానని ఎప్పుడూ బెదిరిస్తూంటాడు."

"నువ్వు నిర్భాగ్యురాలివి!" నాన్సీ సానుభూతి చూపించింది. "ఈ కుంభకోణం ఏమిటి?"

ఈ ముఠాలో అనేక జంటలున్నాయని సెలియా బదులిచ్చింది. ఒక ధనవంతురాలు, సర్వసాధారణంగా తనను చూసుకొందుకు చుట్టాలెవరూ లేని ఒక వృద్ధ మహిళ దగ్గరకెళ్ళి, వాళ్ళింట్లో పనివాళ్ళుగా ఉద్యోగం యిమ్మని ఒక జంట మాట్లాడుతుంది. "వాళ్ళు పనిలో చేరకముందే యింట్లోని యితర పనివాళ్ళను మానిపించెయ్యమని ఎప్పుడూ నొక్కి చెబుతారు. ఇలా చేస్తే, కొత్తగా ఉద్యోగంలో చేరే ఈ జంటను గుర్తించేవాళ్ళు ఉండరు. వీలైనంత ఎక్కువగా ఆ వృద్ధమహిళను దోచుకోవటమే ఈ జంట ప్రధాన లక్ష్యం."

"కొన్ని సందర్భాల్లో వాళ్ళను ఆకలితో చంపేయటం" జార్జి అంది.

సెలియా ఆ అమ్మాయిని కలవరపాటుతో చూసింది. "ఇది నిజమేనా?" ఆమె అడిగింది.

"నా భర్త అలాంటి పనులను ఎప్పుడూ చేయలేదని నేను దృఢంగా నమ్ముతున్నాను. కానీ ఆ ముఠా నాకు చాలా తక్కువ చెప్పారు. వాళ్ళు నన్ను నమ్మలేదు. నాకు తెలిసిన వాటిలో చాలావరకు చాటుగా విన్నదే! ఆ ముఠా నన్ను చాలా బెదిరించారు. నా ఊహ ప్రకారం నేను పోలీసుల వద్దకు వెళ్ళవచ్చునని వాళ్ళు భయపడ్డారు" అని చెప్పిందామె.

"ఈ కుంభకోణం ఎన్నాళ్ళనుంచి జరుగుతోంది?" నాన్సీ అడిగింది.

"ఓహ్! చాలాకాలం నుంచి."

"మొదట బలి అయినది మిసెస్ హోర్టనేనా?" నాన్సీ ప్రశ్నించింది.

సెలియా స్మిత్ అవునన్నట్లు తలాడించింది. "రూడీతో నా పెళ్ళవటానికి చాలా రోజుల ముందు జరిగిందది, కానీ దాని గురించి నేను తెలుసుకొన్నాను."

ఒమన్ దంపతులు అక్కడకు పనివాళ్ళుగా వెళ్ళారు. మిసెస్ హోర్టన్ మనుమరాల్ని ఆఫ్రికాకి వెళ్తున్న ఆ పాప మరో తాత, నాయనమ్మలు, ఆమెను హోర్టన్ యింటికి తీసుకొస్తున్నారని ఒమన్ దంపతులు తెలుసుకొన్నారు. ఆ మత ప్రచారకులు హోర్టన్ యింటికి వచ్చినప్పుడు ఒమన్ దంపతులు వేరే చోటికి వెళ్ళిపోయారు. న్యూయార్కులో ఉన్న తమ కూతురి పెళ్ళికి హాజరవ్వాలని వాళ్ళు ముసలామెకి చెప్పారు.

"జోనీ అమ్మ తాలూకు తాత, అమ్మమ్మలను తప్పిస్తే, మిసెస్ హోర్టన్ ఒక్కతే ఆ పాపకి బతికి ఉన్న బంధువని క్లారా ఒమన్ తెలుసుకొంది. అందువల్ల వాళ్ళు ఈ మొత్తం భయంకరమైన కిడ్నాప్ వ్యవహారానికి తెరలేపారు. మిసెస్ హోర్టన్ చనిపోయిన సమయంలో వాళ్ళు దాన్ని అమలు జరిపారు. వాళ్ళు ఆ చిన్న పాపకు నిద్రపట్టే మందు యిచ్చి నిద్రపుచ్చారు. తరువాత దత్తత సంఘం కార్యాలయానికి తీసుకెళ్ళి, అక్కడ వదిలిపెట్టారు."

"జోనీ హోర్టన్ ప్రస్తుతం ఎక్కడ ఉంది?" బెస్ అడిగింది.

"నాకు తెలియదు. నా భర్త, ముఠా సభ్యుల్లోని ఏ ఒక్కరికీ కూడా పాప సంగతి తెలియదు. బొవెన్ దంపతులకు ఏమి జరిగిందో తెలుసుకోవటానికి వాళ్ళు నిఘా పెట్టినప్పటికీ, నేను ఈ వ్యవహారమంతా తెలుసుకొన్నాను. ఆఫ్రికా నుంచి తిరిగొచ్చాక, బెన్ వారిని నీడలా అనుసరిస్తున్నాడు. ఈ కేసును చేపట్టమని మీ నాన్నను వాళ్ళు అడిగినప్పుడు, మిస్టర్ డ్రూ నిజాన్ని తెలుసుకోకుండా అడ్డుపడాలని రూడీ నిర్ధారించుకొన్నాడు. తరువాత రివర్ హైట్స్ లోని మీ యింటి దగ్గర పొంచి వినటం ద్వారా, మీ అమ్మాయిలు కొంత గూఢచర్యం చేయటానికి యిక్కడకు వస్తున్నారని అతను తెలుసుకొన్నాడు. అప్పటినుంచి మీరు ప్రమాదంలో ఉన్నారు."

"ఓహ్!" బెస్ ఆశ్చర్యపోయింది.

"నేను నా భర్త చంద్రమణిని తీసుకొన్నాను" సెలియా చెప్పసాగింది, "అతను దీన్ని చాలా సంవత్సరాల క్రితం సిలోను నుండి తీసుకొచ్చాడు. దాన్ని నాకు గొప్పగా బహూకరించాడు. ఆ మణినే చీటీతో పాటు నీకు పంపాను. నువ్వు చాలా చురుకైనదానివి గనుక నువ్వు త్వరగానో లేక తరువాతో చంద్రమణి మరియు చంద్రమణి లోయ యొక్క ప్రాముఖ్యతను కనుగొంటావని నేను భావించాను."

క్లూలన్నీ ఒక చోట చేర్చటానికి చాలా సమయం పట్టిందని, యిప్పటికీ జవాబు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయని నాన్సీ చెప్పింది. "వాటిలో ఒకటి ఈ పజిల్లో కోట ఎక్కడ సరిపోతుంది?"

"వారు దీనిని సమావేశ స్థలంగా ఉపయోగించారని నాకు తెలుసు."

(చివరి భాగం వచ్చే నెలలో)

No comments:

Post a Comment

Pages