తగవో నగవో తలఁపిదివో. - అచ్చంగా తెలుగు

తగవో నగవో తలఁపిదివో.

Share This

 తగవో నగవో తలఁపిదివో.

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 




శ్రీ వేంకటేశుని ప్రవర్తనని అలమేలు మంగమ్మ తన చెలికత్తెలతో విశ్లేషిస్తూ చెబుతున్న సందర్భం.


తగవో నగవో తలఁపిదివో.                                                                                                        జగడము లేఁటికి సతమగుపనికి

ఈ వేంకటేశుని ప్రవర్తన చాలా చిత్రంగా ఉంటుంది. ఊరికే నవ్వుతాడు.
ఆ నవ్వు తగవు కోసమా? లేక మామూలుగానా?అసలు అతని ఆలోచన ఇది అని చెప్పలేకపోతున్నాను. అయినా నిత్యం ఇలాగే ప్రవర్తించే ఆ  వేంకటేశునితో నాకు తగాదాలు ఎందుకులే!?

పిలిచినయపుడే ప్రియమునఁ బలికితి 
కలదో లేదో కనుఁగొనరే 
అలుకయుఁ దనదే ఆఱడిఁ దనదే 
తెలిసెనో తెలియదో తేరినపనికి

నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అతడు నన్ను పిలిచాడు అంటే చాలు వెంటనే ప్రేమగా ఏమిటి అని పలుకుతాను. మరి నేను అలా ప్రేమగా పలికినప్పటికీ నేను పలకని దాన్ని అన్నట్టుగా గొడవ చేస్తాడు ఎందుకు? నాపై అలక పూనుతాడు. ఎందుకే? నాకు ఒకటే అనుమానం. తను చేస్తున్న అల్లరికి ఏమి పరిణామాలు వస్తాయో అతనికి తెలుసా? తెలియదా?

కవకవనవ్విన గైకొని మొక్కితి 
అవునో కాదో అడుగరే 
అవల నివలఁ దనయాసలు మానఁడు 
చివుకన నేఁటికిఁ జేసినపనికి ز
నన్ను ఆ వేంకటేశుడు హేళనగా చూసి నవ్వినప్పటికీ, నా వాడే కదా అని కౌగిలిలోకి గ్రహించి అతనికి పెద్దరికం ఇచ్చి నమస్కారం కూడా చేశాను. నేను అలా చేశాను లేదో అతన్ని అడగండి. ఈ ప్రకారంగా నేను ఎన్ని చేసినప్పటికీ కోరకూడని ఆశలు కోరటం మాత్రం అతను మారడు. నాకు బాధ ఉంటుంది కదా అందువల్ల నేను కొంచెం కోప్పడితే మనసు నొచ్చుకుంటాడు ఎందుకే? పని చేసిన పనికే కదా నాకు బాధ కలిగింది (నేను బాధపడాలి కాని అతను ఎందుకు బాధపడతాడని అలమేలుమంగ చమత్కారం)

మనిసే ననఁగా మాటలు నమ్మితి
 అనెనో అనఁడో అదెకదరే 
యెనగొని శ్రీవేంక టేశుఁడు గూడెను 
నను నొరయకురే ననిచినపనికి   

      నీకు నా దగ్గర అనురాగస్థానం ఉన్నదని చెబితే అతగాడి మాటలు నమ్మే ఆ మాట అన్నాడో లేదో -అదే- మీరే చూడండి. ఏవేవో మాటలు చెప్పి, నన్ను కలిసి నాతో సుఖానుభవాన్ని పొందాడు.అతడు చేసిన అనురాగపు పని ఏమిటి అని ఎగతాళి గా పదే పదే అడిగి నన్ను పదే పదే రాచి రంపాన పెట్టకండి.

***

No comments:

Post a Comment

Pages