జీవ కారుణ్యం - అచ్చంగా తెలుగు

జీవ కారుణ్యం 

ఎం.బిందుమాధవి 



రామ్మూర్తి ఉదయం నడకకి బయలు దేరాడు. ఇంకా తెల తెల వారుతున్నది. రోడ్ల మీదజన సంచారం ఇంకా పుంజుకోలేదు. చిన్న చిన్న హోటళ్ళు..టిఫిన్ సెంటర్స్..చురుగ్గా ఉదయపు ఆహారపు ఏర్పాట్లల్లో నిమగ్నమై ఉన్నాయి. 


హోటల్ అంటే తింటానికి ఏదో ఒకటి దొరుకుతుందని..ఒళ్ళు విరుచుకుంటూ రెండు మూడు కుక్కలు అయ్యర్ హోటల్ ముందు తారట్లాడుతున్నాయి. 


ఈ లోపే ఒక మానవోత్తముడు..జీవ కారుణ్యంతో రోజూ సైకిల్ మీద వచ్చి ఆ కుక్కలన్నిటికీ బిస్కెట్స్ వేస్తాడు. తన పాప పరిహారానికి.. ఏ ప్రవచన కర్త చెబితే చేస్తున్నాడో ఆ భగవంతుడికే తెలియలి... 


పక్కకి వెళితే ఆ తిండి మిస్సవుతామని..అక్కడే కాచుక్కూర్చుంటాయి అవి. 


హోటల్స్ లో ఏ పదార్ధమూ తాజాగా అప్పటికప్పుడు చేసి పెట్టరనేది జగమెరిగిన సత్యం. 


అలా రాత్రి భోజనాలయ్యాక మిగిలిన పనికి రాని పదార్ధాలు ...కస్టమర్స్ ఆకుల్లో వదిలేసిన పదార్ధాలు..నాలుగైదు బుట్టలతో వీధి చివర చెత్తకుండీలో అయ్యర్ హోటల్  వాళ్ళు పడేసే విందు ఆరగించటానికి మరొక కుక్కల బృందం అక్కడికి చేరింది. 


రామ్మూర్తికి ప్రతి రోజూ ఉదయం ...కుక్క ల కాటుకి బలవ్వకుండా..ఈ పద్మ వ్యూహాన్ని భేదించుకుని..జాగ్రత్తగా నడవటం ఒక ఛాలెంజ్. 


ఆ రోజు రామ్మూర్తి సంగతేదో చూడాలని అతని వెనకాలే ఒక కుక్క బయలుదేరింది. "క్షణ క్షణ ముల్ శునక చిత్తముల్" అన్నట్టు అతని చేతిలో ఏమీ లేకపోయినా వెంటపడింది. నెమ్మదిగా అడుగులో అడుగేస్తూ..రామూర్తి నడక వేగం పెంచగానే పిక్క దొరక బుచ్చుకుంది. 


"చచ్చాను బాబోయ్..." అని ఒక్క కేకేసి కింద పడ్డాడు. ఆ శునక రాజం తన ప్రతాపం చూపించి రామ్మూర్తి కాలి పిక్క కండ కసిదీరా పీకేసింది. పక్కన ఎవరో కర్ర అందుకునే సరికి..అతని మీదికి ఎగబడింది. 


అతని మెడ పట్టుకుని కసి దీరా కండ బయట పడే లాగా కొరికింది. 


ఓ పక్క కుక్క కాటు భయంతో లేచి పరిగెత్త బోయిన రామ్మూర్తి గారి పరిస్థితి "ముందునుయ్యి..వెనక గొయ్యి" చందం అయి.. రాయి తగిలి పడ్డారు. అక్కడే భూమిలోకి సగం దిగబడిన సూది మొన తేలిన రాయి తన ప్రతాపం చూపించి ఆయన కంటి పక్కన లోతుగా గీరుకుంది. 


పక్క వారి సహాయంతో...నెత్తురోడుతూ ఇంటికి చేరుకున్న భర్తని చూసి కంగారుగా "ఏమయిందండి? ఆ నెత్తురేమిటి?" అని ప్రాథమిక చికిత్స చెయ్యటానికి.. ఓ మగ్గుతో నీళ్ళు, డ్రెసింగ్ క్లాత్, యాంటి సెప్టిక్ పౌడర్ తెచ్చింది. 


జరిగింది చెప్పి..ముందు 108 కి ఫోన్ చెయ్యి. మన వైద్యం సరిపోదు. కుక్క నా కాలి పిక్కని ఫలహారం చేసింది. 


"కుక్క కరిస్తే.. యాంటి రేబిస్ ఇంజక్షన్ చేయించాలి. పద..ఆ ఇంజక్షన్స్ చేసే గవర్నమెంట్ సెంటర్ కి వెళ్ళాలి. నువ్వొక్క దానివే తిరగలేవు. మీ తమ్ముడికి ఫోన్ చెయ్యి" అన్నారు రామ్మూర్తి గారు. 

***

ఇంతకు ముందు ఎప్పుడు రేబిస్ ఇంజక్షన్ తీసుకోని వాళ్ళు నాలుగు డోసులు ..రెండు వారాల కాలంలో తీసుకోవాలిట. కింద పడినప్పుడు తగిలిన దెబ్బలకి టిటనస్ తీసుకుని డ్రెసింగ్ చేయించుకోవాలిట. అన్నీ తగ్గి..మామూలు అవడానికి పది రోజులయింది. 


రామ్మూర్తి గారికి మళ్ళీ వాకింగ్ కి బయలుదేరటానికి దాదాపు నెల రోజులు పట్టింది. మళ్ళీ కుక్కలతో సరసాలు ఆడకుండా ఇదిగో కర్ర. జాగ్రత్త... మర్చిపోకుండా తీసుకెళ్ళండి" అని ఒడియాల పప్పు రుబ్బే పనిలో పడింది. 


సదా చేతిలో కత్తితో దర్శనమిచ్చే రాణా ప్రతాప్ సింగ్ స్థాయిలో రామ్మూర్తి గారు..కర్ర చేతబట్టి.. వాకింగ్ కి బయలుదేరారు. 


పార్క్ దాకా వెళ్ళాక.. చేతి కర్ర ఆడిస్తూ.. తోటి వాకర్ తో కబుర్లు చెబుతూ అటూ ఇటూ భయంగా చూసుకుంటూ నడుస్తున్న రామ్మూర్తి గారు ఒక జీవ కారుణ్య సంఘం కార్య కర్త కంట్లో పడ్డారు. 


ఆ కార్య కర్త.. ఆయన్ని ఆపి ఒక ఫొటో తీశాడు. రామ్మూర్తి గారు ఉలిక్కిపడి "ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? నాకెందుకు ఫొటో తీశావ్?" అని గదమాయించారు. 


"మీరు కర్రలు పుచ్చుకు నడుస్తూ..నోరు లేని జీవాలని హింసిస్తున్నారు. అందుకే 'మానవత్వం లేని మానవుడు' అని మీ ఫొటో రేపు పేపర్లో వేస్తాను" అన్నాడు. 


"ఏమిటయ్యా..మీ జీవ కారుణ్యం? పిల్లలు..పెద్దలు అనే తేడా లేకుండా మనుషులని కుక్కలు కరిచి చంపుతుంటే పట్టించుకోని మీరు..స్వీయ రక్షణ కోసం కర్ర చేతిలో పట్టుకున్నంత మాత్రాన నా ఫొటో పేపర్లో వేస్తావా. నెల క్రితం కుక్క నా కాలి కండలు పీకి పెట్టినప్పుడూ ఎక్కడికెళ్ళావ్? చూడు నా కాలి మీద..నుదుటి మీద గాయాలు. మందులు..మాకులు, రోజూ డ్రెసింగ్..అన్నీ కలిపి లక్ష రూపాయలయింది. చచ్చి బతికాను. ఆ ఖర్చులన్నీ మీరిస్తారా?" అన్నారు గట్టిగా. 


"సర్ మీరు ఇలా మాట్లాడారు అని కూడా పేపర్ లో వేస్తాను. రేపు బ్లూ క్రాస్ వాళ్ళని కూడా తీసుకొస్తాను. వాళ్ళే మీ మీద అరెస్ట్ వారంట్ కూడా తీసుకొస్తారు..జాగ్రత్త" అని గబ గబా పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. 


"మీ జీవ కారుణ్యం వాళ్ళు సర్కారు వాళ్ళని రోడ్లు సరిగా వెయ్యమని, చెత్త కుండీలు శుభ్రం చెయ్యమని, కుక్కలు రోడ్ల మీద ప్రజలని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడమని చెప్పండి. మేమూ జీవులమే..అని గుర్తు చెయ్యండి" అన్నారు గట్టిగా గొంతెత్తి. 


అక్కడ ఈ సీనంతా సాక్షుల్లాగా చూస్తున్న వారికి.. ఈ మధ్య ఇదే సబ్జక్ట్ మీద చూసిన సినిమా గుర్తొచ్చింది.

***

చెమటలు కక్కుకుంటూ..ఆందోళనగా ఇంచుమించు పరుగు లాంటి నడకతో ఇంట్లోకొచ్చి పడిన భర్తతో "ఏమయిందండీ..ఇవ్వాళ్ళ కూడా కుక్క ప్రహసనమేనా? కరిచింది కూడానా" అంటూ ఒళ్ళంతా తడిమి చూస్తున్న భార్య తో "జీవ కారుణ్య కార్యకర్తలుట..నా చేతిలో ఉన్న కర్రతో ఫొటో తీశారు. నేను కుక్కలని హింసిస్తున్నాను అని రేపు పేపర్లో వేస్తారుట" అని జరిగినది చెప్పారు. 


"ఇదెక్కడి గొడవండీ..పూర్వం ఇన్ని కుక్కలు ఉండేవి కావు. ఇప్పుడు రోడ్డు మీద నడిచి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది. ఎక్కడ చూసినా రోడ్ల మీద నిలబడి ఆవురావురుమంటూ తింటున్న మనుషులే! అడుగడుక్కి టిఫిన్ సెంటర్స్...హోటల్స్! వాళ్ళు సగం తిని పడేసిన ఆకులు, కాయితాల కోసం ఎగబడుతున్న కుక్కలు!" 


"ఎగబడి తింటున్న వాళ్ళకి వాళ్ళ అవసరం తీరుతున్నదనే ఆలోచనే కానీ అది ఎంత సమస్య సృష్టిస్తున్నదీ ఎవరు ఆలోచించట్లేదు."


"ఇక చెత్త కుండీల పరిస్థితి చెప్పక్కరలేదు. కుండీ ఉన్న చోటు నించి అరకిలో మీటర్ దూరం వరకు...ఏదో ఆలి బాబా నలభై దొంగలు కథలో గుహకి దారి చూపేందుకు వేసిన గుర్తుల్లాగా...అర్ధ రాత్రి..అపరాత్రి..టేక్ అవే లో తీసుకెళ్ళి సగం తిని పారేసిన ప్యాకెట్స్...ఇక ఇళ్ళల్లో పని వాళ్ళు అంత దూరం నించి విసిరి పడేసే చెత్త సంచులు.!" 


"కుక్కలని అదుపు చెయ్యాల్సిన మ్యునిసిపాలిటీ వాళ్ళు కళ్ళు మూసుక్కూర్చుంటున్నారు."


"'మా తాతయ్య వాకింగ్ కి కార్లో వెళ్ళారు' అని మీ మనవడు చెప్పినట్టు... రేపటి నించి ఇంటి పక్కనున్న పార్క్ కి కూడా కార్లో వెళ్ళండి..ఏం చేస్తాం" అని మంచి నీళ్ళు తేవటానికి లోపలికి వెళ్ళింది. 


పక్కనున్న న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నారు రామ్మూర్తి గారు. 


"సుమతీ ఇది చూశావా..మనం కుక్కల గురించే బాధ పడుతుంటే..పాపం ఈ పేద రైతు పులిని విషపు ఎరతో చంపాడని కేసు పెట్టారుట."


"అయ్యో..ఏకంగా పులినే చంపాడా? ఓరి వీడి అసాధ్యం కూలా..పులిని ఎలా చంపాడు? ఎందుకు చంపాడు?" అన్నది సుమతి పక్కనే కుర్చీ లాక్కుని కూర్చుంటూ! 


"ఏముంది అడవులు కొట్టేసి..కాలనీలు, జనావాసాలు తయారు చేస్తుంటే..అక్కడ బతికే జంతువులు ఊళ్ళ మీద పడుతున్నాయి. అడవికి పక్కనే ఉండే పల్లె లో రైతు కి జీవనాధారమైన ఆవును చంపి తినేసిందిట పులి. అలా అతనివి రెండు ఆవులని తినేసిందిట. మళ్ళీ ఆవుని కొనుక్కునే స్థోమత అతనికి లేదు. అయినా తన వస్తువునో..ఆస్తినో పోగొట్టుకున్న వాడు చూస్తూ ఊరుకోలేడు కదా! న్యాయం కోసం అడిగితే పట్టించుకునే వాళ్ళేరి. బతికే దారి లేక..కసితో నిస్సహాయమైన స్థితిలో పులిని చంపాడుట."


"అటవీ శాఖ కేసు పెట్టటానికి తయారయింది కానీ..మనిషికి జరుగుతున్న అన్యాయం గురించి బాధ పడట్లేదు. అందరి సంక్షేమం చూడాల్సిన సర్కారు మాత్రం శుష్కమైన మాటలు చెబుతూ..ఓట్లు దండుకోవటమే పనిగా పొద్దుపుచ్చేస్తున్నారు." 


"ఏమిటి ఏదో మంచి హాట్ టాపిక్ నడుస్తున్నట్టుంది"అన్నాడు విద్యాధర్ లోపలికొస్తూ! 


"రారా తమ్ముడూ..ఇంట్లో అందరూ కులాసాయేనా" అన్నది సుమతి. 


"ఆ ఏముందయ్యా ఊర్లో పెరిగిపోయిన కుక్కల బెడద గురించి..మనకి స్వానుభవం అయింది కదా..ఇవ్వాళ్ళ ఇంకొక కొత్త అనుభవం అయింది. అదీ..దానితో పాటు.. ఈ రోజు పేపర్లో వేసిన 'తన ఆవులని చంపిందన్న వ్యధతో పులిని చంపిన రైతు కథ. అదే మాట్లాడుకుంటున్నాం" అన్నారు రామ్మూర్తి గారు. 


మాట్లాడుకుంటూ ఉండగా..విద్యాధర్ కి ఫోన్ వచ్చింది. 


ఫోన్ మాట్లాడుతున్న తమ్ముడి మొహంలో ఆదుర్దా చూసి.."ఫోన్ ఎక్కడనించి? ఏమిటి విషయం?" అని అడిగింది సుమతి. 


"నేను మళ్ళీ కలుస్తా. అర్జెంట్ గా ఇంటికెళ్ళాలి" అని కంగారుగా స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు విద్యాధర్. 


ఏం జరిగిందో తెలియక రామ్మూర్తి దంపతులు ఆందోళన పడుతుండగా..విద్యాధర్ కూతురు సుమన మళ్ళీ ఫోన్ చేసింది. 


సుమతి ఫోన్ చేతిలోకి తీసుకుని "ఏం జరిగిందమ్మా? అందరూ కులాసాయేనా? నాన్న బయలుదేరాడు. ఈ పాటికి ఇంటి దగ్గరకి వచ్చేసి ఉంటాడు" అన్నది. 


"మా కాలనీలో కోతుల బెడద ఎక్కువ అత్తయ్యా. ఇవ్వాళ్ళ ఒకే సారి మూడు పెద్ద కోతులు..రెండు పిల్ల కోతులు ఇళ్ళ మీదికి వచ్చాయి. పక్క వాళ్ళ ఇంట్లో ఇప్పుడే కొని పెట్టిన డజను అరటి పళ్ళు తినేశాయి. ఒక పెద్ద కోతి వాళ్ళ ఇంట్లో చంటి పాపాయి ఉన్న గదిలోకి వెళ్ళింది. ఆ గదికి ఒకటే దారి. అది పిల్లనెత్తుకు వెళ్ళిపోతుందేమో అని కంగారు పడుతున్నారు."


"మా దొడ్లో నిన్న ఆరేసిన బట్టలు అలాగే ఉన్నాయి. యాదమ్మ తోమి పెట్టిన గిన్నెలు అమ్మ లోపలికి తెస్తుంటే అమ్మతో పాటే ఒక కోతి లోపలికి వచ్చేసింది. భయమేస్తోంది. అందుకే నాన్నకి ఫోన్ చేశాను" అంది. 


అలా కాలనీలో ప్రవేశించిన కోతులు..ఇళ్ళల్లో ఉన్న చెట్ల కొమ్మలు విరిచి, మేడల మీద ఎండ బెట్టుకున్న వస్తువులు చెల్లా చెదురు చేసి..ఇళ్ళల్లో అందుబాటులో ఉన్న పళ్ళు ఆరగించి..ఆరేసుకున్న బట్టలు చింపి పోగులు పెట్టి.. అప్పటికి చేసిన బీభత్సం చాలని..ఆ కాలనీ వాళ్ళ మీద దయ తలచి ఆ రోజుకి అల్లరి చాలించి వెళ్ళిపోయాయి. 


కూతురు సుమన ద్వారా కొంత తెలుసుకున్న అక్కా..బావకి ఫోన్ చేసి...


"కుక్కలు, పులులే కాదు బావగారూ..మా కాలనీలో కోతుల విన్యాసాలు ఇందాక సుమన చెప్పే ఉంటుంది కదా! వాటి బెడద చాలా తీవ్రంగా ఉంది. ఎప్పుడు ఇంట్లో దూరిపోతున్నాయో తెలియట్లేదు. మనకి మనుషుల యోగ క్షేమాలు కాపాడే ప్రభుత్వం ఉందో లేదో తెలియట్లేదు."


"మనం నాగరక ప్రపంచంలో ఉన్నామో..అడవిలో ఉన్నామో కూడా అర్ధం కావట్లేదు. అవి జంతువులు! వాటికి విచక్షణ ఏముంటుంది? మనం బెదిరించలేము..కట్టడి చెయ్యలేము. వాటి కాటుకి చేసే ఇంజక్షన్ మందులకి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరతేట! మనతో కలిసి బతకాలనుకునే జంతువులని కట్టడి చెయ్యటానికి... ఇక మనందరికీ అటవీ శాఖ వాళ్ళు మత్తు ఇంజక్షన్స్ సరఫరా చెయ్యాలి" అన్నాడు. 


"అవునురా.. తమ్ముడూ ఈ మధ్య తిరుపతి యాత్రకి వెళ్ళిన వాళ్ళకి చిరుత పులులు మర్యాద చేస్తున్నాయిట. కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న తిరుపతి దేవస్థానం కానీ, అటవీ శాఖ వారు కానీ, రాష్ట్రాన్ని పాలిస్తున్న యంత్రాంగం కానీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని శాశ్వత పరిష్కారం కనుక్కునే బదులు...యాత్రికులకి స్వీయ రక్షణ కోసం అని కర్రలు ఇచ్చి పంపిస్తున్నారుట."


"నాకు అరవయ్యేళ్ళు వచ్చాయి..తిరుపతిలో ఈ విడ్డూరం నేనెన్నడూ వినలేదు. 100-150 సం ల క్రితం.. నిజంగా అది అడవిలాగా ఉన్నప్పుడు కూడా జనం నిర్భయంగా తిరిగారని చెప్పుకుంటారు" అన్నది సుమతి. 


"అక్కా.. మనం పెట్టే సెల్ ఫోన్ టవర్లకి చిన్న చిన్న పక్షులు అంతరించి పోతుంటే..పెద్ద జంతువులైన ఏనుగులు..ప్రమాదకరమైన జంతువులు పులులు, మొసళ్ళు, గ్రామ సింహాలుగా పేరు బడిన కుక్కలు, కోతులు, ఊళ్ళ మీద పడి మన భరతం పడుతున్నాయి."


"ఈ పరిస్థితులకి మానవ తప్పిదమే కారణం! అడవులు నరికేసి పరిశ్రమల కోసం కర్మాగారాలు కడుతున్నాం. ఊళ్ళు అభివృద్ధి చేస్తున్నాం. చెరువులు పూడ్చేసి కాలనీలు చేస్తున్నాం. ఇళ్ళల్లో వంటలు మానేసి హోటళ్ళు..టిఫిన్ సెంటర్లని ప్రోత్సహిస్తున్నాం."


"జంతువులు తిండి కోసం వెతుక్కుంటూ..ఎక్కడ దొరికితే అక్కడకి వచ్చేస్తున్నాయి. జంతు సంరక్షణ ..జీవ కారుణ్య సంస్థల వాళ్ళు వాటి హక్కులు కాపాడాలనుకుంటుంటే... మనుషులని పాలించాల్సిన వాళ్ళు "దొంగలు దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నట్టు" 'నీకింత..నాకింత' అని వాటా పంచుకుంటూ..మన జీవితాలని గాలికొదిలేస్తున్నారు" అన్నాడు. 


"అంతేలే జీవ కారుణ్యం అంటే..ఆ లిస్టులో జంతువులే వస్తాయేమో..మనుషులు రారనుకుంటా. మనిషి ప్రాణానికి ఏ విలువ లేకుండా పోయింది. మనని ఏలే వారికి ఓట్లు కావలసినప్పుడే మనుషులు గుర్తొస్తారు."


"జంతువుల మనుషులకి కలుగుతున్న ప్రమాదాల గురించి తామే నేరుగా కలగజేసుకోవాలి అని మొన్న సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చూద్దాం..ఇకనైనా మనకి మంచి రోజులొస్తాయేమో" అన్నది సుమతి ఆశగా. 


“జాగ్రత్త తమ్ముడూ..వీలైనప్పుడు నువ్వూ, మరదలూ రండి. బావగారికి కబుర్లు చెప్పే వాళ్ళు కావాలి. ఆయనకి జనాల పిచ్చి.,తెలుసుగా నీకు. ఉంటా" అని ఫోన్ పెట్టేసింది. 


***


No comments:

Post a Comment

Pages