పురాణ కధలు - బసవ పురాణం - 34 - అచ్చంగా తెలుగు

పురాణ కధలు - బసవ పురాణం - 34

Share This

 పురాణ కధలు - బసవ పురాణం - 34 

 పి.యస్.యమ్. లక్ష్మి




34.  గుడ్డవ్వ కధ             

పూర్వం పాండుపురం అనే ఊళ్ళో అనేకమంది బ్రాహ్మణులు నివసిస్తూవుండేవారు.  ఆ ఊరి పక్కనే వున్న మాలపల్లెలో ఒక నిరుపేద వృధ్ధురాలు వుండేది.  ఆమెను అంతా గుడ్డవ్వ అని పిలిచేవారు.  ఆమె గొప్ప శివ భక్తురాలు.  పేదరికమేగాక ఆమెని పట్టి పీడించే భయంకర కుష్టు రోగాన్ని కూడా సహిస్తూ శివ నామ స్మరణ చేస్తూ గడిపేది. 

ఒకసారి ఆమెకు పనిపడి పాండు పురానికి పోవలసి వచ్చింది. కుష్టు రోగంతో ఆమె శరీరంలోని అవయవాలు అన్నీ పుళ్ళు పడి వున్నాయి.  కాళ్ళూ చేతుల వేళ్ళు కొన్ని వూడి పోయాయి.  శరీరంనుంచి విపరీతమైన దుర్గంధం.  ఆమెను చూసి ఆ ఊళ్ళో బ్రాహ్మణులు జాలి తలచే బదులు తిట్టి పోశారు.  అంత రోగగ్రస్తురాలివి ఊళ్ళోకెందుకు వచ్చావు? నీ వ్యాధి మాకందిరికీ అంటించటానికా?  మేము పిల్లా పాపలతో సుఖంగా వుండటం నీకిష్టంలేక ఇక్కడికి వచ్చావా??  ముందు ఇక్కడనుంచి వెళ్ళు. అని నానా దుర్భాషలూ ఆడి  ఆమెని వెళ్ళకొట్టారు.  పాపం గుడ్డవ్వ శారీరక కష్టానికి తోడు వాళ్ళ మాటలతో మనసు వికలమై ఇంక తను జీవించటం వ్యర్ధమని నిర్ణయించుకుని, ఆ ఊరిలో కొలువు తీరిన సోమేశ్వరుని చెంత ప్రాణ త్యాగము చెయ్యదలచి వేగంగా శివాలయం వైపు అడుగులు వేసింది.  ఆ క్షోబలో దారీ తెన్నూ చూసుకోక పడి పోతుంటే దోవలో రాళ్ళు తగిలి శరీర అవయవాలు తెగి పోసాగాయి.  కాళ్ళ వేళ్ళు వూడి పడి నడవటానికి రాక పాక్కుంటూ శివా, నీవే దిక్కంటూ శివాలయం  చేరింది. 

ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.  నీ దర్శన భాగ్యం లభించింది.  ఇంక నాకేం వరం కావాలయ్యా అంటూ శివుణ్ణి స్తుతించ సాగింది.  ఆమె భక్తికి ఆశ్చర్యపోయిన శివుడు ఆమె రోగాన్ని తీసేసి ఆరోగ్యవంతమైన శరీరాన్నిచ్చాడు.. అంతేగాక ఆమె కోరకుండానే,  "నీ రోగమంతా నిన్ను అవమానించినవారికి పంచానులే" అన్నాడు.  గుడ్డవ్వ శేష జీవితాన్ని సుఖంగా గడపమని ఆనతినిచ్చాడు.

గుడ్డవ్వ తన ఇంటికి చేరి తన సాధారణ జీవితాన్ని గడపసాగింది.  పాండు పురంలో గుడ్డవ్వని దూషించిన వారందరికీ అకస్మాత్తుగా కుష్టు రోగం వచ్చి నానా బాధా పడసాగారు.  తర్వాత గుడ్డవ్వకి శివుడు ప్రత్యక్షమైన సంగతీ, ఆమె రోగం పోయిన సంగతీ తెలిసింది.  ఆమెని నిందించటంవల్లే తమకి ఆ రోగం వచ్చింది అని పశ్చాత్తాప పడి అంతా వెళ్ళి ఆమెని శరణు వేడారు.  తమ తప్పుని క్షమించమని కోరారు.  సున్నిత మనస్కురాలైన గుడ్డవ్వ ప్రార్ధనతో శివుడు వారి రోగాన్ని కూడా నశింప చేశాడు.  భక్తికి, సౌశీల్యానికీ మించిన సాధన లేదని అంతా గ్రహించారు.

ఈ విధంగా బసవ పురాణంలోకధలన్నీ తమ అచంచల భక్తితో పరమ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటమే కాదు ప్రత్యక్ష దర్శనం కూడా పొందిన భక్తుల గాధలు.  వీటిలో కొన్నింటిని  మీకు అందించ గలిగాను.  భాషే నాది తప్ప కధలన్నీ పురాణంలోవే.

ఆదరించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు.  ప్రోత్సహించిన అచ్చంగా తెలుగు ఆధిపత్యానికి అభినందనలు.  శుభమ్.

 ***

No comments:

Post a Comment

Pages