చీమ కుట్టింది
పి.యస్.యమ్.
లక్ష్మి
 
రాధ రెండేళ్ళ పాపాయి.  చకా చకా
నడుస్తుంది.  చక్కగా నవ్వుతూ ఆడుకుంటూ
వుంటుంది.  ఒకసారేమైందో తెలుసా?  ఆ పాపాయి అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటోంది. గోడ
పక్కనున్న చిన్న చీమల పుట్ట చూసింది. 
అదేమిటోనని వేలు పెట్టి చూసింది. 
పిల్లలు సాధారణంగా వేలు పెట్టి చూస్తుంటారుకదా దేనినైనా!  అలాగే!
చీమ వూరుకుంటుందా? అది పాపాయి వేలుని కుట్టింది. పాపాయికి నొప్పి పుట్టి ఏడ్చింది.  వాళ్ళమ్మ వచ్చి పాపాయిని ఎత్తుకుంది. ఎందుకమ్మా
ఏడుస్తున్నావు అని అడిగింది.  అంతా
చూసింది.  ఆవిడకి అర్ధమయింది.  పాపాయి ఆ చీమల పుట్టని కదిల్చి వుంటుంది.  చీమ కుట్టి వుంటుంది అని.  పాపాయిని ఊరడిస్తూ అమ్మ చీమని అడిగింది.  “చీమా, చీమా మా పాపాయిని ఎందుకు కుట్టావు?” అని.
చీమ ఏమి సమాధానం చెప్పిందో తెలుసా!?  “నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా?” అన్నది.
ఇది ఎన్నో తరాలుగా అమ్మమ్మలూ, నాన్నమ్మలూ చెప్పిన కధ.
కానీ అమ్మ ఏమి చెప్పిందో తెలుసా?  "పాపాయీ, ఇంకా నువ్వు చిన్న పిల్లవిగనుక నీకు
తెలియదు.  కానీ ఇప్పటినుంచే
నేర్చుకోవాలి.  కాలం అలా వుంది.  మనకి హాని చేసేవాటి దగ్గరకి మనం
వెళ్ళకూడదు.  పైగా వాటికి వీలయినంత దూరంగా
వుండాలి.   చూడు నువ్వా చీమల్ని
పట్టుకోవాలని చూడబట్టే కదా అది నిన్ను కుట్టింది. 
పాపాయి మరీ చిన్నది గనుక అర్ధం కాలేదు. 
హాయిగా నవ్వింది.  
కానీ పిల్లలూ, మీకు అర్ధం అయింది కదా.  వూరికే ఎవరితోనూ గిల్లి కజ్జాలు పెట్టుకోవద్దు.
 దీని గురించే బద్దెన అని సుమతీ శతకం రాసిన
మహానుభావుడు ఒక పద్యం కూడా చెప్పాడు.
 ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి
యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు
ధన్యుడు సుమతీ!
అంటే మనం ఎక్కడ ఎంతమటుకూ అవసరమో అంతమటుకే మాట్లాడాలి.  దానివల్ల ఎదుటివారి మనసు కష్టపెట్టము.  ఉదాహరణకి ఎవరన్నా నిన్ను, "మీ నాన్నగారేం చేస్తున్నారు పాపా?"  అంటే
దానికే సమాధానం చెప్పాలి?  ఆయన అప్పుడేం చేస్తున్నారో చెప్పాలి.  అంతేగానీ ఆయన ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు
తయారవుతారు, ఆఫీసుకి ఎప్పుడు వెళ్తారు, ఇంట్లో ఎలా వుంటారు ఇవ్వన్నీ అక్కరలేదు.
అవ్వన్నీ చెప్పటంవల్ల వినే వాళ్ళకి విసుగు కలగచ్చు, మీ నాన్నగారికి ఇవ్వన్నీ
వాళ్ళకెందుకని చికాకు కలగచ్చు, అరె మా అమ్మాయి ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఇంట్లో
విషయాలన్నీ చెప్పేస్తోందని మీ అమ్మకి బాధ కలగచ్చు, నువ్వింత అమాయకురాలివని
ఎదుటివారికి అభిప్రాయం కలగచ్చు.  అంటే
అనవసమరైన మాటలు ఎన్ని విధాల చేటో తెలిసింది కదా.
మీరు పెద్దవుతున్నకొద్దీ ఈ పద్యం ఇంకా బాగా అర్ధమవుతుంది
మీకు.  ప్రస్తుతానికి మాత్రం కంఠతా
పట్టండి.  మీరు జీవితాంతం
గుర్తుంచుకోవాల్సిన పద్యం ఇది.
***
 

 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment