ఒకటైపోదామా... ఊహల వాహినిలో! - 5
కొత్తపల్లి ఉదయబాబు

(విరాజ్, హరిత ప్రేమికులు. పెళ్ళికి ముందు తనకు బిడ్డను కనివ్వాలని, ఆ తర్వాతే ఆమెను పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు విరాజ్. ఇక చదవండి.)
''రేపు ఇక్కడ ఇదే సమయానికి నీ ప్రశ్నకు
నా సమాధానం చెబుతాను.మగవాడు తీసుకున్నంత తొందరగా ఆడది సమాధానం చెప్పలేదు. ఎందుకంటే
మీరు సరదాగా నిర్ణయం తీసుకున్నా కూడా  ఆ
ఒక్క నిర్ణయం ఒక ఆడదాని జీవితం కాబట్టి. రేపు కలుద్దాం విరాజ్. శుభరాత్రి.''అని అడుగు ముందుకు  వేయబోయిన ఆమెకు
అడ్డంగా నిలబడ్డాడు  అతను.
 ''కోపం వచ్చిందా? నీకు ఇష్టం లేకపోతే వద్దులే.
ఆడవాళ్లు ఎన్నెన్నో అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారని విన్నాను. నాకు కాబోయే
భార్య అలాంటి సాహసి  కాదు అనుకొని  నా కోరికను చంపేసుకుంటాను."
 ''ఒకే. అర్ధమైంది. మరి తమరు తప్పుకుంటే వెళ్లి వస్తాను.'' 
 '' నేను మీ సందు మొదట్లో దింపేసి వెళ్ళిపోతాను.''
 '' వద్దు. నేను వెళ్ళగలను.నన్ను పెళ్లి చేసుకున్నాకనే నీ బైక్ వెనకాల
కూర్చునేది. అంతవరకూ ...''
 '' నో టచ్... నో కిస్. అంతేనా...?''
 ''నా ప్రేమికుడు ఇలాంటి చిన్ని వాటికోసం కక్కుర్తిపడే మాటలు మాట్లాడేవాడు
అన్న అభిప్రాయం నాకు కలగనివ్వకు. వస్తాను..బై...అంకుల్ ని అడిగానని చెప్పు. ''
అనేసి అతన్ని తప్పించుకుని అటుగా వస్తున్న ఆటోని ఆపి ఎక్కి
వెళ్ళిపోయింది హరిత. 
 విరాజ్ ఒక్క
క్షణం గడ్డిలో నీరసంగా కూలబడిపోయాడు. 
 ''ఎలా ఈ అమ్మాయిని అర్ధం చేసుకోవాలి?'' అనుకుంటూ. 
****
 ఆటోలో
కూర్చుందన్నమాటే గాని హరిత మనసు మనసులో లేదు. 
 విరాజ్ తనకి
మొట్టమొదటిసారి ప్రొపోజ్ చేసిన రోజు తన జీవితంలో మొదటి పండుగ అనుకుంది. ఎంతోమంది
అమ్మాయిలను పరిశీలించి తనను ఎన్నుకుని ప్రొపోజ్ చేసినట్టు చెప్పాడు తనకు.
 సరిగ్గా
మూడేళ్ళ క్రితం  తాను  తన డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవం వేదిక మీద
పాట పాడుతుంటే బహుమతులను స్పాన్సర్ చేసిన విరాజ్ తండ్రి విరాజ్ ని తన తరపున
అతిధిగా పంపించాడు. విరాజ్ చేతులమీదుగా తాను ప్రధమ బహుమతిని అందుకుంది.
 తొలిసారి
తనను చూసిన విరాజ్ కళ్లల్లో తానూ చూసిన మెరుపు తన జన్మలో మరిచిపోదు. 
 ఆమాటే తన
తల్లితో అంది.
 ''చూస్తారమ్మా, ఆడదానికి అందమో, అంతకు
మించిన ఆకర్షణో, వాటిని మించిన చలాకీ తనమో, ఏదో ఒక టాలెంటో ఉన్న ఆడదానిని ఎలాగైనా మత్తులో పడేసి తన అవసరం
తీర్చుకున్నాకా ఆటబొమ్మలుగా చేసి సమాజంలో వదిలేసే మృగాలున్న పురుషాధిక్య సమాజంలో
బ్రతుకుతున్నాం మనం. అవసరమైతే మనమే మదమెక్కి 
డబ్బుకోసమే వాళ్ళను వలలో వేసుకున్నామని మనలను దోషులుగా నిలబెట్టడానికి
ఏమాత్రం వెనుకాడని పురుషపుంగవుల సమాజంలో మన తప్పు లేకపోయినా  మనమే పావులమమ్మా.. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని
సంవత్సరాలైనా, సాంకేతిక పరిజ్ఞానం అంతరిక్షంలో పైపైకి
పోతున్నా శారీరకంగా మానసికంగా బలవంతుడైన మగవాడిదే ఈ సమాజం...ప్రపంచం కూడా. 
 ఇంట్లోంచి
బయటకి రానివ్వనినాడు ఇంటిలోపలే ఉండిపోయిన ఆడవాళ్లు ఎన్నీ రకాల నరకాలు
అనుభవించారో...సమిధల్లా మాడి మసైపోయారో ...ఎవరికి తెలుసు. స్త్రీలు పడుతున్న ఆ
మానసిక సంక్షోభం గ్రహించిన కొందరు సంఘ సంస్కర్తలు స్త్రీని తమ సాటి మనిషిగా
గుర్తించి, ఆమె చదువుకోవాలని,  మగాడిమీద ఆధారపడకుండా తనకు
తానుగా తన కాళ్ళమీద నిలబడాలని కోరుకుని, వాళ్ళ పక్షాన నిలబడి
స్త్రీకి గడపదాటి బయటకు వచ్చే అవకాశం ఇచ్చారు. 
 అయినా దాదాపు
ప్రతీ రంగంలోనూ ఆడది శల్య పరీక్షనుంచి శీల పరీక్ష వరకు ఈనాడు ఎదుర్కొంటూనే ఉంది.
ఇపుడు కాలం బాగా మారింది. మగవాడదూకేసిన మోసాన్ని ధైర్యంగా న్యాయస్థానంలో
ప్రశ్నించే స్థాయికి స్త్రీ ఎదిగింది. వాటన్నిటికన్నా ముందు తనను తానూ కాపాడుకునే
విద్యలు స్త్రీ తెలుసుకోవడం అవసరం. ఆ స్వేశ్చ నీకిచ్చినందుకు నీ ఆత్మరక్షణ
చేసుకునే స్థాయికి నువ్వు వచ్చావు. అందుచేత ఆచి తూచి అడుగువేయమ్మా.. ఎటువంటి
ప్రలోభాలకు లొంగకు. నా చుట్టూ చూసిన, అనుభవించిన కొన్ని అనుభవాలన్నీ నీకు జీవిత పాఠాలుగా నీకు చెప్పాను.
జాగ్రత్త తల్లీ .'' అని తల్లి చెప్పిన ప్రతీ విషయం నరనరానా
ఇంకించుకుంది తాను. 
 తన తల్లి
చెప్పినట్టే మూడో రోజు కాలేజీకి వెళ్తోంటే 
తన దారికి అడ్డంగా బైక్ ఆపాడు విరాజ్.
 ''హరితా. మీతో మాట్లాడాలి.'' అన్నాడు.
(ఇంకా ఉంది)
 

 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment