జీవుడించుకంత చేత సముద్రమంత - అచ్చంగా తెలుగు

జీవుడించుకంత చేత సముద్రమంత

Share This

జీవుడించుకంత చేత సముద్రమంత 

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 





రేకు: 0352-05 సం: 04-307

పల్లవి: 

జీవుడించుకంత చేత సముద్రమంత

చేవెక్కి పలుమారు జిగిరించీ మాయ


చ.1:

కోపములైతేను కోటానగోట్లు

దీపనములైతేను దినకొత్తలు

చాపలబుద్దులు సమయని రాసులు

రాపాడీగడవగరాదు వోమాయ


చ.2:

కోరికలైతేను కొండలపొడవులు

తీరనిమోహాలు తెందేపలు

వూరేటిచెలమలు వుడివోనిపంటలు

యీరీతినే యెలయించీని మాయ


చ.3: 

మునుకొన్నమదములు మోపులకొలదులు

పెనగినలోభాలు పెనువాములు

నినుపై శ్రీవేంకటేశ నీదాసులనంటదు

యెనసి పరులనైతే యీదించీ మాయ


భావం:


పల్లవి:

జీవుడు కొంచెము చేసిన పని సముద్రమంతగా లెక్క అవుతుంది.( మాయ చేస్తుందని భావం)

బలముతో (ధైర్యముతో) జీవితంలో  అనేకసార్లు ఈ మాయ ప్రకాశిస్తుంది.



చ.1:

మాయా ప్రభావం వలన మా కోపములు కోటానుకోట్లుగా ఉంటాయి.

ప్రేరేపణలు  నిత్యనూతనములుగా ఉంటాయి. (దినదినమునకు నవీనములు)

చపలత్వంతో కూడిన మా బుద్దులు నాశనము కాని రాశులు గా ఉంటాయి. ( తరగని గుట్టలని భావం)

మాయా ప్రభావంతో  ఇవన్నీ జీవితంలో  వేధించి మమ్మలిని లౌకిక జీవితం నుండి తప్పించుకోనీయటం లేదు.



చ.2:

మాయా ప్రభావం వలన మా కోరికలు  అత్యధికములుగా ఉంటాయి.

తీరనిమోహాలు అపారములు, సమృద్ధులు.

ఆ మోహాలు ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఏఱులోనగువానియందు నీళ్లకొఱకు త్రవ్వెడు పల్లములలో ఊరే ఊటలు.. నాశనం లేని పంటలు.

ఈరకంగా  మాయ మమ్మలిని పురికొల్పుతుంది.



చ.3:

మాయా ప్రభావం వలన  ముందు ఉంచుకొన్న.మదములు అత్యధికములుగా ఉంటాయి.

యుద్ధము చేసే లోభాలు అధికంగా ఉంటాయి.

శ్రీవేంకటేశ !సమృద్ధమైన నీదయతో ఈ మాయ నీదాసులను అంటదు.

నీదాసులు కానివారిని ఈ  మాయ ఈదిస్తుంది.( బాధ పెడుతుందని భావం)

***


No comments:

Post a Comment

Pages