శ్రీథర మాధురి - 113 - అచ్చంగా తెలుగు

శ్రీథర మాధురి - 113

Share This

 శ్రీథర మాధురి - 113

(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృతవాక్కులు)


వెన్నగానే ఉండిపోకండి

ఒకసారి ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు, " నేను చాలా బాధపడుతున్నాను. నాకు వ్యాపారంలో 5 లక్షల నష్టం వచ్చింది. దయచేసి నన్ను కాపాడండి." 
నేను ఇలా అన్నాను, "దిగులుపడకు. వ్యాపారంలో ఇటువంటివన్నీ మామూలే. ఈ సంవత్సరం నీకు 5 లక్షల నష్టం వస్తే, వచ్చే సంవత్సరం 10-15 లక్షల లాభం రావచ్చు."
 
వారికి లాభాలు వచ్చినప్పుడు ఎవరూ నాకు సమాచారం ఇవ్వరు. కేవలం వారికి నష్టం వచ్చినప్పుడే వారు సమయానికి నా దగ్గరికి వస్తారు. పర్వాలేదు. వారికి వారి భావాలను వెల్లడించాలని ఉంది. ఒక వ్యక్తి నిరాశలో ఉన్నప్పుడు అతనికి సహాయం కావాలి. ఎవరైనా ఆనందంగా ఉన్నప్పుడు స్వార్థపూరితమైన బుద్ధికి ఎవరి ఓదార్పూ అవసరం లేదు.
 
దీపావళి కి అంతా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం నేను చూశాను. వారు 'హ్యాపీ దీవాలి' అంటారు. ఆ శుభాకాంక్షలను నిజంగా ఎవరూ పట్టించుకోరు. వారు హడావిడిగా టపాసులు పేలుస్తూ, చాలా యాంత్రికంగా తిరిగి శుభాకాంక్షలు చెబుతారు. అది అందరికీ సంతోషకరమైన సమయం. అప్పుడు దీపావళికి ఆనందంగా ఉండమని నిజానికి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు.

ఒక వ్యక్తికి ఏదైనా నష్టం కలిగినప్పుడు అతనిని ఓదార్చాలి. మీరు వారి వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి, మీ సానుభూతిని ప్రకటిస్తే దాన్ని అతను జీవితాంతం గుర్తుంచుకుంటాడు. దీపావళి వంటి పండుగల సమయాల్లో మీరు వారికి శుభాకాంక్షలు తెలిపినా, తెలుపకపోయినా అతను పెద్దగా పట్టించుకోడు. కానీ ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా నిరాశకు గురైనప్పుడు అతనికి, మానసికంగా, ధార్మికంగా మీ సహాయం కావాలి. ఒక బాధ పడుతున్న ఆత్మను అలా ఒంటరిగా వదిలి వేయ కూడదు. ఎవరైనా కూడా ఉండి అతని సమస్య తీరేలా చూడాలి.

నేను ఇంతకు ముందు చెప్పిన వ్యక్తి ఇటువంటి పరిస్థితుల్లోనే నా వద్దకు వచ్చాడు. నేను కూడా అతన్ని ఆమోదించాను. అతడు ఐదు లక్షలు నష్టం వచ్చిందని చెప్పాడు గనక, నేను 'మరి గత ఏడాది పరిస్థితి ఏమిటని?' అడిగాను.
 
గత ఏడాది అతనికి 10 లక్షల లాభం వచ్చిందని అతను బదులిచ్చాడు. అంతకుముందు ఏడాది అతనికి 15 లక్షల లాభం వచ్చిందట. అంతకుముందు ఏడాది అతనికి మూడు లక్షల నష్టం వచ్చిందట. ఈ లాభనష్టాల వ్యాపార చక్రం వెనుక నాకొక క్రమబద్ధత కనిపించింది. అతను లాభాలను ఆస్వాదించినట్టే నష్టాలను కూడా ఎదుర్కోవాలి. ఈ విధమైన దృక్పథంతో విషయాలను చూడడం అలవరచుకోవాలి. నేనివన్నీ అతనికి చెప్పలేదు. కేవలం ఇలా చెప్పాను, 'దయచేసి ఒక అర కిలో వెన్న తీసుకుని గురువారంనాడు ఆంజనేయస్వామి విగ్రహానికి అద్దేలా చూడు.' అతడు అంగీకరించాడు.
  
నేను వెన్ననే ఎందుకు సూచించాను? వెన్న అనేది ఒక మధ్యస్థ ఉత్పత్తి. మొదటి ఉత్పత్తి పాలు, చివరి ఉత్పత్తి నెయ్యి. ఒకవేళ ఒక వ్యక్తికి ఏమీ తెలియక పోతే, అతను పూర్తిగా అజ్ఞానంతో, అమాయకత్వంతో కూడుకొని ఉంటే, అతడు మొదటి దశ అయిన పాలవంటివాడు. అటువంటి వారితో ఎటువంటి సమస్యా లేదు. ఒకవేళ ఒక వ్యక్తి పూర్తి జ్ఞాని అయితే, అతను నెయ్యిలాగా చివరి దశలో ఉన్నాడన్న మాట. అతనితో కూడా ఎటువంటి సమస్యా లేదు.

కానీ మా వద్దకు వచ్చే చాలామంది వెన్న వంటి వారు. అదొక మధ్యస్థ దశ. అటూ ఇటూ కానిదది. వారికి మిడిమిడి జ్ఞానం ఉంటుంది, అది ఎంతో ప్రమాదకరమైనది. కాబట్టి మధ్య దశ అయిన వెన్నను అజ్ఞానంగా భావించవచ్చు. ఈ అజ్ఞానాన్ని మనం ఆంజనేయ స్వామికి సమర్పించి, మనల్ని మహాజ్ఞానంతో దీవించమని కోరుకుంటాము. గురువారం నాడు మీరు ఆంజనేయ స్వామి వద్దకు వెళ్లి మీ అజ్ఞానాన్ని ఆయనకు సమర్పించి, ఆయన నుంచి మహా జ్ఞానాన్ని తీసుకోవచ్చు. ఆయన వెన్నను స్వీకరించి, దాన్ని జ్ఞానమనే నెయ్యిగా మార్చి మీకు ఇస్తారు. నా వద్దకు వచ్చిన ఈ వ్యాపారి, లాభనష్టాలు వ్యాపార చక్రంలో సాధారణమే అనే జ్ఞానాన్ని సంపాదించుకోవాలని నేను కోరుకున్నాను.

ఈ ఏడాది నాకు ఐదు లక్షల లాభం వచ్చినట్లయితే, నా వద్ద మరిన్ని తెలివితక్కువ పనులు చేయటానికి మరింత ధనం ఉంటుంది.
ఈ నిజం అతని మనసులో స్వచ్ఛందంగా ఉదయించాలని నేను కోరుకున్నాను. అందుకే ఆంజనేయస్వామికి వెన్న రాయమని అతనికి చెప్పాను.

మొదటి నెల నేను చెప్పిన విధంగానే అతను వెళ్ళి వెన్న రాశాడు. కారణం చెబితే, ఈ అరకిలో వెన్న కూడా రాయడేమో అని నేను అతనికి కారణం చెప్పలేదు. ఆంజనేయస్వామికి కనీసం అర కిలో వెన్న అయినా దక్కాలని నేను అనుకున్నాను. పాపం, అసలే చాలావరకూ ఎవరూ ఆయన వద్దకు వెళ్లరు. ఆ తర్వాత నెల మన మిత్రుడు తిరిగి నా వద్దకు వచ్చి, "ఇంత వరకూ ఎటువంటి లాభాలు రాలేదు" అన్నాడు.

నేను మరొక అర కిలో వెన్నను వచ్చే గురువారం నాడు రాయమన్నాను. అతను అంకితభావంతో ఆ పని చేసి, మూడవ నెల తిరిగి నా వద్దకు వచ్చాడు. అప్పుడు నేను మరొక అరకిలో వెన్న రాయమన్నాను. ఆ తర్వాత అతను తిరిగి నా వద్దకు రాలేదు. బహుశా ఆంజనేయస్వామి అతనికి జ్ఞానాన్ని ప్రసాదించారేమో. కనీసం వెన్న ఖర్చైనా మిగులుతుందని అతను వదిలేసి ఉండొచ్చు లేదా, 'ఇతడు నన్ను మభ్యపెడుతున్నాడు. నా సమస్యకు ఎటువంటి పరిష్కారం ఇతనివద్ద దొరకదు. కాబట్టి అతని వద్దకు వెళ్లి నా సమయాన్ని, అతని సమయాన్ని కూడా ఎందుకు వృధా చెయ్యాలి?' అని కూడా అతను అనుకుని ఉండొచ్చు.

అతనలా భావించినా, అదీ మంచికే అని నేను అనుకున్నాను. కనీసం ఈ మాత్రం జ్ఞానమైనా అతనికి కలిగితే అదీ మంచిదే. లౌకికమైన కోరికలతో నా వద్దకు రావడం వృధా ప్రయాస అని అతను గుర్తించి ఉంటాడు.

లౌకికమైన కోరికలతో ఎవరైనా నా వద్దకు వచ్చినప్పుడు, నా వద్ద ఒక స్థిరమైన సమాధానం ఉంది. అది మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. దైవం యొక్క దివ్య దృష్టిని నమ్మండి. ఆయన ఎల్లప్పుడూ మీకు ఏది మంచిదో అదే ఇస్తారు.

***


No comments:

Post a Comment

Pages