భారతాంబిక శతకము - గరికపాటి మల్లవధాని - అచ్చంగా తెలుగు

భారతాంబిక శతకము - గరికపాటి మల్లవధాని

Share This

 భారతాంబిక శతకము - గరికపాటి మల్లవధాని

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవి పరిచయం:
గరికపాటి మల్లావధాని (సెప్టెంబరు 18, 1899 - జనవరి 5, 1985) స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. ఆయన కాంగ్రెస్ నేతగా జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ స్ఫూర్తితో పాల్గొన్నాడు. ఆయన కవిగా పదుల సంఖ్యలో పుస్తకాలను రచించగా, అంతకుమించి పండితునిగా పరిష్కరించిన గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈయన కొవ్వూరులో 1899లో వికారి నామ సంవత్సర భాద్రపద పూర్ణిమ నాడు సీతారామయ్య, వెంకటసుబ్బమ్మలకు మొదటి కుమారునిగా జన్మించాడు. కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో, విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలోనూ, సంస్కృతాంధ్రాలను అభ్యసించాడు. ప్రఖ్య సీతారామశాస్త్రి, పురిఘళ్ళ సుబ్రహ్మణ్యశాస్త్రి, తాతా సుబ్బరాయశాస్త్రుల శుష్రూషలో సంస్కృత భాష సాహిత్యపు మెరుగులు దిద్దుకున్నాడు. కల్లూరి వెంకట్రామశాస్త్రి, వజ్ఝల సీతారామ శాస్త్రుల దగ్గిర తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించాడు. వేలూరి శివరామశాస్త్రి గారి అష్టావధానాల ఆకర్షణలో పడి అవధానాలు చేయడం ప్రారంభించాడు.
ఈయన కొంతకాలం ఎర్నగూడెం తాలూకాలో తెలికిచెర్ల జమీందారు రాజా కాకర్లపూడి వేంకటరమణయ్య ఆశ్రయములో ఉన్నాడు. ఆ జమీందారుగారి వినోదార్థము కవితాగోష్ఠులను, అష్టావధానములను కావించి, 8 ఎకరముల భూవసతిని సన్మానముగా గ్రహించాడు. నర్సాపురములో జరిగిన సభలో "కవిశేఖర" బిరుదమును పొందాడు. 1922 లో ఏలూరులోని గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయములో సంస్కృతాంధ్ర పండితుడిగా చేరినాడు. 1930వ దశకంలో "ఢంకా" అనే పత్రికను నడిపినాడు. 1935 లో మంజువాణీప్రెస్, రామా అండ్ కో, వెంకటరమణ పవరుప్రెస్ మొదలైన ముద్రణాలయములలో గ్రంథపరిశోధనము గావించాడు. 1947 లో సర్ సి.ఆర్.రెడ్డి కాలేజీలో తెలుగుపండితులుగా చేరి పెక్కుమంది శిష్య ప్రశిష్యులను సంపాదించి విశిష్ట భాషాసేవ ఒనర్చాడు.
1921లో ఆయన చదువు మానుకొని సహాయ నిరాకరణోద్యమంలో చేరి గ్రామ గ్రామానికీ పోయి జాతీయగీతాలు రాసి, పాడి, బ్రిటీషువాడికి వ్యతిరేకంగా ఉపన్యాసాలిచ్చి, జనాన్ని మేలుకొలిపాడు! 1930లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగహంలోకి దూకి, శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించాడు. కోర్టువారు ఆయన్ని, ఏలూరులో బ్రిటీషు జిల్లాజడ్జి గారి ముందు విచారణకి బోనెక్కించారు.

రచనలు

1.గరికపాటి కలంలో దేశభక్తి గళం, 2. భారతాంబికా శతకము, 3. విద్యార్థి శతకము, 4. ఋతుషట్కము, 5. శివనివేదనము, 6. శంకర జననము, 7. పుష్పవివేకము, 8. పండిత రాయలు, 9. ఆదర్శజ్యోతి (శ్రీరాముని గుణగణ ప్రశంస), 10. అమరుక కావ్యం (ఆంధ్రీకరణము), 11. దిగంబరి (తత్త్వనాటికలు)

అవధానాలు

ఇతడు సుమారు 20 వరకు అష్టావధానాలు చేశాడు. ఇతని అష్టావధానాలలో సమస్య, దత్తాక్షరి, వర్ణన, కావ్యపాఠము, వ్యస్తాక్షరి, పురాణపఠనము, చదరంగం, అప్రస్తుత ప్రసంగం అనే ఎనిమిది అంశాలు ఉండేవి
(తెలుగు వికిపీడియా నుండి) 

శతక పరిచయం:
"భారతాంబికా" అనే మకుటంతో చంపకోత్పలమాలికా వృత్తాలలో రచింపడిన ఈశతకం ఒక చారిత్రాత్మిక శతకంగా వర్గీకరించవచ్చు. కవి ఈశతకాన్ని రాజకీయ గ్రంథంగా అభివర్ణించారు. ఈశతకాన్ని వారు ఉప్పుసత్యాగ్రహ సమయంలో బళ్ళారి అల్లెపురం జైలులో ఉన్నప్పుడు వ్రాసినదిగా శతకం ముందుమాటలో కవిగారు తెలిపారు.
ఈశతకంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహ పిలుపుపై స్పందించి పశ్చిమ గోదావరి మండలంలో ప్రజల స్పందన మరియు ఉద్యమ వివరాలను కళ్ళకు కట్టే విధంగా వర్ణించారు.
కొన్ని పద్యాలను చూద్దాము.

ఉ. పుట్టిన నీదు బిడ్డలము పొట్టకుబట్టకులేక పెక్కులి
క్కటులు వొందుచుండ నధికారులమంచు విదేశసంభవుల్
నెట్టనఁ బీటవెట్టుకొని నీసిరినెల్లను దోచుచుండ మే
మెట్టుల నింకఁజూచి సహింపగలారమె భరతాంబికా!

ఉ. రండిదెయుప్పుచట్టము తిరస్కృతిసేయుఁడటంచు జైత్రపున్
డిండిమఘోషణంబెసఁగ డెబ్బదిఏడ్వుర దండుతోఁడ ను
ద్దండత దండికేఁగి రిపుతండములొత్తిలి చూచుచుండ బ్ర
హ్మాండముగాఁదిరస్కృతి మహాత్ముఁడొనర్చెను భారతాంబికా!

అదే సమయంలో పశ్చిమగోదావరీ మండలంలో గాంధీజీ పిలుపుకు స్పందించిన తెలుగు ప్రజలు నారాయణరాజశేఖరుని నాయకత్వాంలో ఉద్యమంలో పాల్గొన్నారు.

ఉ. పాయని వేడ్కమైనపుడు పశ్చిమగౌతమి మండలంబునన్
జేయని యేలురందుటుముఁజేర్చిరి నీప్రజ, లంతఁ దచ్చమూ
నాయక పట్టభద్రునిఁ బొనర్చిరి మేరుగంభీరు, దండు నా
రాయణరాజశేఖరు నరాతిభయంకరు భారతాంబికా

అందు పాల్గొన్న మరికొంతమంది దేశభక్తులు

ఉ. మామకశిష్యతల్లజుఁడు మంజులగాత్రుడు దొడ్డయాఖ్యుడున్
మామకసోదరుండు ధృతిమంతుఁడు జోగయశర్మగూడి ర
మ్యామలభావముల్ దొలక హాయిగఁబాడెడు స్వైరగీతికా
స్తోమముభీరుతంగొలఁచి శూరతఁగూర్చెను భారతాంబికా!

ఈవిధంగా బయలుదేరిన సేనకు మార్గమధ్యంలో ఉన్న గ్రామముల ప్రజలు నీరాజనాళు సమర్పించారు. వారి శక్తికొలది ధనసహాయం చేసారు. స్త్రీ, బాల వృద్ధులు ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవటానికి సేనను అనుసరించారు. భీమవరం చేరేసమయానికి సేన బలగం నాలుగు రెట్లయింది. అదెక పెద్ద ఉత్సవంలా ఒకరితో ఒకరు పోటీపడి ఉద్యమం విజయవంతం చేయటానికి ఉత్సాహపడ్డారు.
అటువంటి సేనను రెండుగా చేసి చుట్టుపక్కల గ్రామాలనుండి కూడా జనులను ఉద్యమంలో చేర్చుకొన్నారు.

ఉ. దండునురెండుఁజేసి పెఱదారుల గ్రామములెల్లఁజుట్టి పం
డ్రెండవతేది రేపన వడిజనుదెంచిరి మట్లపాలె, మా
రెండవనాడే యుప్పు నొనరించి తిరస్కృతిఁజేసినారలు
ద్దండుగారె తావక సుతప్రకరమ్ములు భారతాంబికా!
 
ఈవిధంగా మట్లుపాలెమున ఉప్పును తయారుచేసి తెస్తుండగా బితీషు సేనలు దానిని నేలపాలు చేసారు అయినా ప్రజలు కోపం చెందక సాంతం వహించారు. దానితో

చం. ఇటుపయిఁదూర్పుతాళ్లకడ హెచ్చుగనుప్పొనరింపవచ్చునం
చటకొకకొందరేగుసమయంబునఁ గ్రూరతనాయకద్వయిం
జటుకునఁబట్టి శిక్షనిడి జైలునకంపెఁ ప్రభుత్వ మంతన
చ్చటఁగలపెద్దలెల్లరువెసన్ సభగూడిరి భారతాంబికా!

ఆసభలో కొమ్మారెడ్డిని నాయకునిగా ఎన్నుకొని అందరూ తూర్పుతాళ్ళకడ చేరుకొన్నారు. అక్కడ సర్వుతోటలో స్థావరం ఏర్పర్చుకొని మళ్ళుకట్టి ఉప్పు తాయారుచేసి అందరికి పంచారు. ఇంతచేసిన ఈ సేనను ఏమీ చేయలేక మీసాలురాని బలకులను అతివలను చాలరకాల కష్టాలు పెట్టారు నరసాపురం కలక్టరు. అదేవిధంగా భీమవరంలో కలక్టరు కూడా జనాలను  అరష్టులు చేసి భయభ్రాతులను చేయటానికి ప్రయత్నం చేసాడు.

ఉ. ఎంతగబందెలందిడిన నేడ్తెరవచ్చెడు యోధవర్గపుం
బంతముఁజూచి వీరికిఁక బందెలుచాలవటన్నభీతి దు
శ్చింతయొనర్చి పాలకులు చిందరవందరగొట్టసాగినా
రింతులు బాలురంచయిన నెంచక యెల్ల భారతాంబికా!

ఈ ఉద్యంమంలో పాల్గొన్న అందరు నాయకులను విచారణ పేరిట పిలిచి శాసనోల్లంఘన కై శిక్షలను వేసింది ఆనాటి ప్రభుత్వం. పురుషులనే కాక స్ర్తీలను సైతం కఠినశిక్షలకు గురిచేసింది. అదే  సమయంలో ఈకవి కూడా రజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. జైలులో తాను అనుభవించిన కష్టాలు ఆకాలంలో జైలు జీవితం అన్ని సవివరంగా కవి వర్ణించాడు.  

ఉ. చోరులఁ, ద్రాగుబోతులను, జూదరులం దెరువాటుకారులన్
జారుల, గూటసాక్ష్యములొసంగెడువారల దుర్విచారులన్
గారలనుంచుటెందయిన గంటిమికాని, మహాత్ములన్ గుణో
దారుల నిట్లుబందెనుడు దౌష్ట్యముగంటిమె భారతాంబికా!

అదేసమయంలో గాంధితో సంధి చేసుకొని ఖైదీలనందరిని శిక్ష మధ్యకాలంలోనే విడిచివేసిరి.

ఉ. దేశజులున్విదేజులు దేవుడటంచునుగొల్చు గాంధి సం
దేశమునాలకింపమి జనించిన దుష్ఫలితంబునెంచి వై
దేశికపాలకుల్ తుదకు దిక్కఱిసంధికి బూని బందెలన్
వేసినవారలన్విడిచివేసిరి మధ్యనె భారతాంబికా!

ఈకావ్యం ఒక శతకములా వ్రాసినప్పటికీ ఆనాటి రాజకీయపరిస్థులకు అద్దంపడుతుంది. ముఖ్యంగా స్వాతంత్ర్య సంగ్రామంలో మన తెలుగు ప్రజల పాత్ర గురించి తెలుపుతుంది. అందుకే ఇది ఒక శతకంలాగానే కాక ఒక చారిత్రిక కావ్యంగా కూడా భావించవచ్చును.
ఇటువంటి మంచి శతకం అందరూ తప్పక చదవ వలసినది.
మీరూ చదవండి. మీ మిత్రులచే చదివించండి. 

No comments:

Post a Comment

Pages