వైజయంతీ టాకీస్ - అచ్చంగా తెలుగు
వైజయంతీ టాకీస్
భావరాజు పద్మినిమనలో చాలామందింకా పుట్టనప్పటి సంగతిది...
1951వ సంవత్సరం...

ఆ రోజు శారదా థియేటర్ ప్రారంభం... కమిటి అధ్యక్షులైన డా.పొన్నపల్లి సుబ్రహ్మణ్యం గారు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతా ఏర్పాట్లన్నీ చేస్తన్నారు. కాసేపట్లో కుమారి వైజయంతిమాల నృత్య ప్రదర్శనతో థియేటర్ ప్రారంభోత్సవం! 

నిజవేఁ ! ఆ రోజు మా నర్సాపురవోళ్లకి పండగే! ఎంచేతంటే అప్పటిదాకా మూకీ సిన్మాలు తప్ప, టాకీ సిన్మాలు చూడని మావూరోళ్లకి ఆ రోజు నుంచి సినీమా పండగే! సినేమా చూడాలంటే దూరాలెళ్లక్కర్లా! ఇంక జాయిగా ఇక్కడే సూడొచ్చు. పైగా కట్టిన థియేటర్ కూడా సెంటర్లో ఇంద్రభవనం లాగుందని ఒకటికి నాలుగుసార్లు చుట్టూ తిరిగి చూస్తా చెప్పుకోసాగారు అంతా.

అందరినీ స్వాగతించి, కూచోబెడతా పరుగులు పెడతాన్న ఆయన్ను ఒక మూల నుంచి ముచ్చటగా చూడసాగారు కోసూరి ఆదినారాయణ గారు. 5'6" మనిషి, ఎప్పుడూ తెల్లని చొక్కా ధరించేవారు. నుదుట గోవింద నామంతో నిత్యం కళకళలాడే మొహం,  ఆయనది! రాయ్ పేటలో బాగా కలిగిన కుటుంబం వోళ్లది! ఇంద్రభవనం లాంటి వాళ్లింటి కిందే పుల్లైసు తయారుజేసే ఫాక్టరీ ఉండేది. ఆదినారాయణ గారు లైసెన్స్డ్  మెడికల్ ప్రాక్టిషనర్ (LMP) లో మంచి పేరు పొంది, సొంత వైద్యశాల నడుపుతన్నారు. నాటు వైజ్జాన్ని, ఇంగిలీషు వైజ్జాన్ని కలగలిపి తనదైన పద్దతిలో చికిత్స చేస్తా, ఊళ్లో మంచి పేరు పొందారాయిన! డాక్టర్లే ఇళ్లకొచ్చి వైజ్జం చేసే రోజులవి! అందుకే ఎక్కడికెళ్లాలన్నా తన గుర్రబ్బండిలో చిన్న సూట్కేసు వెంటేసుకుని వెళ్లేవోరాయన! అలా ఊళ్లో అందరికీ తల్లో నాలుకలా ఉంటా, వైజ్జం చేస్తానే మరోపక్క వె.ఎన్.కాలేజీ సెక్రటరీ గా కూడా బాధ్యత నిర్వహిస్తున్నారు.

ఇంతలో శారదా టాకీస్ లోనికి 15 ఏళ్ల సన్నటి పిల్లెవరో నర్తకి వేషంలో వచ్చింది. చెంపకు చారడేసి కళ్లతో ముచ్చటగా ఉంది. అంతకు ముందు 'జీవితం' అనే తెలుగు సినిమాలో వేషమేసింది. చూస్తే చిన్నపిల్లలా ఉంది, మరి ఎలా చేస్తుందో... అనుకుంటా ఎదురు చూడసాగారు జనం.

వేదిక మీద ఆమె నాట్య ప్రదర్శన మొదలైంది. అంతే, మబ్బు జాడ కన్న నెమలి, పురివిప్పి ఆడినట్టు అద్భుతంగా నాట్యం చెయ్యసాగిందామె. జనాలు మైమరచిపోయి, రెప్ప వెయ్యడం కూడా మరచిపోయి మరీ చూస్తన్నారు. 

ఆదినారాయణ గారు మనసులో ఇలా అనుకున్నారు... 'పేరు వైజయంతట! అంటే మా ఆవిడ పేరే! ఈ పేరుతోనే నర్సాపురంలో ఇలాటి ఓ బ్రహ్మాండమైన థియేటర్ కట్టాల. బొంబాయిలో నేను చూసిన థియేటర్ లాగా, జనం ఇంతకంటే మురిసిపోయేలా గొప్ప డిజైను తేవాల!' 

అనుకున్నదే తడవుగా మొగల్తూరు రోడ్డులో కాలవకు ఎదర ఎకరం స్థలం కొనీసారు. బొంబాయి విక్టోరియా కాలేజీలో సివిల్  ఇంజినీరింగ్ చదూతున్న తన కొడుకు యోగేశ్వరరావు ను పిలిపించారు. 

"ఒరేయ్! బొంబాయి థియేటర్ తరహాలో మన నర్సాపురంలో సినీమా హాలు కట్టాల. అందుకు ప్లానంతా నీదే! డిజైను, కట్టడం అన్నీ దగ్గరుండి చూసుకోవాల! ప్రహరీ గోడ లోపల కొట్లు, మీదన థియేటరు... కారు నేరుగా పైకెళ్లేటట్టు స్లోపు కట్టాల. ఎంత ఖర్చైనా పర్లేదు. ఈ దెబ్బతో మనూరి పేరు మోత మోగిపోవాల!" అన్నారాయన.

అనుకున్నట్టుగానే... 1951 లోనే థియేటర్ నిర్మాణం మొదలైంది. కానీ ఆ తర్వాత వచ్చిన తుఫాను వల్ల అందాకా కట్టిందంతా కుప్పకూలిపోయింది. 'ఆదినారాయణ గారి కల కలగానే మిగిలిపోయింది. ఆయన పనైపోయింది రోయ్! లాప్పోతే వైజ్జం జేసుకునేటోరు వైజ్జమే జెయ్యాల గానీ సినిమాహాలెందుకంట?' అంటా అంతా చెవులు కొరుక్కున్నారు. దాంతో ఇంకా పంతం పెరిగిపోయిందాయనకి.

మళ్లీ డబ్బు కూడబెట్టి నిర్మాణం మొదలెట్టారు. మొత్తానికి గోదారి జిల్లాల్లో జనాలు డంగైపోయేట్టు 1957 నాటికి కట్టడం పూర్తైంది. డిజైన్ అద్భుతంగా 'మరో ప్రపంచ వింతా?' అనుకునేట్టు కుదిరింది. కానీ, కారు పైదాకా పోయే ఏర్పాటు మాత్రం కాలేదు. ఐతేనేం? ఎన్నో కొత్త హంగులు కూర్చారు.

అప్పటిదాకా థియేటర్లలో ప్రోజెక్టర్ వెనుక కార్బన్ మండుతూ ఉంటే, మాన్యువల్ గా నాబ్ సాయంతో ఫోకస్ అడ్జస్ట్ చేసేవారు. కానీ వైజయంతీ టాకీస్ కోసం... రీలు నుంచి రీలు మారేటప్పుడు ఫోకస్ సవరించుకునే "Automatic arc adjustment motors" ను ప్రత్యేకంగా తెప్పించారు. 'గామౌంట్ కాలీ' అనే జెర్మన్ ప్రొజెక్టర్లు చాలా ఖరీదెట్టి, తెప్పించారు. థియేటర్లో రిజర్వు కాటగిరీ సీట్లు కూడా మాంచి ఫారెన్ రకం వి వేయించారు‌. ఇలా అన్నీ బాగుండడంతో జనం బాగా రాసాగారు.

అప్పట్లో హిందీ సినిమా వచ్చిందంటే, హైదరాబాదు, విజయవాడ, తర్వాత మా నర్సాపురంలోనే ఆడేది. అంత ఘనంగా విజయవంతమై, ఊరికే పేరు తెచ్చింది ఆదినారాయణ గారి ప్రయత్నం! శారదా టాకీస్ లో నవయుగ, విజయ ప్రొడక్షన్స్ సినీమాలాడితే, పోటాపోటీగా ఆదినారాయణ గారల్లుడు "ఎస్.వి.ఎస్ ప్రొడక్షన్స్" అనే పేరుతో సినిమా ప్రొడ్యూసర్ గా ఉండడంతో ఆ సినీమాలన్నీ వైజయంతీ టాకీసులో తొలాటాడేవి! రాజనందిని
నిండు‌మనసులు, కొంటె కోడలు, కాబోయే అల్లుడు, నిండు హృదయాలు, నిండు దంపతులు, కలిసొచ్చిన అదృష్టం, లవ్ ఇన్ సింగపూర్, డబ్బుకు లోకం దాసోహం, వంటి ఎస్.వి.ఎస్ సినీమాలకు జనం ఎగబడేవోరు!

నర్సాపురం జనాలకి ఇంగ్లీషు, తెలుగు సినేమాలు అలవాటు చేయాలని ఆదినారాయణ గారి కోరిక! అందుకే, ప్రతిరోజు వైజయంతీ టాకీసులో మాట్నీ హిందీ సినిమానే! కానీ, భాష రానివోళ్ల కోసం ఏం చెయ్యాల? దానికీ ఓదారి కనిపెట్టారాయన!

రుస్తుంబాదా లో ఉండే పంతులు గార్ని జీతానికి పెట్టి, రోజూ బెంచీలో ఒక ఎత్తుబల్లేసి కూర్చోపెట్టేవోరు. ఆయన జరుగుతున్న కతంతా తెలుగులో చెబుతాంటే, వెనక జేరి, ఆయన చెప్పే కథ వింటా బొమ్మలు చూసేవోరు. నెమ్మదిగా ఆయనకు మా ఊళ్లో 'మాట్నీ పంతులు' అన్న పేరొచ్చేసింది. థియేటర్  సౌండులో మాట్నీపంతులు గారు జెప్పేది సగం ఇనబడీ ఇనబడక, చుట్టూ ఉన్నవోళ్లు ఎవడికత వాడల్లేసుకునే వోడు. 

ఓసారి 1965 లో 'గైడు' సినీమా వచ్చింది. అప్పటికే పోస్టర్లు జూసిన జనం లుకలుక లాడిపోయారు. శాలువా గప్పిన దేవానంద్ ని జూసి దేవదాసులా పక్కన కుక్కగానీ ఉంటదేమో అనుకున్నారు. హీరోయిన్ జుట్టుకు సెంటు నూనె రాసిందేమో, హీరో వాసన జూత్తన్నాడని అనుకున్నారు. 'రోజీ రోజీ' అంటా బయటికొచ్చిన జనాన్ని జూత్తా 'ఈళ్లకేటైందో!' అనుకున్నారు. 

చివరికీ గోలెందుకని మాట్నీ పంతులు ఎనకన జేరారు. ఆయన జనానికి కథ చెప్తున్నాడు. హీరో వాన కోసం నిరాహార దీక్ష చేసే సన్నివేశం! "హీరోని స్వామీజీగా అనుకుని, అతనేదో మామూలుగా చెప్పిన ఒక సంఘటనను పట్టుకుని, వానల‌కోసం నిరాహారదీక్ష చెయ్యమంటున్నారు ఊరివాళ్లు!" అన్నారాయన. 

ఆ పక్కనోడు పక్కనోడికిలా చెప్పాడు "హీరో స్వామీజీ అయిపోయాడంట. వానొచ్చేదాకా అన్నం తినడంట."

ఆ పక్కనోడు మరొకళ్లకిలా "చూసావా! హీరోయినొదిలేసిందని హీరో సన్నాసి అయిపోయాడంట. ఆ గెడ్డం, ఆ వాలకం జూడు! రోజీ వొచ్చి అన్నం తినిపిద్దంట..." అనీవోడు! చివరికి కథే మారిపోయేది! ఇలా ఉండీది యవ్వారం!

10 కమాండ్ మెంట్స్, బైబిల్ లాంటి ఇంగ్లీషు సినీమాలు, జింబో, టార్జాన్ లాంటి సినిమాలను మా నర్సాపురానికి తెచ్చిన ఘనత ఆదినారాయణ గోరిదే!

హిందీ సినిమాల ఇషయాల గురించి మాంచి జ్ఞానముండేది మా నర్సాపురవోళ్లకి! జ్ఞానంతో పాటుగా, ఊళ్లో వోళ్లందరికీ సాయంకాలం సందడికి వైజయంతీ హాలు కిందున్న కొట్లు వేదికయ్యేవి! 

థియేటర్ కిందన బోడపాటి వేంకటేశ్వర రావు సోడా బిస్కెట్ షాపు, వాళ్లదే కారంబోర్డ్ లాంటి రిక్రియేషన్ క్లబ్బు, ఉండేవి. అక్కడ ఆటలాడ్డం చాలామందికి అలవాటైంది. మరోపక్క చెదలవాడ రామారావు అరటిపళ్లు, కూరగాయల అంగడి ఉండేది. ఆ దెబ్బతో ఆయనింటిపేరు ఎగిరిపోయి "అరటిపళ్ల రామారావు" అన్న పేరొచ్చిందాయనకి.

థియేటర్ కి కొంత దూరంలో కొంత అవతలన్న ఉప్పులూరి నారాయణరావు సోడా కొట్టు, బెల్లంకొండ లక్ష్మణరావు కాఫీ హోటలు అందరికీ కాలక్షేపం కల్పిస్తూ ఓ వెలుగు వెలిగాయి. అదెంతదాకా పోయిందంటే, 'మొగల్తూరు రోడ్డు' అనడం పోయి జనం ఆ దారిని 'వైజయంతీ టాకీసు రోడ్డు' అనడం మెదలెట్టారు‌.

కాలక్రమంలో కోసూరి ఆదినారాయణ గారు, కాలం చెయ్యడం, థియేటర్ చేతులు మారడం జరిగింది. ఆ థియేటర్ వైభవాన్నంతా విన్న మొగల్తూరుకు చెందిన సినీమా హీరో కృష్ణంరాజు ఆ హాలు కొనాలని ఆశపడ్డాడు. లక్ష రూపాయల తేడాతో బేరం కుదరక ఆ ప్రయత్నం విఫలమైంది. 

నెమ్మదిగా కళ కోల్పోయిన ఆ థియేటర్ తో పాటే, ఆ కొట్లూ, ఆ వీధి, ఆ వైభోగమంతా మరుగున పడింది. థియేటర్ పడగొట్టే ముందర, ప్రొజెక్టర్స్ ను పశ్చిమగోదావరి జిల్లా  జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి వాళ్లు కొనుక్కుని వెళ్లారు. రిజర్వ్ కాటగిరీ సీట్లన్నీ కొయ్యలగూడెం వాళ్లు కొన్నారు. అలా కట్టినప్పుడే కాదు పడగొట్టేటప్పుడూ అన్నీ వేరేవాళ్లకి ఉపయోగపడ్డాయి. 

ఇప్పుడా థియేటర్ లేదు, ఆ వైభోగం లేదు!

కానీ, కోసూరి ఆదినారాయణ గారు సృష్టించిన  ఒక‌చరిత్ర జనాల‌మనసుల్లో ఇంకా గుర్తుండి పోయిందేమో గానీ... అసలు థియేటరే లేకపోయినా... ఇప్పటికీ మా నర్సాపురంలో కొందరు ఆ రోడ్డును 'వైజయంతీ టాకీసు రోడ్డు' అనే అంటారు!

***
(శ్రీ కోసూరి అనిల్ గారికి, బొమ్మ కోసం స్కెచ్ అందించిన భవానీ  శంకర్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు.)

No comments:

Post a Comment

Pages