చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 31 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 31

Share This

 చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 31

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery
నవలా రచయిత : Carolyn Keene



(మిత్రులను పంపించాక, నాన్సీ రివర్-హైట్స్ లోని తన యింటికి ఫోను చేసింది. జోనీ హోర్టన్ పేరుతో వచ్చి, ఆస్తిని కైవసం చేసుకొన్న అమ్మాయి వివరాలు కర్సన్ డ్రూ సేకరించినట్లు, ఆమె జాన్ టాబర్ అన్న వ్యక్తిని పెళ్ళాడినట్లు తెలిసిందని హన్నా గ్రూ చెబుతుంది. పోలీసు కార్యాలయానికి వెళ్ళిన నాన్సీకి బుంగమీసాల ఖైదీ మాట్లాడినట్లు, అతను మిస్టర్ వీలర్ని కోటలో దాచిన ప్రాంతం గురించి చెప్పినట్లు, ప్రస్తుతం ఆ న్యాయవాదిని భారీ బందోబస్తు మధ్య ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తుంది. తాము కోటలో శోధించినప్పుడు మిస్టర్ వీలర్ తమకు కనబడలేదేమని నాన్సీ ఆశ్చర్యపోతుంది. తరువాత. . .)
@@@@@@@@@@@@@@@

"అదేమంత ఆశ్చర్యపోయే విషయం కాదు" అధికారి అన్నాడు. "పైకి కనిపించని తలుపు గల గదిలో మిస్టర్ వీలర్ ఉన్నాడు."

పోలీసులు కిడ్నాపర్ల కోసం యింకా శోధిస్తున్నారని, అయితే వాళ్ళు ఒక్క ఆచూకీ కూడా తెలుసుకోలేకపోయారని ఒప్పుకొంటున్నట్లు అతను చెప్పాడు. సగ్స్ వాళ్ళ పేర్లు చెప్పటానికి నిరాకరిస్తున్నాడు. "మిస్ డ్రూ! మీ కారు గురించి ఒక్క మాట కూడా తెలియలేదు."

నాన్సీకి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. మిస్టర్ వీలర్ అపహరణ మిస్టరీకి, తనకు తెలియని జోనీ హోర్టన్ కిడ్నాపుని నాన్సీ జోడిస్తే, అది నమ్మశక్యం కాని విషయమని చీఫ్ భావించవచ్చునని ఆమెకు తెలుసు. "ఈ చుట్టుపక్కల పోయిన వస్తువులను కోటలో దాచే ముఠా ఏదైనా ఉంటే, నా కారు కూడా కోటలోనే ఉండొచ్చు" హఠాత్తుగా అందామె.

ఆమె మాటలను విని బెస్, జార్జ్ కూడా ఆశ్చర్యపోయారు. అమ్మాయిలు, అబ్బాయిలు మాత్రమే కాకుండా, పోలీసులు కూడా కోటను శోధించిన విషయం జార్జ్ గుర్తుచేసింది.

"కానీ వారు మైదానంలో శోధించలేదు కదా!" నాన్సీ ప్రతికూలంగా వాదించింది.

"అది నిజమే!" చీఫ్ బుర్కె ఒప్పుకొన్నాడు.

ఎవరైనా అధికారులను అమ్మాయిలతో పాటు కోటకు వెళ్ళటానికి పంపమని నాన్సీ అతన్ని అడిగింది. అతను దానికి అంగీకరించి, సార్జెంట్ ఫోస్లీని, గూఢచారి హంఫ్రేలను వాళ్ళతో పంపుతానని చెప్పాడు. ఆ వ్యక్తులను లోనికి పిలిచి వీళ్ళకు పరిచయం చేసాడు. తరువాత వాళ్ళు అమ్మాయిలను బయట ఉన్న పోలీసు కారు వద్దకు తీసుకెళ్ళారు.

ఆ బృందం కోట వైపు బయల్దేరింది. వాళ్ళు అక్కడకు చేరుకోగానే, కందకం పైన వంతెన యింకా కిందకే ఉండటం చూసి నాన్సీ సంతోషించింది. సగ్స్ స్నేహితులు అతనికి సంకేతాలు పంపకపోవటం గమనించి, ఏమి జరిగిందో చూద్దామని వాళ్ళు వచ్చి ఉండొచ్చునని ఆమె కొంత శంకించింది. వాళ్ళు చేసే మొదటి పని కందకంపై వంతెన్ని కిందకు పట్టి ఉంచిన తీగలను, రాళ్ళను తొలగిస్తారు. దానివల్ల పోలీసులు మరొకసారి తమ రహస్య సమావేశాలు జరిగే ప్రాంతాన్ని శోధించకుండా నివారించవచ్చు. ఏమి జరిగింది? వాళ్ళిక్కడకు తిరిగి రావటానికి భయపడ్డారా?

డ్రయివరు పోలీసు కారును గోడ పక్కన యిరుకైన బాటపై ఆపాడు. అప్పుడు ముగ్గురు అమ్మాయిలు, యిద్దరు అధికారులు ఆ మైదానప్రాంతాన్ని క్షుణ్ణంగాను, క్రమబద్ధంగాను శోధించటం మొదలెట్టారు. ఒక కారుని దాచి ఉంచే స్థలాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయని తేల్చారు. ప్రతిచోటా పొడవైన గడ్డి, కలుపు మొక్కలు విస్తృతంగా పెరిగాయి. శోధకులు కోట చుట్టుపక్కల, వెనుక ప్రాంతాలను గాలించారు.

ప్రస్తుతం జార్జ్ వాళ్ళను పిలిచింది. "నేను గడ్డి చదునైన ప్రాంతాన్ని చూసాను. దానిపై రెండు యిరుకైన జాడలు ఉన్నాయి. అవి మోటారు వాహనం యొక్క టైరు గుర్తులు కావచ్చు."

నాన్సీ మరియు బెస్ ఆమె వైపు పరుగెత్తారు. కలుపు మొక్కలు, గడ్డి తమ స్థానాల్లో నిటారుగా నిలబడటానికి కష్టపడుతున్నా, టైరు గుర్తుల విషయంలో పొరపాటు లేదు. ఉత్సాహంగా అమ్మాయిలు ఆ గుర్తును అనుసరించారు. ప్రస్తుతం వారు కొద్దిగా కుంగిపోయిన ప్రాంతానికి చేరుకొన్నారు. దాని చివర భారీగా గడ్డి పెరిగిన మట్టిదిబ్బ కనిపించింది. భారీ‌ చెక్క తలుపు ఆ దిబ్బకు బిగించబడి ఉంది.

"నీ కారు అందులో ఉండొచ్చు" తన భుజం పైనుంచి వెనుక ఉన్న నాన్సీని చూస్తూ చెప్పింది బెస్.

బెస్ అందరికన్నా ముందు కదిలింది. కానీ అకస్మాత్తుగా ఆమె ఆగి‌ గట్టిగా అరిచింది, "ఓహ్! పాము .....రాక్షస పాము."

నాన్సీ, జార్జ్ నేల వైపు చూసారు. తలుపుకి ముందు, కొన్ని రాళ్ళ మీద ఎండకి ఒడలార్చుకొంటూ, అయిదడుగుల పాము పడుకొని ఉంది. తనను సమీపిస్తున్న అమ్మాయిల అడుగుల చప్పుడు విని, ఆ సరీసృపం తలను పైకెత్తింది. దాని నోట్లోంచి చీలిన నాలుక వేగంగా బయటకు వచ్చింది.

"కారు ఉందో, లేదో గానీ, నేను మాత్రం ఉండను" అంటూ బెస్ వెనక్కు తగ్గింది.

జార్జ్, నిర్భయంగా నిలబడి, పాము దగ్గరకు రాయి విసరి, దాన్ని తరిమేయాలనే ఉద్దేశంతో చుట్టూ చూస్తోంది. "అది ఈ ప్రాంతాన్ని కాపలా కాస్తోంది" చిరునవ్వుతో అందామె.

"నాన్సీ!" కీచుగొంతుతో అరిచింది బెస్. "అది మనల్ని మింగేస్తుంది!"

"ఆ చిత్రాన్ని నేను చూడలేను" ఆమె చుట్టం ప్రత్యుత్తరమిచ్చింది, కాని ఆమె పరుగును ఆపేసింది.

ఆ సమయానికి జార్జ్ చిన్న రాతిని తీసి, ఆ సరీసృపం మీదకు విసిరింది. ఆ రాయి సున్నితమైన పాము శరీరానికి కొన్ని అంగుళాల ముందు పడింది. తక్షణం ఆ పాము గడ్డిలోకి పాకుతూ వెళ్ళిపోయింది.

పోలీసులు వీళ్ళ కేకలను, బెస్ అరుపును విని, కోటకు అవతల పక్కనుంచి పరుగున వచ్చారు. వాళ్ళు అమ్మాయిల దగ్గరకి వచ్చే సమయానికి, నాన్సీ పాత తలుపుని పట్టి గట్టిగా లాగుతోంది. దాని కదిలించటం ఆమెకు చాలా కష్టమని ఋజువైంది.

వెంటనే సార్జెంట్ ఫాస్లీ, గూఢచారి హంఫ్రీ ముందుకొచ్చి, దాన్ని ఒక్కుదుటున లాగారు. భారీగా ఉన్న ఆ తలుపు తెరుచుకోగానే, నాన్సీ ఆనందంతో కేకపెట్టింది. "నా కారు!" అని అరిచిందామె.

యువ గూఢచారి తలుపును బార్లా తెరిచి లోనికి పరుగెత్తింది. అది కాయగూరలు, పళ్ళ వంటి వాటిని నిలవయుంచే గిడ్డంగి అని ఆమె ఊహించింది. ఆమె తన కారెక్కి, స్టీరింగు వెనుక కూర్చుంది. ఇగ్నిషన్ లాక్ లో తాళం లేదు. దాని తాళం తన పర్సులో ఉంది. వేగంగా దాన్ని లాక్ లో పెట్టి, ఒక సెకను తరువాత మోటారుని స్టార్ట్ చేసింది.

"ఇది పనిచేస్తోంది!" ఉద్వేగంగా అరిచి, ఆనందంగా నవ్వింది.

ఇద్దరు అధికారులు విస్మయం చెందారు. తరువాత సార్జంట్ ఫాస్లీ చెప్పాడు, "నువ్వు తెలివైన యువ గూఢచారివి! మీ కారు కోసం ఈ దీవిలో మరెవరూ చూడాలని అనుకోలేదు!"

కారుని దొంగిలించిన వాళ్ళ గురించి చిన్న చర్చ నడిచింది. ప్రతివాడు కారుని వాడుకోవటానికో, అమ్మటానికో ఎత్తుకెళ్ళారని సందేహిస్తారు. చివరకు ఆ చుట్టుపక్కల నాన్సీ గూఢచర్యం చేయకుండా ఆపటానికే ఆమె కారుని దొంగిలించారన్న అభిప్రాయంతో చర్చను ముగించారు.

"డీప్ రివర్లో ఎక్కడకు వెళ్ళినా మీకు మంచి పేరు ఉందని దీన్నిబట్టి స్పష్టంగా అర్ధమవుతోంది" అన్నాడు గూఢచారి హంఫ్రీ. "సరె! ఇప్పుడు మీ కారు మీకుంది. మీకింక మా అవసరం లేదనుకొంటున్నాను. ఇక మేము వెనక్కి వెళ్ళటం మంచిదనుకొంటాను, ఫోస్లీ!"

ఇద్దరు వ్యక్తులు తమ కారు వద్దకు వేగంగా వెళ్ళారు. అయినప్పటికీ, నాన్సీ కారు సరిగా పనిచేస్తోందో, లేదో చూడడానికి కొంతసేపు ఆగారు. తరువాత తమ కారులో వారు కందకపు వంతెనను దాటి వెళ్ళిపోయారు.

"ఈ చుట్టుపక్కల మరికొన్ని చూద్దాం" నాన్సీ సూచించింది. "అదృష్టం ఉంటే, సగ్స్ మిత్రులకు చెందిన కొన్ని బకాయి విషయాలను కనుక్కోవచ్చు."

"ఈ జీవితంలో కాదు" బెస్ వేగంగా బదులిచ్చింది. "నాన్సీ డ్రూ! నెడ్ కిచ్చిన వాగ్దానాన్ని మరిచిపోవద్దు."

నాన్సీ ఆమె అభిప్రాయాన్ని అంగీకరించింది. ఆమె తన కారును కందకపు వంతెనపైకి పోనిచ్చింది. అప్పుడే కిర్రుమన్న శబ్దం అమ్మాయిలకు వినిపించింది. వారి కిందనుంచి చెక్కలు మూలుగుతున్న శబ్దాలు వస్తున్నాయి. మరొక సెకనులో వంతెన పైకి లేవటం ప్రారంభించింది.

"నాన్సీ! వంతెన పైకి లేస్తోంది" బెస్ భయంతో అరిచింది. "మనం పడిపోతాం!"

@@@@@@@@@@@

కందకపు వంతెన మరింతగా శబ్దం చేస్తూ పైకి లేస్తూంటే, నాన్సీ కారు స్టీరింగ్ ని వెనక్కి తిప్పుతూ, వేగంగా ఆ ఏటవాలు ప్రాంతం నుంచి కోట ప్రాంగణంలోకి పోనిచ్చింది. ఆమె సరిగ్గా సమయానికి వంతెన మీదనుంచి కారుని కిందకు దింపకపోయినట్లయితే, వంతెన మీద నుంచి అది బోల్తాపడటం కానీ, కోట గోడకు, పైకి లేచిన వంతెనకు మధ్యలో పడి నలిగిపోవటం కానీ జరిగేది.

"నాన్సీ! నన్ను అలా మరొకసారి భయపెట్టకు!" బెస్ వేడుకొంది.

ఆమె బంధువు ఆమెను చులకనగా చూసింది. "ఇది నాన్సీ తప్పని నువ్వు అనుకొంటున్నావా? మనం సజీవంగా ఉండే యోగం పట్టినందుకు ఆమెకు ధన్యవాదాలు చెప్పాలి."

బెస్ నాన్సీకి క్షమాపణ చెప్పింది. నాన్సీకి కారు నడపటం రాదన్న ఉద్దేశంతో తానా మాట అనలేదని చెప్పిందామె. దానిపై వాదనలను నిరోధించటానికి, "ఈ వంతెన అలా లేచేలా చేసిందేమిటో?" అని నాన్సీ సంభాషణ దారిని మళ్ళించింది.

ముగ్గురు అమ్మాయిలు కారులోంచి దిగారు.

(సశేషం)

No comments:

Post a Comment

Pages