శ్రీథర మాధురి - 112 - అచ్చంగా తెలుగు

శ్రీథర మాధురి - 112

Share This

 శ్రీథర మాధురి - 112 

(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృతవాక్కులు)


ధర్మం యొక్క గొప్పతనాన్ని అంతా మనం శ్రీరుద్రం లోని ఈ ఒక్క శ్లోకాన్ని చూచి తెలుసుకోవచ్చు. కేవలం దైవాన్ని కాదు ఆయన అనుచరులను కూడా ఆరాధించి, గౌరవించాలి.
 
నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీథుషే!
 అథో యౌ అస్య సత్త్వనో హంతేభ్యో కరన్నమః !

ఓ రుద్రా, నీలకంఠా ! వేయి కనులు కలవాడా! నేను నిన్ను మాత్రమే నమస్కరించి గౌరవించట్లేదు, నీతో పాటుగా నిన్ను ఆరాధించి పూజించే వారందరినీ కూడా ఆరాధించి గౌరవిస్తున్నాను.

తమ‌ భగవానుడిగా రుద్రుడిని ఆరాధించే వారందరినీ కూడా ఆరాధించి, గౌరవించాలి. ఎందుకంటే భగవానుడు వారి ద్వారా కూడా నివసిస్తూ ఉన్నాడు కదా ! వారు రుద్రుడి నామాలను పగలూ రాత్రీ జపిస్తూ ఉంటారు కనుక, భగవానుడు వారిలో శాశ్వతంగా నివసిస్తూ ఉంటారు. వారి నుంచి ప్రసరించే దివ్యకాంతి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రుగ్మతలను నిర్మూలిస్తుంది. వారు వృద్ధుడి యొక్క దివ్య కాంతిని వ్యాప్తి చేస్తూ ఉంటారు, అందుకే వారిని కూడా ఆరాధించి, పూజించాలి.
అటువంటి వారిని కొలిచినప్పుడు, నిశ్చయంగా రుద్రుడు కూడా ప్రసన్నుడౌతాడు. భగవంతుడు ఆయన భక్తులలో ప్రకాశిస్తూ ఉంటాడు కనుక, వారికి ప్రణమిల్లితే, అది కూడా రుద్రుడిని చేరుతుంది. అందుకే రుద్ర భక్తులను ఆరాధించాలి.

ఇదే సనాతన ధర్మం లో ఉన్న అద్భుతం. వేదాలు సామరస్యాన్ని, పరస్పర గౌరవాన్ని  తీసుకు వస్తాయి. ఇవి 'దేవో మానుష రూపేణ' అన్న అంశాన్ని చాటిచెబుతాయి. అందుకే ధర్మాన్ని పాటించే వారిని గౌరవించాలని ఉద్ఘటించబడింది.

***

దైవం అనేక రూపాల్లో అవతరిస్తూ ఉంటారు. అటువంటి ఒక ఉత్కృష్టమైన అవతారమే శివుడు.
 
కానీ ఈ రూపంలో ఉన్న దైవాన్ని అంతా ప్రేమతో కంటే, భయంతో ఎక్కువ పూజిస్తూ ఉంటారు. కొందరు ఆయనను లయకారుడు అంటారు. శివుడి యొక్క ఈ ప్రతికూలమైన, సంకుచిత నిర్వచనంతో విభేదించమని నేను మిమ్మల్ని గట్టిగా వేడుకుంటున్నాను.
 
ఈ ప్రపంచంలో ఏదైనా తిరిగి పుట్టాలంటే, చివరికి నాశనమవ్వాల్సిందే. కాబట్టి మరణం అనేది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.

నేను శివుడిని పునర్జన్మ ప్రసాదించే దేవుడని పిలిచేందుకు ఇష్టపడతాను. ఒకరు తిరిగి పుట్టాలంటే,  చావాలి. తిరిగి జన్మించడం అనేది నిశ్చయంగా జరుగుతుంది. చాలా కొద్దిమంది అదృష్టవంతులు కైలాసంలో తిరిగి పుడతారు. కొంతమంది ఖగోళ జీవులుగా, మరికొంతమంది పితరులుగా, లౌకిక అలౌకిక జగత్తును సేవించాలని ఆసక్తి ఉన్న అదృష్టవంతులు దేవతలుగా, అక్షరాలుగా, యక్షులుగా, కిన్నెరలుగా, గంధర్వులుగా, కింపురుషులుగా, మనుషులుగా పుడతారు.

కాబట్టి శివుడు పునరుజ్జీవనాన్ని అనుకూలింప చేస్తాడు. ఈ రూపంలో ఉన్న దైవాన్ని ప్రార్ధించడం ద్వారా, మీరు ఆయన కోరుకున్న విధంగా సేవ చేసేందుకై ఎంపిక చేయబడతారు.

చనిపోవడం ద్వారా ఆయన పునర్జన్మ అనే చర్యను మీరు చేసేలా చేస్తారు. మేనేజ్మెంట్లో చేయండి లేక చావండి అంటారు, కానీ ఇక్కడ మీరు శివుడి యొక్క దయతో పునర్జన్మ అనే పనిని చెయ్యాలంటే, చనిపోవల్సిందే.
 
శివ అన్న పదమే శుభకరమైనది. కాబట్టి ఆయన ఎటువంటి అశుభకార్యాన్ని చేయలేరని, ఆయన చేసేవన్నీ శుభకరమైనవేనని, ఇక్కడ అర్థం. నిజానికి దైవం శివుడిగా రూపం దాల్చినప్పుడు, ఆయనకు మంగళకరమైనవి తప్ప, ఏమీ తెలీదు అందుకే ఆయనను శివుడు అన్నారు.
 
శివుడి రూపంలో ఉన్న దైవం యొక్క అద్భుతం ఏమిటంటే ఆయన భిక్షకుడు. ఆయన భిక్షపతి. ఆయన యాచకుడిలా జీవించినా కూడా, ఆయన దయవల్ల మాత్రమే ఎవరైనా ప్రస్తుత జీవితంలో సంపన్నులు కావడం మాత్రమే కాదు, భవిష్యత్తులో రాబోయే జన్మలలో కూడా శుభకరంగా పుట్టగలుగుతారు.

 కాబట్టి ఈ ప్రకాశవంతమైన చిరస్మరణీయమైన శివరాత్రి రోజున శివుడికి మీ ప్రేమను అందించండి.

హరహర మహాదేవ ! ఓం నమఃశివాయ !
 

***

No comments:

Post a Comment

Pages